Home జాతీయ national telgu మొహమ్మద్ షా ‘రంగీలా’: ఈ చక్రవర్తి నుంచి కోహినూర్ వజ్రాన్ని నాదిర్ షా ఎలా లాక్కున్నారు,...

మొహమ్మద్ షా ‘రంగీలా’: ఈ చక్రవర్తి నుంచి కోహినూర్ వజ్రాన్ని నాదిర్ షా ఎలా లాక్కున్నారు, మొఘల్ సంపదను ఎలా కొల్లగొట్టారు?

6
0

SOURCE :- BBC NEWS

మొహమ్మద్ షా

ఫొటో సోర్స్, San Diego Museum of Art

1739 జనవరి నాటికి మొఘల్ సామ్రాజ్యం ప్రపంచంలోనే అత్యంత సంపన్న సామ్రాజ్యాల్లో ఒకటి. నెమలి సింహాసనంపై కూర్చున్న మొఘల్ చక్రవర్తి చేతుల్లోనే ఇప్పటి ఉత్తర భారతం, పాకిస్తాన్, బంగ్లాదేశ్, అఫ్గానిస్తాన్‌లో చాలా భాగం ఉండేది.

ప్రపంచ ప్రసిద్ధి చెందిన కోహినూర్ వజ్రం, నెమలి సింహాసనం లేదా మయూర్ సింహాసన్‌ (తఖ్త్-ఈ-తౌస్) పైభాగంలో కోహినూర్ వజ్రం మిలమిల మెరిసేది.

ఔరంగజేబు చనిపోయిన తర్వాత మొఘల్ సామ్రాజ్య ప్రాబల్యం క్రమక్రమంగా తగ్గుతూ పోయినప్పటికీ, కాబూల్ నుంచి కర్ణాటక వరకు ఉన్న సారవంతమైన భూభాగం వీరి నియంత్రణలోనే ఉండేది.

‘‘కోహినూర్ ది స్టోరీ ఆఫ్ ది వరల్డ్స్ మోస్ట్ ఇన్‌ఫేమస్ డైమండ్” పేరుతో విలియం డాల్రింపుల్, అనితా ఆనంద్ రాసిన పుస్తకంలో.. ‘‘ఆ సమయంలో, మొఘల్ రాజధాని దిల్లీలో సుమారు 20 లక్షల మంది నివసించేవారు. ఇది పారిస్, లండన్‌ల మొత్తం జనాభా కంటే ఎక్కువ” అని రాశారు.

ఇస్తాంబుల్‌కు, టోక్యోకు మధ్యలో అత్యంత సంపన్నమైన, అద్భుతమైన నగరం దిల్లీ. ఈ సామ్రాజ్యపు రాజు మొహమ్మద్ షా. ఈయన ‘రంగీలా’ పేరుతో ఎక్కువగా ఫేమస్.

మొహమ్మద్ షా పాలనపై పుస్తకం రాసిన జహీరుద్దీన్ మాలిక్ పలు ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు.

‘‘1719లో మొహమ్మద్ షా దిల్లీ సింహాసనంపై కూర్చున్నారు. ఆ సమయంలో ఆయన వయసు 18 ఏళ్లే. ఆయన అసలు పేరు రోషన్ అఖ్తర్. జహన్ షాకు కొడుకు, ఔరంగజేబుకు మనవడు. సింహాసనాన్ని అధిష్టించిన తర్వాత ఆయన విలువిద్యను అభ్యసించారు. తరచూ వేటకు వెళ్లేవారు” అని జహీరుద్దీన్ తన పుస్తకంలో రాశారు.

నల్లమందుకు బానిస కావడంతో కొంతకాలం తర్వాత ఆయనకు కడుపులో ఇబ్బందులు తలెత్తాయని, ఆయన ఆరోగ్యం క్రమంగా క్షీణించడం ప్రారంభమైందని పేర్కొన్నారు. అంతకుముందులా ఆయన గుర్రపు స్వారీని చేయలేకపోయారు.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
మొఘల్ సామ్రాజ్యం

ఫొటో సోర్స్, Getty Images

ఆస్థానంలో కళల ఆధిపత్యం..

మొహమ్మద్ షా అందాన్ని ఆరాధించేవారు. మహిళల వస్త్రం ‘పేష్వాజ్’, ‘ముత్యాలతో పొదిగిన బూట్లు’ వేసుకోవడమంటే ఆయనకు చాలా ఇష్టం.

