Home జాతీయ national telgu ఓబుళాపురం మైనింగ్ కేసు: గాలి జనార్దన రెడ్డికి ఏడేళ్ల జైలుశిక్ష

ఓబుళాపురం మైనింగ్ కేసు: గాలి జనార్దన రెడ్డికి ఏడేళ్ల జైలుశిక్ష

4
0

SOURCE :- BBC NEWS

Gali anardhana Reddy

ఫొటో సోర్స్, Getty Images

ఓబుళాపురం మైనింగ్ కేసు తుది తీర్పు వెలువడింది.

హైదరాబాద్ నాంపల్లిలోని సీబీఐ న్యాయస్థానం, పదిహేనేళ్ల నాటి ఈ కేసులో తీర్పునిచ్చింది.

కర్ణాటక ఎమ్మెల్యే గాలి జనార్దన రెడ్డి, ఆయన బంధువు బీవీ శ్రీనివాస రెడ్డి, ఉన్నతాధికారులు వి.డి. రాజగోపాల్, గాలి జనార్దన రెడ్డి సహాయకుడు మెఫజ్ అలీ ఖాన్, ఓఎంసీ కంపెనీలను కోర్టు దోషులుగా తేల్చింది.

గాలి జనార్దన రెడ్డి, బీవీ శ్రీనివాస రెడ్డి, రాజగోపాల్, మెఫల్ అలీఖాన్‌కు ఏడేళ్ల జైలు శిక్షతో పాటు పదివేల రూపాయల జరిమానా విధించింది.

జరిమానా కట్టకపోతే మరో ఏడాది జైలుశిక్ష అనుభవించాల్సిఉంటుంది.

రాజగోపాల్‌కు ఏడేళ్లతో పాటు మరో నాలుగేళ్ల అదనపు శిక్ష విధించింది. అయితే రెండు శిక్షలనూ ఒకేసారి అమలుచేస్తారా లేక వేర్వేరుగానా అన్నది తెలియాల్సిఉంది.

ఓఎంసీ కంపెనీకి రెండు లక్షల జరిమానా విధించింది.

మాజీ మంత్రి సబితా ఇంద్రా రెడ్డి, సీనియర్ అధికారి కృపానందంను ఈ కేసులో కోర్టు నిర్దోషులుగా ప్రకటించింది.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
ఓబుళాపురం, ఓఎంసీ, గాలి జనార్దన రెడ్డి, శ్రీలక్ష్మి

ఫొటో సోర్స్, UGC

కేసులో నిందితుల వివరాలు

ఏ1- బీవీ శ్రీనివాస రెడ్డి – ఏడేళ్ల జైలు శిక్ష

ఏ2 -గాలి జనార్దన రెడ్డి – ఏడేళ్ల జైలు శిక్ష

ఏ3- వీడీ రాజగోపాల్ – ఏడేళ్ల జైలు శిక్ష

ఏ4 -ఓఎంసీ కంపెనీ – రెండు లక్షల రూపాయల జరిమానా

ఏ5- లింగారెడ్డి – మరణించారు

ఏ6 -వై శ్రీలక్ష్మి –హైకోర్టు 2022లో కేసు కొట్టివేయగా, సుప్రీంకోర్టులో విచారణలో ఉంది (సీబీఐ పిటిషన్ పెండింగులో ఉంది)

ఏ7 – మెఫజ్ అలీ ఖాన్ – ఏడేళ్ల జైలు శిక్ష + నాలుగేళ్ల అదనపు శిక్ష

ఏ8 – కృపానందం – నిర్దోషి

ఏ9 – సబితా ఇంద్రా రెడ్డి – నిర్దోషి

ఓబుళాపురం, ఓఎంసీ, గాలి జనార్దన రెడ్డి, శ్రీలక్ష్మి

ఫొటో సోర్స్, ANI

అసలేంటీ కేసు?

తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన కేసుల్లో ఓఎంసీ కేసు ఒకటి. దీన్నే ఓబుళాపురం మైనింగ్ కేసు అంటారు.

