Home జాతీయ national telgu హైదరాబాద్ : గుల్జార్ హౌజ్ అగ్ని ప్రమాద తీవ్రతకు 7 కారణాలు ఇవే…

హైదరాబాద్ : గుల్జార్ హౌజ్ అగ్ని ప్రమాద తీవ్రతకు 7 కారణాలు ఇవే…

3
0

SOURCE :- BBC NEWS

అగ్నిప్రమాదం

హైదరాబాద్ పాతబస్తీలో గుల్జార్ హౌజ్ నుంచి చార్మినార్ వెళ్లే మార్గం. రెండింటి మధ్య సుమారు 200 మీటర్ల దూరం ఉంటుంది.

ఈ మధ్యలోనే రెండు వైపులా ముత్యాలు అమ్మే దుకాణాలు ఎక్కువగా కనిపిస్తుంటాయి.

గుల్జార్ హౌజ్ పక్కనున్న రెండో భవనంలోనే గ్రౌండ్ ఫ్లోర్‌లో కృష్ణా పెరల్స్, ఇక్రమ్ జ్యువెలర్స్, మోదీ పెరల్స్ దుకాణాలున్నాయి.

ఈ దుకాణాలకు పైన ఉన్న రెండు అంతస్తులు నివాస భవనాలు.

కృష్ణా పెరల్స్ నుంచి పై అంతస్తులకు వెళ్లేందుకు మార్గం ఉంది. ఈ మార్గంలోనే పై అంతస్తులకు రాకపోకలకు సాగించాలి.

ఇక్కడే అగ్ని ప్రమాదం జరిగి 17 మంది చనిపోయారు. ఈ సంఘటన దేశవ్యాప్తంగా తీవ్రకలకలం రేపింది.

ఇంత పెద్ద ప్రమాదానికి ప్రధానంగా ఏడు కారణాలు కనిపిస్తున్నాయి. అవేంటో చూద్దాం…

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
పొగ

ఫొటో సోర్స్, screengrab

దట్టమైన పొగ కమ్ముకుంది….

అగ్ని ప్రమాదం ఎప్పుడు జరిగిందనే స్పష్టమైన సమయం ఎవరూ చెప్పలేకపోతున్నారు.

ఫైర్ డిపార్ట్‌మెంట్ అధికారులు, స్థానికులు చెబుతున్న వివరాల ప్రకారం ఆదివారం ఉదయం సుమారు 6 గంటల సమయంలో అగ్ని ప్రమాదం జరిగినట్లుగా అర్థమవుతోంది.

ఉదయం 6.16 గంటలకు అగ్నిమాపక శాఖకు ఫోన్ కాల్ వచ్చినట్లుగా తెలంగాణ ఫైర్ సర్వీసెస్ డిపార్ట్‌మెంట్ డైరెక్టర్ జనరల్ నాగిరెడ్డి చెప్పారు.

ఆ వెంటనే అక్కడికి అగ్నిమాపక సిబ్బంది చేరుకుని మంటలు అదుపులోకి తీసుకువచ్చేందుకు ప్రయత్నించారు. 11 ఫైరింజన్లు, ఒక రోబో వాహనంతోపాటు సుమారు 70మంది అగ్నిమాపక సిబ్బంది రెండున్నర గంటలపాటు శ్రమించి మంటలను ఆర్పివేశారు.

అయితే, ప్రమాదం జరిగినప్పుడు ఆ ఇంట్లో ఉన్నవారంతా నిద్రలో ఉండటంతో వాయువులు, పొగ దట్టంగా కమ్ముకుని ఊపిరాడక అపస్మారక స్థితిలోకి చేరుకున్నారని అధికారులు గుర్తించారు.

”సెలవు కావడంతో మూసారంబాగ్, బంజారాహిల్స్, అత్తాపూర్ నుంచి ప్రహ్లాద్ మోదీ తమ్ముడు, చెల్లెళ్ల కుటుంబీకులు ఆయన ఇంటికి వచ్చారు. ఆ సమయంలోనే ఘటన జరిగింది” అని అగర్వాల్ కమ్యూనిటీ ప్రతినిధి ఒకరు బీబీసీతో చెప్పారు.

అగ్నిమాపక సిబ్బంది

1. ఎలక్ట్రిక్ బైకులు, ఏసీ కంప్రెసర్లు తగలబడటం

ప్రమాదానికి కారణాలపై పూర్తిస్థాయి దర్యాప్తు చేస్తున్నట్లుగా ఫైర్ సర్వీసెస్ డీజీ నాగిరెడ్డి మీడియాకు చెప్పారు.