ఆయన ఆస్థానంలో సంగీతాన్ని, చిత్రలేఖనాన్ని బాగా ప్రోత్సహించేవారు. ఆస్థానంలోకి సితారాను, తబలాను తీసుకొచ్చి, జానపద సంగీత సంప్రదాయాన్ని మళ్లీ వెలుగులోకి తీసుకొచ్చిన ఘనత మొహమ్మద్ షా రంగీలా దే.

మొఘల్ సామ్రాజ్యపు చిత్రలేఖన కళను పునరుద్ధరించారు. యమునా నది తీరాల్లో హోలీని ఆడేవారు. ఎర్రకోట తోటల్లో తన ఆస్థానాధికారులతో మొహమ్మద్ షా తరచూ మాట్లాడేవారు.

ఔరంగజేబు మతోన్మాద, కఠిన నైతిక నియమాల కారణంగా అంతకుముందు ఎన్నడూ బయటకురాని కళలు, నృత్యం, సంగీతం, సాహిత్య రచనలు కూడా మొహమ్మద్ షా ఆధ్వర్యంలో వెల్లివిరిసాయి.

సామంత రాజుల చేతుల్లోకి అధికారం

కానీ, మొహమ్మద్ షా ‘రంగీలా’ యుద్ధ రంగంలోకి దిగి పోరాటం చేసే యోధుడు కాదు. పాలనపై తనకెలాంటి ఆసక్తి లేదని పదేపదే చెప్పడం ద్వారా ఆయన అధికారంలో కొనసాగగలిగారనే అభిప్రాయం ఉంది.

‘‘ఉదయం పూట కోడిపందాలు, ఏనుగుల పోటీలు చూసేవారు. మధ్యాహ్నం డ్రిల్స్, మిమిక్రీలు ఆయనకు వినోదాన్ని పంచేవి. పాలనా బాధ్యతలన్ని సలహాదారులకే అప్పగించారు” అని విలియం డాల్రింపుల్, అనితా ఆనంద్‌లు రాశారు.

మొహమ్మద్ షా ‘రంగీలా’ పాలనలో అధికారం దిల్లీ చేతుల్లో నుంచి సామంత రాజుల చేతుల్లోకి వెళ్లింది. రాజకీయాలు, ఆర్థిక వ్యవస్థ, అంతర్గత భద్రత వంటి ముఖ్యమైన విషయాలపై నిర్ణయాలను సొంతంగా వారే తీసుకునేవారు.

కోహినూర్ పుస్తకం

ఫొటో సోర్స్, Juggernaut

దిల్లీపై నాదిర్ షా దాడి

ఇద్దరు స్థానిక సామంత రాజులు ఉత్తరాన అవధ్‌కు చెందిన నవాబు సాదత్ ఖాన్, దక్షిణాన నిజాం-ఉల్-ముల్క్‌లు స్వతంత్ర రాజులుగా తమ పట్టును పెంచుకునేందుకు ప్రయత్నించడం మొదలుపెట్టారు.

మొహమ్మద్ షా ‘రంగీలా’ విలాసవంతమైన జీవితం గురించి పశ్చిమాన తన రాజ్య సరిహద్దులో ఉన్న పర్షియన్ మాట్లాడే వ్యక్తి నాదిర్ షాకు తెలిసింది.

ఫ్రెంచ్ రచయిత పెరీ లూయి బజాన్ తన ఆత్మకథలో నాదిర్ షాను వర్ణిస్తూ ఇలా రాశారు.

‘‘నాదిర్ షా తలపై జుట్టంతా తెల్లగా నెరిసి కనిపిస్తున్నా, గడ్డానికి మాత్రం నల్లరంగు వేసుకునేవారు. ఆయన గొంతు గంభీరంగా ఉండేది. ఆయన ఎప్పుడు ఎక్కడ ఉంటారో తెలిసేదికాదు. మిలటరీ క్యాంపులోనే ఆయన ఆస్థానాన్ని నిర్వహించేవారు. టెంట్లలో ఆయన రాజభవనం ఉండేది” అని పేర్కొన్నారు.

కాందహార్‌పై దాడికి ముందు.. రహస్యంగా దిల్లీపై దాడి చేసి, మొఘల్ ఖజానాను దొంగలించేందుకు నాదిర్ షా ప్రయత్నిస్తున్నారన్న వార్తలు గుప్పుమన్నాయి. రెండు దారులను ఆయన గుర్తించారని తెలిపాయి.

