Home జాతీయ national telgu రోజూ విటమిన్ పిల్ తీసుకోవాలా? సప్లిమెంట్లు ఎవరికి అవసరం?

రోజూ విటమిన్ పిల్ తీసుకోవాలా? సప్లిమెంట్లు ఎవరికి అవసరం?

5
0

SOURCE :- BBC NEWS

విటమిన్ పిల్స్

ఫొటో సోర్స్, Getty Images

5 గంటలు క్రితం

చాలామంది తమ ఆరోగ్యంలో విటమిన్లను అత్యంత ముఖ్యమైన భాగంగా పరిగణిస్తున్నారు.

బ్రిటన్‌లో మూడింట రెండొంతుల మంది ప్రజలు విటమిన్లను, మినరల్స్‌ను, ఇతర సప్లిమెంట్లను తీసుకుంటున్నట్లు లండన్‌కు చెందిన మార్కెట్ పరిశోధన సంస్థ మింటెల్ చెప్పింది.

మార్కెట్లో చాలా సప్లిమెంట్లు అందుబాటులో ఉన్నాయి. ఈ సప్లిమెంట్లలో వివిధ రకాల విటమిన్లు, మినరల్స్‌ మిశ్రమంగా అంటే మల్టివిటమిన్ల రూపంలో ఉంటున్నాయి. అయితే, ఏది మీ ఆరోగ్యానికి ప్రయోజనకరమో తెలుసుకోవడం కష్టం.

వాస్తవంగా ఆరోగ్యంగా ఉండేందుకు ప్రజల శరీరానికి 13 బేసిక్ విటమిన్లు అవసరం. కానీ, వాటిని సప్లిమెంట్ల రూపంలో తీసుకోవచ్చా?

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌

ప్రతిరోజూ విటమిన్ పిల్స్ తీసుకోవాలా?

రెండు రకాల విటమిన్లు ఉంటాయి. అవి ఫ్యాట్ సాల్యుబల్ (కొవ్వులో కరిగే), వాటర్ సాల్యుబల్ (నీటిలో కరిగే) విటమిన్లు.

ఫ్యాట్ సాల్యుబల్ విటమిన్లు ఏ, డీ, ఈ, కే.

కొవ్వులో కరిగే ఈ విటమిన్లు మీ శరీరంలో నిల్వై ఉంటాయి. రోజూ ఎలాంటి పిల్ తీసుకోకుండా, వాటి స్థాయిలను మీరు మెయింటైన్ చేసుకోవచ్చు.

వీటిని అధిక మోతాదులో తీసుకుంటే ప్రమాదకరం. పెద్ద మొత్తంలో వీటిని తీసుకోకూడదు.

వాటర్ సాల్యుబల్ (నీటిలో కరిగే) విటమిన్లు సీ, బీ. ఫోలిక్ యాసిడ్ లాంటివి. ఇవి శరీరంలో నిల్వ అయి ఉండవు. తగిన మొత్తాల్లో వీటిని తీసుకోవాలి.

ఒకవేళ అధికమొత్తంలో ఈ విటమిన్లను తీసుకుంటే, మూత్రం ద్వారా ఈ అదనపు మొత్తాలు బయటికి వెళ్లిపోతాయి. ‘విటమిన్ బీ’ను కాలేయం నిల్వచేయగలదు.

విటమిన్స్

ఫొటో సోర్స్, Getty Images

కొన్ని మల్టివిటమిన్ టాబ్లెట్లలో కాల్షియం, జింక్, ఐరన్ వంటి మినరల్స్ ఉంటాయి. ఈ మూడింటిన్ని ఆహారం ద్వారానే పొందవచ్చు.

కాల్షియం ఎముకలు బలపడడానికి అవసరం. ప్రతిరోజూ 700 మిల్లీగ్రాములు కావాల్సి ఉంటుంది.

జింక్ అనేది మీ రోగనిరోధక, జీర్ణవ్యవస్థకు కీలకం. మహిళలకు 7 మిల్లీగ్రాములు, పురుషులకు 9.5 మిల్లీగ్రాములు అవసరం.

ఆహారం నుంచి శక్తిని విడుదల చేసి, రక్తంలో ఆక్సిజన్ సరఫరా చేసేందుకు ఐరన్ ఉపయోగపడుతుంది.

19 నుంచి 50 ఏళ్ల మధ్యలో ఉన్న మహిళలకు రోజూ 14.8 మిల్లీగ్రాముల ఐరన్ అవసరం. పురుషులకు రోజూ 8.7 మిల్లీగ్రాముల ఐరన్ కావాలి.

విటమిన్ డీ సప్లిమెంట్స్

ఫొటో సోర్స్, Getty Images

సప్లిమెంట్లు తీసుకోవడం ఎవరికి ప్రయోజనకరం కావొచ్చు?

బలమైన, ఆరోగ్యకరమైన పళ్లు, ఎముకలు, కండరాలకు అవసరమైన కాల్షియం శోషణకు విటమిన్ డీ అవసరం.

ఫాస్ఫేట్, మెగ్నీషియం శోషణకు కూడా ఇది సాయపడుతుంది.

సరైన ఆకలి లేని వారికి లేదా పెద్ద వారికి ప్రత్యేకంగా మల్టివిటమిన్లు తీసుకోవడం ప్రయోజనకరం కావొచ్చు. అయితే, దీనికోసం వైద్యుల్ని సంప్రదించాలి.

