Home జాతీయ national telgu హుర్రెమ్: ఓటొమన్ సుల్తాన్‌‌ను పెళ్లాడిన బానిస, ఆమె ఎవరనేది ఇప్పటికీ పెద్ద మిస్టరీ

హుర్రెమ్: ఓటొమన్ సుల్తాన్‌‌ను పెళ్లాడిన బానిస, ఆమె ఎవరనేది ఇప్పటికీ పెద్ద మిస్టరీ

3
0

SOURCE :- BBC NEWS

హుర్రెమ్ సుల్తాన్

ఫొటో సోర్స్, Michael Bowles/Getty Images

ఓటొమన్ సామ్రాజ్యంలో అత్యంత ప్రభావవంతమైన మహిళలలో హుర్రెమ్ సుల్తాన్ ఒకరు. ఆమె అత్యంత శక్తిమంతమైన ఓటొమన్ పాలకుడు ‘సులేమాన్ ది మాగ్నిఫిసెంట్’ భార్య. ఆమెను రోక్సెలానా అని కూడా పిలుస్తారు.

హుర్రెమ్ సుల్తాన్ 1558లో మరణించారు. హుర్రెమ్ చనిపోయి వందల ఏళ్లయినా ఆమె కథ ప్రజలను ఆకర్షిస్తూనే ఉంది.

హుర్రెమ్ ప్రయాణం సాధారణమైనది కాదు. బానిసత్వ జీవితం నుంచి సామ్రాజ్యంలో ఒక శక్తిగా ఎదిగారు. ఆమె కేవలం సుల్తాన్ భార్య మాత్రమే కాదు, 16వ శతాబ్దంలో ఓటొమన్ సామ్రాజ్యం రాజకీయాలు, పాలన రూపురేఖలను మార్చిన మహిళ కూడా.

14వ శతాబ్దం నుంచి 20వ శతాబ్దం ప్రారంభం వరకు ఓటొమన్ సామ్రాజ్యం కింద ప్రపంచంలోని చాలా ప్రాంతాలుండేవి. దీని రాజ్యం ఆగ్నేయ ఐరోపా, పశ్చిమ ఆసియా, ఉత్తర ఆఫ్రికాలకు విస్తరించింది. చరిత్రలో అతిపెద్ద, దీర్ఘకాలిక సామ్రాజ్యాలలో ఒకటిగా ‘ఓటొమన్’ను పరిగణిస్తుంటారు.

హుర్రెమ్ సుల్తాన్ ఎదుగుదలతోనే ఓటొమన్ చరిత్రలో రాణులకు అధికారం, రాజ మహిళలు నిర్ణయాలు తీసుకోవడం ప్రారంభమైందని చాలామంది చరిత్రకారులు నమ్ముతారు.

సుల్తాన్ రాజభవనంలో మహిళల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన విభాగాన్ని ‘హరమ్’ అని పిలిచేవారు. సుల్తాన్ భార్యలు, మహిళా బంధువులు, పనిమనిషులు ఇక్కడ నివసించారు. అంతఃపురంలో హుర్రెమ్ బస, అక్కడి నుంచి ఆమె తదుపరి ప్రయాణాలు చరిత్రలో నమోదయ్యాయి.

అయినప్పటికీ, ఆమె నిజమైన గుర్తింపు మిస్టరీగానే ఉంది. కొందరు ఆమె నేటి యుక్రెయిన్ నుంచి బందీగా వచ్చారని భావిస్తుంటారు. ఆమె ఒక సంప్రదాయ క్రైస్తవ మతాధికారి కూతురని మరికొందరు అంటారు. మరొకరు, హుర్రెమ్ ఇటాలియన్ ఉన్నత కుటుంబానికి చెందినవారని, సముద్రపు దొంగలు ఆమెను కిడ్నాప్ చేసి, తీసుకొచ్చారని చెబుతారు.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
ఓటొమన్ సామ్రాజ్యం

ఫొటో సోర్స్, Tim’s Productions

బానిసత్వం నుంచి..

హుర్రెమ్ సుల్తాన్ 1500లో రుథేనియా అనే ప్రాంతంలో జన్మించారని చాలామంది చరిత్రకారులు నమ్ముతారు. ఈ ప్రాంతం నేటి యుక్రెయిన్, పోలాండ్, బెలారస్ ప్రాంతాలలో విస్తరించి ఉంది.

హుర్రెమ్ అసలు పేరు విషయంలో కచ్చితమైన ఆధారాలు లేవు. కొంతమంది యుక్రెయిన్లు ఆమెను అలెగ్జాండ్రా లిసోవ్‌స్కా లేదా అనస్తాసియా అని పిలుస్తారు. అంతేకాదు లా రోసా, రోసన్నా, రోక్సోలేన్, రోక్సానా పేర్లతో పాటు పశ్చిమ ఐరోపాలో రోక్సెలానా వంటి పేరుతో కూడా పిలిచేవారని కొందరు చెబుతారు.

