Home జాతీయ national telgu హార్ముజ్ జలసంధిలో మూడు సరకు రవాణా నౌకలు, పర్షియన్ గల్ఫ్‌లో రెండు ఫ్యూయల్ ట్యాంకర్లపై దాడి

హార్ముజ్ జలసంధిలో మూడు సరకు రవాణా నౌకలు, పర్షియన్ గల్ఫ్‌లో రెండు ఫ్యూయల్ ట్యాంకర్లపై దాడి

4
0

SOURCE :- BBC NEWS

ఇరాన్, హార్ముజ్, అమెరికా, చమురు

ఫొటో సోర్స్, Royal Thai Navy

పర్షియన్ గల్ఫ్‌లో రెండు చమురు ట్యాంకర్లపై పేలుడు పదార్థాలతో దాడి జరిగినట్లు అధికారులు వెల్లడించారు.

ఇరాక్ పోర్ట్ ఉమ్ కస్ర్ సమీపంలో జరిగిన ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా మరో 38 మందిని కాపాడారు.

ఈ ఘటనకు పేలుడు పదార్థాలతో వచ్చిన ఇరాన్ బోట్లు కారణం కావచ్చని రాయిటర్స్, సీఎన్ఎన్ రిపోర్ట్ చేశాయి.

దాడికి గురైన రెండు ట్యాంకర్ల చుట్టూ రక్షణ బోట్లు ఉన్నట్లు షిప్ ట్రాకింగ్ వెబ్‌సైట్లు చూపిస్తున్నాయి.

దాడి నేపథ్యంలో చమురు రేవుల్లో కార్యకలాపాలను నిలిపివేసినట్లు ఇరాక్ అధికారులు వెల్లడించారు.

హార్ముజ్ జలసంధిలో మూడు సరుకు రవాణా నౌకలు గుర్తుతెలియని ప్రొజెక్టైల్స్ కారణంగా దాడులకు గురయ్యాయని మారిటైమ్ అధికారులు తెలిపిన తర్వాత ఈ పేలుళ్లు జరిగాయి.

మరో ఘటనలో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లోని జెబల్ అలీ తీరానికి 35 నాటికల్ మైళ్ల దూరంలో ఒక కంటైనర్ నౌకను గుర్తుతెలియని ప్రొజెక్టైల్ తాకినట్లు యూకే మారిటైమ్ ట్రేడ్ ఆపరేషన్స్(యూకేఎంటీఓ) వెల్లడించింది. సిబ్బంది అంతా సురక్షితంగా ఉన్నారని, ఈ పేలుళ్ల కారణంగా పర్యావరణంపై ఎలాంటి ప్రతికూల ప్రభావం కనిపించలేదని ఆ సంస్థ పేర్కొంది.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌

కాగా.. హార్ముజ్ జలసంధిలో దెబ్బతిన్న మూడు సరకు రవాణా నౌకలలో థాయిలాండ్ జెండా ఉన్న నౌక ఒకటి ఉంది. ఇది ఒమన్ తీరానికి ఉత్తరాన 11 నాటికల్ మైళ్ల దూరంలో ఉండగా దాడి జరిగింది. ఇందులో మంటలు చెలరేగడంతో అందులోని 23 మంది సిబ్బందిని రక్షించినట్లు రాయల్ థాయ్ నేవీ తెలిపింది.

ఈ ఘటనకు బాధ్యత వహించిన ఇరాన్.. నౌకలోని సిబ్బంది తమ హెచ్చరికలను బేఖాతరు చేసినందునే ఈ దాడి చేసినట్లు ప్రకటించింది.

రెండో నౌక జపాన్ జెండా ఉన్న కంటైనర్ షిప్. ఇది యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ తీరానికి 25 నాటికల్ మైళ్ల దూరంలో దాడికి గురై స్వల్పంగా దెబ్బతింది. ఇక మూడో సరకు రవాణా నౌక దుబయికి వాయువ్యంగా సుమారు 50 నాటికల్ మైళ్ల దూరంలో దెబ్బతిన్నట్లు యూకే మారిటైమ్ ట్రేడ్ ఆపరేషన్స్ తెలిపింది.

