Home జాతీయ national telgu పాకిస్తాన్ సారీ చెప్పి, రూ. 36,000 కోట్లు ఇవ్వాలని బంగ్లాదేశ్ డిమాండ్, అసలు కథ ఇదే..

పాకిస్తాన్ సారీ చెప్పి, రూ. 36,000 కోట్లు ఇవ్వాలని బంగ్లాదేశ్ డిమాండ్, అసలు కథ ఇదే..

4
0

SOURCE :- BBC NEWS

మొహమ్మద్ యూనస్‌, షాబాజ్ షరీఫ్

ఫొటో సోర్స్, Getty Images

ఒక గంట క్రితం

పాకిస్తాన్ నుంచి బంగ్లాదేశ్ విముక్తి కోసం 1971లో యుద్ధం జరిగింది. ఆ సమయంలో పాకిస్తాన్ నుంచి తన వాటాగా వేలాది కోట్లు రావాల్సి ఉందని, ఇపుడు వాటిని చెల్లించాల్సిందిగా డిమాండ్ చేస్తోంది బంగ్లాదేశ్ ప్రభుత్వం.

అంతేకాదు, యుద్ధ సమయంలో పాకిస్తాన్ దురాగతాలకు క్షమాపణ కూడా కోరింది. ఈ విషయాన్ని బంగ్లాదేశ్ మీడియా విస్తృతంగా కవర్ చేయగా, పాక్ మీడియా పెద్దగా పట్టించుకోలేదు.

బంగ్లాదేశ్, పాకిస్తాన్ విదేశాంగ కార్యదర్శుల సమావేశం ఏప్రిల్ 16న ఢాకాలో జరిగింది. ఇరుదేశాల మధ్య 15 సంవత్సరాల తర్వాత విదేశాంగ కార్యదర్శుల సమావేశం జరిగింది.

ఈ సమావేశంలో బంగ్లాదేశ్ విదేశాంగ కార్యదర్శి మొహమ్మద్ జాషిముద్దీన్‌, పాకిస్తాన్ విదేశాంగ కార్యదర్శి అమ్నా బలోచ్ పాల్గొన్నారు.

బంగ్లాదేశ్‌తో సంబంధాలను బలోపేతం చేసుకుంటామని అమ్నా బలోచ్ హామీ ఇచ్చారు.

కాగా, పాకిస్తాన్ నుంచి వాటాగా దక్కాల్సిన రూ. 36 వేల కోట్లతో పాటు, యుద్ధం సమయంలో పాక్ సైన్యం దురాగతాలకు క్షమాపణ కూడా చెప్పాలని జాషిముద్దీన్ డిమాండ్ చేయడంతో ఈ సమావేశం వార్తల్లో ఉంది.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
మొహమ్మద్ జాషిముద్దీన్‌, అమ్నా బలోచ్

ఫొటో సోర్స్, MINISTRY OF FOREIGN AFFAIRS BANGLADESH

బంగ్లాదేశ్ మీడియాలో కవరేజీ

బంగ్లాదేశ్‌లోని ప్రముఖ వార్తాపత్రిక ‘ది డైలీ స్టార్’‌తో పాటు తదితర మీడియా సంస్థలు ఈ అంశాన్ని ముఖ్యాంశాలుగా రాశాయి.

“1971కి ముందు పాకిస్తాన్ చర్యలు బంగ్లాదేశీయులకు తీవ్ర బాధ కలిగించాయి” అని ది డైలీ స్టార్ రాసింది.

“ఇద్దరి మధ్య నిజమైన, ప్రభావవంతమైన సంబంధాన్ని నిర్మించడానికి ఇది ఒక అడ్డంకి. పాకిస్తాన్ సైన్యం చంపిన పౌరుల సంఖ్య, బంగ్లాదేశ్ స్వాతంత్య్ర పోరాటంలో ఎదుర్కొన్న అణచివేత, క్రూరత్వం చరిత్రలో రికార్డైన ఘటనలు” అని ఆ పత్రిక రాసింది.

“పాకిస్తాన్ నుంచి అధికారిక క్షమాపణ లేదా పరిహారమనేది బంగ్లాదేశ్‌కు ప్రతీకారం తీర్చుకోవడం కాదు. సత్యాన్ని అంగీకరించాలని, రెండు దేశాలు గౌరవప్రదంగా ముందుకు సాగడానికి సహాయపడాలని కోరుకోవడం. ఇది సంక్లిష్టమైనది, జాగ్రత్తగా చేయడం అవసరం” అని తెలిపింది.

దక్షిణ కొరియా, చైనాలతో జరిగిన యుద్ధ సమయంలో చేసిన దురాగతాలకు జపాన్ చెప్పిన క్షమాపణ సరిపోదని ఈ సందర్భంగా ‘ది డైలీ స్టార్’ అభిప్రాయపడింది. అయితే, పాకిస్తాన్ క్షమాపణ డిమాండ్‌ను సమర్థించింది. సమస్యలు ఉన్నప్పటికీ, పాకిస్తాన్‌తో తన సంబంధాలను మెరుగుపరచుకోవడానికి బంగ్లాదేశ్ చొరవ చూపాలని సూచించింది.

