SOURCE :- BBC NEWS

ఫొటో సోర్స్, Getty Images
4 గంటలు క్రితం
తెలంగాణ, ఛత్తీస్‌గఢ్ సరిహద్దుల్లోని అటవీ ప్రాంతంలో యుద్ధానికి ముందు ఉండే తరహా వాతావరణం కనిపిస్తోంది.
ఇక్కడ కర్రిగుట్టల్లో వేల సంఖ్యలో పోలీసులు మావోయిస్టుల కోసం గాలిస్తున్నట్లు చెప్తున్నారు. అయితే, ఎంతమంది పోలీసులున్నారనే విషయంలో అధికారికంగా ఎలాంటి సమాచారం లేదు.
సుమారు వారం నుంచి గాలిలో చక్కర్లు కొడుతున్న హెలికాప్టర్లు, తుపాకీలతో కనిపిస్తోన్న పోలీసులు, గూడేలకే పరిమితమైన ఆదివాసీలు.. ఇలా ఆ ప్రాంతమంతా గంభీర వాతావరణం నెలకొంది.
”మాకు పేలుళ్ల శబ్దాలు వినిపిస్తున్నాయి” అని పలువురు గ్రామస్తులు స్థానిక మీడియాకు చెప్పారు. కానీ, అక్కడ ఏం జరుగుతోందనే విషయంలో మౌనంగా ఉన్నారు తెలంగాణ పోలీసులు.
ఒకవైపు మోహరిస్తోన్న బలగాలు, మరోవైపు అధికారిక సమాచారం లేమితో అనేక వదంతులు ప్రచారంలోకి వస్తున్నాయి.

ఫొటో సోర్స్, Getty Images
ఇంతకీ కర్రిగుట్టల్లో జరుగుతోంది?
కర్రిగుట్టల దగ్గర ఎత్తైన కొండలు, లోయలు, గుహల్లో పెద్ద సంఖ్యలో మావోయిస్టులు ఉంటారని భావించిన కేంద్ర, వివిధ రాష్ట్ర ప్రభుత్వాలకు చెందిన బలగాలు ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టి, సెర్చ్ ఆపరేషన్ నిర్వహిస్తున్నాయి.
వారం రోజులకు పైగా కొనసాగుతున్న ఈ ఆపరేషన్‌లో భారీ సంఖ్యలో మృతులు ఉన్నట్లు చెబుతున్నప్పటికీ, ఇప్పటివరకూ
ఎలాంటి అధికారిక ప్రకటనా రాలేదు.
ఎంతమంది చనిపోయారనే విషయంలోనూ ఇటు పోలీసులు, అటు మావోయిస్టుల వైపు నుంచి భిన్నమైన ప్రకటనలు వచ్చాయి.
ముగ్గురు మావోయిస్టులు చనిపోయినట్టు పోలీసులు.. ఆరుగురు మావోయిస్టులు చనిపోయిన్టటు మావోయిస్టులు ప్రకటనలు చేశారు.
ముట్టడి తీవ్రత, బలగాల సంఖ్య రోజురోజుకూ పెరుగుతుండడంతో ఎప్పుడు ఏం జరుగుతుందో అనే ఉత్కంఠ వాతావారణం ఈ కొండల చుట్టుపక్కల గ్రామాల్లో ఏర్పడింది.
ఈ ప్రదేశాన్ని మావోయిస్టులు ఎన్నో ఏళ్లుగా గెరిల్లా బేస్ క్యాంపులుగా ఉపయోగించుకుంటున్నారు. మావోయిస్టులు ఇక్కడ పెద్ద ఎత్తున మందుపాతరలు పెట్టారు. ఇక్కడి నుంచి ఛత్తీస్‌గఢ్, తెలంగాణలతో పాటు ఆంధ్ర, ఒడిశాలకు కూడా కొండల చాటుగా ప్రయాణించే అవకాశం ఉంటుందని స్థానికులు పలువురు బీబీసీతో చెప్పారు. దీంతో ఈ ప్రదేశం మావోయిస్టులకు అనుకూలంగా ఉండేది.

