SOURCE :- BBC NEWS

ఫొటో సోర్స్, Getty Images
అమెరికా అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్ విధించిన సుంకాలు ప్రపంచవ్యాప్తంగా స్టాక్ మార్కెట్లలో మంటలు పుట్టించాయి.
మరి, ప్రస్తుత మార్కెట్ల పతనం మాంద్యానికి దారి తీస్తుందని అనుకోవాలా?
తాజా పరిణామాలలో గుర్తించాల్సిన అంశం ఏమిటంటే.. స్టాక్ మార్కెట్లలో ఏం జరుగుతుందో, ఆర్థిక వ్యవస్థలోనూ అదే జరుగుతుందని కాదు. స్టాక్ మార్కెట్లు వేరు, ఆర్థిక వ్యవస్థ వేరు. స్టాక్ మార్కెట్లలో షేర్ల ధరలు పడిపోవడం అంటే, ఆర్థికంగా కష్టాలు ఎదురవుతాయని కాదు.
అయితే కొన్ని సందర్భాల్లో అలా జరగవచ్చు.
స్టాక్ మార్కెట్లు భారీగా పతనమైనప్పుడు కంపెనీలకు భవిష్యత్ లాభాలకు సంబంధించిన రీఅప్రైజల్ జరిగినట్లు.
పన్నులు పెరగడమంటే ఖర్చులు పెరిగి లాభాలు తగ్గుతాయనేది మార్కెట్లు వేసే ప్రాథమిక అంచనా.
ఈ పరిస్థితులకు అర్థం మాంద్యం తప్పనిసరని కాదు. అయితే అందుకు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని మాత్రమే.
ప్రజలు, ప్రభుత్వం చేసే ఖర్చు… ఎగుమతులు వరుసగా రెండు త్రైమాసికాల పాటు తగ్గినప్పుడు.. ఆ తరువాత కూడా తగ్గుతూనే ఉన్నప్పుడు ఆర్థిక వ్యవస్థ మాంద్యంలో చిక్కుకున్నట్లు భావించవచ్చు.


ఫొటో సోర్స్, Getty Images
2024 అక్టోబర్, డిసెంబర్ మధ్య బ్రిటన్ ఆర్థిక వ్యవస్థ 0.1 శాతం మాత్రమే పెరిగింది. జనవరిలో అంతే శాతం తగ్గినట్లు తాజా గణాంకాలు చెబుతున్నాయి.
ఫిబ్రవరిలో బ్రిటన్ ఆర్థిక వ్యవస్థ పని తీరు ఎలా ఉందో ఈ శుక్రవారం తెలుస్తుంది.
మాంద్యంలోకి వెళుతున్నామా లేదా అని చెప్పడానికి ఇంకా చాలా దూరం ప్రయాణించాల్సి ఉంది.
ఏదేమైనప్పటికీ, స్టాక్ మార్కెట్‌లలో కొనసాగుతున్న నష్టాలు కొన్ని ఆందోళనకరమైన అంశాలకు ప్రతీకగా చూడాల్సి ఉంటుంది.
బ్యాంకుల పని తీరు ఆర్థిక వ్యవస్థకు సూచనగా అంచనా వేస్తారు. “బ్యాంకుల పతనం నాకు ఊపిరి ఆగిపోయేలా చేసింది” అని మార్కెట్ పరిశీలకుడు ఒకరు నాతో చెప్పారు.
తూర్పు పశ్చిమ దేశాలతో అంతర్జాతీయ వాణిజ్యం చేస్తున్న హెచ్ఎస్‌బీసీ, స్టాండర్డ్ చార్టర్డ్ బ్యాంకుల షేర్లు చివరకు కొంత కోలుకున్నప్పటికీ, రాత్రికి రాత్రే 10శాతం నష్టపోయాయి.
మరో ఆందోళనకర సంకేతం స్టాక్ మార్కెట్లలో కాకుండా కమోడిటీ ఎక్స్చేంజ్‌లలో కనిపించింది.

ఫొటో సోర్స్, Getty Images
ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక వ్యవస్థ ఆరోగ్యం ఎలా ఉందో చెప్పడానికి రాగి, చమురు ధరలను కొలమానంగా భావిస్తారు.
ట్రంప్ సుంకాలు పెంచిన తర్వాత ఈ రెండింటి ధరలు 15శాతానికి పైగా పడిపోయాయి.
వాస్తవానికి ప్రపంచానికి అనేక పెద్ద పెద్ద మాంద్యాలేవీ రాలేదు.
1930, 2008లో మహా ఆర్థిక సంక్షోభం, కోవిడ్ మహమ్మారి.. ఈ మూడు సందర్భాల్లో ప్రపంచంలోని ప్రధాన ఆర్థిక వ్యవస్థల్లో కొంత తిరోగమనం కనిపించింది.
ఇప్పుడు అలాంటిది ఏర్పడే పరిస్థితి లేదని అంచనా వేస్తున్నారు. అయితే అమెరికా, బ్రిటన్, యూరోపియన్ యూనియన్ దేశాల్లో ఆర్థిక మాంద్యం వచ్చే అవకాశాలు ఉన్నాయని ఆర్థిక నిపుణులు నమ్ముతున్నారు.
బ్రిటన్‌కు సానుకూల అంశం ఏమంటే, పెట్టుబడిదారులు ప్రభుత్వ బాండ్లలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు రావడంతో ప్రభుత్వ రుణ ఖర్చులు ఐదు బిలియన్ పౌండ్ల నుంచి 6 బిలియన్ పౌండ్లు తగ్గే అవకాశం ఉంది.
అయితే ఆర్థిక వ్యవస్థ తిరోగమనంలోకి వెళితే ప్రభుత్వం లోటును భర్తీ చేసుకునేందుకు పన్నులు పెంచాల్సి రావచ్చు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)