Home జాతీయ national telgu హెర్నియా అంటే ఏమిటి? జిమ్‌‌కు వెళ్లేవాళ్లకు ఈ ముప్పు ఎక్కువా?

హెర్నియా అంటే ఏమిటి? జిమ్‌‌కు వెళ్లేవాళ్లకు ఈ ముప్పు ఎక్కువా?

4
0

SOURCE :- BBC NEWS

పుట్టుకతో వచ్చే హెర్నియా

ఫొటో సోర్స్, Getty Images

హెర్నియా వ్యాధి గురించి చాలా మంది వినే ఉంటారు.

మన శరీరంలోని ఒక అవయవం బలహీనమైన కండరం లేదా కణజాల పొరలోంచి బయటకు ఉబ్బి కనిపించడాన్ని హెర్నియా అంటారు.

సాధారణంగా హెర్నియాలు ఛాతీ, తొడలు, పిరుదుల ప్రాంతంలో కనిపిస్తాయి.

హెర్నియా లక్షణాలు అన్నిసార్లూ తీవ్రంగా కనిపించకపోవచ్చు, ఒక్కోసారి అసలు లక్షణాలు బయటపడకపోవచ్చు.

అయితే, పొట్ట లేదా తొడలపై వాపు ఉన్నట్టుగా కనిపిస్తుంది.

పడుకున్నప్పుడు ఈ వాపు లోపలికి వెళుతుంది. దగ్గినప్పుడు లేదా ఎక్కువగా బరువులెత్తడం వంటి పనులు చేసినప్పుడు ఇది కనిపిస్తుంది.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌

హెర్నియాకు కారణాలేంటి ? ఇది ఎన్ని రకాలు ?

హెర్నియాకి అనేక కారణాలున్నాయి. కొందరికి పుట్టుకతోనే హెర్నియా సమస్య వస్తుంది.

కొన్ని కేసుల్లో బలహీనమైన ఉదర కండరాల వల్ల , బరువులు ఎత్తడం వల్ల పొట్టపై పడే ఒత్తిడి కారణంగా, ఊబకాయం , జన్యుపరమైన అంశాలు, కండరాల ఒత్తిడి కారణంగా కూడా వచ్చే అవకాశం ఉంటుందని కోల్‌కతాలోని మణిపాల్ ఆసుపత్రి వైద్యుడు శుభాయు బెనర్జీ ‘బీబీసీ’తో చెప్పారు.

డాక్టర్ బెనర్జీ లాప్రోస్కోపీ, ఆంకాలజీ శస్త్రచికిత్సల నిపుణుడు.

గర్భంతో ఉన్నప్పుడు పొత్తి కడుపుపై కలిగే ఒత్తిడి వల్ల కూడా ఈ సమస్య రావచ్చని.. కొన్ని రకాల హెర్నియాలలో పైకి ఎలాంటి లక్షణాలు కనిపించకపోయినా చాలా అసౌకర్యంగా, నొప్పిగా అనిపిస్తాయని డాక్టర్ శుభాయు బెనర్జీ చెప్పారు.

కొందరిలో తీవ్రమైన నొప్పితో పాటు వాంతి వచ్చినట్లు అనిపించడం వంటి లక్షణాలుంటాయన్నారు.

తొడపై రెండు రకాల హెర్నియాలు కనిపిస్తాయి. ఇంగ్యూనల్, ఫెమోరల్.

అంబిలికల్ హెర్నియా నాభి దగ్గర కడుపులో ఏర్పడుతుంది. ఈ రకం హెర్నియా శిశువు పుట్టినప్పటి నుంచే ఉండే అవకాశం ఉంది. లేదా పెద్దవాళ్లు ఆ శిశువు పొట్టపై ఒత్తిడి కలిగించినప్పుడు ఏర్పడే అవకాశం కూడా ఉంది.

హెర్నియా

ఫొటో సోర్స్, Getty Images

హెర్నియా లక్షణాలు

హెర్నియా లక్షణాలు మారుతూ ఉంటాయి.

