Home జాతీయ national telgu బీఆర్ఎస్ రజతోత్సవం: పాతికేళ్ల ప్రస్థానంలో ఆ పార్టీ ఇంకా నేర్చుకోవాల్సింది ఏంటి?

బీఆర్ఎస్ రజతోత్సవం: పాతికేళ్ల ప్రస్థానంలో ఆ పార్టీ ఇంకా నేర్చుకోవాల్సింది ఏంటి?

7
0

SOURCE :- BBC NEWS

బీఆర్ఎస్

ఫొటో సోర్స్, X/BRS Party

2001లో తెలంగాణ రాష్ట్ర సాధనే ధ్యేయంగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్ర సమితి (ప్రస్తుతం భారత రాష్ట్ర సమితి) తన పదేళ్ల పాలన తర్వాత 2023 ఎన్నికల్లో పరాజయం పాలై కష్టదశను ఎదుర్కొంటోంది.

పాతికేళ్ల సిల్వర్ జూబ్లీ వేడుకల్ని జరుపుకుంటున్న ఆ పార్టీ, రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి, బలమైన శక్తిగా ఎదుగుతూ, రాష్ట్ర రాజకీయాల్లో కీలక పాత్ర పోషించాలని ప్రయత్నిస్తున్న భారతీయ జనతాపార్టీకి మధ్య నలిగిపోతానని ఎన్నడూ ఊహించి ఉండదు.

తన పార్టీ శ్రేణులు చేజారిపోకుండా కాపాడుకోవడం ఆ పార్టీ ముందున్న అతి పెద్ద సవాలు.

గెలిచిన పార్టీలు ఓడిపోయిన పార్టీ నుండి నేతలను తమవైపు ఆకర్షించడం భారత రాజకీయాల్లో అనుసరిస్తున్న సర్వసాధారణ వ్యూహం.

హార్స్ ట్రేడింగ్ ఒక ప్రామాణిక పద్ధతిగా మారుతున్న తరుణం ఇది. తాను అధికారంలో ఉన్నప్పుడు టీఆర్ఎస్ స్వయంగా ఉపయోగించిన ఈ వ్యూహం కేవలం ఒకటి రెండు సందర్భాల వ్యవహారంగా కాక, భారత రాజకీయాల్లో, ముఖ్యంగా రాష్ట్ర స్థాయి రాజకీయాలలో ఒక ప్రాథమిక మార్పుగా పరిణమించింది.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌

రాజకీయ సంస్థాగత పథంలో టీఆర్ఎస్ పాతిక సంవత్సరాల పయనాన్ని మూడు దశలుగా చూడొచ్చు. మొదటి దశలో ఉద్యమ పార్టీగా విస్తరిస్తూ తెలంగాణ రాజకీయ అస్థిత్వానికి తానే సారధిగా ఎదగడం మీద దృష్టి పెట్టింది ఆ పార్టీ.

ఉద్యమ పార్టీ నుంచి రాజకీయ పార్టీగా మారిన తర్వాత పదేళ్ల పాటు తెలంగాణను పాలించడాన్ని రెండో దశగా భావించవచ్చు. ఈ దశలోనే పార్టీ పేరును తెలంగాణ రాష్ట్ర సమితి నుంచి భారత రాష్ట్ర సమితిగా మార్చుకుంది. ఇతర రాష్ట్రాలకూ విస్తరించే ప్రయత్నం చేసింది.

2023 ఎన్నికల తర్వాత ఆ పార్టీ ప్రతిపక్ష పాత్ర పోషించడం మూడో దశగా చూడొచ్చు.

అదృష్టం తలకిందులుకావడంతో, అఖిల భారత రాజకీయాలకు ఎదగాలన్న బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆశయం దారుణంగా దెబ్బతింది. దీంతో తెలంగాణ ఐడెంటినీ తిరిగి దక్కించుకునేందుకు ఆ పార్టీ తిరిగి ప్రయత్నాలు ప్రారంభించింది. అయితే, ఆంధ్ర ప్రాంత వ్యతిరేకత ఆధారంగా ఒకప్పుడు లభించిన విశ్వసనీయత, ప్రామాణికత మారిన పరిస్థితుల్లో తిరిగి పొందడం సాధ్యమేనా అనే సందేహాలు తలెత్తుతున్నాయి.

బీఆర్ఎస్, కేటీఆర్, కేసీఆర్

ఫొటో సోర్స్, @KTRBRS

ఆటుపోట్లు టీఆర్ఎస్‌కు కొత్త కాదు. ఆ పార్టీ చరిత్ర చూస్తే ఇది అర్ధమవుతుంది. అయితే గత వైభవాన్ని సాధించాలంటే రెండు రకాల సవాళ్లను గుర్తించాలి.

