SOURCE :- BBC NEWS

ఫొటో సోర్స్, HARPER COLLINS
26 మే 2025
భారత్, పాకిస్తాన్ మధ్య 1971లో యుద్ధం ప్రారంభం కావడానికి దాదాపు రెండు నెలల ముందు దిల్లీలో ఒక ఉన్నత స్థాయి సమావేశం జరిగింది.
ఈ సమావేశంలో అప్పటి రక్షణ మంత్రి జగ్జీవన్ రామ్, నేవీ చీఫ్ అడ్మిరల్ ఎస్‌ఎం నందా, భారత నిఘా సంస్థ రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్ (రా) అధిపతి రామ్‌నాథ్ కావో పాల్గొన్నారు.
కరాచీ ఓడరేవులో పాకిస్తాన్ ఒక అత్యాధునిక నౌకా నిఘా వ్యవస్థను ఏర్పాటు చేసిందని భారత నౌకా దళానికి సమాచారం అందింది.
‘మీ విశ్వసనీయ వర్గాల ద్వారా ఈ అంశానికి సంబంధించిన మరింత సమాచారం అందించగలరా’ అని రామ్‌నాథ్‌ను అడ్మిరల్ నందా అడిగారు.
పాకిస్తాన్ నిఘా వ్యవస్థ సామర్థ్యాలను అంచనా వేయడానికి దానికి సంబంధించిన ఫోటోలు అవసరమని రామ్‌నాథ్ అభిప్రాయపడ్డారు.
ఇలాంటి సమాచారాన్ని సాధారణ గూఢచారులు సేకరించలేరు. ఇందుకోసం ప్రత్యేక నిపుణులైన గూఢచారులు అవసరమయ్యారు.


ఫొటో సోర్స్, INDIAN NAVY
సీక్రెట్ మిషన్ కోసం డాక్టర్ నౌక
ఈ మిషన్ కోసం రామ్‌నాథ్‌కు డిప్యూటీ అయిన శంకరన్ నాయర్, బాంబేలోని ఒక ‘రా’ ఏజెంట్‌ను సంప్రదించి, ఆయనకు ఈ బాధ్యతను అప్పగించారు.
ఆ ఏజెంట్ అయిదు రోజుల తర్వాత నాయర్‌ను కలిసి తన ప్రణాళికను చెప్పారు. అలాగే ఈ మిషన్‌లో మనకు ఉపయోగపడే ఒక వ్యక్తి తనకు తెలుసని కూడా చెప్పారు. ఈ ప్లాన్‌కు తుది రూపం ఇవ్వడానికి నాయర్ స్వయంగా బాంబే వెళ్లారు.
”ఈ పనిలో తనకు బాంబేలో నివసించే పార్సీ డాక్టర్ కావాస్జీ సహాయం చేయగలడని ఏజెంట్ చెప్పారు. ఈ డాక్టర్ పని మీద తన నౌకలో కువైట్ మీదుగా పాకిస్తాన్ వెళ్తుంటారని చెప్పారు” అని తన ఆత్మకథ ‘ఇన్‌సైడ్ ఐబీ అండ్ రా, ద రోలింగ్ స్టోన్ దట్ గేదర్డ్ మాస్’లో నాయర్ రాశారు.
కావాస్జీ నౌకను పాకిస్తాన్ వారు తమ ఓడరేవుకు ఎందుకు, ఎలా అనుమతించారో ఎవరికీ తెలియకపోవడం చాలా ఆశ్చర్యకరం.
”కావాస్జీ కుటుంబం 1880ల నుంచి షిప్పింగ్ వ్యాపారంలో ఉంది. బహుశా అతన్ని అనుమతించడానికి ఇదే కారణం అయ్యుండొచ్చు. కరాచీ పోర్టు నుంచి వీరి కార్యకలాపాలు సాగేవి. ఆయన కుటుంబం కూడా కరాచీలో నివసించేది. దేశ విభజన తర్వాత కూడా ఈ ధనిక పార్సీ కుటుంబీకులు కరాచీలోనూ, బాంబేలోనూ స్థిరపడ్డారు” అని ఆత్మకథలో పేర్కొన్నారు నాయర్.