ఇళ్లకే పరిమితమైన పెద్ద వారు ఏడాదంతా విటమిన్ డీ సప్లిమెంట్లను, అలాగే కాల్షియాన్ని తీసుకోవాలి.

జీవనశైలిని మార్చుకునేటప్పుడు లేదా బరువు తగ్గేటప్పుడు మీరు డైట్‌లో ఉండి, కొన్ని ఆహారాలను తీసుకోకుండా మానేస్తే.. ఆ సమయంలో సప్లిమెంట్లు మీకు ప్రయోజనకరంగా ఉండొచ్చు. మీరు తినడం మానేసిన ఒక నిర్దిష్ట ఆహార పదార్థం నుంచే వచ్చే పోషకాలను ఇవి అందిస్తాయి.

మీరు ఒకవేళ చాలా తక్కువ కేలరీల డైట్‌లో ఉంటే కనుక, మల్టివిటమిన్లు ప్రయోజనకరం.

డెయిరీ ప్రొడక్టులను తీసుకోవడం మానేస్తే, కాల్షియం సప్లిమెంట్లు లేదా కాల్షియం టాబ్లెట్లు మీకు ప్రయోజనకరం కావొచ్చు.

పూర్తిగా శాకాహారులైన వీగన్లు అయితే, పాల ఉత్పత్తులు తీసుకోకపోతే విటమిన్ బీ12, కాల్షియం లోపం ఏర్పడుతుంది. ఆ సమయంలో ఈ పోషకాల కోసం సప్లిమెంట్లు తీసుకోవాలని సూచిస్తుంటారు.

పీరియడ్స్ సమయంలో తీవ్ర నీరసంతో బాధపడే మహిళలు, అమ్మాయిలకు ఐరన్ లోపం ఏర్పడుతుంది.

35 నుంచి 49 ఏళ్ల మధ్యనున్న మహిళల్లో 4.8 శాతం మంది ఐరన్ లోపంతో అనీమియాతో బాధపడుతున్నట్లు యూకే నేషనల్ డైట్, న్యూట్రిషియన్ సర్వే పేర్కొంది.

12.5 శాతం మందిలో తక్కువ ఐరన్ ఉంటోంది. ఐరన్ టాబ్లెట్లను తీసుకోవడానికి ముందు, మీరు కచ్చితంగా వైద్యున్ని సంప్రదించాలి.

పిల్లల్లో న్యూరల్ ట్యూబ్ లోపాల ప్రమాదాన్ని తగ్గించేందుకు తొలి 12 వారాల ప్రెగ్నెన్సీలో మహిళలకు వైద్యులు ఫొలిక్ యాసిడ్ సప్లిమెంట్లను రాస్తుంటారు.

విటమిన్ సీ

ఫొటో సోర్స్, Getty Images

విటమిన్ సీ టాబ్లెట్లు

జలుబు, ఫ్లూలను నిరోధించేందుకు చాలామంది ప్రజలు ‘విటమిన్ సీ’ను ఏళ్ల తరబడి తీసుకుంటున్నారు. దీనికి సూపర్‌ఫుడ్ హోదా ఉంది. ఎందుకంటే, ఇదో యాంటీఆక్సిడెంట్.

అయితే, మీ శరీరం అత్యధిక మొత్తంలో విటమిన్ సీని నిల్వచేయలేదు. ఎక్కువ మొత్తంలో దీన్ని తీసుకుంటే, మూత్రం నుంచి అది బయటికి వచ్చేస్తుంది.

విటమిన్ సీ సాధారణంగా పండ్లు, కూరగాయల్లో లభిస్తుంది. ఒక నారింజ పండులో 70 మిల్లీగ్రాముల విటమిన్ సీ ఉంటుంది.

ఆహారం

ఫొటో సోర్స్, Getty Images

ఎన్ని విటమిన్లు అవసరం?

విటమిన్లు, మినరల్స్ ఎంత అవసరం అనేది ఒక్కో వ్యక్తికి ఒక్కోలా ఉంటుంది. మీ వయసు, యాక్టివిటీ స్థాయిలు, జెండర్, ఇతర అంశాలపై ఇది ఆధారపడుతుంది.

ఆరోగ్యకరమైన, సమతుల్య ఆహారం నుంచి అన్నిరకాల విటమిన్లు, మినరల్స్‌ను పొందుతామని చాలామంది నిపుణులు చెబుతుంటారు. అయితే, విటమిన్ డీ దీనికి మినహాయింపు.

కొంతమంది వ్యక్తులు సరైన ఆహారం తీసుకోలేకపోవడం వల్ల, దానికోసం సప్లిమెంట్లను తీసుకుంటూ ఉంటారని నేషనల్ డైట్ అండ్ న్యూట్రిషియన్ సర్వే చెప్పింది. సప్లిమెంట్లను తీసుకోవడానికి బదులుగా, డైట్‌ను మెరుగుపరుచుకోవాలని, కనీసం ఐదు రకాల పండ్లు, కూరగాయలు తినే ఆహారంలో ఉండేలా చూసుకుని, ఆరోగ్యకరంగా ఉండాలని సూచిస్తుంది..

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)