ఒకటి: రాజకీయాలలో వై.ఎస్.రాజశేఖర రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్, చంద్రబాబు నాయుడు నాయకత్వంలోని తెలుగుదేశం పార్టీల నుంచి టీఆర్ఎస్‌‌కు ప్రధానంగా సవాళ్లు ఎదురయ్యాయి. తెలంగాణ వాదానికి మద్ధతు పెరుగుతున్నప్పటికీ ఈ ఇద్దరి నాయకత్వం రాష్ట్రంలో ఆ పార్టీకి ఎన్నికల్లో సవాలుగానే నిలిచింది.

దీనికి కారణం ఉంది.

అప్పటికి తెలంగాణ సమాజం వైవిధ్యభరితమైన ఆలోచనా స్రవంతులకు నిలయంగా ఉండేది. సామాజిక తెలంగాణ భావనకు ఆనాడు పనిచేసిన అనేక వర్గాలు మద్దతుగా ఉండేవి. ఈ గ్రూపులన్నీ తెలంగాణ రాష్ట్ర సమితి విధానాలను అనుమానంగానే చూసేవి. ఇందుకు ప్రధాన కారణం ఆ పార్టీ అధినేత అనుసరించే వ్యక్తిగత, నిరంకుశ ధోరణి అని చెప్పొచ్చు.

భౌగోళిక తెలంగాణ అనే కేసీఆర్ భావనను ఈ వర్గాలు అంగీకరించలేకపోయాయి. దీంతో టీఆర్ఎస్‌కు ఈ వర్గాల నుంచి ఎన్నికల్లో ఆమోదం, మద్ధతు లభించలేదు. 2004, 2009 ఎన్నికల్లో, అప్పుడప్పుడు జరిగిన ఉప ఎన్నికలలో టీఆర్ఎస్ పేలవ ప్రదర్శన ఈ అభిప్రాయానికి బలం చేకూర్చింది.

అయితే, ఈ భావనలన్నీ రాష్ట్ర విభజన తర్వాత పూర్తిగా మారిపోయాయి. తెలుగుదేశం పార్టీకి ఆంధ్రా పార్టీగా ముద్రతోపాటు, తెలంగాణ ఏర్పాటులో ఆలస్యానికి, కష్టాలకు కాంగ్రెస్‌దే బాధ్యత అన్న ప్రచారం బలంగా సాగింది. అది టీఆర్ఎస్‌కు అడ్వాంటేజ్‌గా మారింది.

కేటీఆర్

ఫొటో సోర్స్, @KTRBRS

అధికారంలోకి వచ్చిన తర్వాత టీఆర్ఎస్, తాను అత్యుత్తమమని నమ్మిన ఒక విధానాన్ని అమలులోకి తెచ్చింది. దీనినే సర్వైవల్ పాప్యులిజం అని కూడా అంటారు.

ఆధునిక ఉదారవాద సూక్ష్మ రాజకీయ ఆర్థిక విధానాల కారణంగా గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయం, పట్టణ ప్రాంతాల్లో చిన్న వ్యాపారాలు, ఉత్పత్తి కుంటుపడుతున్న తరుణంలో రాయితీతో కూడిన ఆహార ధాన్యాలు, వృద్ధులు, వికలాంగులు, ఒంటరి మహిళలకు ఫించన్లు లాంటి ప్రజాకర్షక పథకాలను తెచ్చి పూర్తిగా ఎన్నికల రాజకీయాలకు తెరలేపింది ఆ పార్టీ.

సంక్షేమ కార్యక్రమాల పేరుతో ఏమాత్రం తిరుగు ఆదాయం లేని పథకాలను అమలు చేయడం మొదలుపెట్టింది టీఆర్ఎస్/బీఆర్ఎస్ పార్టీ పాలన.

విధానపరంగా కానీ, ప్రజలపై ప్రభావం చూపడంలోగానీ, ఈ పథకాలు అంత అంత అత్యుత్తమేమీ కావు. ఉదాహరణకు రైతులకు ఏటా ఎకరానికి 10వేల రూపాయలు ఇచ్చే రైతు బంధు పథకం జాతీయ స్థాయిలో గుర్తింపు పొందింది. ఇతర రాష్ట్రాలు కూడా దీన్ని అనుసరించే ప్రయత్నం చేశాయి. బాగానే ఉంది.