“రెండు నెలల కిందట కావాస్జీకి ఒక ఇబ్బంది ఎదురైంది. బాంబే కస్టమ్స్ అధికారులు అతని నౌకలో ఒక అనుమతి లేని సరుకును స్వాధీనం చేసుకున్నారు. ఈ విషయంలో అతనిపై దర్యాప్తు జరుగుతోంది. దీనికోసం డాక్టర్ పెద్ద మొత్తంలో జరిమానా చెల్లించాల్సి ఉంది. ఇలాంటి సమయంలో ఏం చేయాలో నాకు బాగా తెలుసు” అని నాయర్ తన ఆత్మకథలో రాశారు.

ఫొటో సోర్స్, MANAS PUBLICATION
శంకరన్, కావాస్జీల సమావేశం
శంకరన్ నాయర్ స్నేహితుడే బాంబే కస్టమ్స్ చీఫ్. ఫోన్ చేసి కుశల ప్రశ్నలు అడిగిన తర్వాత నాయర్ తన సమస్యను చెప్పారు.
10 నిమిషాల తర్వాత, డాక్టర్‌పై విధించిన జరిమానాను తన రహస్య నిధి నుంచి ‘రా’ చెల్లిస్తుందని తెలిపారు. తర్వాత డాక్టర్‌పై దర్యాప్తు ముగిసినట్లు కస్టమ్స్ విభాగం లేఖ ద్వారా ప్రకటిస్తుంది.
నాయర్ ఆ లేఖ తీసుకొని, మరో ఇద్దరు గూఢచారులతో కలిసి డీఎన్ రోడ్‌లోని కావాస్జీ క్లినిక్‌కు వెళ్లారు.
భారత నౌకాదళ కమాండర్ మీనన్‌గా తనను తాను పరిచయం చేసుకున్నారు నాయర్.
”మీపై ఉన్న కేసు ఉపసంహరించుకున్నట్లు కస్టమ్స్ విభాగం జారీ చేసిన ఈ లేఖను మీకివ్వడానికి వచ్చాను. అయితే, దీనికోసం మీరు నాకొక చిన్న పని చేసి పెట్టాలి. మీరు ఆ పనిని చేయనని చెప్పొచ్చు. అప్పుడు నేను ఈ లేఖను కాల్చేస్తాను. తర్వాత మళ్లీ మీపై దర్యాప్తు మొదలవుతుంది” అని డాక్టర్‌తో కమాండర్ మీనన్‌గా నటిస్తున్న నాయర్ అన్నారు.
నాయర్ ప్రతిపాదనను అంగీకరించడం తప్ప తనకు ఇంకో దారి లేదనే సంగతి డాక్టర్ కావాస్జీ గ్రహించారు.

ఫొటో సోర్స్, R.K.YADAV
ఇద్దరు రా ఏజెంట్లతో కరాచీకి పయనం
కావాస్జీ కరాచీ పయనం గురించి ”ద వార్ దట్ మేడ్ ఆర్& ఏడబ్ల్యూ” అనే పుస్తకంలో రచయితలు అనూష నందకుమార్, సందీప్ సంకేత్ ప్రస్తావించారు.
”మీరు నా నుంచి ఏం కోరుకుంటున్నారని నాయర్‌ను డాక్టర్ కావాస్జీ ప్రశ్నించారు. మీరు మళ్లీ పాకిస్తాన్‌కు వెళ్లేప్పుడు మీ నౌకలో మా మనుషులు ఇద్దరిని తీసుకెళ్లాలని నాయర్ చెప్పారు. రెండు రోజుల తర్వాత ఈ ప్రయాణం మొదలవుతుందన్నారు. కనీసం నాతో వచ్చే ఆ ఇద్దరి పేర్లయినా చెప్పండని నాయర్‌ను కావాస్జీ అడిగారు. ఒకరి పేరు రాడ్, మరొకరి పేరు మారియార్టీ అని నాయర్ చెప్పారు. కానీ వాళ్లిద్దరి అసలు పేర్లు రావు, మూర్తి. మూర్తి, రా సంస్థ ఫోటోగ్రఫీ శాఖ నిపుణుడు కాగా, నాయర్ నౌకా దళ సహాయకుడు రావు” అని ఆ పుస్తకంలో రాశారు.