ప్రస్తుతం నెలకొన్న అసాధారణ పరిస్థితుల దృష్ట్యా 40 కోట్ల బ్యారళ్ల చమురును విడుదల చేయాలని 32 దేశాలు ఏకగ్రీవంగా ఓటు వేసిన రోజే ఈ దాడులు జరిగాయని అంతర్జాతీయ ఇంధన సంస్థ (ఐఈఏ) ప్రకటించింది.

గత నెల చివరలో ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్ దాడులు చేసినప్పటి నుంచి అంతర్జాతీయ వాణిజ్యానికి అత్యంత కీలకమైన గల్ఫ్, హార్ముజ్ జలసంధి ప్రాంతాల్లో అస్థిరత ఏర్పడింది. దీనివల్ల నౌకల రాకపోకలు తగ్గి ప్రపంచవ్యాప్తంగా ఇంధన ధరలు పెరిగాయి.

అమెరికా, ఇజ్రాయెల్, వాటి మిత్ర దేశాలకు వెళ్లే ఒక్క లీటరు చమురును కూడా ఈ మార్గంలో వెళ్లనివ్వబోమని ఇరాన్ హెచ్చరింది.

బ్యారెల్ చమురు 200 డాలర్లు అవుతుందని, అందుకు సిద్ధంగా ఉండాలని, చమురు ధరలు ప్రాంతీయ స్థిరత్వంపై ఆధారపడిఉంటాయని, ఇప్పుడు దాన్నే అస్థిరపరిచారని ఇరాన్ ప్రతినిధి ఇబ్రహీం జొల్ఫాఖరీ ఆరోపించారు.

సరైన భద్రతా పరిస్థితులు ఉన్నప్పుడు నౌకలకు రక్షణగా ఎస్కార్ట్ పంపే అవకాశాలను పరిశీలిస్తున్నట్లు జీ7 దేశాల నాయకులు బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు.

హార్ముజ్ జలసంధి వెంబడి ఉన్న ఇరానియన్ ఓడరేవులకు ప్రజలు దూరంగా ఉండాలని అమెరికా సెంట్రల్ కమాండ్ సూచించింది, తెహ్రాన్ ఆ ప్రాంతాలను సైనిక కార్యకలాపాల కోసం ఉపయోగిస్తోందని పేర్కొంది.

చమురు ధరల్లో మార్పులు యుద్ధం వల్ల జరుగుతున్నవని ట్రంప్ అన్నారు. చమురు ధరలు ఇప్పటికే తగ్గుతున్నాయన్నారు.

ఇరాన్, హార్ముజ్, అమెరికా, చమురు

ఫొటో సోర్స్, Getty Images

గల్ఫ్ దేశాలపై కొనసాగుతున్న దాడులు

గల్ఫ్ చమురు సరఫరాకాకుండా అడ్డుకునేందుకు ఇరాన్ ప్రయత్నాలు చేస్తే అమెరికా నుంచి తీవ్ర సైనిక చర్యలుంటాయని ట్రంప్ ముందే హెచ్చరించారు. అవసరమైతే అమెరికా సైన్యం నౌకలకు రక్షణ కల్పిస్తుందని అన్నారు.

ప్రపంచ చమురు సరఫరాలో దాదాపు 20శాతం హార్ముజ్ మీదుగానే జరుగుతుంది. ఇది దాదాపు మూసుకుపోయిన పరిస్థితి ఏర్పడడతో 40 కోట్ల బ్యారెళ్ల చమురు విడుదల చేయాలని ఐఈఏ సభ్యదేశాలు నిర్ణయించాయని ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఫాతిహ్ బిరోల్ చెప్పారు.

