SOURCE :- BBC NEWS
ఫొటో సోర్స్, Reuters
2 గంటలు క్రితం
చదివే సమయం: 4 నిమిషాలు
‘‘అంతర్జాతీయ జలాల్లో ఉంటే క్షేమంగా ఉంటామనుకున్నారు. కానీ, ఒక టార్పెడో దానిని ముంచేసింది’’.. అంటూ హిందూ మహా సముద్రంలో ఇరాన్ నౌకను ముంచేసినట్లు వెల్లడిస్తూ అమెరికా రక్షణ మంత్రి పీట్ హెగ్సెత్ చేసిన ప్రకటన ఇది.
అయితే, తాము ముంచేశామని చెబుతున్న ఇరాన్ నౌక వివరాలను హెగ్సెత్ చెప్పలేదు.
అయితే, ఆ తర్వాత కొద్దిసేపటికి నౌకను పేల్చేసిన దృశ్యాలంటూ పెంటగాన్ ఒక వీడియో ఫుటేజ్‌ను విడుదల చేసింది. ఆ వీడియోలో మొదట ఒక ఆగివున్న నౌక కనిపిస్తుంది. ఆ తర్వాత కొద్ది సెకండ్ల తర్వాత నౌక సమీపంలో భారీ పేలుడు జరిగినట్లు నీటి అలలను బట్టి అర్థం అవుతుంది. నౌక ఊగిపోతున్న దృశ్యాలు కనిపిస్తాయి.
అంతకుముందు, ఇరాన్‌కు చెందిన నౌక ‘ఐఆర్ఐఎస్ దేనా’ తమ సముద్ర జలాల్లో మునిగిపోయిందని, అందులోని దాదాపు 140 మంది గల్లంతయ్యారని శ్రీలంక ప్రకటించింది. నౌకలో ఉన్నవారిని రక్షించేందుకు తమ నౌకాదళం, వైమానిక దళాలను రంగంలోకి దించినట్లు కూడా తెలిపింది.
సదరు నౌక నుంచి తెల్లవారుజామున ఎమర్జెన్సీ సిగ్నల్ అందిందని శ్రీలంక విదేశాంగ మంత్రి విజిత హెరాత్ పార్లమెంటుకు తెలిపారు.
గాలె ఓడరేవుకు 40 నాటికల్ మైళ్ల దూరంలో నౌక మునిగిపోయింది. ఆ ఓడలో దాదాపు 180 మంది ఉన్నట్టు చెబుతున్నారు. అందులో గాయపడిన 32మంది నావికులను గాలె పోర్టులోని ఆస్పత్రిలో చేర్చినట్టు హెరాత్ తెలిపారు.
హిందూ మహాసముద్రంలో మునిగిపోయిన ఇరాన్ నౌకలో ఉన్న 80 మంది మృతదేహాలను కనుగొన్నట్లు ఆ దేశ రక్షణ మంత్రిత్వ శాఖ కార్యదర్శి ఎయిర్ వైస్ మార్షల్ సంపత్ తుయకొంత వెల్లడించారు.

ఫొటో సోర్స్, Fadel SENNA / AFP via Getty Images
హెగ్సెత్ చేసిన ప్రకటన తప్ప, ఓడ మునిగిపోవడానికి గల కారణాలు ఇంకా పూర్తిగా వెల్లడికాలేదు.
శ్రీలంక నేవీ ప్రతినిధి బుద్ధిక సంపత్ బీబీసీ ప్రతినిధి యోగితా లిమాయేతో మాట్లాడారు. “ఈ సంఘటన మా ప్రాదేశిక జలాల వెలుపల జరిగింది. కానీ మా రీసర్చ్ అండ్ డిఫెన్స్ జోన్‌లోనే జరిగింది కాబట్టి మేము మా అంతర్జాతీయ బాధ్యతల ప్రకారం చర్య తీసుకోవాల్సి వచ్చింది” అని అన్నారు.
‘‘నీటిలో తేలియాడుతున్న వ్యక్తులను గుర్తించి వారిని రక్షించాం. ఆ తర్వాత వారు ఇరానియన్ ఓడకు చెందినవారని తేలింది’’ అని ఆయన అన్నారు.
ఓడ నుంచి లభించిన పేపర్ల ప్రకారం నౌకలో దాదాపు 180 మంది ఉన్నారనీ, అయితే తప్పిపోయినవారి సంఖ్య ఇదమిత్థంగా తెలియడం లేదనీ ఆయన వెల్లడించారు.
