Home జాతీయ national telgu హార్ముజ్ జలసంధి: ఇరాన్ దీనిని మూసేస్తే ప్రపంచంపై ఎలాంటి ప్రభావం పడుతుంది?

హార్ముజ్ జలసంధి: ఇరాన్ దీనిని మూసేస్తే ప్రపంచంపై ఎలాంటి ప్రభావం పడుతుంది?

6
0

SOURCE :- BBC NEWS

ఇరాన్ మిలటరీ స్పీడ్‌బోటు

ఫొటో సోర్స్, Atta Kenare / Getty Images

గల్ఫ్‌లో అమెరికా తన సైనిక ఉనికిని పెంచుకుంటూ ఉండటంతో.. యుద్ధం అంటూ వస్తే ప్రపంచంలోనే అత్యంత కీలక చమురు రవాణా మార్గమైన హార్ముజ్ జలసంధిని మూసేస్తామని ఇరాన్ హెచ్చరించింది.

యుద్ధం జరిగినట్లయితే ‘‘ఇంధన భద్రత ప్రమాదంలో పడుతుంది. హార్ముజ్ జలసంధిని మూసివేస్తాం’’ అని ఇరాన్ విదేశీ సంబంధాల వ్యూహాత్మక మండలి కార్యదర్శి జలాల్ దేహ్ఘాని ఫిరౌజాబాది చెప్పారు.

ప్రపంచంలోని మొత్తం చమురు సరఫరాలో ఐదోవంతు ఈ ఇరుకైన జలమార్గం ద్వారానే సరఫరా అవుతోంది. అత్యంత ఇరుకైన ఒక చోట వెడల్పు కేవలం 40 కి.మీ మాత్రమే ఉంటుంది.

ఇరాన్ అణు కార్యక్రమం విషయంలో వాషింగ్టన్‌కు, తెహ్రాన్‌ మధ్య ఉద్రిక్త వాతావరణం పెరుగుతుండటంతో.. గల్ఫ్ ప్రాంతంలో అమెరికా తమ సైనిక ఉనికిని నిరంతరం పెంచుకుంటోంది.

ప్రస్తుతం రెండు దేశాల మధ్య చర్చలు జరుగుతున్నాయి. అయితే, ఇరాన్ ప్రాదేశిక జలాలకు వీలైనంత దూరంగా ఉండాలని అమెరికా జెండాతో ప్రయాణించే వాణిజ్య నౌకలకు సూచిస్తూ.. అమెరికా రవాణా విభాగానికి చెందిన మారిటైమ్ అడ్మినిస్ట్రేషన్ ఫిబ్రవరి 9న ఓ సూచన జారీ చేసింది.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

ఈ ప్రకటన తర్వాత ప్రపంచవ్యాప్తంగా చమురు ధరలు 1 శాతానికి పైగా పెరిగాయి. కానీ, ఆ తర్వాత రోజు కాస్త తగ్గాయి.

”ఈ జలమార్గాన్ని మూసివేస్తే, చమురు ధరలపై ఇది చూపే ప్రభావం దృష్ట్యా, కచ్చితంగా ఆర్థిక సమస్యలు సృష్టిస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు” అని గతంలో ఈ ఉద్రిక్తతలు నెలకొన్నప్పుడు, యూకే ఇంటెలిజెన్స్ ఏజెన్సీ ఎంఐ6 మాజీ అధినేత సర్ అలెక్స్ యంగర్ బీబీసీతో అన్నారు.

హార్ముజ్ జలసంధి

ఫొటో సోర్స్, Stocktrek / Getty Images

హార్ముజ్ జలసంధి గుండా ఎంత చమురు రవాణా అవుతుంది?

గతేడాది సగటున ప్రతి రోజూ 20 మిలియన్ బ్యారెళ్లకు పైగా ముడి చమురు, కండెన్సేట్ (తరచుగా సహజ వాయువు నుంచి ఉత్పత్తి చేసే తక్కువ సాంద్రత కలిగిన ద్రవం), ఇంధనాలు ఈ జలసంధి గుండా సరఫరా అయినట్లు ఫ్రైట్ అనలిటిక్స్ సంస్థ వోర్టెక్సా డేటా వెల్లడించింది.

ఇరాన్‌తో పాటు తోటి ఓపెక్ సభ్య దేశాలు సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, కువైట్, ఇరాక్‌ లు చాలా వరకు చమురు ఎగుమతులను ఈ జలసంధి గుండా ఆసియాకు పంపుతున్నాయి.

ఈ జలమార్గంలో ఏదైనా అంతరాయం ఏర్పడితే, ప్రపంచానికి చమురు సరఫరాల్లో తీవ్రమైన ఆలస్యం చోటుచేసుకుంటుంది. తక్షణమే ధరల మీద ప్రభావం చూపుతుంది.