‘‘నాదిర్ షా నుంచి తప్పించుకున్న కొందరు ఇరాన్ తిరుగుబాటుదారులకు మొఘలులు ఆశ్రయమిచ్చారు. అంతేకాక, ఇరాన్ రాయబారి నుంచి కొన్ని ఉత్పత్తులను మొఘల్ సరిహద్దు అధికారులు స్వాధీనం చేసుకున్నారు. నాదిర్ షా తన రాయబారిని దిల్లీకి పంపారు. మొఘలులు స్నేహితులా ప్రవర్తించడం లేదని ఫిర్యాదు చేశారు’’ అని విలియం డాల్రింపుల్, అనితా ఆనంద్‌లు తమ పుస్తకంలో రాశారు.

మూడు నెలల తర్వాత, దిల్లీకి ఉత్తరాన ఉన్న కర్నాల్‌లో మొఘల్‌‌లకు చెందిన మూడు సైన్యాలను నాదిర్ షా ఓడించారు. దీనిలో ఒకటి దిల్లీది కాగా, మరో రెండు అవధ్, డెక్కన్‌‌ రాజ్యాలకు చెందిన సైన్యాలు.

నాదిర్ షా, మొహమ్మద్ షా రంగీలా మధ్యలో ఒప్పందం

ఫొటో సోర్స్, Getty Images

నాదిర్ షా, మొహమ్మద్ షా మధ్య ఒప్పందం

నాదిర్‌ షా సైన్యాలు మొఘల్‌ సైన్యాలను చుట్టుముట్టడం, వాటి దగ్గరున్న సరుకులు తరిగిపోతుండటంతో సంధి కోసం నాదిర్షాను పిలిచారు మొహమ్మద్ షా .

‘‘రంగీలాను నాదిర్ షా బాగానే చూసుకున్నారు. కానీ, తిరిగి వెళ్లనివ్వలేదు. రంగీలా అంగరక్షకుల నుంచి ఆయుధాలను తీసేసుకున్నారు. ఆ తర్వాత రోజు నాదిర్ షా సైనికులను మొఘల్ క్యాంపుకు పంపారు. మొహమ్మద్ షా రంగీలాకు చెందిన మొత్తం బృందాన్ని, సేవకులను తీసుకురావాలని ఆదేశించారు. నాయకుడు లేని మొఘల్ సైన్యాన్ని తిరిగి ఇంటికి వెళ్లవచ్చని ఆ తర్వాత రోజు చెప్పారు’’ అని ‘స్వార్డ్ ఆఫ్ పర్షియా’ పుస్తకంలో మైఖేల్ ఆక్స్‌వర్దీ రాశారు.

ఇలా మొఘల్ సైన్యానికి చెందిన బలగాలన్ని నాదిర్ షా ఆధీనంలోకి వచ్చాయి.

‘‘కొన్ని వారాల తర్వాత, మొహమ్మద్ షా రంగీలా దిల్లీకి వచ్చినప్పుడు, నగరమంతా నిశ్శబ్దంగా ఉంది. మార్చి 20న, వంద ఏనుగులతో నాదిర్ షా దిల్లీలోకి ప్రవేశించారు. వచ్చిన వెంటనే, ఎర్రకోటలో దివాన్-ఈ-ఖాస్‌కు సమీపంలో ఉన్న షాజహాన్ పడకగదిలో తన క్యాంపును ఏర్పాటు చేసున్నారు. అసద్ బుర్జ్ సమీపంలోని ఒక భవనంలో మొహమ్మద్ షా ఉండేవారు” అని ‘తారిఖ్-ఇ-జహాన్ కుషా-ఈ-నాద్రి” అనే పుస్తకంలో మెహదీ అష్రాబాదీ రాశారు.

మొహమ్మద్ షా తన రాచ ఖజనా మొత్తాన్ని నాదిర్ షాకు అప్పజెప్పారు. మార్చి 21 బక్రీద్ రోజున దిల్లీలోని అన్ని మసీదుల్లో నాదిర్ షా పేరుతో ధర్మోపదేశం చేశారు. అదే రోజు, దిల్లీలోని మింట్‌లో నాదిర్ షా పేరుతో నాణేలను ముద్రించారు.

నాదిర్ షా, మొహమ్మద్ షా

ఫొటో సోర్స్, museum guimenet paris

దిల్లీలో మారణహోమానికి నాదిర్ షా ఆదేశం

ఆ తర్వాత రోజు మొఘల్ రాజధాని చరిత్రలోనే అత్యంత బాధకరమైన రోజు. నాదిర్ షా దిల్లీలోకి ప్రవేశించిన వెంటనే ధాన్యాల ధరలు విపరీతంగా పెరిగాయి. నాదిర్ షా సైనికులు పహాడ్‌గంజ్ వర్తకులతో బేరమాడటం మొదలుపెట్టారు. కానీ, వారు వినలేదు. ఇరువర్గాల మధ్య ఘర్షణలు చెలరేగాయి.