”ప్రాథమికంగా గ్రౌండ్ ఫ్లోర్ లో ఉన్న మెయిన్ స్విచ్ బోర్డు వద్ద షార్ట్ సర్క్యూట్ జరిగి మంటలు అంటుకున్నట్లుగా తేలింది” అని చెప్పారు.

ప్రమాదం జరిగిన తర్వాత మంటలు అంటుకున్న పెరల్స్ దుకాణంలోని పెరల్స్ సహా నగలు తగలబడటంతోపాటు రెండు బైక్‌లు కూడా పూర్తి తగలబడ్డాయి. అవి ఎలక్ట్రిక్ బైక్‌లని అనుమానిస్తున్నారు ఫైర్ సిబ్బంది.

”ఎలక్ట్రిక్ బైకులు కాలడంతో అందులో ఉండే లిథియం-అయాన్ బ్యాటరీల నుంచి తీవ్రమైన పొగ వచ్చిందని తెలుస్తోంది.

తర్వాత మొదటి అంతస్తుకు మంటలు వ్యాపించడంతో అక్కడ ఏసీ కంప్రెసర్ పేలి అందులోనుంచి వాయువులు బయటకు వచ్చాయి” అని సహాయక చర్యల్లో పాల్గొన్న ఫైర్‌మెన్ ఒకరు బీబీసీతో చెప్పారు.

మంచం

2. నిద్రలో ఉండటం, చిన్న పిల్లలు కావడం…

ప్రమాదం జరిగినప్పుడు అందరూ నిద్రలో ఉన్నారని అధికారులు చెబుతున్నారు.

నలుగురు మాత్రం రెండో అంతస్తుకు వెళ్లడంతో ప్రమాదంనుంచి తప్పించుకోగలిగారు. వారిని ఫైర్ సిబ్బంది కాపాడినట్లు చెప్పారు నాగిరెడ్డి.

మొదటి అంతస్తులో దాదాపు ఆరేడు గదులు ఉన్నట్లు లోనికి వెళ్లిన ఫైర్ సిబ్బంది చెప్పారు.

ఆ గదుల్లోని వారంతా నిద్ర పోయారని చెబుతున్నారు. పొగ దట్టంగా వ్యాపించి నిద్రలో అపస్మారక స్థితికి చేరుకున్నట్లుగా పోలీసులు భావిస్తున్నారు.

వీరిలో ఎక్కువ మంది చిన్న పిల్లలు ఉన్నారు. చనిపోయిన వారిలో 8 మంది పిల్లలు. వారందరూ ఏడేళ్లలోపు వారే.

దీంతో వారు ప్రమాదం గురించి తెలుసుకుని బయటపడే అవకాశం లేకుండా పోయింది.

ఇరుకు దారి

3. ఒకటే మార్గం…

నిద్రలోంచి ఎవరైనా ప్రాణాలు కాపాడుకునేందుకు ప్రయత్నించినా, కిందకు వచ్చే వీల్లేకుండా ఉంది.

గ్రౌండ్ ఫ్లోర్ లోనే మంటలు అంటుకుని మొదటి అంతస్తుకు వ్యాపించినట్లుగా ఫైర్ సర్వీసెస్ డీజీ నాగిరెడ్డి చెప్పారు.

దీనివల్ల భవనం నుంచి బయటకు వచ్చేందుకు కూడా మార్గం లేదు. వెళ్లేందుకు, వచ్చేందుకు ఒకేదారి ఉంది.

”ఆ దారి చాలా ఇరుకుగా ఉంటుంది. కాస్త లావుగా ఉన్నవారెవరైనా ఒకరు వెళితే మరొకరు వెళ్లే పరిస్థితి ఉండదు” అని గాజులు అమ్ముకునే స్థానికుడొకరు బీబీసీతో చెప్పారు.

కాలిపోయిన గది

4. జనసంచారం లేకపోవడం…

పాతబస్తీ ప్రాంతంలో ఉదయం సహజంగానే జన సంచారం తక్కువగా ఉంటుంది.

ఆదివారం సెలవు కావడంతో ఎవరూ అక్కడికి రాలేదు. జాహెద్, ఇబ్రహీం వంటి కొందరు స్థానికులు నమాజుకు వెళ్లి, టీ తాగేందుకు అటుగా వెళుతూ మంటలు, అరుపులు గమనించి అక్కడికి వెళ్లామని చెబుతున్నారు.

