SOURCE :- BBC NEWS

ఫొటో సోర్స్, Getty Images
హైదరాబాద్ నగరంలో వేసవి కష్టాలు మొదలవుతున్నాయి. మోటార్లతో నల్లా నీటిని తీసుకుంటే జరిమానాలు విధిస్తామని ఇప్పటికే హైదరాబాద్ వాటర్ బోర్డు ప్రకటించింది.
కొన్నిచోట్ల భూగర్భ జలాలు తగ్గుతున్నాయి. అలాంటి సమయంలో స్థోమత ఉన్న వాళ్లు వాటర్ ట్యాంకర్లు తెప్పించుకుంటున్నారు.
నగరంలో ఇంటింటికీ నీరివ్వడంతో పాటూ, ట్యాంకర్లు కూడా పంపుతోంది హైదరాబాద్ మెట్రోపాలిటిన్ వాటర్ సప్లై అండ్ సీవరేజ్ బోర్డు. అంతా ఓకే కానీ, వారికి ఆ నీరు ఎక్కడ నుంచి వస్తుంది?
భూగర్భంలో నుంచి అయితే భూ యజమానులు ఇప్పటికే తోడి వాడుకుంటున్నారు, అమ్ముకుంటున్నారు. మరి ఇన్ని లక్షల, కోట్ల లీటర్ల నీటిని హెచ్ఎండబ్ల్యుఎస్ఎస్‌బి ఎక్కడి నుంచి తెస్తోంది?
హైదరాబాద్ నగరానికి ప్రధానంగా నీరు అందించేది కృష్ణా నదే. హైదరాబాద్ నగరం కృష్ణా బేసిన్‌లోనే ఉంది. ప్రస్తుతం ఈ నగరానికి వచ్చే నీటిలో సగం వరకూ ఆ నది నుంచే వస్తున్నాయి. ఆ తరువాత స్థానంలో గోదావరి ఉంటుంది.
ప్రస్తుతం హైదరాబాద్ నగరానికి నీరు ఎలా వస్తుందో ఈ పట్టిక చూస్తే అర్ధమవుతుంది.


ఒకప్పుడు హైదరాబాద్ నగరంలో నీటి కోసం ఎక్కువగా జంట జలాశయాలపైనా, తరువాత మంజీరపైనా ఆధారపడే వారు. క్రమంగా ఒక్కో నీటి వనరూ పెరుగుతూ వచ్చింది.
స్వాతంత్య్రానికి ముందే నిజాం కాలంలో నిర్మించిన జంట జలాశయాల నుంచి రోజుకు 40 మిలియన్ గాలన్లు తీసుకోగల సామర్థ్యం ప్రస్తుతం ఉంది. అయితే ప్రస్తుతానికి ఆ నీటిని వాడటం లేదు.
తరువాత నిర్మించిన సింగనూరు నుంచి మాత్రం పూర్తి సామర్థ్యంలో నీరు వస్తోంది. అక్కడి నుంచి 75 మిలియన్ గాలన్లు, మంజీర నుంచి 45కి గానూ 30 మిలియన్ గాలన్ల నీరు తీసుకుంటున్నారు వాటర్ బోర్డు అధికారులు.

ఇక అక్కంపల్లి నుంచి కృష్ణా నీరు, ఎల్లంపల్లి నుంచి గోదావరి నీరు వస్తూనే ఉంది. వీటిలో జంట జలాశయాల నీరు పూర్తిగా గ్రావిటీతో పారతాయి. సింగనూరు, మంజీర నీటికి కొంచెం గ్రావిటీ, కొంచెం పంపింగ్ అవసరం పడుతుంది. ఇక కృష్ణా, గోదావరి నీరు పూర్తిగా పంపింగ్ మీదనే ఆధారపడి ఉంటాయి.
ఆయా మార్గాల్లో నీటిని హైదరాబాద్ శివార్లలోని వివిధ ట్రీట్‌మెంట్ ప్లాంట్లకు తీసుకువస్తారు. అక్కడ శుద్ధి చేసిన నీటిని నాలాలు (కుళాయిలు), ట్యాంకర్ల ద్వారా సరఫరా చేస్తోంది వాటర్ బోర్డు.
ఈ పద్ధతిలో హైదరాబాద్ నగరానికి రోజుకు దాదాపు 1,800 మిలియన్ లీటర్లు లేదా 63.57 మిలియన్ క్యూబిక్ అడుగుల నీరు సరఫరా చేస్తున్నారు. దాదాపు 13 లక్షల కనెక్షన్లకు ఈ నీరు అందిస్తోంది.

