SOURCE :- BBC NEWS

ఫొటో సోర్స్, Getty Images
ఎవరికైనా దెబ్బ తగిలినప్పుడో, ప్రమాదాలు జరిగినప్పుడో లేదంటే జబ్బు చేసినపుడు అందించే మొదటి సేవను ప్రథమ చికిత్స అంటారు.
ప్రమాద స్థలంలో మొట్టమొదటి ఫస్ట్ ఎయిడ్/సేవ అందించే వారిని ఫస్ట్ రెస్పాండర్స్ అంటారు.
మనం కూడా ఏదో ఒక సందర్భంలో ప్రమాద స్థలంలో ఉండి, ఫస్ట్ రెస్పాండర్‌గా మారే పరిస్థితులు కలగొచ్చు. అందుకే మనందరికి ప్రాథమిక చికిత్స గురించి కనీస అవగాహన ఉండాలి.


ఫొటో సోర్స్, Getty Images
ఏం చేయాలి?
ఎవరైనా ప్రమాదంలో పడినా, గాయపడినా.. ఆ వ్యక్తి చుట్టూ ఇంకా ప్రమాదాలు ఉన్నాయో లేదో చూడాలి. ఉదాహరణకు.. కరెంటు తీగలు, మంటలు, వాహనాలు, పాములు, కూలిపోతున్న గోడ, వరద నీరు వంటివి. ఏ ప్రమాదం పొంచి లేదనుకున్నపుడే బాధితుడి వద్దకు వెళ్లాలి. లేదంటే మీరు కూడా ప్రమాదంలో పడొచ్చు.
బాధితులు మనకి సన్నిహితులైతే కంగారుగా ఉంటుంది. షాక్‌కి గురై మనం ఏమీ చేయలేని పరిస్థితి కూడా రావొచ్చు. వెంటనే తేరుకుని సహాయం చేస్తే బాధితులు బతికే అవకాశం ఉంటుంది.
చాలా అవసరం అనుకుంటే తప్ప బాధితులను వారు ఉన్న స్థానం నుంచి కదపకూడదు.
బాధితులకు తినడానికి, తాగడానికి ఏమీ ఇవ్వకూడదు.
ఎమర్జెన్సీ ఫోన్ నంబర్లు దగ్గర పెట్టుకోవాలి.
- 100: పోలీస్
- 101: అగ్నిమాపక కేంద్రం
- 108: అంబులెన్స్

ఫొటో సోర్స్, Getty Images
ఎవరైనా అకస్మాత్తుగా కుప్పకూలితే ఏం చేయాలి?
ఎవరైనా అకస్మాత్తుగా కుప్పకూలిపోతే ఆ వ్యక్తి పడిపోయిన చోట ఏ ప్రమాదమూ లేదని రూఢీ చేసుకోవాలి. కచ్చితంగా అవసరం అనుకుంటే తప్ప రోగిని ఉన్న చోటు నుంచి కదపకూడదు. ఎమర్జెన్సీ నంబర్‌కి కాల్ చేయాలి. తర్వాత పడిపోయిన వారిని తట్టి లేపే ప్రయత్నం చేయాలి. వాళ్లు కదలకుండా ఉంటే ఎయిర్ వే, బ్రీతింగ్, సర్క్యూలేషన్ (A,B,C) అనేపద్ధతిలో వారికి చికిత్స అందించాలి.
- A: ఎయిర్ వే – అంటే శ్వాసనాళంలో ఏదైనా అడ్డు పడిందేమో చూసి తీసేయడం, బాధితులు వాంతి చేసుకున్నట్లయితే వారిని పక్కకి తిప్పి పడుకోబెట్టాలి.
- B: బ్రీతింగ్, వారు ఊపిరి తీసుకుంటున్నారో లేదో చూడాలి.
- C: సర్క్యూలేషన్, వారి నాడి కొట్టుకుంటోందో లేదో చూడాలి. ఊపిరి, నాడీ లేదని నిర్ధరించుకుంటే వెంటనే సీపీఆర్ (కార్డియో పల్మనరీ రీససిటేషన్) చేయాలి.
ఇవన్నీ కూడా వ్యక్తి పడిపోయిన 2 నిమిషాలలోపు జరిగిపోవాలి.
సమయం గడుస్తున్న కొద్దీ మెదడుకి రక్త ప్రసరణ లేక కోమాలోకి వెళ్లే ప్రమాదం ఉంటుంది.
ఛాతిపైన మన రెండు అర చేతులు ఒకదానిపైన మరొకటి పెట్టి నొక్కాలి. అలా 30 సార్లు నొక్కాక, వారి నోటిలోకి గాలి ఊదాలి. అలా రెండుసార్లు గాలి ఊదాక మళ్లీ ఛాతిపైన 30 సార్లు నొక్కాలి (నిమిషానికి 100-120 సార్లు మించరాదు).
ఎమర్జెన్సీ వాళ్లు వచ్చేదాకా ఇలా సీపీఆర్ చేస్తే బెటర్. ఇలా సీపీఆర్ చేస్తున్నపుడు వ్యక్తి గుండె మళ్లీ కొట్టుకోవడం ప్రారంభం అయ్యే అవకాశం ఉంటుంది.