హార్ముజ్ జలసంధి

హార్ముజ్ జలసంధి ఎలా ఉంటుంది?

ఇరాన్, ఒమన్ సముద్ర సరిహద్దుల మధ్యలో ఈ జలసంధి ఉంటుంది. ఇది ఒక ఇరుకైన జలమార్గం.

ఈ మార్గంలోకి ప్రవేశించే, బయటకు వచ్చే దగ్గర సుమారు 50 కి.మీ.ల వెడల్పు మాత్రమే ఉంటుంది. మధ్యలో ఒక దగ్గర అత్యంత ఇరుకైన చోట కేవలం 40 కి.మీల వెడల్పే ఉంది.

అయితే, ఈ జలసంధి మధ్య భాగంలో మాత్రమే పెద్ద నౌకలు ప్రయాణించేందుకు వీలుగా సరిపడినంత లోతు ఉంటుంది.

మారిటైమ్ నేవిగేషన్ చార్ట్‌లు (సముద్రయాన పటాలు) భారీ చమురు నౌకల కోసం సురక్షితమైన ఇన్‌బౌండ్ లేన్‌ను, అవుట్‌బౌండ్ లేన్‌ను, ఈ రెండింటి మధ్య బఫర్ జోన్‌ను నిర్దేశించాయి.

మొత్తంగా చూస్తే, కేవలం 10 కి.మీ వెడల్పు ఉండే మార్గం గుండానే భారీ నౌకలు ప్రయాణించాల్సి ఉంది.

పర్షియన్ గల్ఫ్‌లోకి ఈ ట్యాంకర్లు ప్రవేశిస్తున్నప్పుడు ఇరాన్, అరబ్ దేశాలకు మధ్య వివాదాస్పద ప్రాంతాలైన గ్రేటర్, లెస్సర్ తుంబ్‌ దీవులకు సమీపంగా వెళ్తాయి.

మిలిటరీ యాక్షన్ అనేది సముద్ర రవాణాకు అంతరాయం కలిగించే చర్యగా చాలా మంది నిపుణులు పరిగణిస్తారు.

ఇరాన్-ఇరాక్ యుద్ధం 1980 నుంచి 1988 వరకు కొనసాగిన సమయంలో, రెండు దేశాలు ఈ జలమార్గం ద్వారా ఒకదానికొకటి చమురు సరఫరాకు అంతరాయం కలిగించడానికి ప్రయత్నించాయి.

హార్ముజ్ జలసంధి

ఫొటో సోర్స్, Gallo Images via Getty Images

రక్షణాత్మక వ్యూహమా?

విశ్లేషకులు అభిప్రాయం ప్రకారం, హార్ముజ్ జలసంధిని మూసివేయడం శత్రువులను అడ్డుకునే వ్యూహంగా పరిగణిస్తుంటారు. ఇది ఒకరకంగా అణ్వాయుధాన్ని కలిగి ఉండటంతో సమానంగా భావిస్తారు.

అంతర్జాతీయ సమాజం సుదీర్ఘకాలంగా ఇరాన్ సైనిక అణు కార్యక్రమాన్ని వ్యతిరేకిస్తున్నట్టే, ప్రపంచానికి ఇంధన సరఫరాలు కాకుండా తన భౌగోళిక స్థానాన్ని ఇరాన్‌ వ్యూహాత్మకంగా వాడుకోవడానికి కూడా అనుమతించబోమని శక్తివంతమైన దేశాలు పదేపదే చెబుతున్నాయి.

ఈ జలసంధిని తాత్కాలికంగా ఇరాన్ మూసివేయగలదని కూడా నిపుణులు తరచూ అంచనా వేస్తున్నారు. కానీ, అమెరికా, దాని మిత్రదేశాలు తమ సైనిక సామర్థ్యాలను వాడుతూ సముద్ర రవాణాను వెంటనే పునరుద్ధరించగలవని కూడా అదే స్థాయిలో విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు నిపుణులు.

నౌకలు

ఫొటో సోర్స్, NurPhoto via Getty Images

హార్ముజ్ జలసంధికి ఇరాన్ ఎంత సమీపంలో ఉంది?