కోల్‌కతాలోని సాల్ట్ లేక్‌లోని మణిపాల్ ఆసుపత్రిలో పనిచేస్తున్న డాక్టర్ శుభాయు బెనర్జీ ఈ లక్షణాల గురించి బీబీసీకి చెప్పారు.

‘‘హెర్నియా లక్షణాలు అది ఏ రకం, శరీరంపై ఎక్కడ ఉంది అన్న దానిపై ఆధారపడి ఉంటాయి’’ అన్నారు డాక్టర్ బెనర్జీ.

పడుకున్నప్పుడు హెర్నియా వాపు లోపలికి వెళ్తుందా, నొప్పి ఏ స్థాయిలో ఉంది? అసౌకర్యంగా ఉందా అనే దాన్నిబట్టి వాటి తీవ్రత మారుతుందని తెలిపారు.

‘‘హెర్నియా వల్ల తొడల దగ్గర వాపు లేదా బిగుతుగా కూడా అనిపించవచ్చు. వ్యాధి కొంచెం ముదిరిన దశకు చేరుకుంటే, వికారంగా ఉండి వాంతులు కూడా అవుతాయి’’ అని చెప్పారు.

హెర్నియాతో బాధపడేవారు వైద్యుడిని సంప్రదించి రోగ నిర్ధరణ చేయించుకోవడం అవసరం.. ఏమాత్రం అనుమానం ఉన్నా వెంటనే వైద్యుడిని కలవడం చాలా ముఖ్యం అన్నారు డాక్టర్ శుభాయు బెనర్జీ.

వ్యాయామం

ఫొటో సోర్స్, Getty Images

హెర్నియా – వెయిట్ లిఫ్టింగ్ వ్యాయామాలు

వెయిట్ లిఫ్టింగ్ చేసేవారు, వ్యాయామంలో భాగంగా బరువులు ఎత్తేవారు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. లేదంటే హెర్నియా సమస్యలు రావొచ్చని వైద్యులు చెప్తున్నారు.

కండరాలు చాలా బలహీనంగా ఉన్నవారికి కానీ, అప్పటికే ఏదో ఒక ఆరోగ్య సమస్య ఉన్నవారికి హెర్నియా వచ్చే ప్రమాదం ఉంది.

అలాంటి వారు బరువైన వస్తువులను ఎత్తడం లేదా పొట్టపై ఎక్కువ ఒత్తిడి కలగడం వల్ల హెర్నియా రావొచ్చని వైద్యులు హెచ్చరిస్తున్నారు.

వెయిట్ లిఫ్టింగ్

ఫొటో సోర్స్, Getty Images

వెయిట్ లిఫ్టింగ్ వ్యాయామాలు చేసేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?

బరువులెత్తుతూ వ్యాయామం చేసేటప్పుడు జాగ్రత్తలు అవసరమని డాక్టర్ శుభాయు బెనర్జీ చెప్పారు.

నిపుణులైన జిమ్ ట్రైనర్ల పర్యవేక్షణలో బరువులెత్తడం మంచిదన్నారు.

బరువులెత్తేటప్పుడు శరీరం కదలకుండా చూసుకోవాలని.. ఒకేసారి ఎక్కువ బరువుతో వ్యాయామం చేయకుండా, క్రమంగా బరువు పెంచుకుంటూ వెళ్లాలని డాక్టర్ బెనర్జీ అన్నారు.

‘‘వెయిట్ లిఫ్టింగ్ చేసేముందు కనీసం ఐదు నుంచి పది నిమిషాల వార్మప్ చేయాలి. ఆ తరువాత, కొన్ని కార్డియో ఎక్సర్‌సైజ్‌లు, స్ట్రెచింగ్ వ్యాయామాలు చేయండి. ఆ తరువాతే బరువులు ఎత్తండి’’ అని ఆయన సూచించారు.

‘‘వ్యాయామం చేస్తున్నప్పుడు శరీర స్థితిపై శ్రద్ధ వహించాలి, కదలికలు నెమ్మదిగా ఉండాలి. ఒకేసారి ఎక్కువ బరువు ఎత్తొద్దు. శిక్షకుడు చెప్పిన విధంగా వ్యాయామం తీవ్రతను పెంచండి లేదా తగ్గించండి. ఎక్సర్‌సైజ్ చేస్తున్నప్పుడు ట్రైనర్ సూచించినట్టుగా శ్వాస తీసుకోండి. సరైన మొత్తంలో నీళ్లు కూడా తాగాలి. ఒకవేళ మీకు నొప్పి, అసౌకర్యం అనిపిస్తే వెంటనే విశ్రాంతి తీసుకోండి” అని ఆయన చెప్పారు.