ఫొటో సోర్స్, Getty Images
పిల్లల గొంతులో ఏదైనా ఇరుక్కుంటే?
పిల్లల గొంతులో ఏదైనా అడ్డు పడితే వారిని వెంటనే తలకిందులుగా తిప్పి, వీపుపైన ఐదు సార్లు అర చేయి కింది భాగంతో కొట్టాలి. అదే పెద్దవారికైతే బాధితుడిని ముందుకు వంపి, వీపు పైన అర చేయితో కొట్టాలి.
నోటిలో ఆహారం ఏదైనా అడ్డుపడితే వేలు పెట్టి బయటకి తీయాలి. అడ్డు పడిన వస్తువు మరీ ఎక్కువ లోపలకు ఉంటే తీయకండి, అది ఇంకా లోపలికి వెళ్లే ప్రమాదం ఉంటుంది.
తాగడానికి ఏమీ ఇవ్వకూడదు. బాధితుడికి గాలి దొరకని పరిస్థితి ఉంటే, వారిని ముందుకు వంపి, వెనక నుంచి ఛాతీ కింద వైపున గట్టిగా పట్టుకుని లోనికి నొక్కాలి.

ఫొటో సోర్స్, Getty Images
రక్తస్రావం జరిగితే ఏం చేయాలి?
రక్తస్రావం ఎక్కడి నుంచి జరుగుతుందో చూసి అక్కడ చేతితో గట్టిగా అదిమి పట్టుకోవాలి. స్టెరైల్ బ్యాండేజీ ఉంటే దాంతోనే గట్టిగా అదిమి పట్టుకోవాలి. ఎయిర్ వే, బ్రీతింగ్, సర్కులేషన్.. అవసరమనుకుంటే సీపీఆర్ చెయ్యాలి. గాయం అయిన చోటులో గాజు ముక్కలు, మట్టి ఇంకా ఇతర పదార్థాలు ఉంటే వాటిని తీసేసి గాయాన్ని శుభ్రంగా కడిగి, బ్యాండేజీ కట్టాలి.
గాయమైన భాగాన్ని గుండె కంటే ఎత్తులో ఉండేలా ఎత్తి పట్టుకోవాలి. బ్యాండేజ్ రక్తంతో తడిచిపోతే దానిపైనే ఇంకా బ్యాండేజీలు కట్టాలి. రక్తస్రావం ఆగిపోయినా బ్యాండేజీ తీయకూడదు. రక్తస్రావం అయ్యే చోటు నుంచి ఎముక బయటికి కనపడితే దానిని వీలైనంత వరకు ముట్టుకోకపోవడం ఉత్తమం. గాయమైన చోట మరీ పెద్ద వస్తువు ఉంటే దానిని తీసే ప్రయత్నం చేయకూడదు.
రక్త వాంతులు అయినా, రక్త విరేచనాలు లేదా నల్లటి మలం వచ్చినా, మూత్రంలో రక్తం వచ్చినా, పొట్ట భాగం బాగా నొప్పిగా ఉన్నా శరీరం లోపల రక్తస్రావం జరుగుతోందని అర్థం. ఆ సమయంలో వెంటనే అంబులెన్స్‌కి ఫోన్ చేయాలి. బాధితులను పక్కకు తిప్పి పడుకోబెట్టాలి.

