SOURCE :- BBC NEWS

2 గంటలు క్రితం
జమ్మూ కశ్మీర్‌లోని పహల్గాంలో ఏప్రిల్ 22న జరిగిన తీవ్రవాద దాడిలో మరణించిన 26 మందిలో గుజరాత్‌కు చెందిన ముగ్గురు వ్యక్తులు ఉన్నారు.
ఈ దాడి తరువాత దేశవ్యాప్తంగా ఆయారాష్ట్రాల్లో నివసిస్తున్న పాకిస్తానీ పౌరులను గుర్తించి, వారిని తిరిగి పంపించడానికి తగిన చర్యలు తీసుకోవాలని అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులను కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆదేశించారు.
ఈ నేపథ్యంలో శనివారం ఉదయం, గుజరాత్‌లోని అహ్మదాబాద్, సూరత్‌లలో స్థానిక పోలీసులు బంగ్లాదేశీయులు, ఇతర దేశాల పౌరులనే ఆరోపణలపై 500 మందికి పైగా వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. వీరు భారతదేశంలోకి అక్రమంగా వచ్చారని అభియోగం.
వైరల్ అయిన వీడియోలో, కాన్వాయ్‌కి ఇరువైపులా పోలీసులు ఉండగా, మహిళలు సహా పెద్ద సంఖ్యలో నిర్బంధించిన వ్యక్తులు కాన్వాయ్ మధ్యలో నడుస్తున్నట్లు కనిపిస్తోంది.
అదుపులోకి తీసుకున్న అనేక మంది వ్యక్తులు పోలీసు కాన్వాయ్‌లో వరుసగా కూర్చున్నట్లు మరొక వీడియోలో ఉంది.
ఇప్పటివరకు అందిన సమాచారం ప్రకారం, అహ్మదాబాద్‌లోని చందోలా, సూరత్, రాజ్‌కోట్, మహిసాగర్ జిల్లాలోని కొన్ని ప్రాంతాలలో పోలీసులు వీరిని అదుపులోకి తీసుకున్నారు.
రాజ్‌కోట్ పోలీసులు, క్రైమ్ బ్రాంచ్, స్పెషల్ ఆపరేషన్స్ గ్రూప్, ఇతర శాఖలు సంయుక్తంగా అర్థరాత్రి వరకు ఈ ఆపరేషన్ నిర్వహించాయి. ఇందులో 10 మందికి పైగా అనుమానితులను అదుపులోకి తీసుకున్నారని రాజ్‌కోట్ నుంచి బీబీసీ ప్రతినిధి బిపిన్ టంకారియా తెలిపారు.