ఫొటో సోర్స్, Getty Images
కర్రిగుట్టల వైపు రావొద్దన్న మావోయిస్టులు
“కగార్ దాడి నుంచి రక్షణ పొందడానికి మేం కర్రిగుట్టపై బాంబులు అమర్చాం. ఈ విషయం ప్రజలకు తెలియజేశాం. అయినప్పటికీ కొద్దిమంది ఆదివాసీ, ఆదివాసేతర ప్రజలను పోలీసులు మాయమాటలు చెప్పి నమ్మిస్తూ, డబ్బులు ఇస్తూ, కర్రిగుట్టపైకి పంపిస్తున్నారు. ప్రజలారా పోలీసుల వలలోపడి కర్రిగుట్టపైకి రావొద్దని విజ్ఞప్తి చేస్తున్నాం” అంటూ మావోయిస్టు పార్టీ వెంకటాపురం-వాజేడు ఏరియా కమిటీ కార్యదర్శి శాంత పేరిట ఒక లేఖ విడుదలైంది.
ఈ లేఖ ఏప్రిల్ 8న విడుదల అయింది. కర్రిగుట్టల వైపు పోలీసులు వస్తున్నారన్న సమాచారంతో వ్యూహాత్మకంగా ఈ లేఖ విడుదల చేశారని భావిస్తున్నప్పటికీ పోలీసులు మాత్రం తమ వ్యూహం మార్చుకోకుండా, కర్రిగుట్ట ముట్టడి కొనసాగించారు. ”ఈ ప్రాంతంలో ఈ మధ్య కాలంలోనే 12 పెద్ద మందుపాతరలతో సహా మొత్తం 24 మందుపాతరలు నిర్వీర్యం చేశాం” అని ఒక స్థానిక పోలీసు బీబీసీతో చెప్పారు.
ప్రస్తుతం అక్కడ ఏం జరుగుతోందన్న విషయంపై తెలంగాణ పోలీసులు అధికారికంగా ఏం సమాచారం ఇవ్వడం లేదు.
కొందరు క్షేత్ర స్థాయి పోలీసు సిబ్బంది బీబీసీకి చెప్పిన ప్రకారం, పెద్ద సంఖ్యలో ఛత్తీస్‌గఢ్ రాష్ట్ర పోలీసులు, సీఆర్పీఎఫ్ సిబ్బంది రోజూ అడవిలోకి వెళ్లి వస్తున్నారు. వారం రోజులుగా కర్రిగుట్టల పరిసరాల్లో డ్రోన్లు, హెలికాప్టర్లు తిరుగుతున్నాయి. వెంకటాపురం, వాజేడు పరిసరాల్లోని ఆదివాసీలను తప్ప బయటి వారిని ఆ ప్రాంతాలకు అనుమతించడం లేదు. వాజేడు, వెంకటాపురం పోలీస్ స్టేషన్లు కేంద్రంగా కేంద్ర బలగాలకు వసతి, ఇతర సౌకర్యాలు ఏర్పాటు చేసినట్టు తెలుస్తోంది.
అయితే, ”తాము ఎటువంటి ఆపరేషన్ లోనూ పాల్గొనడం లేదు” అని ములుగు జిల్లా ఎస్పీ శబరీశ్ మీడియాకు చెప్పారు.

ఫొటో సోర్స్, Getty Images
పోలీసుల లక్ష్యం ఏంటి?
ఇక్కడ రెండు ప్రధాన లక్ష్యాలు పోలీసులకు ఉన్నాయి. ఒకటి మధ్య భారతదేశంలో విపరీతమైన ఏరివేత చర్యల వల్ల మావోయిస్టులు ఈ కొండ ప్రాంతాలకు పెద్ద సంఖ్యలో వచ్చి తలదాచుకున్నారు కాబట్టి, ఇక్కడ ఒకేచోట వందల సంఖ్యలో మావోయిస్టులు దొరికే అవకాశం ఉంది.
రెండవది, మావోయిస్టులకు సంబంధించిన కీలకమైన నాయకులు, కేంద్ర కమిటీ సభ్యులు, పీఎల్జీఏ (పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ) ఒకటవ బెటాలియన్, అలాగే అనేకమంది పోలీసుల మరణాలకు కారకుడు అని ఆరోపణలు ఎదుర్కొంటోన్న మడావి హిడ్మా అనే కీలక మావోయిస్టు – పీఎల్జీఏ నాయకుడు ఈ ప్రాంతంలో ఉండవచ్చనే అంచనాతో వారు కర్రిగుట్టల కేంద్రంగా ఆపరేషన్ లో దూకుడు పెంచారు.
కేవలం కర్రిగుట్టలు మాత్రమే కాకుండా, పక్కనే ఉన్న దుర్గం గుట్టలపై కూడా బలగాలు దృష్టి పెట్టాయి. అక్కడ కొత్తగా ఒక మొబైల్ టవర్ కూడా ఏర్పాటు చేశారు.

