Home జాతీయ national telgu హీరో మాధవన్: దక్షిణాది చరిత్ర గురించి ఏమన్నారు, ఏడో తరగతి హిస్టరీ నుంచి దిల్లీ పాలకుల...

హీరో మాధవన్: దక్షిణాది చరిత్ర గురించి ఏమన్నారు, ఏడో తరగతి హిస్టరీ నుంచి దిల్లీ పాలకుల పాఠాల తొలగింపుపై విమర్శలేంటి?

2
0

SOURCE :- BBC NEWS

ఎన్సీఈఆర్టీ

ఫొటో సోర్స్, NCERT/GettyImages

ఎన్‌సీఈఆర్‌టీ (నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రీసర్చ్ అండ్ ట్రైనింగ్) కొత్తగా విడుదల చేసిన ఏడో తరగతి సోషల్ సైన్స్ పుస్తకంలో మొఘలులు, దిల్లీ సుల్తానుల పాలన గురించి ప్రస్తావించలేదు.

గతంలో ఈ పుస్తకంలో ఈ రెండింటి గురించి సంక్షిప్తంగా పాఠాలు ఉండేవి.

అయితే 2025-26 కోసం కొత్తగా రూపొందించిన సోషల్ సైన్స్ పుస్తకంలో ఈ పాఠాలను తొలగించారు.

పాఠశాల విద్య కోసం జాతీయ విద్యా విధానం, జాతీయ పాఠ్య ప్రణాళికలో భాగంగా ఎన్‌సీఈఆర్‌టీ కొత్త పుస్తకాలను సిద్ధం చేసింది.

కొన్ని తరగతులకు సంబంధించిన పుస్తకాలు ఇంకా రావల్సి ఉంది.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
ఎన్‌‌సీఈఆర్‌టీ, సీబీఎస్‌ఈ, ఏడో తరగతి, మొఘలులు

ఫొటో సోర్స్, NCERT

పుస్తకాల నుంచి మొఘల్, దిల్లీ సుల్తానుల పాలనా కాలం తొలగింపు

ఏడో తరగతి కొత్త సోషల్ పుస్తకంలో ఐదు అంశాల మీద 12 చాప్టర్లు ఉన్నాయి.

ఇందులో మొదటి అంశం ఇండియా అండ్ ద వరల్డ్: ల్యాండ్ అండ్ ది పీపుల్. ఈ చాప్టర్‌లో మూడు పాఠాలు ఉన్నాయి. జియోగ్రాఫికల్ డైవర్సిటీ ఆఫ్ ఇండియా ( భారతదేశ భౌగోళిక వైవిధ్యం), అండర్ స్టాండింగ్ ది వెదర్ (వాతావరణాన్ని అర్ధం చేసుకోవడం), క్లైమేట్స్ ఆఫ్ ఇండియా ( భారతదేశపు వాతావరణ పరిస్థితులు) అనేవి ఈ మూడు.

రెండో పాఠం ‘టాపెస్ట్రీ ఆఫ్‌ ది పాస్ట్’- ఈ అధ్యాయంలో చరిత్ర వివరాలు ఉన్నాయి.

ఇందులో – న్యూ బిగినింగ్స్: సిటీస్ అండ్ స్టేట్స్( కొత్త అధ్యాయం: నగరాలు, రాజ్యాలు), ది రైజ్ ఆఫ్ ఎంపైర్స్ (రాజ్యాల అవతరణ), ది ఏజ్ ఆఫ్ రీఆర్గనైజేషన్ (పునరేకీకరణ యుగం), ది గుప్తా ఎరా: యాన్ ఏజ్ ఆఫ్ టైర్‌లెస్ క్రియేటివిటీ ( గుప్తుల కాలం: అవిశ్రాంత సృజనాత్మక యుగం) తదితర పాఠాలున్నాయి.

వీటి తర్వాత అవర్ కల్చరల్ హెరిటేజ్ అండ్ నాలెడ్జ్ ట్రెడిషన్స్, గవర్నెన్స్ అండ్ డెమొక్రసీ, ఎకనామిక్ లైఫ్ అరౌండ్ అజ్ అనే అధ్యాయాలు ఉన్నాయి.