ముంబయిలోని లీలావతి ఆసుపత్రిలో పనిచేసే డాక్టర్ నరేంద్ర నికమ్ ‘బీబీసీ’తో మాట్లాడుతూ జిమ్‌లో వ్యాయామం చేసే యువత కోసం కొన్ని సూచనలు చేశారు.

ప్రతిరోజూ ఎక్సర్‌సైజ్ చేసేముందు వార్మప్ చేయాలని డాక్టర్ నికమ్ కూడా సూచిస్తున్నారు.

ఎక్కువ బరువు ఎత్తొద్దని, నొప్పి అనిపిస్తే వెంటనే వ్యాయామం చేయడం ఆపేయాలని అన్నారు.

‘‘ఎక్కువ బరువులు ఎత్తుతూ చేసే వ్యాయామాలు హెర్నియాల ప్రమాదాన్ని పెంచుతాయి. భారీ బరువులు ఎత్తడం వల్ల ఉదరం గోడపై ఒత్తిడి పెరిగి కండరాలు చీలిపోయి హెర్నియాలు ఏర్పడతాయి’’ అన్నారు డాక్టర్ నరేంద్ర.

జిమ్‌కు వెళ్లే 25 నుంచి 35 ఏళ్ల వయసువారిలో హెర్నియా కేసులు పెరుగుతున్నట్లు నివేదికలు చెప్తున్నాయని, చికిత్స చేయించుకోకపోతే రక్తస్రావం, ఇన్ఫెక్షన్, రక్తం గడ్డకట్టడం వంటి సమస్యలు వచ్చే ప్రమాదం ఉందని ఆయన అన్నారు.

బరువులు ఎత్తడానికి ప్రత్యామ్నాయంగా యోగా, నడక, ఈత కొట్టడం వంటివి ప్రయత్నించొచ్చని సూచించారు.

ఆహారం,  డైట్

ఫొటో సోర్స్, Getty Images

హెర్నియా రోగులు ఎలాంటి ఆహారం తీసుకోవాలి?

హెర్నియా రాకుండా ఉండాలంటే ఆహార మార్పులు అవసరం.

బరువును అదుపులో ఉంచుకోవడం వల్ల హెర్నియా ప్రమాదాన్ని నివారించవచ్చని వైద్యులు చెప్తున్నారు.

ముంబయిలోని జైనోవా షల్బీ హాస్పిటల్‌లో పనిచేస్తున్న డైటీషియన్ జినాల్ పటేల్‌.. హెర్నియాతో బాధపడుతున్నవారు ఎలాంటి ఆహారం తినాలో బీబీసీతో చెప్పారు.

“హెర్నియా ఉన్నవారు మద్యం, స్మోకింగ్ మానేయాలి. ఇవి కడుపులోని కణజాలాలను బలహీనపరుస్తాయి. హెర్నియా ఉన్నవారు ఎక్కువ పండ్లు, తృణధాన్యాలు, గింజలు, ఫైబర్ అధికంగా ఉండే ఆహారాలు తినాలి’’ అన్నారు జినాల్.

ఒకేసారి ఎక్కవమొత్తంలో తినడం కన్నా, చిన్న చిన్న మొత్తాల్లో తినడం మంచిదని సూచించారు.

‘‘హెర్నియా ఉన్నవారు కారంగా ఉండే, ఎసిడిటీ కలిగించే ఆహార పదార్థాలకు దూరంగా ఉండాలి. నీళ్లు ఎక్కువగా త్రాగాలి. మలబద్దకం రాకుండా జాగ్రత్త తీసుకుని, జీర్ణక్రియను మెరుగుపరుచుకోవడంపై శ్రద్ధ వహించాలి’’ అని డైటీషియన్ జినాల్ పటేల్‌ సూచించారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)