గల్ఫ్‌లో మరోచోట ప్రతీకార దాడులు ప్రారంభించామని ఇరాన్ చెప్పింది. సౌదీఅరేబియాలోని భారీ చమురురక్షేత్రం, దుబయి అంతర్జాతీయ విమానాశ్రయాన్ని లక్ష్యంగా చేసుకున్నామని తెలిపింది.

ఎయిర్‌పోర్టు దగ్గర రెండు డ్రోన్లను అడ్డుకున్నామని, ఈ ఘటనలో నలుగురు గాయపడ్డారని అధికారులు చెప్పారు.

”తీవ్ర నష్టం కలిగించే భారీ ఆపరేషన్” ప్రారంభించామని, ఖతార్‌, కువైట్, ఇరాక్‌లోని అమెరికా స్థావరాలు కూడా ఇందులో లక్ష్యాలుగా ఉన్నాయని ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కోర్(ఐఆర్‌జీసీ)తెలిపింది.

ఏడు బాలిస్టిక్ మిసైళ్లను తాము అడ్డుకున్నామని, వాటిలో చాలావరకు ప్రిన్స్ సుల్తాన్ ఎయిర్ బేస్ లక్ష్యంగా జరిగాయని సౌదీ అరేబియా తెలిపింది. చమురుక్షేత్రాన్ని లక్ష్యంగా చేసుకున్న రెండు డ్రోన్లను కూడా అడ్డుకున్నామని చెప్పింది.

మొజ్తాబా ఖమేనీ, ఇరాన్

ఫొటో సోర్స్, Getty Images

‘కొత్త సుప్రీం లీడర్ క్షేమంగా ఉన్నారు’

ఒమన్‌లో సలాహ్ పోస్టు దగ్గర అనేక ఇంధన స్టోరేజ్ ట్యాంకులపై డ్రోన్లతో దాడి జరిగిందని ఒమన్ తెలిపింది. వాణిజ్య నౌకలకు ఎలాంటి నష్టం జరగలేదని బ్రిటిష్ మారిటైమ్ సెక్యూరిటీ సంస్థ అంబ్రే చెప్పినట్ట న్యూస్ ఏజెన్సీ రాయిటర్స్ రిపోర్టు చేసింది.

లెబనాన్‌లో బేరూత్ శివార్లలోని దహియేలో ఆయుధ నిల్వల కేంద్రాలు, కమాండ్ సెంటర్లు వంటి హిజ్బొల్లా స్థావరాలను లక్ష్యంగా చేసుకుని ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ చెప్పింది.

తూర్పు లెబనాన్‌లోని బెకా వాలీ గ్రామాల్లో ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో ఏడుగురు చనిపోయారని, 23 మంది గాయపడ్డారని లెబనాన్ ఆరోగ్యమంత్రిత్వ శాఖ తెలిపింది.

ఇరాన్ కొత్త సుప్రీం లీడర్ మొజ్తాబా ఖమేనీ క్షేమంగా ఉన్నారని ఇరాన్ అధ్యక్షుడు మాసౌద్ పెజెష్కియాన్ కుమారుడు టెలిగ్రామ్‌లో తెలిపారు. మొజ్తాబా గాయపడ్డట్టు వార్తలు రావడంతో ఈ ప్రకటన విడుదల చేశారు.

అమెరికా, ఇజ్రాయెల్ దాడుల్లో మొజ్తాబా ఖమేనీ స్వల్పంగా గాయపడ్డారని సీనియర్ ఇజ్రాయెల్ అధికారులు రాయిటర్స్‌తో చెప్పారు. కొత్త సుప్రీం లీడర్ స్వల్పంగా గాయపడ్డారని సైప్రస్‌లోని ఇరాన్ రాయబారి ‘గార్డియన్‌’తో చెప్పారు.

ఆదివారం(మార్చి 8) ఆయన్ను నియమిస్తున్నట్టు ప్రకటించిన తర్వాత మొజ్తాబా ఖమేనీ ప్రజలకు బహిరంగంగా కనిపించలేదు. ఎలాంటి ప్రకటనలూ విడుదల చేయలేదు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)