ఈ ఎన్‌సీఈఆర్‌టీ పుస్తకం నుంచి మొఘలులు, వారి పాలనా కాలం గురించిన పాఠ్యాంశాలు తొలగించారు. దక్షిణాది పాలకుల గురించిన పాఠాలను చేర్చారు.

ఇవేకాకుండా, ఈ టెక్స్ట్ బుక్‌లో మౌర్య సామ్రాజ్య వివరాలను పొందుపరిచారు. అందులో చంద్రగుప్త మౌర్యుడి ఎదుగుదల, అశోకుడు, ఆయన పాలనా కాలంలో ప్రజల జీవనశైలిని వివరించారు.

‘పునరేకీకరణ యుగం’ అనే చాప్టర్‌లో శృంగ, శాతవాహన, యెది, చోళ, చేర, పాండ్య, కుషాణ రాజ వంశాల ప్రస్తావన ఉంది. గుప్తుల గురించి ఒక అధ్యాయమే ఉంది.

పుస్తకంలో మూడో టాపిక్ – అవర్ కల్చరల్ హెరిటేజ్ అండ్ నాలెడ్జ్ ట్రెడిషన్స్. ఇందులో ఒక చాప్టర్‌లో భూమి ఎలా పవిత్రమైనది అనే అధ్యాయం ఉంది.

ఈ అధ్యాయం పుణ్యక్షేత్రాల ప్రాధాన్యత, తీర్థయాత్రలు, పవిత్ర స్థలాల గురించి బోధిస్తుంది.

ఇందులో ఒక పార్ట్‌లో కుంభమేళా మీద పాఠం ఉంది. 2025లో జరిగిన కుంభమేళాకు 66 కోట్ల మంది హాజరయ్యారని ఈ పాఠంలో చెప్పారు.

ఎన్‌సీఈఆర్‌టీ గతంలో రూపొందించిన ఏడో తరగతి సోషల్ సైన్స్ పుస్తకంలో దిల్లీ పాలకుల గురించి సవివరమైన పాఠాలు ఉన్నాయి.

అందులో ఖిల్జీ, తుగ్లక్ వంశాల పాలనా విధానంపై ప్రస్తావన ఉంది. మొఘలుల పాలన మీద ఒక పాఠం ఉంది.

అందులో మొఘల్ రాజవంశం, చరిత్ర, వారి సైనిక కార్యక్రమాల గురించి పూర్తిగా వివరించారు.

అయితే, ఈ పాఠాలు ఏడో తరగతి టెక్స్ట్ బుక్‌లోని మరో భాగంలో ఉండేవి. ఇప్పటివరకు ఈ సాంఘిక శాస్త్ర పుస్తకంలోని మొదటి భాగం మాత్రమే విడుదలైంది.

ఇతర కాలాలకు సంబంధించిన మెటీరియల్ త్వరలో వస్తుందని ఎన్‌సీఈఆర్‌టీ తెలిపింది.

ఎన్‌‌సీఈఆర్‌టీ, సీబీఎస్‌ఈ, ఏడో తరగతి, మొఘలులు

ఫొటో సోర్స్, ANI

పుస్తకాల్లో మార్పు గురించి ప్రభుత్వం ఏమంటోంది?

పుస్తకంలో రెండో భాగం కొన్ని నెలల్లో వస్తుందని అధికారులు చెప్పినట్లు కొన్ని కథనాలు వెలువడ్డాయి.

అయితే రెండో భాగంలో మొఘలులు, దిల్లీ సుల్తానుల మీద పాఠాలు ఉంటాయా లేదా అనే విషయం గురించి ఎన్‌సీఈఆర్‌టీ ఏమీ చెప్పలేదు.

“పుస్తకాలన్నీ ఇంకా బయటకు రాలేదు. ఏయే పాఠ్యాంశాలను తొలగించారు, వేటి గురించి ప్రస్తావించ లేదు అనేది పుస్తకాలు విడుదలైనప్పుడు మాత్రమే తెలుస్తుంది” అని ఉత్కళ్ యూనివర్సిటీ మాజీ ప్రొఫెసర్ సంజయ్ ఆచార్య చెప్పారు.