అయితే, ఓటొమన్ సామ్రాజ్యం అధికారిక పత్రాలు ఆమెను హసేకి హుర్రెమ్ సుల్తాన్ అని సూచిస్తాయి. హుర్రెమ్ అంటే పర్షియన్ భాషలో ఉల్లాసంగా ఉండటం, హసేకి అనేది సుల్తాన్ బిడ్డ తల్లికి ఇచ్చే గౌరవ బిరుదు.

రోహటిన్ అనే పట్టణం నుంచి క్రిమియన్ టాటర్ దొంగలు హుర్రెమ్‌ను కిడ్నాప్ చేశారని కొన్నిచారిత్రక ఆధారాలున్నాయని తుర్కియే ప్రొఫెసర్ ఫెరిడున్ ఎమెచెన్ చెప్పారు. రోహటిన్ ఆ సమయంలో పోలాండ్‌లో భాగంగా ఉండేది, ఇప్పుడు పశ్చిమ యుక్రెయిన్‌లో ఉంది.

మరో ప్రొఫెసర్ జైనాబ్ తారిమ్ ప్రకారం .. హుర్రెమ్‌ను బానిసగా అమ్మేశారు. యుక్తవయస్సులో ఉండగా ఆమెను ఓటొమన్ సామ్రాజ్యానికి తీసుకువచ్చి అప్పటి ప్రిన్స్ సులేమాన్ తల్లికి బహుమతిగా ఇచ్చారు.

చరిత్రకారుల ప్రకారం, హుర్రెమ్ 1520లో అంతఃపురంలో భాగమయ్యారు. ఎందుకంటే మరుసటి సంవత్సరం సులేమాన్‌, హుర్రెమ్‌కు కొడుకు జన్మించారు. అతని పేరు మెహ్మెట్.

అనంతరం, శతాబ్దాల సంప్రదాయాన్ని బద్దలు కొడుతూ.. హుర్రెమ్‌ను వివాహం చేసుకున్నారు సులేమాన్. ఇది మొత్తం రాజ సభను దిగ్భ్రాంతికి గురిచేసిన చర్య. అంతేకాదు, హుర్రెమ్ హోదానూ పెంచింది.

అంతకుముందు, ఏ ఓటొమన్ సుల్తాన్ కూడా తన పనిమనిషిని వివాహం చేసుకోలేదు.

మెరీమ్ ఉజెర్లీ

ఫొటో సోర్స్, Tim’s Productions

ఇటలీ మూలాలు?

హుర్రెమ్ రుథేనియాకు చెందినవారని చాలామంది చరిత్రకారులు అంగీకరిస్తున్నప్పటికీ, ఆమె జననం, కుటుంబం గురించి కొన్ని భిన్నమైన, ఆశ్చర్యకరమైన వాదనలున్నాయి. పరిశోధకుడు డాక్టర్ రినాల్డో మర్మారా కూడా అలాంటిదే ఒకటి చెప్పారు.

హుర్రెమ్ ఇటలీలోని ఒక ధనిక కుటుంబానికి చెందినవారని పేర్కొన్న వాటికన్ పాత పత్రాలలో ఒక దానిని కనుగొన్నానని రినాల్డో చెప్పారు. ఆమె పేరు మార్గెరిటా అని, సియెనాలోని మార్సిలి కుటుంబానికి చెందినవారని తెలిపారు.

ఈ పత్రాల ప్రకారం.. హుర్రెమ్, ఆమె సోదరుడిని సముద్రపు దొంగలు బంధించి, ఓటొమన్ కోర్టులో బానిసలుగా విక్రయించారు. హుర్రెమ్ వారసుడు సుల్తాన్ మెహ్మెట్ IV, పోప్ అలెగ్జాండర్ VIIల మధ్య సంబంధం ఉందని కూడా ఈ పత్రం చెబుతుందని రినాల్డో పేర్కొన్నారు.

అయితే, చరిత్రకారులు రినాల్డో వాదనపై సందేహాలు వ్యక్తం చేశారు. ఈ వాదనను నిరూపించడానికి ఇంకా ఆధారాలు అవసరమని ప్రొఫెసర్ జైనాబ్ తారిమ్ అభిప్రాయపడ్డారు. ఆ కాలంలోని వెనీషియన్ రాయబారులకు అన్ని రకాల కోర్టు వార్తలను తెలుసుకునే అవకాశం ఉందని, వారి రికార్డులు చాలా కచ్చితమైనవని జైనాబ్ అభిప్రాయం. కానీ, ఆ పత్రాలలో హుర్రెమ్ ఇటలీకి చెందినవారని ప్రస్తావించలేదని ఆమె గుర్తుచేశారు.

హుర్రెమ్ సుల్తాన్

ఫొటో సోర్స్, Rinaldo Marmara

‘రష్యన్ మాంత్రికురాలు’

హుర్రెమ్ సుల్తాన్‌ను వేర్వేరు సమయాల్లో విభిన్న పేర్లతో పిలిచేవారు.