ప్రణాళిక ప్రకారం రెండు రోజుల తర్వాత కావాస్జీ తన ఇద్దరు కొత్త సహచరులు రాడ్, మారియార్టీలతో కలిసి ఒక చిన్న నౌకలో కరాచీకి బయల్దేరారు. వారు పాకిస్తాన్ జలాల్లోకి ప్రవేశించే వరకు ఎలాంటి ఇబ్బందులు ఎదురు కాలేదు.
”భారత్ ఒక కొత్త నిఘా సంస్థను ఏర్పాటు చేసిందని, కఠినమైన మిషన్లను నిర్వహించగల సామర్థ్యం ఆ సంస్థకు ఉందని అప్పటికే పాకిస్తాన్‌కు తెలిసిపోయింది. అయితే ఆ కొత్త సంస్థ పేరు వారికి తెలియదు” అని పుస్తకంలో అనూష రాశారు.

ఫొటో సోర్స్, Getty Images
‘సిక్ క్యాబిన్’లో ఇద్దరు గూఢచారులు
కరాచీ ఓడరేవులో కావాస్జీ నౌక ఆగగానే పాకిస్తాన్‌కు చెందిన సీఐడీ ఇన్‌స్పెక్టర్ తన ఇద్దరు సహచరులతో కలిసి ఓడ ఎక్కారు. వారిని చూడగానే డాక్టర్ కాస్త కంగారుపడ్డారు. పాకిస్తాన్ అధికారులు నిమిషాల వ్యవధిలోనే నౌకను తనిఖీ చేశారు. అయితే పేపర్లలో పేరు ఉన్న ఇద్దరు వ్యక్తులు, బెర్తులలో కనిపించకపోయేసరికి వారి గురించి ఆరా తీశారు.
”ఇన్‌స్పెక్టర్లు తమను చూడకూడదనే ఉద్దేశంతోనే వీరిద్దరూ కనబడకుండా లోపల దాక్కున్నారు. వాళ్లెక్కడ ఉన్నారని కావాస్జీని ఇన్‌స్పెక్టర్ అడిగారు. ‘సిక్ బే’ అంటే అనారోగ్యానికి గురైన వారు ఉండే క్యాబిన్‌లో వారిద్దరు ఉన్నారని కావస్జీ చెప్పారు. అక్కడికి వెళ్లి తనిఖీ చేయండని ఒక ఇన్‌స్పెక్టర్ అనగానే, వారిద్దరికీ చికెన్‌పాక్స్ ఉందని కావాస్జీ చెప్పారు. ప్రయాణంలో ముందుగా ఒకరికి ఈ వ్యాధి వచ్చింది. తర్వాత అది మరొకరికి సోకింది. అందుకే వారిద్దరినీ సిక్ బేలో ఉంచాను. మీరు అక్కడికి వెళ్లడం మంచిది కాదు అని కావాస్జీ అన్నారు. ఆ మాటలను ఇన్‌స్పెక్టర్ నమ్మారు. కరాచీకి తరచుగా రాకపోకలు సాగిస్తుండే డాక్టర్ కావాస్జీని వారు నమ్మకపోవడానికి ఇంకో కారణమేమీ లేదు. వారు ఓడ దిగగానే డాక్టర్ ఊపిరి పీల్చుకున్నారు” అని పుస్తకంలో అనూష రాశారు.