ఎన్‌సీఈఆర్‌టీ పుస్తకాల్లో మొఘలుల చరిత్రకు సంబంధించిన పాఠాలను తొలగించడంపై కేంద్ర విద్యాశాఖ సహాయమంత్రి సుకాంత మజుందార్‌ను ప్రశ్నించినప్పుడు, మొఘలుల పాలనా కాలం గురించిన పాఠాలను తొలగించలేదని, రిపీట్ అయిన అంశాలను తీసివేశామని చెప్పారు.

“భారతీయ చరిత్రలో మొఘలుల పాలనా కాలం ముఖ్యమైనదే. కానీ మిగతా రాజవంశాల పాలనా కాలాలకు కూడా సమ ప్రాధాన్యత దక్కాలి కదా” అని ఆయన ఎన్డీటీవీతో అన్నారు.

చరిత్ర పుస్తకాల్లో మొఘల్ పాలకులకు ఎందుకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నారు, ఇతర సామ్రాజ్యాలను ఎందుకు విస్మరిస్తున్నారనే ప్రశ్న చాలాకాలంగా ఉంది.

ఎన్‌‌సీఈఆర్‌టీ, సీబీఎస్‌ఈ, ఏడో తరగతి, మొఘలులు

ఫొటో సోర్స్, Getty Images

నటుడు ఆర్.మాధవన్ ఏమన్నారు?

తాను చదివిన చరిత్ర పుస్తకాల్లో దక్షిణ భారతదేశ చరిత్రను నిర్లక్ష్యం చేశారని సినీ నటుడు ఆర్.మాధవన్ ఇటీవల వ్యాఖ్యానించారు. దక్షిణ భారతదేశ చరిత్రకు మరింత చోటు కల్పించాలని ఆయన కోరారు.

“ఇది చెబుతున్నందుకు నేను ఇబ్బందులు ఎదుర్కోవల్సి రావచ్చు. అయినా చెబుతా. నేను స్కూల్‌లో చరిత్ర చదువుకునే రోజుల్లో మొఘలుల మీద 8 చాప్టర్లు, హరప్పా, మొహంజోదారో నాగరికత మీద రెండు, బ్రిటిషర్ల పాలన, భారత స్వాతంత్ర్య ఉద్యమం గురించి నాలుగు చాప్టర్లు ఉండేవి. కానీ, దక్షిణ భారత రాజ్యాలైన చోళ, పాండ్య, పల్లవ, చేర వంశాల గురించి ఒక పాఠమే ఉండేది’’ అని మాధవన్ ఒక ఇంటర్వ్యూలో చెప్పారు.

చోళ రాజ్యవంశం 2400 ఏళ్లనాటిదని, మొఘలులు, బ్రిటిషర్ల పాలనా కాలం 800 ఏళ్ల నాటిదని మాధవన్ అన్నారు.

“చోళ రాజుల కాలంలో రోమ్‌కు సుగంధ ద్రవ్యాల రవాణా జరిగింది. సముద్ర రవాణాకు వాళ్లు మార్గం చూపించారు. చరిత్ర పుస్తకాల్లో దీని గురించి ప్రస్తావన ఎక్కడుంది? అంగ్‌కోర్‌వాట్‌లో ఆలయ నిర్మాణంతో పాటు శక్తివంతమైన నేవీ గురించిన ప్రస్తావన ఏది?” అంటూ మాధవన్ ప్రశ్నలు సంధించారు.

ఎన్‌‌సీఈఆర్‌టీ, సీబీఎస్‌ఈ, ఏడో తరగతి, మొఘలులు

ఫొటో సోర్స్, NCERT

తొలగింపు ప్రక్రియ 1998 నుంచే మొదలైందా?

2023 ప్రారంభంలో, ఎన్‌సీఈఆర్‌టీ పన్నెండో తరగతి చరిత్ర పుస్తకం నుంచి మొఘలులకు సంబంధించిన అధ్యాయాలను తొలగించింది.

‘థీమ్స్ ఆఫ్ ఇండియన్ హిస్టరీ’ పేరుతో మూడు భాగాలుగా ప్రచురించిన ఈ పుస్తకంలోని రెండొ భాగంలో ఉన్న ‘రాజుల చరిత్ర, మొఘల్ కోర్టు’ అనే అధ్యాయాన్ని తొలగించారు.