అమెరికా కాంగ్రెషనల్ రీసెర్చ్ 2012లో సమర్పించిన నివేదికలో ఇరాన్ ఈ విషయంలో మెల్లగా తన వ్యూహాన్ని అనుసరించే అవకాశం ఉందని చెప్పింది. దానిలో కొన్నింటిని పేర్కొంది. అవేమిటంటే…

  • హార్ముజ్ జలసంధిలో నౌకాయాన నిషేధాన్ని ప్రకటిస్తూనే.. దాన్ని ఉల్లంఘిస్తే జరిగే పర్యవసనాలను స్పష్టంగా చెప్పకపోవడం.
  • దీని గుండా వెళ్లే నౌకలను సీజ్ చేయడం లేదా తనిఖీలు చేయడం.
  • నౌకలపై హెచ్చరికగా కాల్పులు జరపడం
  • సైనిక దళాలతో కొన్ని నిర్దిష్ట నౌకలను మాత్రమే లక్ష్యంగా చేసుకోవడం
  • ఈ జలసంధి మార్గంలో, పర్షియన్ గల్ఫ్‌లో నేవల్ మైన్లు ఉపయోగించడం
  • వాణిజ్య, సముద్ర నౌకలను లక్ష్యంగా చేసుకునేందుకు జలాంతర్గాములను, క్షిపణులను వాడటం

ఇరాన్-ఇరాక్ యుద్ధ సమయంలో.. చమురు ట్యాంకర్లపై దాడి చేసేందుకు ఇరాన్ సిల్క్‌వార్మ్ మిసైళ్లను మోహరించింది. గల్ఫ్ జలాల్లో నేవల్ మైన్లను వేసింది.

ఈ మైన్లలో ఒకటి యూఎస్ఎస్ సామ్యూల్ బీ రాబర్ట్స్‌ను అడ్డుకుంది. దీంతో, అమెరికా ప్రతీకార సైనిక చర్యలను దిగాల్సి వచ్చింది.

హార్ముజ్ జలసంధిని పూర్తిగా మూసివేయడంలో ఇరాన్ విఫలమైంది. కానీ, దీనివల్ల సరుకు రవాణా, బీమా ప్రీమియాలు విపరీతంగా పెరిగాయి. గల్ఫ్ నిష్క్రమణ మార్గం వద్ద నౌకల రద్దీ నెలకొంది.

నౌకలు

ఫొటో సోర్స్, AFP via Getty Images

నిపుణుల అంచనా ఏంటి?

ప్రతి నెలా ఈ జలమార్గం గుండా వెళ్లే 3 వేల నౌకలను ఆపేందుకు వేగంగా నడిచే బోట్లు, జలాంతర్గాములను వాడుతూ మైన్లను అమర్చడం అనేది ఇరాన్ వద్దనున్న అత్యంత ప్రభావవంతమైన మార్గాల్లో ఒకటని నిపుణులు భావిస్తున్నారు.

ఇరాన్ సాధారణ నౌకాదళం, ఇస్లామిక్ రివల్యుషనరీ గార్డ్ కోర్ (ఐఆర్‌జీసీ) నేవీలు విదేశీ యుద్ధ నౌకలపై, వాణిజ్య నౌకలపై దాడులు చేసే అవకాశం ఉంది.

ఇజ్రాయెల్, అమెరికా వైమానిక దాడులకు అతిపెద్ద సైనిక నౌకలు తేలిగ్గా లక్ష్యంగా మారవచ్చు.

ప్రస్తుతం, ఇరాన్ దక్షిణ సముద్ర సరిహద్దులకు సమీపంలో ఆ దేశ సైనిక నౌకలు కదులుతున్నట్లు ఉపగ్రహ చిత్రాలను ఉపయోగించే పరిశీలించి చెప్పే మారిటైమ్ ట్రాకింగ్ వెబ్‌సైట్లు పేర్కొంటున్నాయి.

వాణిజ్య నౌక

ఫొటో సోర్స్, Chip Hires via Getty Images

హార్ముజ్ జలసంధిని మూసేస్తే..ఏ దేశాలు ఎక్కువగా ప్రభావితమవుతాయి?

హార్ముజ్ జలసంధి గుండా సౌదీ అరేబియా ప్రతిరోజూ సుమారు 60 లక్షల బ్యారెళ్ల క్రూడ్ ఆయిల్‌ను సరఫరా చేస్తున్నట్లు అనలిటిక్స్ సంస్థ వోర్టెక్సా పరిశోధన పేర్కొంది. ఇది పొరుగు దేశాలన్నింటి కంటే కూడా ఎక్కువ.

2024లో హార్ముజ్ జలసంధి గుండా 84 శాతం ముడి చమురు, కండెన్సేట్, 83 శాతం ద్రవరూప సహజ వాయువు ఆసియా మార్కెట్లకు సరఫరా అయినట్లు యూఎస్ ఎనర్జీ ఇన్‌ఫర్మేషన్ అడ్మినిస్ట్రేషన్ (ఈఐఏ) పేర్కొంది.

దీని గుండా వెళ్లే క్రూడ్ ఆయిల్‌ను దిగుమతి చేసుకునే టాప్ దేశాలు చైనా, భారత్, జపాన్, దక్షిణా కొరియా అని సంస్థ తెలిపింది.

