Home జాతీయ national telgu 9 ఎకరాల చెరువులో 12 వేల పక్షులు

9 ఎకరాల చెరువులో 12 వేల పక్షులు

1
0

SOURCE :- BBC NEWS

విదేశీ పక్షులు

ఆంధ్రప్రదేశ్‌లో విదేశీ పక్షుల వలస అంటే మొదట గుర్తుకొచ్చేది ఏలూరు దగ్గరలోని కొల్లేరు, నెల్లూరు సమీపంలోని నేలపట్టు. కానీ, గుంటూరు దగ్గరలో ఉన్న ఉప్పలపాడు కూడా ఇపుడు విదేశీ పక్షులకు ఆవాసంగా మారింది.

మధ్య ఆసియా, తూర్పు యూరప్, నైజీరియాల నుంచి భారత్‌కు సరిహద్దు దేశాలైన బంగ్లాదేశ్, నేపాల్, పాకిస్తాన్‌ మీదుగా ఏటా సుమారు 12 నుంచి 15 వేల పక్షులు ఇక్కడికి వలస వస్తుంటాయని అటవీశాఖ అధికారులు చెబుతున్నారు.

గుంటూరు నగరానికి 8 కిలోమీటర్ల దూరంలోని పెదకాకాని మండలంలో ఉంది ఈ ఉప్పలపాడు గ్రామం.

ముప్పై ఏళ్ల కితం ఈ ఊరిలోని మంచినీటి చెరువుకు విదేశీ పక్షులు పెద్ద సంఖ్యలో రావడాన్ని పర్యావరణ ప్రేమికుడు, అప్పట్లో బాపట్లలో బీఎస్‌ఎన్‌ఎల్‌లో పనిచేసిన మృత్యుంజయరావు గుర్తించారు. అనంతరం పక్షి ప్రేమికులు గ్రామ పెద్దలతో చర్చించారు.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
ఉప్పలపాడు

వాస్తవానికి ఉప్పలపాడు గ్రామంతో పాటు సమీప గ్రామాల ప్రజల తాగునీటి అవసరాల కోసం వందేళ్ల క్రితం జమీందారీ వ్యవస్థలు ఉన్నప్పుడు తవ్వించిన చెరువు అది.

అయితే ప్రపంచంలోనే అరుదైన పక్షులు తమ గ్రామానికి విచ్చేయడం విశేషంగా ఆ గ్రామ ప్రజలు భావించారు.

దాదాపు 27 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న చెరువులో తొమ్మిది ఎకరాలను పక్షులకు వదిలేయాలని నిర్ణయించారు.

పక్షి ప్రేమికులతో కలిసి ఆ ప్రదేశాన్ని గ్రామస్తులు అభివృద్ధి చేశారు. చెరువులో పక్షులు గుడ్లు పెట్టేందుకు, సంతాన ఉత్పత్తికి వీలుగా స్టాండ్లు ఏర్పాటు చేశారు. ఆ తర్వాత ఈ చెరువును అటవీ శాఖ స్వాధీనం చేసుకోగా, గ్రామ పర్యావరణ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో ప్రస్తుతం పక్షుల కేంద్రం నడుస్తోంది.

ఉప్పలపాడుకు విదేశీ పక్షులు

ఈ చెరువు ప్రత్యేకత ఏమిటంటే..

కొల్లేరు వేలాది ఎకరాల్లో విస్తరించిన మంచినీటి సరస్సు.. నెల్లూరు సమీపంలోని నేలపట్టు దాదాపు 500 ఎకరాల విస్తీర్ణంలోని ఇరిగేషన్‌ ట్యాంక్‌.. కానీ ఉప్పలపాడు కేవలం 27 ఎకరాల మంచినీటి చెరువు.

ఈ ప్రాంతానికి 12 నుంచి 15 వేల పక్షులు రావడం, ఇక్కడే నివాసముండటం విశేషమని పర్యావరణవేత్త మృత్యుంజయరావు చెబుతున్నారు.

”తక్కువ ఏరియాలో ఎక్కువ పక్షులు ఉండటమే ఉప్పలపాడు కేంద్రం ప్రత్యేకత. అందుకే ఇది అరుదైన పక్షుల కేంద్రంగా చెప్పొచ్చు” అని మృత్యుంజయరావుతో పాటు గుంటూరు అటవీ శాఖ డిప్యూటీ రేంజ్‌ ఆఫీసర్ వెంకటేశ్వరరావులు బీబీసీకి తెలిపారు.

గుంటూరు అటవీ శాఖ డిప్యూటీ రేంజ్‌ ఆఫీసర్ వెంకటేశ్వరరావులు

ఇక్కడికి ఏయే పక్షులు వస్తాయంటే?

