Home జాతీయ national telgu 48వేల లీటర్ల కిరోసిన్ కేటాయింపు సరే, పంపిణీ ఎలా, అసలిప్పుడు కిరోసిన్ స్టవ్‌లు ఉన్నాయా?

48వేల లీటర్ల కిరోసిన్ కేటాయింపు సరే, పంపిణీ ఎలా, అసలిప్పుడు కిరోసిన్ స్టవ్‌లు ఉన్నాయా?

21
0

SOURCE :- BBC NEWS

కిరోసిన్

ఫొటో సోర్స్, Getty Images

ఇరాన్, ఇజ్రాయెల్-అమెరికా యుద్ధ ప్రభావం భారత్‌లో చమురు, గ్యాస్ సరఫరాపై పడిందనేది ఇప్పుడిక బహిరంగ రహస్యమే.

ఎల్‌పీజీ కొరత ఉందని ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం కూడా అంగీకరిస్తోంది. అయితే ఆందోళనతో ఎక్కువగా కొనుగోలు చేయడం వల్లే ఈ కొరత ఏర్పడుతోందని ప్రభుత్వం చెబుతోంది. ఎల్‌పీజీ కొరతను పరిష్కరించేందుకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లను చేస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఈమేరకు 48 వేల లీటర్లకు పైగా కిరోసిన్‌ను అందుబాటులో ఉంచినట్టు ప్రభుత్వ పేర్కొంది.

కానీ ఈ కిరోసిన్ ప్రజలకు ఎలా చేరుతుందన్నదే అసలైన ప్రశ్న. 2020లో కిరోసిన్ పంపిణీని నిలిపివేసిన తర్వాత, దీని పంపిణీ వ్యవస్థ దెబ్బతింది.

ఈ వ్యవస్థ పునరుద్ధరణ అంత తేలిక కాదని, అయినా ఈ స్వల్పకాలిక ఏర్పాటు కోసం ఎవరైనా ఎందుకు ముందుకు రావాలనుకుంటారు? అని కిరోసిన్ పంపిణీలో పాలుపంచుకున్న పాత డీలర్లు బీబీసీతో చెప్పారు.

ఎల్‌పీజీ కొరతను పరిష్కరించడంలో భాగంగా కేటాయించిన 48వేల లీటర్ల కిరోసిన్‌ను పంపిణీ చేసేందుకు ప్రతి జిల్లాల్లో ఒకటి లేదా రెండు ప్రదేశాలను గుర్తించాలని, అక్కడ్నుంచి కిరోసిన్‌ను పంపిణీ చేయాలని రాష్ట్రాలను, కేంద్రపాలిత ప్రాంతాలను ప్రభుత్వం ఆదేశించింది.

ప్రజా పంపిణీ వ్యవస్థ (పీడీఎస్) కింద కిరోసిన్‌ను పంపిణీ చేయాలని ప్రభుత్వం పేర్కొంది.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

ప్రస్తుత పరిస్థితి ఏంటి?

ప్రభుత్వం ఈ ప్రయత్నాలన్నీ చేస్తున్నప్పటికీ, ఈ కిరోసిన్ ప్రజలకు ఎలా చేరుతుందన్నదే అసలైన ప్రశ్న.

” వంటగ్యాస్ కొరతను ఎదుర్కొనేందుకు కిరోసిస్‌ను ప్రభుత్వం ఎలా అందుబాటులో ఉంచుతుంది? ఆరేళ్ల క్రితం ఎలాంటి అధికారిక కార్యక్రమం లేకుండా పూర్తిగా రద్దు చేసిన కిరోసిస్ డీలర్ వ్యవస్థను ప్రస్తుతం పునరుద్ధరించడం దాదాపు అసాధ్యమని పెట్రోలియం మంత్రిత్వ శాఖలోని ఉన్నతాధికారులకు తెలియదా?” అని ఉత్తరప్రదేశ్ కిరోసిస్ ఆయిల్ డీలర్స్ అసోసియేషన్ (ప్రస్తుతం కార్యకలాపాల్లో లేని) అధ్యక్షుడు చంద్ర శేఖర్ సింగ్ చెప్పారు.