అయితే విద్యార్థులపై సిలబస్ భారాన్ని తగ్గించడానికే ఆ అధ్యాయాన్ని తొలగించామని ఎన్‌సీఈఆర్‌టీ వివరణ ఇచ్చింది.

1998లో ఎన్డీయే ప్రభుత్వం ఏర్పడిన తర్వాత, నేషనల్ కరిక్యులమ్ ఫ్రేమ్‌వర్క్ 2000 కింద పాఠ్యపుస్తకాలలో మార్పులు జరిగాయి.

తరువాత 2002-2003 విద్యా సంవత్సరంలో 7, 8 తరగతుల పాఠ్యపుస్తకాల్లో మొఘల్ సామ్రాజ్యం గురించిన పాఠ్యాంశాల్ని తగ్గించారు.

మధ్యయుగ భారతదేశానికి సంబంధించిన అధ్యాయాలను మార్చి, హిందూ రాజులకు పాఠ్యపుస్తకాల్లో స్థానం కల్పించారు.

ఆ సమయంలో11, 12 తరగతుల పుస్తకాల నుంచి మొఘలులకు సంబంధించిన పాఠాలను తొలగించకున్నా, అందులో కొత్త అంశాలు వచ్చి చేరాయి.

ఉదాహరణకు, మొఘల్ చక్రవర్తి ఔరంగజేబును దేవాలయాలపై దాడి చేసిన పాలకుడిగా చిత్రీకరించారు.

ప్రభుత్వం పాఠ్యాంశాలను మార్చడానికి చేస్తున్న ప్రయత్నాలు భారత చరిత్రను వక్రీకరించే ప్రయత్నమని 2021లో చరిత్రకారులు రోమిలా థాపర్, ఇర్ఫాన్ హబీబ్ అన్నారు.

ముస్లిం పాలకులను పాఠ్యపుస్తకాల నుండి తొలగించడం అంటే భారతీయ కళ, సంస్కృతి, జీవనశైలిపై గణనీయమైన ప్రభావాన్ని చూపిన భారతీయ చరిత్రలోని ముఖ్యమైన భాగాన్ని తొలగించడమేనని విమర్శకులు వాదించారు.

ఎన్‌‌సీఈఆర్‌టీ, సీబీఎస్‌ఈ, ఏడో తరగతి, మొఘలులు

ఫొటో సోర్స్, Getty Images

ధర్మేంద్ర ప్రధాన్ ఏం చెప్పారు?

నరేంద్ర మోదీ ప్రభుత్వం విద్యను కాషాయీకరణ చేస్తోందని ప్రతిపక్షాలు, విమర్శకులు గతంలో ఆరోపించారు.

అయితే, ప్రభుత్వం ఆ ఆరోపణలను కొట్టి పారేసింది.

చరిత్ర పుస్తకాల నుండి ఏదీ తొలగించే ప్రణాళిక లేదని కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ గతంలో చెప్పారు.

భారత చరిత్ర అధ్యయనాన్ని మొఘల్ ఆక్రమణదారుల విజయాలకే పరిమితం చేయకూడదని గతంలో ఆయన అభిప్రాయపడ్డారు.

చరిత్ర పుస్తకాలలో హిందూ రాజులకు తగిన స్థానం ఎందుకు ఇవ్వడం లేదని దేశంలోని హిందూత్వ సంస్థలు ప్రశ్నిస్తున్నాయి.

ఇటీవల విడుదలైన ‘చావా’ చిత్రంలో మరాఠా పాలకుడు ఛత్రపతి శంభాజీ మహారాజ్ కథను చూపించారు.

ఈ సినిమా విడుదల తర్వాత, మొఘల్ చక్రవర్తి ఔరంగజేబు సమాధిని తొలగించాలని బీజేపీ నాయకులు డిమాండ్ చేశారు.

“మన చరిత్ర పుస్తకాలలో, ఔరంగజేబు లాంటి క్రూరమైన పాలకుడిని కీర్తించారు. చరిత్రను వక్రీకరించడం వల్ల కొందరు ఔరంగజేబ్‌ను హీరోగా చూపించడానికి ప్రయత్నిస్తున్నారు” అని కేంద్ర మంత్రి రా‌జ్‌నాధ్ సింగ్ ఇటీవల వ్యాఖ్యానించారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)