బళ్లారి, అనంతపురం జిల్లాల పరిధిలో కర్ణాటక-ఆంధ్ర సరిహద్దుల్లో అక్రమంగా ఇనుప ఖనిజం తవ్వకాలు జరుపుతున్నారంటూ ఈ కంపెనీపై పలు ఆరోపణలు వచ్చాయి. దీంతో 2009లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కోరడంతో అప్పటి కేంద్ర ప్రభుత్వం కేసును సీబీఐకి అప్పగించింది.

అప్పటి తెలుగుదేశం నాయకులు నాగం జనార్దన రెడ్డి కూడా దీనిపై విచారణ కోరుతూ కోర్టులో పిటిషన్ వేశారు.

ఓబుళాపురం మైనింగ్ కంపెనీని 2001లో బళ్లారి కేంద్రంగా ప్రారంభించారు. 2007లో ఆ సంస్థకు ఏపీ ప్రభుత్వం నుంచి ఇనుప గనుల లైసెన్సు దక్కింది.

కానీ ఆ సంస్థ గనుల తవ్వకాల్లో అక్రమాలు చేస్తోందంటూ 2009 డిసెంబరులో కేసు నమోదైంది.

ఈ కేసులో సీబీఐ 2011లో తొలిసారి చార్జిషీటు వేసింది. మొత్తం నాలుగు చార్జిషీట్లు దాఖలు చేసింది. 2014లో చివరి చార్జిషీటు వేసింది. ఇవాళ (2025 మే 6) తుది తీర్పు వచ్చింది.

ఈ చార్జిషీటులో ఐపీసీలోని సెక్షన్లు, అవినీతి నిరోధక సెక్షన్లు, అటవీ, గనుల చట్టాల కింద కేసులు నమోదయ్యాయి. విచారణలో భాగంగా 219 మంది సాక్షులను, 336 పత్రాలను కోర్టులో ప్రవేశ పెట్టింది సీబీఐ. కేసులో 9 మంది నిందితులు ఉండగా, విచారణలో ఉండగానే ఒక నిందితుడు లింగారెడ్డి మరణించారు. 2022లో ఐఏఎస్ అధికారి శ్రీలక్ష్మిపై కేసును హైకోర్టు కొట్టివేసింది. దీనిపై సీబీఐ సుప్రీంకోర్టుకు వెళ్లింది.

ప్రస్తుతం కళ్యాణ రాజ్య ప్రగతి పక్ష పార్టీ నాయకుడిగా, గంగావతి ఎమ్మెల్యేగా ఉన్న గాలి జనార్దన రెడ్డి ఈ కేసులో 2011 సెప్టెంబరులో అరెస్ట్ అయ్యారు. 2015లో ఆయన బెయిల్‌పై విడుదలయ్యారు.

2011లో గాలి జనార్దన రెడ్డితో పాటు బీవీ శ్రీనివాస రెడ్డిని సీబీఐ అరెస్టు చేసింది. ఐఏఎస్ అధికారి శ్రీలక్ష్మి కూడా కొంత కాలం జైల్లో ఉన్నారు.

ఓబుళాపురం, ఓఎంసీ, గాలి జనార్దన రెడ్డి, శ్రీలక్ష్మి

ఫొటో సోర్స్, AFP

గాలి జనార్దన రెడ్డి నేపథ్యం ఏంటి?

పాత చిత్తూరు జిల్లా నుంచి కర్ణాటక వెళ్లి స్థిరపడ్డ తెలుగు కుటుంబానికి చెందిన గాలి జనార్దన రెడ్డి, ఆయన సోదరులు ఓఎంసీని ప్రారంభించారు.

అనంతపురం – బళ్లారి సరిహద్దుల్లో ఇనుప ఖనిజం తవ్వకాలు, లైసెన్సులు తెచ్చుకోవడం, తవ్వకాల సమయంలో రాష్ట్రాల సరిహద్దులు కూడా లెక్క చేయకపోవడం, పన్ను ఎగవేత, అక్రమ మైనింగ్, అక్రమ ఎగుమతులు.. ఇలా అనేక ఆరోపణలు ఎదుర్కొంది ఓఎంసీ సంస్థ. దాదాపు 884 కోట్ల రూపాయల మేర ప్రభుత్వ ఖజానాకు నష్టం జరిగిందని సీబీఐ అభియోగం మోపింది.