ఫొటో సోర్స్, HARPER COLLINS
కరాచీ ఓడరేవు ఫోటోలు తీసిన గూఢచారులు
కావాస్జీ నౌక అర్ధరాత్రి వేళ మళ్ళీ ముందుకు కదలడం ప్రారంభించింది. కాసేపటికి అది ఓడరేవు ప్రవేశద్వారం వద్ద ఉన్న రెండు రాళ్ల మధ్యకు చేరుకుంది. ఇక్కడికి రావాలని ముందుగానే వారు నిర్ణయించుకున్నారు. పోర్ట్ హోల్స్ ద్వారా తమ కెమెరాలతో రాడ్, మారియార్టీ ఫోటోలు తీయడం మొదలుపెట్టారు.
”దీన్ని ఈ మధ్యే నిర్మించినట్లు ఉన్నారని రాడ్ అభిప్రాయపడ్డారు. దానిపై యాంటీ ఎయిర్‌క్రాఫ్ట్ ఫిరంగులు పెట్టారు. దీనర్థం పాకిస్తాన్, కరాచీ ఓడరేవును యుద్ధానికి సిద్ధం చేస్తోంది. ఏజెంట్లు ఇద్దరూ ఆ ప్రాంతానికి చెందిన డజన్ల కొద్ది ఫోటోలను తీశారు. ఫిరంగులతో పాటు అక్కడున్న అన్ని రకాల కోటల ఫోటోలు తీశారు. ఓడరేవులో లంగరు వేసిన పాకిస్తాన్ నౌకా దళానికి చెందిన అనేక షిప్‌ల ఫోటోలు కూడా తీశారు” అని వైస్ అడ్మిరల్ జీఎం హీరానందానీ రాసిన ‘ట్రాన్సిషన్ టు ట్రంప్, హిస్టరీ ఆఫ్ ది ఇండియన్ నేవీ 1965-1975’ అనే పుస్తకంలో పేర్కొన్నారు.

ఫొటో సోర్స్, BHARATRAKSHAK.COM
దిల్లీలో ఫోటోల అధ్యయనం
”సుమారు అరగంట తర్వాత, ఓడను వెనక్కి తిప్పమని పైలట్లను ఆదేశించారు. ఇద్దరు ఏజెంట్లు మళ్ళీ సిక్ బేకి వెళ్లారు. ఒకరోజు తర్వాత కరాచీ రేవు నుంచి ఓడ బయలుదేరింది. తిరుగు పయనంలో రాళ్లకు అవతలివైపు ఫోటోలను కూడా తీశారు. తర్వాత అరేబియా సముద్రంలోకి వెళ్లిన ఓడ కువైట్ వైపు కదిలింది” అని ఆ పుస్తకంలో రాశారు.
నౌక కువైట్ చేరుకున్న వెంటనే రావు, మూర్తి నేరుగా భారత రాయబార కార్యాలయానికి వెళ్లారు. అక్కడి నుంచి కరాచీ నుంచి తీసుకొచ్చిన కెమెరా ఫిల్మ్‌లను దిల్లీకి పంపారు. తర్వాతి రోజు రావు, మూర్తి విమానంలో దిల్లీకి బయలుదేరారు.
”వార్ రూమ్‌లో జగ్జీవన్ రామ్, రామ్‌నాథ్, అడ్మిరల్ నందా ఆ ఫోటోలపై అధ్యయనం చేశారు. కరాచీ నౌకాశ్రయం 360 డిగ్రీల దృశ్యాలను వారికి మూర్తి చూపించారు. అక్కడ ఉన్న వారందరూ ఆ చిత్రాలను ఆశ్చర్యంతో చూశారు” అని అనూష నందకుమార్, సాకేత్ తమ పుస్తకంలో పేర్కొన్నారు.
కరాచీ ఓడరేవు లోపలి ఫోటోలు భారత్‌కు లభ్యంకావడం ఇదే మొదటిసారి. పాకిస్తాన్ ఏ ప్రదేశాల్లో మోహరించిందో, వారి సామర్థ్యం ఏమిటో భారత నౌకా దళానికి తెలిసిపోయింది.