కానీ, వాస్తవంలో గ్రామీణ ప్రాంతాల్లో భూముల యజమానులు అంటే పట్టాదారులకు మాత్రమే ఈ పథకం అందుతుంది. వ్యవసాయం చేస్తున్న వారిలో కౌలు రైతులు, పాలు రైతులు ఎక్కువ. వారికి ఈ పథకం ద్వారా ఎలాంటి ప్రయోజనం ఉండదు. టీఆర్ఎస్‌పై కొందరు ప్రజల్లో అసంతృప్తి పెరగడానికి ఇదొక కారణం అనుకోవచ్చు.

కేసీఆర్

ఫొటో సోర్స్, BRS party

సామాజిక రంగంలో విధానాలపరంగా తిరోగమనంలో పయనించడం కూడా ఆ పార్టీ విధానాలలో కనిపిస్తుంది.

ప్రత్యేక రాష్ట్రం కోసం టీఆర్ఎస్ ఉద్యమమిస్తున్నప్పుడు ప్రధానంగా లేవనెత్తిన చదువు అనే అంశాన్ని అధికారంలోకి వచ్చిన తర్వాత పట్టించుకోలేదనే విమర్శలు వినిపించాయి.

తెలంగాణలో పాఠశాల నుంచి యూనివర్సిటీ స్థాయి వరకు నిర్లక్ష్యానికి గురై, విద్యారంగం తక్కువ ప్రాధాన్యతగల రంగంగా మారింది.

అప్పటికే ఉన్న ప్రభుత్వ విద్యకు పునరుత్తేజం తీసుకొచ్చేందుకు బదులుగా కులాల వారీగా గురుకుల విద్యాలయాలను ఏర్పాటు చేశారు.

సంప్రదాయ వృత్తులకు అనుగుణంగా వివిధ కళాకారులు, సామాజిక వర్గాలకు అందించిన గొర్రెలు, చేపలు, మగ్గం పంపిణీ వంటి స్కీమ్‌లు ప్రజాదరణ పొందినప్పటికీ, తక్కువ స్థాయి కులాల్లోని హిందూ, ముస్లిం కుటుంబాల ఆడపిల్లల పెళ్లిళ్లకు ఆర్థిక భరోసాను ఇచ్చే కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ వంటి స్కీమ్‌లు ఉన్నప్పటికీ, ఉన్నత చదువులకు వెళ్లి, ఆర్థిక స్వాతంత్య్రం, సామాజిక హోదా పొందాలని ఆకాంక్షించే యువతకు ఇవి పెద్దగా రుచించ లేదు.

పథకాల లబ్దిదారుల నుంచి పెద్ద ఎత్తున ఓటు బ్యాంకును సంపాదించినప్పటికీ, 2023లో ఆ పార్టీ పరాజయం పాలైంది. అయితే తమ వ్యూహం ఎక్కడ ఫెయిలైందో, లోపం ఎక్కడుందో తెలుసుకునే ప్రయత్నానికి బదులు అనూహ్య పరాజయం అని చెప్పుకోవడానికే ఆ ప్రాధాన్యమిచ్చింది. ఓటమి కారణాలను అంగీకరించే స్థితిలో లేదు ఆ పార్టీ.

కేసీఆర్

ఫొటో సోర్స్, BRS party

పాలనా విధానం, ఓటర్ల మద్దతు విషయంలో ఈ ఎన్నికల ఓటమి టీఆర్ఎస్‌కు ఎలాంటి సంకేతాలిచ్చింది? రాష్ట్రాల్లోని విస్తృతమైన రాజకీయ పార్టీలకు ఒక స్పష్టమైన విషయం నిర్ధరణకు వచ్చింది. రాజకీయ పార్టీల భావిస్తున్నట్లు కేవలం ప్రజాకర్షక పథకాలు మాత్రమే పని చేయవు. ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరచడం, నాణ్యమైన పాలనపై కూడా దృష్టి పెట్టాల్సిన అవసరం పార్టీలకు దీని ద్వారా అర్ధమైంది.

అధికారంలో ఉన్న పార్టీ ఓడిపోతే అది తీసుకొచ్చిన ప్రయోజనాలు పోతాయేమోననే ఆందోళన ప్రజల్లో కనిపించడం లేదని తెలంగాణ ఎన్నికల్లో స్పష్టంగా నిర్ధరణ అయింది. ఒకసారి ఇచ్చిన హామీ వెనక్కి తీసుకోవడం సాధ్యం కాదని, ప్రజాదరణ కోల్పోయేంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే తప్ప రాబోయే ప్రభుత్వాలు వాటిని పక్కన పెట్టలేవన్న విషయం కూడా ప్రజలకు స్పష్టమైంది.