ఫొటో సోర్స్, Getty Images
ఎంతమంది మరణించారు?
ఇప్పటివరకూ ఇక్కడ ఎంతమంది మరణించారు అనే విషయంలో ఎలాంటి స్పష్టమైన సమాచారమూ లేదు. ఈ నెల 24న ముగ్గురు మావోయిస్టులు చనిపోయినట్టు పోలీసులు చెప్పారు. అదే సమయంలో, అక్కడ ఆరుగురు మావోయిస్టులు చనిపోయినట్టుగా ఏప్రిల్ 24వ తేదీన మావోయిస్టు పార్టీ తరఫున విడుదలైన లేఖలో రాశారు.
మధ్యలో ఒకసారి 28 మంది మావోయిస్టులు చనిపోయారన్న వార్తలు వచ్చినప్పటికీ, దానిని పోలీసులు ఖండించారు.
అసలు అంత మంది మావోయిస్టులూ, వారి ముఖ్యమైన అనుచరులూ ఇక్కడే ఉన్నారా? అసలిక్కడకు వచ్చారా? లేక వచ్చి వెళ్లిపోయారా? వంటి ప్రశ్నలకు స్పష్టమైన సమాచారం లేదు. దానిపై మీడియాలో రకరకాల వార్తలు, క్షేత్రస్థాయిలో వదంతులూ వ్యాప్తి చెందుతున్నాయి.
మరోవైపు, పోలీసులు ఆశించినట్టుగా మావోయిస్టు అగ్రనేతలు అక్కడలేరనీ, వారు తమ క్యాంపును అప్పటికే తరలించేశారనీ కూడా కొన్ని తెలుగు మీడియా సంస్థలు వార్తలు ప్రచురించాయి. వాటిని బీబీసీ స్వతంత్రంగా నిర్ధరించలేదు.

ఫొటో సోర్స్, UGC
శాంతి చర్చల కోసం డిమాండ్
ఆపరేషన్ కగార్ తక్షణం నిలిపివేయాలనీ, మావోయిస్టులతో చర్చలు జరపాలనీ హైదరాబాద్ వేదికగా పలు ప్రజా సంఘాల ప్రతినిధులు, శాంతి చర్చల కమిటీగా ఏర్పడిన ప్రముఖులు, కన్సర్న్డ్ సిటిజన్స్ కమిటీ అనే సంఘం కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాయి.
వారిలో కొందరు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలసి కేంద్రాన్ని శాంతి చర్చలవైపు వచ్చేలా ఒప్పించాలని కోరారు. రేవంత్ సానుకూలంగా స్పందించి, తాము మంత్రుల కమిటీతో చర్చించి నిర్ణయం తీసుకుంటామనీ, తాము నక్సల్స్ సమస్యను శాంతిభద్రతల సమస్యగా చూడడం లేదన్నారు.
అలాగే, తెలంగాణ ప్రతిపక్ష నాయకులు కల్వకుంట్ల చంద్రశేఖర రావు కూడా ఈ అంశంపై బహిరంగ ప్రకటన చేశారు. బలం ఉందని చంపడం కాకుండా, ప్రజాస్వామ్యబద్ధంగా చర్చలకు అవకాశం ఇవ్వాలని ఆయన కోరారు.
ఇక మావోయిస్టులు తాము శాంతి చర్చలకు సిద్ధం అంటూ నాలుగుసార్లు లేఖలు విడుదల చేశారు. అయితే, ఈ శాంతి చర్చలపై భారత ప్రభుత్వం నుంచి ఎటువంటి స్పందనా రాలేదు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)