కరాచీలో ఏ ప్రదేశంలో ఇంధన నిల్వలు ఉన్నాయో, ఏ రకమైన నౌకలు ఓడరేవు వద్ద ఉన్నాయో కూడా భారత్ తెలుసుకుంది.
1971 డిసెంబర్ 3న అధికారికంగా యుద్ధాన్ని ప్రకటించడానికి ముందే భారత్ వద్ద కరాచీ ఓడరేవు పూర్తి మ్యాప్ ఉంది. పాకిస్తాన్ తన అత్యుత్తమ డాల్ఫిన్ క్లాస్ సబ్‌మెరైన్లను మోహరించింది. వారి వద్ద ఉన్న 8000 మంది నేవీ జవాన్లలో 5,000 మందిని మాత్రమే యుద్ధంలోకి దించింది.

ఫొటో సోర్స్, ADMIRAL NANDA FAMILY
ఇందిరా గాంధీ అనుమతి తీసుకున్న అడ్మిరల్ నందా
1971 డిసెంబర్ 3న భారత్, పాకిస్తాన్ మధ్య యుద్ధం మొదలు కాగానే, కరాచీపై దాడి చేయాలనే తమ ప్రణాళికను భారత నౌకా దళం అమలు చేయడం ప్రారంభించింది.
దీనికంటే ముందు అక్టోబర్ మొదట్లో అడ్మిరల్ నందా, ఇందిరా గాంధీని కలవడానికి వెళ్లారు.
నేవీ సన్నాహాల గురించి ఇందిరా గాంధీకి తెలియజేశారు. ‘‘ఒకవేళ కరాచీపై నేవీ దాడి చేస్తే ప్రభుత్వానికి ఏదైనా రాజకీయ అభ్యంతరం ఉంటుందా’’ అని ఇందిరా గాంధీని ఆయన అడిగారు.
ఈ ఘటన గురించి తన ఆత్మకథలో నందా వివరించారు.
”ఇందిరా గాంధీ నేను అడిగిన ప్రశ్నకు అవును లేదా కాదు అని బదులు ఇవ్వకుండా ‘మీరు ఎందుకిలా అడుగుతున్నారు?’ అంటూ తిరిగి ప్రశ్నించారు. భారత సముద్ర సరిహద్దు అవతల ఎలాంటి చర్య తీసుకోవద్దని, అలాంటి చర్యల వల్ల మాకు చాలా సమస్యలు ఎదురయ్యాయని 1965లో భారత నౌకా దళానికి స్పష్టంగా చెప్పారంటూ ఆమెకు నేను సమాధానం చెప్పాను.
ఇందిర కాసేపు ఆలోచించి, ‘‘వెల్ అడ్మిరల్, ఇఫ్ దేరీజ్ వార్, దేరీజ్ వార్’ అని అన్నారు. అంటే యుద్ధం జరిగితే యుద్ధమే ఉంటుంది అని చెప్పడం ఆమె ఉద్దేశం. నేను ఆమెకు కృతజ్ఞతలు చెబుతూ, మేడమ్ నాకు సమాధానం దొరికింది అని అన్నాను” అని నందా తన పుస్తకంలో రాశారు.

ఫొటో సోర్స్, Getty Images
పాకిస్తాన్ దృష్టి మళ్లింపు
కరాచీపై నౌకా దళం దాడి చేయడానికి ముందు కరాచీ, మాహిర్, బాదిన్ వైమానిక స్థావరాలపై భారత వైమానిక దళం బాంబులు వేయడం మొదలుపెట్టింది. కరాచీ ఓడరేవుపై కూడా బాంబులు వేస్తూనే ఉన్నారు.