రెస్క్యూ ఆపరేషన్ ప్రారంభించినప్పుడు ఓడను తమ నేవీ చూడలేదని, సముద్రంలో చమురు మరకలు, తేలుతున్న లైఫ్ రాఫ్ట్‌లు మాత్రమే కనిపించాయని బుద్ధిక సంపత్ తెలిపారు.
జలాంతర్గామి దాడి కారణంగానే ఓడ మునిగిపోయిందని చెప్పలేమని ఆయన అన్నారు. అయితే, ఓడ మునిగిపోవడానికి కారణమేంటో తెలియరాలేదని ఆయన అన్నారు.
ఓడ ఎలా మునిగిపోయిందన్నది దర్యాప్తు తర్వాతే తెలుస్తుందని అన్నారు.
ఇరాన్ నౌక ప్రమాదానికి అసలు కారణం తెలియదని రక్షణ శాఖ సహాయ మంత్రి అరుణ జయశేఖర కూడా బీబీసీ సింహాళ సర్వీస్ ప్రతినిధికి తెలిపారు.
ఇరాన్‌పై అమెరికా-ఇజ్రాయెల్ దాడుల్లో భాగంగానే ఓడపై బాంబు దాడి జరిగిందా అని అంతకు ముందు శ్రీలంక ప్రతిపక్ష ఎంపీ ఒకరు పార్లమెంటులో ప్రశ్నించగా, దానిపై అధికారిక స్పందన రాలేదు.
ఫొటో సోర్స్, Getty Images
కొనసాగుతున్న ఇరాన్ దాడులు
రెండు బాలిస్టిక్ క్షిపణులతో ఇరాన్ తమ దేశంపై దాడి చేసిందని ఖతార్ రక్షణ శాఖ తెలిపింది.
ఒక క్షిపణిని ఖతార్ వైమానిక రక్షణ వ్యవస్థ కూల్చివేసింది. మరొకటి ఈ ప్రాంతంలో అమెరికా అతిపెద్ద మిలటరీ బేస్ అయిన అల్ ఉదీద్‌లోని యుఎస్ వైమానిక దళ స్థావరాన్ని తాకింది.
ఈ దాడిలో ఎవరూ చనిపోలేదని ఖతార్ చెబుతోంది.
తెహ్రాన్‌లోని డజన్ల కొద్దీ సైనిక స్థావరాలపై దాడి చేశామని ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ (ఐడీఎఫ్) అరబిక్ భాషా ప్రతినిధి అవిచాయ్ అడ్రేయ్ అన్నారు.
ఈ దాడులు ఇరాన్ రివల్యూషనరీ గార్డ్‌తో అనుబంధంగా ఉన్న పారామిలిటరీ దళమైన బసీజ్ ప్రధాన కార్యాలయాన్ని లక్ష్యంగా చేసుకున్నాయి.
దీంతో పాటు మిస్సైల్ లాంచ్ పాడ్‌లు, రక్షణ వ్యవస్థలను కూడా లక్ష్యంగా చేసుకున్నారు.
ఇరాన్ ప్రభుత్వానికి సంబంధించిన భవనాలపై ఐడీఎఫ్ దాడులు చేస్తూనే ఉంటుందని ఆయన అన్నారు.
మంగళవారం (మార్చి 3) సాయంత్రం డ్రోన్ దాడి తరువాత దుబాయ్‌లోని అమెరికా కాన్సులేట్ భవనం మంటల్లో చిక్కుకున్నట్టు చూపించే వీడియో ఫుటేజీని బీబీసీ వెరిఫై ధ్రువీకరించింది.
కాన్సులేట్ నుంచి కొన్ని మీటర్ల దూరంలో ఉన్న ఒక జంక్షన్ నుంచి చిత్రీకరించిన ఈ వీడియో, ఒక డ్రోన్ భవనాన్ని ఢీకొట్టడాన్ని చూపిస్తోంది.
కాన్సులేట్ ప్రధాన పరిపాలనా భవనం సమీపంలోని పార్కింగ్ స్థలంలో ఒక డ్రోన్ ల్యాండ్ అయిందని అమెరికా విదేశాంగ కార్యదర్శి మార్కో రూబియో ధ్రువీకరించారు.
“మా రాయబార కార్యాలయం, దౌత్య కేంద్రాలు ఉగ్రవాద ప్రభుత్వ ప్రత్యక్ష దాడికి గురవుతున్నాయి” అని రూబియో అన్నారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)