ఒట్టోమన్ కాలం నాటి పత్రాలు, కవితలలో ఆమెను “రష్యన్ మాంత్రికురాలు” అని అభివర్ణించారు. హుర్రెమ్ ప్రత్యర్థులు ఆమెను అలా పిలిచేవారు. ముఖ్యంగా సుల్తాన్ సులేమాన్ పెద్ద కుమారుడు ప్రిన్స్ ముస్తఫా మరణించినపుడు ఆ పేరుతో పిలిచారు.

సులేమాన్ రెండో భార్య కుమారుడు ముస్తఫా. ఆయనను ఓటొమన్ సామ్రాజ్యం తదుపరి పాలకుడిగా భావించారు. హుర్రెమ్ తన కొడుకును సుల్తాన్‌గా చేయడం కోసం ముస్తఫా హత్యకు కుట్ర పన్నారని చాలామంది ఆరోపణ.

అయితే, ఆ సమయంలో ‘రష్యా’ అనే పదం నేటి రష్యన్ ప్రజలను సూచించలేదని ప్రొఫెసర్ అమెచెన్ స్పష్టం చేశారు. ఆ సమయంలో ‘రష్యన్లు’ అనే పదాన్ని నేటి యుక్రెయిన్ లేదా బెలారస్ వంటి ఉత్తరాన ఉన్న ప్రాంతాల ప్రజలను వివరించడానికి ఉపయోగించేవారని చెప్పారు.

“16వ శతాబ్దంలో యుక్రెయిన్ ప్రజలు నివసించే పోలాండ్ ప్రాంతాలను ‘రుస్కే’ ప్రావిన్స్ అని పిలిచేవారు, రోహటిన్ కూడా అక్కడే ఉండేది. ఆ సమయంలో యుక్రెయిన్లను ‘రుసిన్లు’ అని పిలిచేవారు” అని బీబీసీ యుక్రెయిన్ జర్నలిస్ట్ విటాలీ చెర్వోనెంకో అన్నారు.

హుర్రెమ్ సుల్తాన్ ఫోటో

ఫొటో సోర్స్, Pictures From History/Universal Images Group

హుర్రెమ్ సుల్తాన్ గుర్తింపు ఒక రాజకీయ సమస్యగా కూడా మారింది. ముఖ్యంగా యుక్రెయిన్‌లో ఆమెను గొప్ప మహిళగా పరిగణిస్తారు. హుర్రెమ్ గౌరవార్థం ఆమె జన్మస్థలంగా భావిస్తున్న రోహటిన్‌లో విగ్రహాలు పెట్టారు. మారియుపోల్ నగరంలో ఆమె పేరుతో మసీదు కట్టారు.

2019లో తుర్కియేలోని యుక్రెయిన్ రాయబార కార్యాలయం విజ్ఞప్తి మేరకు, ఇస్తాంబుల్‌లోని సులేమానియే మసీదులోని హుర్రెమ్ సమాధిపై ఉన్న ఫలకం నుంచి ‘రష్యన్ మూలం’ అనే ప్రస్తావన తొలగించారు.

ఫలకంపై ఆమె గుర్తింపును యుక్రెయిన్ మహిళగా నమోదు చేశారు. హుర్రెమ్ కథ ఇప్పటికీ సజీవంగా ఉందని, ఆమె గుర్తింపు చరిత్ర, రాజకీయాల్లో ముఖ్యమైన పాత్ర పోషిస్తుందని ఇది సూచిస్తుంది.

సులేమానియే మసీదు

హుర్రెమ్ ఎక్కడ చనిపోయారు?

హుర్రెమ్ ప్రభావం అంతఃపురానికే పరిమితం కాలేదు. ఆమె పనులను ప్రజలు ఇప్పటికీ గుర్తుంచుకుంటారు. ఆమె ఇస్తాంబుల్, జెరూసలేంలో (అప్పుడు ఓటొమన్ సామ్రాజ్యంలో భాగంగా ఉండేవి) మసీదులు, ధార్మిక సంస్థలను నిర్మించారు. ఇస్తాంబుల్‌లోని హసేకి ప్రాంతం ఇప్పటికీ ఆమె పేరుతోనే ఉంది.

చారిత్రక రికార్డుల ప్రకారం, హుర్రెమ్ సుల్తాన్ 1558 ఏప్రిల్ 15న ఇస్తాంబుల్‌లో మరణించారు. ఆమెను సులేమానియే మసీదులో ఖననం చేశారు. అక్కడే ఆమె కోసం ప్రత్యేక సమాధిని నిర్మించారు.

హుర్రెమ్ మరణించినప్పటికీ, ఆమెకు సంబంధించిన కథలు, రహస్యాలు నేటికీ ముగియలేదు. ప్రపంచ చరిత్రలో ఆమె పేరు ప్రత్యేక ప్రాముఖ్యతను సంపాదించుకుంది.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)