దీనికితోడు మంటలు అంటుకున్న ప్రదేశం కూడా లోపలికి ఉంటుంది. అవి పెద్దగా అయ్యే వరకు ఎవరూ గమనించలేదని అధికారులు భావిస్తున్నారు.

దీనివల్ల అగ్నిమాపక శాఖకు సమాచారం అందేసరికే మంటలు పూర్తిగా వ్యాపించాయి. దట్టమైన పొగ ఆ ఇంటిని కమ్మేసింది.

మొదటి అంతస్తు

5. టెర్రస్ లేదా రెండో అంతస్తుకు వెళ్లలేకపోవడం…

మొదటి అంతస్తు నుంచి రెండో అంతస్తుకు లేదా టెర్రస్ పైకి చేరుకుని ఉంటే పరిస్థితి వేరేలా ఉండేది.

పొగ తీవ్రత రెండో అంతస్తు లేదా టెర్రస్ పైకి అంత ఎక్కువగా ఉండేంది కాదని ఫైర్ మెన్ ఒకరు చెప్పారు.

”పొగ తీవ్రత మొదటి అంతస్తుపైనే ఎక్కుగా కనిపించింది. మేం లోనికి వెళ్లినప్పుడు మెట్ల మార్గం, మొదటి అంతస్తు గదుల బయట పూర్తిగా పొగచూరి కనిపించాయి. మంటల తీవ్రత కూడా మొదటి అంతస్తు బయట ప్రదేశంపై ఎక్కువగా ఉంది.

గదుల లోపల వస్తువులు పెద్దగా కాలిపోయిన దాఖలాలు కనిపించలేదు. మంచాలు, సోఫాలు యథాతథంగా ఉన్నాయి” అని ఫైర్‌మెన్ ఒకరు బీబీసీతో చెప్పారు.

నిద్రలోంచి లేచి ఎలాగోలా రెండో అంతస్తు లేదా టెర్రస్ పైకి చేరుకుని ఉంటే ఫైర్ సిబ్బంది వచ్చేసరికి ప్రాణాపాయ స్థితికి చేరుకుని ఉండేవారు కాదని మరొక ఫైర్ మెన్ అభిప్రాయపడ్డారు.

చనిపోయిన వారెవరికీ కాలిన గాయాలు లేవని అధికారులు చెబుతున్నారు.

పోలీసులు

6. చుట్టూ భవనాల మధ్య ఇరుకైన ప్రదేశం…

ప్రమాదం జరిగిన భవనం చుట్టూ అనేక భవనాలు, అవి చాలా ఇరుకుగా ఉన్నాయి.

అగ్ని ప్రమాదం జరిగితే అదే భవనంపై అంతస్తులకు మంటలు, పొగ దట్టంగా వ్యాపించే వీలుందే తప్ప బయట వాతావరణంలోకి వెళ్లే వీల్లేకుండా ఉంది.

దీనివల్ల భవనం లోపలే పొగ కమ్మేసిందని అధికారులు భావిస్తున్నారు.

గుల్జార్ హౌస్

7. పాతకాలపు భవనం..

ప్రహ్లాద్ కుటుంబం చాలా ఏళ్లుగా అక్కడే నివాసం ఉంటోంది.

” వాళ్లంతా 125 ఏళ్లుగా ఇక్కడ ఉంటున్నారు. ప్రస్తుతం ఆ కుటుంబంలో ఇద్దరే మిగిలారు” అని హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ చెప్పారు.

వాస్తవానికి ఆ ప్రాంతమంతా కమర్షియల్ కేటగిరీ కింద కనిపిస్తుంటుంది. చార్మినార్ నుంచి కేవలం 100-15౦ మీటర్ల దూరంలోనే ఘటన ప్రదేశం ఉంటుంది. ఇక్కడ వ్యాపార సముదాయాలు ఎక్కువగా ఉండటంతో కమర్షియల్ ప్రదేశంగా ఉంది. ఘటన జరిగిన సమయంలో దుకాణాలన్నీ మూసివేసి ఉన్నాయి.

అయితే, ఇక్కడ నివాసాలు ఎన్నో దశాబ్దాలుగా ఉన్నట్లుగా అధికారులు చెబుతున్నారు.

”నిజాం సమయం నుంచి ఇక్కడ నివాసాలు ఉన్నాయి. అవే కంటిన్యూ అవుతున్నాయి. అంతే తప్ప కొత్తగా వచ్చిన నివాస భవనాలు కాదు” అని నాగిరెడ్డి మీడియాకు చెప్పారు. అక్కడ ఫైర్ లేదా స్మోక్ అలారం లేదని ఆయన వెల్లడించారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)