”నిజానికి, ఇదంతా ఒక ప్రణాళిక ప్రకారమే జరిగింది. పాకిస్తాన్ దృష్టిని వైమానిక స్థావరాల వైపు మరల్చడానికి ఇలా చేశారు. మన నౌకలు ఒక నిర్దిష్ట లక్ష్యంతో కరాచీ వైపు కదులుతున్నట్లు పాక్‌కు తెలియకూడదు. నా బాల్యం అంతా కరాచీలోనే గడిచింది. కాబట్టి నాకు కరాచీ ప్రాంతమంతా బాగా తెలుసు. రెండోది మా నిఘా సంస్థ మాకు కరాచీ గురించి ప్రామాణికమైన సమాచారాన్ని అందించింది. క్లిఫ్టన్, కిమారి ఓడరేవుల మధ్య ఉన్న చమురు నిల్వలను లక్ష్యంగా చేసుకుంటే ఎంత ప్రభావవంతంగా ఉంటుందో అంచనా వేయమని నేను నా సిబ్బందిని కోరాను” అని అడ్మిరల్ నందా తన పుస్తకంలో పేర్కొన్నారు.

ఫొటో సోర్స్, INDIAN NAVY
కరాచీపై మిసైల్ బోట్‌తో దాడి
1971 మొదట్లో సోవియట్ యూనియన్ నుంచి భారత్‌కు ఓసా-1 మిసైల్ బోట్ (క్షిపణి పడవ) లభించింది.
తీరప్రాంత రక్షణ కోసం వీటిని రూపొందించారు. కానీ, కరాచీపై దాడి చేయడానికి దానిని ఉపయోగించాలని నౌకాదళ కమాండర్లు నిర్ణయించుకున్నారు.
కరాచీపై వైమానిక దళ యుద్ధ విమానాలు బాంబు దాడి చేస్తుండగా, మూడు ఓసా-1 క్షిపణి పడవలు కరాచీ వైపు కదలడం ప్రారంభించాయి. కరాచీ ఓడరేవును నాశనం చేయడమే లక్ష్యంగా దీనికి ‘ఆపరేషన్ ట్రైడెంట్’ అని పేరు పెట్టారు.
మూడు మిసైల్ బోట్లను పాకిస్తాన్ ప్రాదేశిక జలాలకు తీసుకెళ్లి, కరాచీకి 250 కిలోమీటర్ల దూరంలో ఉంచారు.
‘‘పాకిస్తాన్ నౌక పీఎన్‌ఎస్ ఖైబర్‌ను మొదటి బోట్ ముంచి వేసింది. ఈ దాడి ఎక్కడి నుంచి జరిగిందో వారు ఊహించలేకపోయారు. భారత వైమానిక దళ విమానాలు తమపై దాడి చేశాయని వారు భావించారు” అని అనూష నందకుమార్, సందీప్ సాకేత్ రాశారు.
”ఆ తర్వాత, పాకిస్తాన్ సైన్యానికి ఆయుధాలను తీసుకెళ్లే కార్గో షిప్‌ను రెండో బోట్ ముంచేసింది. మూడవ క్షిపణి, కరాచీ ఓడరేవును లక్ష్యంగా చేసుకుని చమురు ట్యాంకులపై దాడి చేసింది. రావు, మూర్తి తీసిన ఫోటోలు ఈ దాడిలో వారికి చాలా సహాయపడ్డాయి” అని సాకేత్ రాశారు.
పాకిస్తాన్ నౌకాదళ పోరాట సామర్థ్యాన్ని ఈ దాడి దాదాపు నాశనం చేసింది. ఇంధన కొరతతో పాటు ఈ దాడి కారణంగా పాకిస్తాన్ తమ నౌకాదళంలోని అన్ని నౌకలను వెనక్కి పిలిపించి, కరాచీ ఓడరేవు రక్షణ కోసం వాటిని మోహరించింది.
ఇది జరిగిన కొన్ని రోజుల తర్వాత ‘ఆపరేషన్ పైథాన్’ మొదలైంది. ఇందులో కరాచీ పోర్టును దిగ్బంధించారు. ఈ దిగ్బంధనం లక్ష్యం పశ్చిమ పాకిస్తాన్‌ను తూర్పు పాకిస్తాన్ (బంగ్లాదేశ్) నుంచి పూర్తిగా వేరుచేయడం. ఈ ప్రయత్నం విజయవంతమైంది.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
SOURCE : BBC NEWS