నిరుద్యోగ గ్రామీణ యువతను పట్టించుకోకపోవడం, వ్యవసాయ కుటుంబాల్లోని సామాజిక ఆగ్రహం లాంటివ బీఆర్ఎస్ ఎన్నికల్లో ఓడిపోవడానికి కారణమని లోక్‌నీతి-సీఎస్‌డీఎస్ సర్వే (2023)లో వెల్లడైంది.

ఇప్పడు పౌర సంఘాలను తిరిగి యాక్టివేట్ చేసి వాటిని ఎంత సమర్ధవంతంగా ఉపయోగించుకుంటుందనేదానిపై బీఆర్ఎస్ భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది.

తెలంగాణ సాధన పోరాట సమయంలో ఈ పౌరసంఘాలే ప్రముఖ పాత్ర వహించాయి.

పౌర సంఘాలు, ఉద్యమ బృందాలు, మహిళలు, దళితులు, కుల సంస్థలు, విద్యార్థులు, ఉపాధ్యాయులు, ఉద్యోగులు, ఇతర వృత్తిపరమైన అసోసియేషన్లు వీటికి నాయకత్వం వహించాయి. తెలంగాణ చరిత్రలో, ప్రత్యేక రాష్ట్ర డిమాండ్‌ను ఏకతాటిగా, ఐక్యతగా నిలపడంలో వీరి సహకారం వెలకట్టలేనిది.

అధికారమంతా ఒకరి చేతిలోనే కేంద్రీకృతం కావడం, తమకు మద్ధతుగా నిలిచే రాజకీయ సమూహాలు కుచించుకుపోవడం, పౌర సమాజంలో పరపతిని కోల్పోవడం, అవినీతి ఆరోపణలు, ముఖ్యంగా కాళేశ్వరం ప్రాజెక్టుపై వెల్లువెత్తిన విమర్శల వంటివి ప్రజల్లో భారత రాష్ట్ర సమితి ప్రభుత్వంపై ఆగ్రహావేశాలను పెంచాయి.

తెలంగాణలో 2023 ఎన్నికల సందర్భంగా పౌర సంఘాలలో సరికొత్త కార్యాచరణ కనిపించింది.

కర్ణాటక రాష్ట్రంలో ప్రజలను మేల్కొలపడానికి, సమాజంలో అవినీతి, విద్వేష రాజకీయాలకు వ్యతిరేకంగా ప్రజలను చైతన్యపరచడానికి ఉద్దేశించిన ప్రజా ఉద్యమం ‘ఒద్దేలు కర్ణాటక’ ప్రయోగం ఇక్కడ పౌర సమాజాన్ని ఉత్తేజపరిచి, తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన పౌర సంఘాల పాత్రను గుర్తుకు తెచ్చింది. అలాంటి యాక్టివిజమే ఇక్కడ ఎన్నికల ఫలితాలలో ప్రతిబింబించింది.

బీఆర్ఎస్ రజతోత్సవ ప్రాంతం

ఫొటో సోర్స్, X/BRS Party

తెలంగాణలో పాలన మార్పు అనేది ప్రజల అసంతృప్తికి, ప్రజాస్వామ్యం లోపించడానికి, పాలనలో ప్రజల భాగస్వామ్యం తగ్గిపోవడం పట్ల స్పష్టమైన సంకేతం అని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు.

బీఆర్ఎస్ రజతోత్సవాలలో ఆ పార్టీ తప్పకుండా మార్చుకోవాల్సిన విధానం…నేనే సుప్రీం అనే ధోరణిని నాయకత్వం దూరంగా పెట్టడం. అనుసరించాల్సింది రాజకీయ, సామాజిక, సాంస్కృతిక పరంగా ప్రజలను భాగస్వామ్యం చేసుకునే విధానం.

సిద్ధాంతాలపరంగా, రాజకీయంగా కేంద్రీకృతమైన జాతీయ రాజకీయాలు, పాలన ఉంటున్న ఈ నేపథ్యంలో నేడు ఆరోగ్యకరమైన లౌకిక, సమాఖ్య ప్రజాస్వామిక భవిష్యత్ కోసం స్థానిక, సామాజిక, సాంస్కృతికతను ప్రతిబింబించే బలమైన ప్రజాస్వామిక స్థానిక పార్టీలు అత్యవసరం. దీనికోసం అంతర్గతంగా ప్రజాస్వామికంగా ఉంటూ, సమిష్టి ఆకాంక్షలకు బాధ్యత వహించాలి.

బీఆర్ఎస్‌ రాష్ట్ర, జాతీయ రాజకీయాలకు అనుగుణంగా మారాలనుకుంటే, సరైన దిశగా ఆలోచించి, తనకు తాను సంస్కరించుకునేందుకు ఇదొక మంచి సందర్భం.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)