ఫొటో సోర్స్, UGC
పాము కరిస్తే..
శరీరంలో ఏదైనా భాగం కెమికల్ లేదా మంట అంటుకుని కాలినా/వేడి నూనె పడినా వెంటనే ఆ భాగం పైన చల్లటి నీళ్లు ఒక 15 నిమిషాల పాటు పోయాలి. తర్వాత దగ్గర్లోని ఆసుపత్రికి తీసుకెళ్లాలి.
పాము కరిచినపుడు పాత సినిమాల్లో చూపినట్టుగా ఆ భాగంపైన గట్టిగా కట్టు కట్టకూడదు, గాయం నుంచి రక్తం నోటితో పీల్చే ప్రయత్నం చేయకూడదు, ఐస్ పెట్టకూడదు. పాము కరిచిన చోటుని చెక్ చేసి అది విషపూరితమా? కాదా అని నిర్ధరించుకోవాలి. రెండు గాట్లు మాత్రమే ఉంటే అది విషపూరితమైన పాము అని అర్థం. వెంటనే గాటు పడిన చోటుని సుబ్బు నీళ్లతో కడిగేయాలి. ఆ శరీర భాగాన్ని ఎటూ కదలని పొజిషన్‌లో పెట్టాలి. క్రీప్ బ్యాండేజ్ గానీ లేదంటే చున్నీ గానీ ఉంటే దానితో పాము కరిచిన భాగం నుంచి పైకి చుట్టుకుంటూ వెళ్లాలి. దాని వల్ల విషం శరీరంలోని ఇతర భాగాలకు పాకకుండా ఉంటుంది. వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్లీ యాంటీ స్నేక్ వీనమ్ ఇప్పించాలి.
ఎవరైనా నీళ్లలో మునిగిపోతే, వారిని బయటకు తీసిన తర్వాత దృఢమైన నేలపైన పడుకోబెట్టి, శ్వాసనాళంలో ఉన్న నీరు బయటకు వెళ్లి పోయేలా పక్కకు తిప్పాలి. మళ్లీ వెల్లకిలా తిప్పి శ్వాస ఆడుతుందో లేదో చూసి అవసరమైతే సీపీఆర్ చేయాలి.
ఎవరికైనా ఎలక్ట్రిక్ షాక్ తగిలి పడిపోతే ముందు మెయిన్ పవర్ స్విచ్ ఆఫ్ చేయాలి. ఒకవేళ అది ఆఫ్ చేయలేని పరిస్థితి ఉంటే చెక్క వస్తువులతో లేదంటే చెక్క కుర్చీ, న్యూస్ పేపర్‌తో అయినా ఆ కేబుల్ వైర్లని పక్కకి జరపవచ్చు. అలా చేస్తున్నపుడు, రబ్బరు చెప్పులు వేసుకోవాలి, లేదంటే దట్టమైన న్యూస్ పేపర్ కట్టపైన నిలబడాలి.
సంఘటనా స్థలం నుంచి ప్రమాద కారకాలను తీసివేసిన తర్వాత వెంటనే బాధితులకు సీపీఆర్ అందించాలి.
పిచికారీ మందుల విషయంలో..
ఎమర్జెన్సీ సందర్భాల్లో వేడి వస్తువులు లేదా వేడి కాపడం పెట్టకూడదు .
కండరాలకు గాయమైతే ఐస్ ప్యాక్ వాడొచ్చు.
ఎవరికైనా ముక్కులో నుంచి రక్తం కారుతుంటే.. ఆ వ్యక్తిని కొంచెం ముందుకి వంగి కూర్చోమని చెప్పి రెండు ముక్కు ద్వారాలను కలిపి గట్టిగా ఒక పది నిమిషాల పాటు పట్టుకోవాలి. ఆ సమయంలో శ్వాస నోటి ద్వారానే తీసుకోవాలి. ముక్కు చీదకూడదు. రక్తస్రావం ఆగిన తర్వాత చాలా గంటల వరకు కూడా ముక్కు చీదకూడదు. రక్తస్రావం అసలు ఆగకపోతే వెంటనే ఆసుపత్రికి వెళ్లాలి.
ఎవరైనా పిచికారీ చేసే మందులు (ఆర్గానో ఫాస్ఫరస్) తీసుకున్నట్లయితే విష పదార్థాన్ని మొత్తం వారి నోటి, ముక్కు నుంచి తీసేసే ప్రయత్నం చేయాలి. వీలైతే వారి మొహం, చేతులు నీటితో కడిగేయాలి.
ఎటువంటి పాయిజన్ తీసుకున్నారో తెలియకుండా వాంతి చేసుకునేలా ఏమీ ఇవ్వకూడదు. 108కి ఫోన్ చేసి, ఆ వ్యక్తి తీసుకున్న విష పదార్థం పేరు చెప్పి ఏం చేయమంటారో కనుక్కోవాలి.

ఫొటో సోర్స్, Getty Images
ఫస్ట్ ఎయిడ్ కిట్‌లో ఏం ఉండాలి?
- బ్యాండేజ్
- దూది
- బీటాడిన్ లోషన్
- పారాసిటమాల్ మాత్రలు
- ఆస్పిరిన్, నైట్రోగ్లిజరిన్ మాత్రలు
- కత్తెర
- కాటన్ గాజ్ పీసులు
- థర్మామీటర్
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)