పెట్రోలియం మంత్రిత్వ శాఖ, చమురు కంపెనీలు ఏర్పాటు చేసిన డీలర్ల చెయిన్ ద్వారా కిరోసిన్‌ను పంపిణీ చేస్తారు.

కిరోసిన్‌ను పంపిణీ చేయడానికి , ఫైర్ సేఫ్టీ లైసెన్స్, జిల్లా కలెక్టర్ నుంచి ఎన్ఓసీ, లేబర్ లైసెన్స్, స్థానిక అగ్నిమాపక విభాగం ఇచ్చే ఎన్ఓసితో పాటు పలు రకాల లైసెన్సులను డీలర్లు పొందాల్సి ఉంటుంది.

ఈ లైసెన్సులు, అనుమతులన్నింటిన్నీ పొందడంతో పాటు డీలర్లు తమ వద్దనున్న కిరోసిన్‌ను భూగర్భ ట్యాంకులలో నిల్వ చేసి, తూనికలు, కొలతల శాఖ సీల్ చేసిన డిస్పెన్సింగ్ యంత్రాల ద్వారానే విక్రయించాలి.

2020లో కిరోసిన్ సరఫరాను నిలిపివేసినప్పటి నుంచి ఈ ఆరేళ్ల కాలంలో, కిరోసిన్‌ను పంపిణీ చేసేందుకు ఉన్న అన్ని ఎన్ఓసీలకు, లైసెన్సులకు, అనుమతులకు కాలం చెల్లింది.

అంతేకాక, సరైన నిర్వహణ లేక, భూగర్భ ట్యాంకులు, డిస్పెన్సింగ్ యంత్రాలు కూడా శిథిలావస్థకు చేరుకున్నాయి.

ఇటువంటి పరిస్థితిలో గతంలో కిరోసిన్ పంపిణీ నిర్వహించిన ఎంత మంది డీలర్లు ప్రస్తుతం ఈ కిరోసిన్ పంపిణీ వ్యవస్థలో చేరాలనుకుంటారు?

కిరోసిన్ ట్యాంకులు

ఫొటో సోర్స్, Arshad Afzaal Khan

క్షేత్రస్థాయిలో పరిస్థితేంటి?

ఉత్తరప్రదేశ్‌లోని పశ్చిమ ప్రాంతానికి చెందిన మాజీ కిరోసిన్ డీలర్ భువేష్ చంద్రను దీని గురించి అడగగా.. ”కిరోసిన్‌ను కేవలం ప్రభుత్వం తాత్కాలిక ప్రాతిపదకనే కేటాయిస్తుంది. ఈ తాత్కాలిక ఏర్పాట్లు కూడా కేవలం రెండుమూడు నెలలే లేదా ఈ సంక్షోభం కొనసాగినంత కాలం మాత్రమే. ఎటువంటి ప్రయోజనాలు లేకుండా ఈ వ్యవస్థలో ఎవరైనా చేరతారా?” అని ప్రశ్నించారు.

బిహార్‌లోని కటిహార్ జిల్లాకు చెందిన మయాంక్ గుప్తా కూడా గతంలో కిరోసిన్ డీలర్‌గా వ్యవహరించారు.

”భూగర్భ ట్యాంకులకు, డిస్పెన్సింగ్ యంత్రాలకు మరమ్మతులు చేయడానికే లక్షల రూపాయలు ఖర్చవుతుంది. ఆ తర్వాత ప్రక్రియకు మరో రూ.10 నుంచి రూ.12 లక్షలవుతుంది. అంత డబ్బు ఇప్పుడు మావద్ద లేదు” అని తెలిపారు.

”లోతుగా విచారించకుండా తీసుకునే ఇటువంటి నిర్ణయాలపై మాజీ కిరోసిన్ డీలర్లు ఆసక్తి చూపరు. క్షేత్రస్థాయిలో ఎటువంటి అవగాహన లేని, ఏసీ కార్యాలయాల్లో కూర్చునే అధికారులు ఈ నిర్ణయాలు తీసుకుంటారు” అని చెప్పారు.

ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయాన్ని కేవలం మాజీ డీలర్లు, డిస్ట్రిబ్యూటర్లు మాత్రమే కాదు, కస్టమర్లు సైతం ప్రశ్నిస్తున్నారు. కిరోసిన్ పొందడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటనే దానిపై వినియోగదారులను కూడా గందరగోళానికి గురి చేస్తుంది.

”ప్రస్తుతం కిరోసిన్ స్టవ్‌లు, కిరోసిన్ ల్యాంపులు మార్కెట్లో, లేదా మా ఇళ్లల్లో ఎక్కడా కూడా అందుబాటులో లేవు. ఇలాంటి పరిస్థితిలో, ఈ ఇంధనాన్ని ప్రజలెలా వాడుకుంటారన్నది అతిపెద్ద ప్రశ్న.” అని లఖ్‌నవూకు చెందిన నివాసి లక్ష్మీ నారాయణ్ అన్నారు.

కిరోసిన్ సరఫరాపై ప్రభుత్వం ఏమంటోంది?

పెట్రోలియం మంత్రిత్వ శాఖకు చెందిన సంయుక్త కార్యదర్శి సుజాత శర్మ

ఫొటో సోర్స్, @PIB_India

శనివారం కేంద్ర విదేశాంగ శాఖ, పెట్రోలియం మంత్రిత్వ శాఖ, షిప్పింగ్ మంత్రిత్వ శాఖకు చెందిన అధికారులు మధ్య ప్రాచ్యంలో ప్రస్తుత పరిస్థితిపై జాయింట్ ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించాయి.

”ఎల్‌పీజీ సరఫరా విషయానికొస్తే, భౌగోళిక రాజకీయ పరిస్థితులు మాకు ఆందోళనకరంగా మారాయి. ప్రజలు భయాందోళనతో గ్యాస్ బుక్ చేస్తున్నారు. నిన్న 75 లక్షల బుకింగ్స్ అయితే, ఈ రోజు బుకింగ్స్ 88 లక్షలకు పెరిగాయి. ఇదంతా ప్యానిక్ బుకింగ్ వల్లే” అని పెట్రోలియం మంత్రిత్వ శాఖకు చెందిన సంయుక్త కార్యదర్శి సుజాత శర్మ చెప్పారు.

”అదనంగా 48 వేల లీటర్ల కిరోసిన్‌ను కేటాయించాం. ఇది సాధారణ కేటాయింపుల కంటే ఎక్కువ. ప్రతి జిల్లాలో ఒకటి లేదా రెండు ప్రదేశాలను గుర్తించి, అక్కడ కిరోసిన్‌ను పంపిణీ చేయాల్సిందిగా రాష్ట్రాలను, కేంద్ర పాలిత ప్రాంతాలను ఆదేశించాం” అని శుక్రవారం జరిగిన పత్రికా సమావేశంలో పేర్కొన్నారు.

ఈ మేరకు 2026 మార్చి 12న గురువారం పెట్రోలియం, సహజ వాయువు మంత్రిత్వ శాఖ నోటిఫికేషన్‌ను విడుదల చేసింది.

దీని కింద 2025–26 సంవత్సరానికి గాను ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా దేశం మొత్తానికి కలిపి మొత్తం 48,240 కిలోలీటర్ల కిరోసిన్‌ను ప్రభుత్వం కేటాయించింది.

పీడీఎస్ కింద చౌక ధరల దుకాణాల ద్వారా ఈ కిరోసిన్‌ను పంపిణీ చేస్తామని ప్రభుత్వ నోటిఫికేషన్‌లో వెల్లడించింది. ఈ పంపిణీకి సంబంధించిన స్థాయిని, ప్రమాణాలను సంబంధిత రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు నిర్ణయిస్తాయి.

కేటాయించిన 45 రోజుల్లోగా మొత్తం పంపిణీ ప్రారంభించాలని రాష్ట్రాలకు, కేంద్ర పాలిత ప్రాంతాలకు కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)