ఫొటో సోర్స్, Getty Images
ఈ ఏడాది నీటి కష్టాలు ఉంటాయా?
2025 మార్చి నాటికే కృష్ణా, గోదావరి నదులపై ఉన్న ప్రాజెక్టుల నీటి మట్టాలు తగ్గుముఖం పట్టాయి. కానీ పూర్తిగా అడుగంట లేదు.
ఆయా జలాశయాల పూర్తి సామర్థ్యం వరకూ నీరు తీసుకోవచ్చు. ప్రస్తుతం నాగార్జునసాగర్ నుంచి అత్యవసరంగా తోడటానికి కూడా సిద్ధంగా ఏర్పాట్లు చేసుకుంటోంది వాటర్ బోర్డు.
సాగర్‌లో 510 అడుగుల దగ్గర కూడా నీరు తీసుకునే ఏర్పాటు ఉంది.

ఫొటో సోర్స్, Getty Images
భవిష్యత్తు ఏంటి?
ప్రస్తుతానికి హైదరాబాద్ నగరానికి భయంకరమైన తాగునీటి ఎద్దడి వచ్చే అవకాశమైతే కనిపించడం లేదు కానీ, భవిష్యత్తు అవసరాల కోసం గోదావరి నీటిని మరింత తెప్పించేలా ప్రణాళిక వేశాయి ప్రభుత్వాలు.
అయితే ఈ విషయంలో బీఆర్ఎస్ వైఖరి కంటే కాస్త భిన్నంగా ఉంది కాంగ్రెస్ వైఖరి. గోదావరి నుంచి రెండో విడత నీరు తెచ్చేలా జీడీడబ్ల్యుఎస్ ఫేజ్ 2 ప్రారంభించడానికి 2024 ఆగస్టులో పాలనా అనుమతులు ఇచ్చింది ప్రభుత్వం. ముఖ్యంగా కాళేశ్వరంలో భాగమైన మల్లన్నసాగర్ నుంచి 20 టీఎంసీల నీరు తీసుకునేలా ప్రణాళిక వేస్తున్నారు.
ముందుగా మల్లన్న సాగర్‌కు వచ్చిన గోదావరి నీటిని, అక్కడి నుంచి ఘనపురం పంప్ హౌస్‌కి తెస్తారు. అక్కడ నుంచి జంట జలాశయాల్లోకి నీరు తేవాలని ప్రస్తుత ప్రభుత్వ ఆలోచన. ఇదే నీటిని తరలించడం కోసం బీఆర్ఎస్ ప్రభుత్వం తలపెట్టిన కేశవరాన్ని రద్దు చేసి, ఆ స్థానంలో ఈ ప్రతిపాదన చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం.
ఇప్పటికే టెండర్ల ప్రక్రియ ప్రారంభం అయింది. అది పూర్తయితే, మరో 25 ఏళ్లు హైదరాబాద్ నగర తాగునీటికి ఢోకా ఉండదని తెలంగాణ ప్రభుత్వం చెబుతోంది.
మరోవైపు పాతబడిన మంజీర పైపులైన్ కూడా పునరుద్ధరించే యోచనలో ఉంది రాష్ట్ర ప్రభుత్వం.
నగరానికి మరీ బెంగళూరు తరహా నీటి కష్టాలు వచ్చే అవకాశం లేకపోయినా, నీటి వృథా చాలా ఎక్కువగా ఉందని ఆందోళన చెందుతున్నారు వాటర్ బోర్డు అధికారులు.
మరోవైపు హైదరాబాద్ నగరంలో భూగర్భ జలాలు పెద్ద ఎత్తున పడిపోవడం వల్ల వాటర్ బోర్డుపై డిమాండ్ పెరుగుతోంది. ముఖ్యంగా భారీ నిర్మాణాలు అధికంగా నీరు వాడటం కూడా ఈ తగ్గుదలకు ఒక కారణంగా కనిపిస్తోంది.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)