SOURCE :- BBC NEWS

(ఈ కథనంలో మిమ్మల్ని కలిచివేసే అంశాలుంటాయి)
అన్నా పోడెడ్‌వోర్నా అనే మహిళను ఇంటర్వ్యూ చేయడానికి వెళ్లిన పోలిష్ టీవీ జర్నలిస్ట్ రాఫెల్ జలేవ్స్కీకి, ఆమె ప్రవర్తన కాస్త వింతగా, అసాధారణంగా అనిపించింది.
ఆమె ఏదో దాచిపెడుతున్నట్లు, కంగారుపడుతున్నట్లుగా ఎందుకు ఉందో ఆయనకు మొదట అర్ధం కాలేదు.
కానీ, ఆ ఇంటర్వ్యూ తర్వాత తన సహచరి మృతదేహాన్ని ఎక్కడ పాతిపెట్టానో వివరిస్తూ పోడెడ్‌వోర్నా పోలీసులకు ఈమెయిల్ రాశారు. ఆమె తన నేరాన్ని ఒప్పుకోవడంలో రాఫెల్ చేసిన ఇంటర్వ్యూ చాలా కీలకంగా మారిందని ప్రాసిక్యూటర్లు కూడా ఆయన్ను మెచ్చుకున్నారు.
అసలింతకు ఈ కేసేంటి, ఆ జర్నలిస్టు చేసిన ఇంటర్వ్యూకు, ఈ కేసులో చిక్కుముడికి లింక్ ఏంటి?

ఫొటో సోర్స్, Derbyshire Police
పోడెడ్‌వోర్నా ఒక మంచి నైపుణ్యం కలిగిన బుచర్ (మాంసం కొట్టే వ్యక్తి). అయితే, 2010లో డెర్బీలో తాను నివసించే ఇంట్లో తన సహచరి ఇజాబెలాను హత్య చేసి తోటలో పాతిపెట్టారామె.
ఆమె ఈ హత్యకు పాల్పడినట్లు గత మంగళవారం నిర్ధరణైంది. అంటే నేరం జరిగిన 15 ఏళ్ల తర్వాత నిరూపణ అయింది.
“ఇంటర్‌వ్యూలో ఇజాబెలా గురించి మాట్లాడేటప్పుడు ఆమె చాలా కంగారుపడుతూ, భయపడుతూ కనిపించింది” అని జలేవ్స్కీ బీబీసీతో చెప్పారు.
ఆ ఇద్దరు మహిళలూ పని వెతుక్కుంటూ పోలాండ్ నుంచి బ్రిటన్‌కి వచ్చి నార్మంటన్ ప్రాంతంలో నివసించారని డెర్బీ క్రౌన్ కోర్టులో పోడెడ్‌వోర్నా కేసు విచారణ సందర్భంగా జ్యూరీకి తెలిసింది.
2010 ఆగస్టు 28న పోలాండ్‌లో ఉండే తన తల్లికి ఇజాబెలా ఫోన్ చేశారని, ఆ తర్వాత ఆమె గురించి ఎలాంటి సమాచారం లేదని ప్రాసిక్యూటర్లు తెలిపారు.
“ఆ కాల్ తర్వాత కొద్దిసేపటికే, ఇజాబెలాను పోడెడ్‌వోర్నా హత్య చేసింది. పెద్ద కత్తితో ఇజాబెలా శరీరాన్ని సగానికి నరికి ముక్కలు చేసింది” అని ప్రాసిక్యూటర్ గోర్డాన్ ఆస్ప్డెన్ కె.సి అన్నారు.
గతంలో పోడెడ్‌వోర్నా బుచర్‌గా పని చేశారని, పెద్దపెద్ద కత్తులు ఉపయోగించి టర్కీ కోడి మాంసాన్ని బోన్‌లెస్ చికెన్‌గా మార్చడం, దాన్ని ముక్కలు ముక్కలుగా నరకడం లాంటి పనులు చేసిన అనుభవముందని పోలీసులు గుర్తించారు.
మృతదేహాన్ని తోట వెనుక భాగంలో పాతిపెట్టి, దాన్ని కాంక్రీట్‌తో కప్పేసిందని విచారణలో తేలింది.

పోలాండ్‌లో ఎక్కువగా చూసే టీవీ చానెల్స్‌లో ఒకటైన పోల్సాట్‌కు రిపోర్టర్‌గా పనిచేస్తున్నారు జలేవ్స్కీ.
ఇజాబెలా కనిపించడం లేదని, ఆమె అదృశ్యం గురించి పరిశీలించమని ఆమె కుమార్తె కాసియా నుంచి జలేవ్స్కీకి ఉత్తరాలు అందాయి.
2024లో పోలిష్ సంస్థ మిస్సింగ్ ఫర్ ఇయర్స్‌ను ఇజాబెలా కుమార్తె సంప్రదించారు. ఆ సంస్థ వారు ఫేస్‌బుక్ ద్వారా పోడెడ్‌వోర్నాను సంప్రదించారు.
ఇజాబెలా ఎక్కడ ఉందో, ఆమెకు ఏం జరిగిందో తనకు తెలియదని పోడెడ్‌వోర్నా వారికి చెప్పారు.
ఏడాది తర్వాత మే 2025లో, పోడెడ్‌వోర్నాను ఇంటర్వ్యూ ఇవ్వాలని అడిగారు జలేవ్స్కీ.
బోయర్ స్ట్రీట్‌లోని ఆమె ఇంటి దగ్గర ఇంటర్వ్యూ చేయడానికి డెర్బీకి వెళ్లారాయన.
ఇజాబెలా గతంలో ఎక్కడ ఉండేదో తెలుసని, కానీ, ఇప్పుడెక్కడుందో తనకు తెలియదని పోడెడ్‌వోర్నా చెప్పారు.
కానీ, జలేవ్స్కీకి ఎక్కడో అనుమానంగానే ఉంది. ఆమె నిజం చెప్పడంలేదని ఆయనకు అనిపించింది.
”ఇజాబెలా కనిపించకుండా పోవడానికి, పోడెడ్‌వోర్నాకి సంబంధం ఉండొచ్చని ఇజాబెలా కుటుంబం మొదటి నుంచీ చెబుతోంది” అని ఆయన అన్నారు.
“ఇంటర్వ్యూలో ఇజాబెలా గురించి మాట్లాడేటప్పుడు ఆమె చాలా కంగారు పడుతూ, భయపడుతూ కనిపించింది” అని జలేవ్స్కీ చెప్పారు.