2024లో ఈ జలసంధి గుండా ప్రతిరోజూ 5 లక్షల బ్యారెళ్ల ముడి చమురును, కండెన్సేట్లను అమెరికా దిగుమతి చేసుకుందని ఈఐఏ తెలిపింది.

మొత్తం తన చమురు దిగుమతుల్లో ఇది సుమారు 7 శాతం. పెట్రోలియం వినియోగంలో 2 శాతం.

అయితే, గల్ఫ్‌లోని దేశాల నుంచి అమెరికా దిగుమతి చేసుకునే చమురు ఆ ఏడాదిలో సుమారు 40 ఏళ్ల కనిష్ట స్థాయిలకు చేరిందని, అమెరికా సొంత చమురు ఉత్పత్తి పెరగడం, కెనడా నుంచి దిగుమతులు పెరగడమే దీనికి కారణమని ఈఐఏ రిపోర్టు పేర్కొంది.

ఈ నేపథ్యంలో.. హార్ముజ్ జలసంధి మూయడం వల్ల ఇటీవల సంఘర్షణల సమయంలో ఇజ్రాయెల్‌కు మద్దతుగా నిలిచిన అమెరికా లేదా యూరోపియన్ దేశాల కంటే కూడా అరబ్, ఆసియా దేశాలే ఎక్కువగా నష్టపోయే ప్రమాదం ఉంది. చాలా ఆసియా దేశాలు ఇరాన్‌తో మంచి, సన్నిహిత సంబంధాలను కొనసాగిస్తున్నాయి.

హార్ముజ్ జలసంధి గుండా వెళ్లే చమురును ఎక్కువగా వాడుకునే దేశాల్లో చైనా ఒకటి. గ్లోబల్ మార్కెట్లలో ధరల కంటే తక్కువకు ఇరాన్ ఈ చమురును చైనాకు అమ్ముతోంది.

2024లో అంతర్జాతీయ మార్కెట్‌కు ఇరాన్ ఎగుమతి చేసిన చమురులో సుమారు 90 శాతం చైనాయే కొనుగోలు చేసిందని ఈఐఏ అంచనావేసింది.

”ఒకవేళ ఈ జలసంధి మూసివేస్తే.. నష్టపోయే తొలి దేశం చైనానే. అందుకే, చైనాకు కూడా ఆ సంప్రదింపులు చాలా అవసరం” అని ఇరాన్ విదేశీ వ్యవహారాల వ్యూహాత్మక మండలి కార్యదర్శి ఫిరౌజాబాది చెప్పారు.

కీలకమైన ఈ ఎనర్జీ కారిడార్‌ను మూసివేయడాన్ని అడ్డుకునేందుకు తన పూర్తి దౌత్యాన్ని చైనా ఉపయోగిస్తుందని నిపుణులు పేర్కొంటున్నారు.

హార్ముజ్ జలసంధిని మూసివేస్తే ఇరాన్ శత్రువుల కంటే మిత్రులకే ఎక్కువ నష్టం జరుగుతుందని సీఎన్‌బీసీతో ఎనర్జీ కన్సల్టెన్సీ అవుట్‌లుక్ అడ్వైజర్స్ పార్టనర్ అనాస్ అల్హాజీ అన్నారు.

మిలటరీ నౌక

ఫొటో సోర్స్, Getty Images

ప్రత్యామ్నాయ మార్గం ఉందా?

హార్ముజ్ జలసంధిని మూసివేత ముప్పు గురించి గత కొన్నేళ్లుగా వస్తున్న హెచ్చరికలు.. గల్ఫ్ ప్రాంతంలోని మిగిలిన చమురు ఎగుమతి దేశాలు ప్రత్యామ్నాయ ఎగుమతి మార్గాలను అభివృద్ధి చేసుకునేందుకు దోహదం చేశాయి.

2019లో సౌదీ అరేబియా క్రూడ్ ఆయిల్‌ను సరఫరా చేసేందుకు తాత్కాలికంగా ఒక సహజ వాయువు పైప్‌లైన్‌ను మార్చి ఉపయోగించింది.

యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ తన భూభాగంపై ఉన్న చమురు క్షేత్రాలను గల్ఫ్ ఆఫ్ ఒమన్‌లోని ఫుజైరా ఓడరేవుకు పైప్‌లైన్ ద్వారా అనుసంధానించింది. రోజువారీ సామర్థ్యం 15లక్షల బ్యారెళ్లు.

గల్ఫ్ ఆఫ్ ఒమన్‌కు క్రూడ్ ఆయిల్‌ను తరలించాలనే ఉద్దేశ్యంతో.. 2021 జూలైలో ఇరాన్ కూడా గోరే-జాస్క్ పైప్‌లైన్‌ను ప్రారంభించింది.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)