కాప్టివ్ మైనింగ్ లీజులో కాప్టివ్ అనే పదాన్ని తొలగించడం ద్వారా అవినీతికి కారణం అయినట్టు సీబీఐ తన అభియోగాల్లో పేర్కొంది.

ఓఎంసీకి గనుల లైసెన్సులు దక్కినప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పాలనలో ఉంది. ముఖ్యమంత్రిగా వైఎస్ రాజశేఖర రెడ్డి ఉన్నారు. వైఎస్ ప్రభుత్వంలోని అధికారులు కూడా ఈ కేసులో ఉన్నారు. వైఎస్ కుటుంబం, గాలి జనార్దనరెడ్డి కుటుంబానికి ఉన్న సన్నిహిత సంబంధాల దృష్ట్యా, ఈ అక్రమాల వెనుక వైఎస్ కుటుంబం ఉందంటూ తీవ్ర ఆరోపణలు చేసింది తెలుగుదేశం పార్టీ. అయితే ఆ ఆరోపణలను వైఎస్ కుటుంబం ఖండిస్తూ వచ్చింది.

ఓబుళాపురం, ఓఎంసీ, గాలి జనార్దన రెడ్డి, శ్రీలక్ష్మి

ఫొటో సోర్స్, ANI

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో సంచలన కేసుల్లో ఒకటి

కేసు, అరెస్టులు జరుగుతున్నప్పటికీ గాలి జనార్దన రెడ్డి రాజకీయాల్లో కూడా కొనసాగుతూ వచ్చారు. కొంత కాలం మంత్రిగా ఉన్నారు. బీజేపీలో కొనసాగారు. తరువాత సొంత ప్రాంతీయ పార్టీ పెట్టారు.

అప్పట్లో సీబీఐ విచారణను అడ్డుకోవడం కోసం ఉమ్మడి ఏపీ హైకోర్టులో పిటిషన్ వేసింది ఓఎంసీ. హైకోర్టు ఆ కంపెనీకి అనుకూలంగా విచారణపై స్టే ఇవ్వగా, ఆ స్టేకి వ్యతిరేకంగా ఉమ్మడి ఏపీ ప్రభుత్వం, అప్పటి తెలుగుదేశం నాయకులు నాగం జనార్దన రెడ్డి, బళ్లారికి చెందిన తపాల గణేశ్ సుప్రీంకోర్టులో పిటిషన్లు వేశారు. ఇదంతా డిసెంబరు 2009లో జరిగింది. తరువాత కేసు విచారణకు సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

సీబీఐ కాకుండా, కర్ణాటక రాష్ట్ర లోకాయుక్త, భారత ఆదాయపు పన్ను శాఖలు కూడా ఈ అక్రమాలపై విచారణ జరిపాయి. కర్ణాటక లోకాయుక్త నివేదిక ఈ కేసు సంచలనం కావడంలో కీలకం. అక్రమ మైనింగ్ వ్యవహారం ఆ నివేదిక ద్వారానే వెలుగులోకి వచ్చింది.

తెలుగు రాష్ట్రాల్లో వివాదాస్పదమైన బ్రాహ్మణి స్టీల్స్ కూడా ఈ సంస్థ ప్రారంభించినదే. ఈ పెట్టుబడులపై ఈడీ కేసు విచారణలో ఉంది. ఇప్పుడు ఓబుళాపురం కేసులో శిక్ష ఖరారైన నేపథ్యంలో ఎమ్మెల్యేగా ఉన్న గాలి జనార్దన రెడ్డి తన పదవిని కోల్పోవాల్సి ఉంటుంది. అయితే వారు ఈ తీర్పుపై హైకోర్టుకు అప్పీలుకు వెళ్లవచ్చు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)