ఇంటర్వ్యూ అయిన తర్వాత, తన ఆట ముగిసిందని పోడెడ్‌వోర్నాకు అర్థమైంది. పెరుగుతున్న ఒత్తిడి కారణంగా చివరకు 15 ఏళ్ల తర్వాత ఆమె నేరాన్ని అంగీకరించారని ప్రాసిక్యూటర్లు తెలిపారు.
జలేవ్స్కీతో ఇంటర్వ్యూ తరువాత, ఆమె 2025 మే 15న ఇజాబెలా గురించి డెర్బిషైర్ పోలీస్‌కు ఈమెయిల్ పంపారు.
అకస్మాత్తుగా పోడెడ్‌వోర్నా నుంచి ఈమెయిల్ రావడంతో దేనిగురించో పోలీసులకు మొదట్లో అర్థం కాలేదు.
మరిన్ని వివరాలు అడుగుతూ నిందితురాలికి తిరిగి ఈమెయిల్ పంపారు పోలీసులు.
తరువాత కొన్ని రోజులు ఆమెకు, పోలీసులకు మధ్య ఈమెయిల్స్ నడిచాయి.
నార్మాంటన్‌లో ప్రిన్సెస్ స్ట్రీట్‌లోని ఒక ఇంటి వెనుక తోటలో ఇజాబెలాను పాతిపెట్టినట్లు మే 24 తేదీన పోడెడ్‌వోర్నా డిటెక్టివ్‌లకు ఈమెయిల్ పంపడంతో దీనికి ఎండ్ కార్డ్ పడింది.
ఫొటో సోర్స్, Derbyshire Police
అదే రోజు డెర్బీలోని పియర్ ట్రీ పోలీస్ స్టేషన్‌కు వెళ్లి, ఇజాబెలాను తానే చంపినట్లు పోడెడ్‌వోర్నా అంగీకరించారు.
అయితే, ఇద్దరి మధ్యా ఘర్షణ జరిగిందని, ప్రమాదవశాత్తు ఇజాబెలా మరణించిందని, ఆ సమయంలో తనను తాను రక్షించుకోవడం తప్ప మరోదారి కనిపించలేదని ఆమె చెప్పారు.
కానీ పోడెడ్‌వోర్నా వాదనను జ్యూరీ తిరస్కరించింది.
పోడెడ్‌వోర్నాతో తన ఇంటర్వ్యూ గురించి జలేవ్స్కీ మాట్లాడుతూ, ఇజాబెలా కుటుంబానికి పోడెడ్‌వోర్నా చాలా అబద్ధాలు చెప్పిందని అన్నారు.
“ఆమె ఏదో దాచిపెడుతోందని, తనకింకా ఏదో తెలుసని మాకు అర్థమైంది. నేను ఇంటర్వ్యూ చేస్తున్నప్పుడు ఆమె భయపడిన తీరుతో అది నిర్ధరణైంది” అని జలేవ్స్కీ అన్నారు.
“నాతో మాట్లాడిన తర్వాత, ఆమె పోలీసుల వద్దకు వెళ్లి ఇజాబెలా శరీరాన్ని ఎక్కడ పాతిపెట్టారో వెల్లడించిందని తెలిసింది. ఇజాబెలా మరణించాక ఆమె ఆనవాళ్లు కనిపించకుండా చేసిన తీరు భయంకరమైంది, క్రూరమైంది” అని ఆయన అన్నారు.
ఫొటో సోర్స్, Derbyshire Police
ఈ కేసు గురించి పోలాండ్‌లోనే కాకుండా బ్రిటన్‌లో కూడా ప్రముఖంగా చర్చ జరిగిందని జలేవ్స్కీ అన్నారు.
“మేం డెర్బీ వీధుల్లో నడుస్తున్నప్పుడు ఒక వారం పాటు ప్రజలు మా దగ్గరికి వచ్చి ఈ కేసు గురించి అడిగేవారు. ఎంతవరకు వచ్చింది, విచారణ ఎప్పుడు జరుగుతుంది అనేవారు” అని ఆయన అన్నారు.
“శిక్ష విధించాక, ఇది ఇంకా పెద్ద వార్తవుతుందని నేననుకుంటున్నా” అని ఆయన చెప్పారు.
“ఈ కేసులో కాసియా, జలేవ్స్కీ పోషించిన పాత్ర చిన్నది కాదు. అన్నా పోడెడ్‌వోర్నా పోలీసులను సంప్రదించి, ఇజాబెలా మృతదేహం ఎక్కడుందో చెప్పడానికి వారి చర్యలే ప్రేరేపించాయి” అని తీర్పు తర్వాత డిటెక్టివ్ ఇన్‌స్పెక్టర్ కేన్ మార్టిన్ అన్నారు.
( బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)