కరాచీ, చిట్టగాంగ్ మధ్య ప్రత్యక్ష షిప్పింగ్ లైన్లు, వైమానిక సంబంధాలను ఏర్పాటు చేయడంపై ప్రాధాన్యత ఇవ్వడం మంచి ప్రయత్నమని ‘ఢాకా ట్రిబ్యూన్’ వార్తాసంస్థ రాసింది. దాదాపు 15 ఏళ్ల తర్వాత జరిగిన ఈ సమావేశం ఇరు దేశాలు సంబంధాలను తిరిగి గాడిలో పెట్టడంలో ఇరువురి నిబద్ధతకు నిదర్శనమని తెలిపింది.

బంగ్లాదేశ్, పాకిస్తాన్

ఫొటో సోర్స్, @ChiefAdviserGoB

‘కశ్మీర్ ప్రస్తావన’

ఇక ‘డైలీ సన్’ మీడియా కథనం ప్రకారం.. బంగ్లాదేశ్, పాక్ విదేశాంగ కార్యదర్శుల సమావేశం అనంతరం విడుదల చేసిన సంయుక్త ప్రకటన కశ్మీర్ అంశాన్ని కూడా లేవనెత్తింది.

ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి తీర్మానాల ఆధారంగా కశ్మీర్ సమస్యను పరిష్కరించడం గురించి పాకిస్తాన్ ఇందులో ప్రస్తావించింది. తదుపరి సమావేశం వచ్చే ఏడాది ఇస్లామాబాద్‌లో జరగనుంది.

మరో బంగ్లాదేశ్ వార్తాసంస్థ ‘ప్రోథోమ్ అలో’ కథనం ప్రకారం.. ఇరు దేశాలు క్రమం తప్పకుండా చర్చలు జరపడం, పెండింగ్‌లో ఉన్న ఒప్పందాలను పూర్తి చేయడంతో పాటు వాణిజ్యం, వ్యవసాయం, కనెక్టివిటీ ఒప్పందాలపై ముందుకు సాగాలని కోరుకున్నాయి.

పాక్, బంగ్లాదేశ్ విభజన తర్వాత సంవత్సరాలలో ఢాకా నాయకులు, ముఖ్యంగా షేక్ హసీనా ప్రభుత్వం భారత శిబిరంలోనే ఉందని తెలిపింది. భారత్‌తో సన్నిహిత సంబంధాలను కొనసాగించడానికి ఇస్లామాబాద్‌ను షేక్ హసీనా పక్కనబెట్టారని అభిప్రాయ పడింది. కానీ, హసీనా ప్రభుత్వ పతనం తర్వాత పరిస్థితి మారిపోయిందని, పాక్, బంగ్లాదేశ్ మధ్య సంబంధాలను బలోపేతం చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని డాన్ రాసింది.

పాకిస్తాన్‌కు చెందిన ‘ఎక్స్‌ప్రెస్ ట్రిబ్యూన్’, ‘ది న్యూస్’ వంటి పత్రికలు కూడా బంగ్లాదేశ్ క్షమాపణ, పరిహారం డిమాండ్లను ఎక్కువగా చర్చించలేదు.

మొహమ్మద్

ఫొటో సోర్స్, Getty Images

బంగ్లాదేశ్ డిమాండ్లు ఇవే..

1971కి ముందు ఇరు దేశాలు కలిసి ఉన్నప్పుడు ఉమ్మడి ఆస్తుల నుంచి తన వాటాగా రావాల్సిన 4.3 బిలియన్ డాలర్లు (భారత కరెన్సీలో సుమారు రూ. 36,000 కోట్లు) పాకిస్తాన్ చెల్లించాలని విదేశాంగ కార్యదర్శుల సమావేశంలో బంగ్లాదేశ్ డిమాండ్ చేసింది.

1970 తుపాను నేపథ్యంలో తూర్పు పాకిస్తాన్ (ప్రస్తుత బంగ్లాదేశ్)కు సహాయం చేయడానికి ఉద్దేశించిన 200 మిలియన్ డాలర్లు (సుమారు 2,400 కోట్ల టాకాలు) కూడా పాకిస్తాన్ తిరిగి ఇవ్వాలంది.

అదనంగా, 1971 విముక్తి యుద్ధంలో జరిగిన దురాగతాలకు పాకిస్తాన్ అధికారికంగా క్షమాపణ చెప్పే అంశాన్ని కూడా ఢాకా లేవనెత్తింది. అయితే, ఈ విషయంపై పాకిస్తాన్ ఎటువంటి బహిరంగ ప్రకటన చేయలేదు.

స్టేట్ బ్యాంక్ ఆఫ్ పాకిస్తాన్ ప్రకారం, ఈ నెల 4వ తేదీ నాటికి పాకిస్తాన్ విదేశీ మారక నిల్వలు 15.75 బిలియన్ డాలర్లు. అంటే, బంగ్లాదేశ్ డిమాండ్‌ను నెరవేర్చడానికి పాకిస్తాన్ దాని మొత్తం విదేశీ నిల్వలలో పావు వంతుకు పైగా ఇవ్వాల్సి ఉంటుంది.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)