ఫొటో సోర్స్, ANI
పోలీసులు ఏం చెబుతున్నారు?
అహ్మదాబాద్ క్రైమ్ బ్రాంచ్ కు చెందిన శరద్ సింఘాల్ దీనిపై మరింత సమాచారం ఇచ్చారు. అహ్మదాబాద్‌లో నివసిస్తున్న చొరబాటుదారులను అరెస్ట్ చేయాల్సిందిగా రాష్ట్ర హోంశాఖ సహాయ మంత్రి, డీజీపీ, అహ్మదాబాద్ పోలీస్ కమిషనర్ తమను ఆదేశించారని తెలిపారు. ఈమేరకు 2024 ఏప్రిల్ నుంచి ఇప్పటి వరకు క్రైమ్ బ్రాంచ్ రెండు ఎఫ్ఐఆర్లు నమోదు చేసి అక్రమంగా నివసిస్తున్న 127 మంది బంగ్లాదేశీయులను అరెస్టు చేసింది. వీరిలో 77 మందిని బహిష్కరించామని, మరికొందరి విషయంలో ఉత్వర్వుల కోసం వేచి చూస్తున్నామని చెప్పారు.
”అరెస్ట్ అయిన వారి నుంచి సేకరించిన సమాచారం మేరకు చందోలా చుట్టుపక్కల పెద్ద సంఖ్యలో బంగ్లాదేశీయులు నివసిస్తున్నట్లు గుర్తించాం. దీంతో పోలీసులు రంగంలోకి దిగి గాలింపు మొదలుపెట్టారు.”’
”ఇప్పటి వరకు 457 మందిని అదుపులోకి తీసుకున్నాం. వీరిని క్రైమ్ బ్రాంచ్ కార్యాలయంలో విచారించనున్నాం. వీరంతా బంగ్లాదేశ్ పౌరులని, వారు అక్రమంగా భారత్ లోకి ప్రవేశించారని, ఇక్కడికి వచ్చిన తర్వాతే తమగుర్తింపు కార్డులు పొందారని రుజువైతే వారిని బహిష్కరించే ప్రక్రియను ప్రారంభిస్తాం” అన్నారు .
ఎవరు బంగ్లాదేశ్ పౌరులో ఎలా గుర్తిస్తారన్న ప్రశ్నకు శరద్ సింఘాల్ సమాధానమిస్తూ.
”పలు రకాల సమాచారం ఆధారంగా ఈ విషయాన్ని ధృవీకరిస్తున్నాం. వారి గుర్తింపు కార్డు ఎప్పుడు వచ్చింది, ఎప్పుడు, ఎక్కడ పుట్టారు, వారి తల్లిదండ్రులు ఎక్కడ ఉన్నారు. వారు ప్రస్తుతం ఎవరెవరితో కాంటాక్ట్‌లో ఉన్నారు, ఎప్పుడు బంగ్లాదేశ్ కు వెళ్లారు అనే విషయాలను ఆరా తీస్తున్నాం . ఈ సమాచారమంతా సేకరించిన తర్వాతే ఈ ప్రక్రియ పూర్తిచేస్తామని” శరద్ సింఘాల్ చెప్పారు.
మరోపక్క సూరత్ పోలీసులు 100మందికిపైగా బంగ్లాదేశీయులను అదుపులోకి తీసుకున్నారు. నకిలీ ధృవప్రతాలతో వీరు ఇండియాలోకి ప్రవేశించారని చెబుతున్నారు. ”విచారణ పూర్తి చేసిన తరువాత వారందరినీ బంగ్లాదేశ్‌కు పంపించివేస్తాం” అని స్పెషల్ ఆపరేషన్స్ గ్రూప్ డీసీపీ రాజ్‌దీప్ సింగ్ నకూమ్ చెప్పారు.

ఫొటో సోర్స్, ANI

ఫొటో సోర్స్, ANI
‘‘స్లీపర్ సెల్స్ ఉన్నారు’’
గుజరాత్‌లో అక్రమంగా నివసిస్తున్నవారిని పట్టుకోవడానికి ఇప్పటివరకు జరిగిన అతిపెద్ద ఆపరేషన్ ఇదేనని గుజరాత్ ప్రభుత్వం చెబుతోంది.
అహ్మదాబాద్‌లో 890 మంది, సూరత్‌లో 134 మంది సహా ఇప్పటివరకు వెయ్యి మందికి పైగా అక్రమంగా నివసిస్తున్న బంగ్లాదేశ్ పౌరులను అదుపులోకి తీసుకున్నట్లు గుజరాత్ హోంశాఖ సహాయ మంత్రి హర్ష్ సంఘ్వీ తెలిపారు.
గతంలో అరెస్టయిన నలుగురు బంగ్లాదేశీయుల్లో ఇద్దరు గుజరాత్ లో అల్ ఖైదాకు స్లీపర్ సెల్స్ గా పనిచేస్తున్నట్లు గుర్తించామన్నారు. వీరి నేపథ్యం, వారి కార్యకలాపాలన్నింటిపైనా విచారణ కొనసాగుతోందని తెలిపారు.
బంగ్లాదేశీయులు ఎవరైనా గుజరాత్‌లో అక్రమంగా నివసిస్తుంటే వారు నేరుగా పోలీసుస్టేషన్‌కు వెళ్లి లొంగిపోవాలన్నారు. లేదంటే పోలీసులే వారి ఇళ్లకు వెళ్లి అరెస్ట్ చేస్తారని చెప్పారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)