”సెప్టెంబర్‌లో పెలికాన్స్‌ వస్తాయి. జనవరిలో పెయింటెడ్‌ స్టార్క్స్ వస్తాయి. మార్చిలో నైట్‌ హెరాన్స్‌ వస్తాయి. జూన్, జూలైలో ఓపెన్ బిల్స్‌, వైట్‌ ఐబిస్, రోజ్‌ ఐబిస్‌.. ఇలా సంవత్సరంలో 27 జాతుల పక్షులు వస్తుంటాయి” అని ఉప్పలపాడు నివాసి, ఇక్కడ గైడ్‌గా పని చేసే సదాశివరావు తెలిపారు.

ఉప్పలపాడు సదాశివరావు

”ఇక్కడకు చైనా, నేపాల్‌‌ దేశాల నుంచి పెలికాన్ పక్షులు.. నైజీరియా నుంచి పెయింటెడ్‌ స్టార్క్స్ , శ్రీలంక, ఆఫ్రికాల నుంచి ఓపెన్‌ బిల్‌ స్టార్క్స్, దక్షిణాఫ్రికా నుంచి వైట్‌ ఐబిస్‌ ఇలా వివిధ దేశాల నుంచి 27 నుంచి 30 రకాల పక్షులు వలస వస్తున్నాయి. శీతాకాలం మధ్యలో ఇక్కడకు రోజీ పాస్టర్స్‌ వేలసంఖ్యలో వస్తుంటాయి. ఇవి మిడతల దండును తిని రైతులకు మేలు చేస్తుంటాయి” అని మృత్యుంజయరావు చెప్పారు.

మృత్యుంజయరావు

ఇక్కడే ఎందుకు?

” మధ్య ఆసియా సైబీరియా తూర్పు యూరప్‌ ప్రాంతాల నుంచి అడవి జాతి పక్షులు ఇక్కడికి వస్తాయి. ఆయా దేశాల్లో మంచు గడ్డకట్టే ఈ సమయంలో వేల కిలోమీటర్లు ప్రయాణించి ఇక్కడికి చేరుకుంటాయి. ఇక్కడ గుడ్లు పెట్టి, పొదిగి పిల్లలను కని వాటికి ఎగరడం నేర్పిస్తాయి.

ప్రపంచవ్యాప్తంగా ఉన్న పక్షి కేంద్రాల్లో ఏడాదికి ఆరు నెలలకు మించి పక్షులు ఉండవు. ఉప్పలపాడు వద్దనున్న అనుకూల వాతావరణం వల్ల ఇక్కడ ఎక్కువ కాలం విడిది చేస్తాయి. అందువల్ల దీన్ని అరుదైన పక్షుల ప్రత్యేక ఆవాస కేంద్రంగా భావిస్తున్నాం” అని ఉప్పలపాడు గ్రామ పర్యావరణ అభివృద్ధి కమిటీ అధ్యక్షుడు వట్టికూటి హరిబాబు బీబీసీకి తెలిపారు.

ఉప్పలపాడు

ఏటా పక్షుల సంఖ్య పెరుగుతోంది

”ఉప్పలపాడుకి ప్రతి ఏటా పక్షుల రాక పెరుగుతోంది. ఒకప్పుడు ఏడాది మొత్తంలో పదివేలు పక్షులు వచ్చేవి. ఇప్పుడు 12 నుంచి 15 వేల వరకు వస్తున్నాయి. ఒక్క పెలికాన్‌ పక్షులే ప్రస్తుతం 3 వేల వరకు ఉన్నాయి. ఏటా రెండుసార్లు చేప పిల్లలు వేసి ఫీడింగ్‌ చేస్తుంటాం” అని అటవీశాఖ డిప్యూటీ రేంజ్‌ ఆఫీసర్ వెంకటేశ్వరరావు తెలిపారు.

నిజంగా ఇక్కడి గ్రామస్తులు గొప్పవారని, పక్షుల కోసం మంచినీటి చెరువును వదిలేయడంతో పాటు వాటి సంరక్షణకు సైతం చర్యలు తీసుకుంటున్నారని తెలిపారు.

సందర్శకురాలు

”మేం ఉండేది గుంటూరు. దగ్గరలో ఉన్న ఈ పక్షుల కేంద్రానికి మూడు, నాలుగుసార్లు వచ్చాం. ఎప్పుడొచ్చినా కొత్త కొత్త పక్షులు కనిపిస్తుంటాయి. నిజంగా ఇక్కడికి వస్తే చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది” అని ఉప్పలపాడుకు వచ్చిన సందర్శకురాలు వెన్నెల బీబీసీతో చెప్పారు.

మరో సందర్శకురాలు దేవమణి మాట్లాడుతూ.. ”మొదటిసారి వచ్చాం. నిజంగా పల్లెటూర్లలో కూడా పక్షులు కనిపించని ప్రస్తుత పరిస్థితుల్లో గుంటూరుకి దగ్గరలో ఇలాంటి పక్షుల కేంద్రం ఉండటం సంతోషంగా ఉంది” అని చెప్పారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)