‘‘నాదిర్ షాను కోటలోని ఒక గార్డు చంపేశారనే వార్తలు చక్కర్లు కొట్టాయి. ఒక్కసారిగా జనం నాదిర్‌ షా సైనికులపై తిరగబడ్డారు. నాదిర్ షా సైన్యంలో 900 మంది చనిపోయారు. దీంతో, ఊచకోత కోయాలని ఆదేశాలు జారీ చేశారు నాదిర్ షా’’ అని విలియం డాల్రింపుల్, అనితా ఆనంద్ రాశారు.

ఆ తర్వాత రోజు ఈ ఊచకోత ఎలా సాగుతుందో దగ్గరుండి చూసేందుకు ఎర్రకోట నుంచి బయటికి వచ్చారు నాదిర్ షా. చాందినీచౌక్‌కు సమీపంలో కొత్వాలి ప్లాట్‌ఫామ్ వద్ద క్యాంపు ఏర్పాటు చేసుకున్నారు. ఉదయం 9 గంటలకు జనం మీద దాడులు మొదలయ్యాయి.

సైనికులు ఇంటింటికీ వెళ్లి దొరికిన వారిని దొరికినట్టు చంపారు. అప్పుడు పారిన రక్తం కాలువల్లో ప్రవహించిందని చెబుతారు. చాలా ఇళ్లను తగలబెట్టారు. నగరమంతా మృతదేహాలే. ఒక్కరోజే దిల్లీలో 30 వేల మంది మరణించారు.

నరమేధం ఆగగానే దోపిళ్లు మొదలయ్యాయి. నగరాన్ని భాగాలుగా పంచేశారు. అక్కడకు వెళ్లి వీలైనన్ని వస్తువులు, సంపదను దోచుకువచ్చే పనిని సైనికులకు అప్పగించారు. సంపదను దాచిన వారిని చిత్రహింసలు పెట్టేవాళ్లు.

కొన్ని రోజుల తర్వాత, నాదిర్ షాకు భారీ మొత్తంలో డబ్బులు చెల్లించాలని తన సొంత రాజధాని ప్రజలే మొహమ్మద్ షాపై ఒత్తిడి చేయడం ప్రారంభించారు.

”మొత్తం దిల్లీని ఐదు భాగాలుగా విడదీశారు. ప్రతి భాగానికి భారీ మొత్తాన్ని నాదిర్ షా డిమాండ్ చేశారు. బలవంతంగా డబ్బులు తీసుకోవడమే కాకుండా, కుటుంబాలను కూడా నాశనం చేశారు. చాలామంది ప్రజలు విషం తీసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. కొందరు కత్తులతో ప్రాణాలు తీసుకున్నారు. మొఘలులు 348 ఏళ్లు కష్టపడి సంపాదించుకున్న సంపదంతా ఒక్క దెబ్బకి మరొకరి చేతుల్లోకి వెళ్లిపోయింది” అని ‘తజ్కిరా’ అనే పుస్తకంలో ఆనంద్ రామ్ ముఖ్లిస్ రాశారు.

నాదిర్ షా

ఫొటో సోర్స్, B Tauris

మరోసారి దిల్లీ రాజుగా మొహమ్మద్ షా రంగీలా

అదంతా జరుగుతున్నప్పుడు, మొహమ్మద్ షా రంగీలా పట్ల చాలా దయతో, మర్యాదతో ఉన్నట్లు నాదిర్ షా ప్రవర్తించారు. కానీ, వాస్తవానికి అక్కడ జరిగింది మొహమ్మద్ షాను తన పక్కన ఒక క్రమశిక్షణాపరుడిలా నిల్చోబెట్టారు నాదిర్ షా.

నెల తర్వాత మే 12న నాదిర్ షా ఆస్థానాధికారులను పిలిచి, మరోసారి మొహమ్మద్ షా రంగీలా శిరస్సుపై కిరీటాన్ని పెట్టారు.

ప్రముఖ చరిత్రకారుడు ఆర్‌వీ స్మిత్ ది హిందూ పత్రికలో ‘ఆఫ్ నూర్, కోహినూర్’ అనే కథనంలో ఇలా రాశారు.

”మొహమ్మద్ షా రంగీలా తన తలపాగాలో కోహినూర్ వజ్రాన్ని దాచారని డ్యాన్సర్ నూర్‌బాయి నుంచి నాదిర్ షాకు తెలిసింది. మనం అన్నదమ్ముల్లాంటి వాళ్లమని మొహమ్మద్ షాకు నాదిర్ షా చెప్పారు. తలపాగాలు మార్చుకుందామని అన్నారు” అని పేర్కొన్నారు.

‘‘ఈ కథ చాలామందికి ఆసక్తికరం. కానీ, దానికి ఆధారాలేంటో తెలియదు. 19వ శతాబ్దం తర్వాతనే చరిత్ర పుస్తకాల్లో ఈ కథను ప్రస్తావించడం ప్రారంభించారు. నాదిర్ షా తన తలపాగాను మొహమ్మద్ షా రంగీలాకు ఇచ్చారని మొఘల్ ఆస్థానాధికారి జుగల్ కిశోర్ ప్రస్తావించారు’’ అని డాల్రింపుల్ తెలిపారు.

కోహినూర్ వజ్రం

ఫొటో సోర్స్, Getty Images

దిల్లీలో దొంగలించిన తఖ్త్-ఈ-తౌస్, కోహినూర్‌లు ఇరాన్‌కు…

57 రోజుల పాటు దిల్లీలో ఉన్న నాదిర్ షా, 8 తరాల మొఘలులు సేకరించిన సంపదంతా పట్టుకుని మే 14న ఇరాన్ వెళ్లారు.

‘‘ నెమలి సింహాసనంపై ఉన్న సంపదంతా నాదిర్ షా దొంగలించడం అతిపెద్ద విషయం. ఆయన దొంగలించిన సంపదలో విలువైన బంగారం, వెండి, విలువైన వజ్రాలు ఉన్నాయి. 700 ఏనుగులు, 4 వేల ఒంటెలు, 12 వేల గుర్రాలపై పెట్టుకుని ఇరాన్ వచ్చారు” అని ఇరాన్ చరిత్రకారుడు మొహమ్మద్ కజీమ్ మార్వి ‘ఆలంఆరా-యే- నాదెరీ’ లో రాశారు.

చీనాబ్ నది మీద వంతెనను నాదిర్ షా బలగాలు దాటుతున్నప్పుడు, సైనికుల్లో ప్రతి ఒక్కర్ని తనిఖీ చేశారు. ఆ తనిఖీలకు భయపడిన చాలామంది సైనికులు తాము దొంగలించిన బంగారం, విలువైన రాళ్లను నదిలో పడేశారు. ఏదో ఒకరోజు తిరిగి వచ్చి, నదీ నుంచి ఆ విలువైన వజ్రాలను, రాళ్లను తిరిగి తీసుకుంటామని సైనికులు భావించారు.

నాదిర్ షా మొత్తం ఎంత సంపద దోచుకున్నాడు? చరిత్రకారుల అంచనా ప్రకారం. ఆ సమయంలోనే ఆయన దోచిన సంపద విలువ రూ. 70 కోట్లు. మానవ చరిత్రలోనే ఇది అతిపెద్ద సైనిక దోపిడీ. దీనితోపాటు మొహమ్మద్ షా నుంచి నాదిర్ షా తెలివిగా సొంతం చేసుకున్న కోహినూర్ వజ్రం. ఇది వెలకట్టలేనిది.

నాదిర్ షా

ఫొటో సోర్స్, Getty Images

మొహమ్మద్ షా రంగీలా మరణం

నాదిర్ షా దోపిడీ తర్వాత కూడా మొహమ్మద్ షా రంగీలా దిల్లీని తొమ్మిదేళ్లు పాలించారు.

చివరి రోజుల్లో ఆయన పెరాలసిస్‌తో బాధపడ్డారు.

‘‘ఆఖరి రోజుల్లో మొహమ్మద్ షా చాలా బలహీనంగా కనిపించారు. తరచూ జ్వరం వచ్చేది. మరణానికి ముందు, మొహమ్మద్ షా రంగీలాను కోటలోని మసీదుకు తీసుకెళ్లారు. ఆయన ఆస్థానాధికారులు, సంబంధీకులు అక్కడ ఉన్నారు. మాట్లాడుతూనే అకస్మాత్తుగా ఆయన స్పృహ కోల్పోయారు’’ అని షేక్ అహ్మద్ హుస్సేన్ మజాక్ రాసిన పుస్తకం ‘తారిఖ్-ఈ-అహ్మది’ లో పేర్కొన్నారు.

ఆ తర్వాత రోజు అంటే 1748 ఏప్రిల్ 17న మొహమ్మద్ షా తుది శ్వాస విడిచారు. నిజాముద్దీన్ ఔలియా సమాధి ఆవరణలో తనను ఖననం చేయాలన్నది ఆయన చివరి కోరిక.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)