Home జాతీయ national telgu స్టీఫెన్ మిల్లర్: డిపోర్టేషన్ నుంచి గ్రీన్‌లాండ్ వరకు.. ట్రంప్ విధానాల వెనకున్న వివాదాస్పద వ్యక్తి

స్టీఫెన్ మిల్లర్: డిపోర్టేషన్ నుంచి గ్రీన్‌లాండ్ వరకు.. ట్రంప్ విధానాల వెనకున్న వివాదాస్పద వ్యక్తి

12
0

SOURCE :- BBC NEWS

స్టీఫెన్ మిల్లర్

ఫొటో సోర్స్, Getty Images

అమెరికా అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్ పొలిటికల్ సర్కిల్‌లో గత కొన్నేళ్లుగా స్టీఫెన్ మిల్లర్ ఒక కన్జర్వేటివ్ ఫైర్ బ్రాండ్‌గా గుర్తింపు పొందారు. కానీ ఇప్పుడు, విమర్శలకు కేంద్ర బిందువుగా మారారు.

వైట్‌హౌస్ విధానాల రూపకల్పనలో ఆయన అనుసరిస్తున్న అవిశ్రాంత పోరాట శైలి ట్రంప్ కఠిన వలస విధానాల అజెండాను పట్టాలెక్కించింది.

అలాగే, పశ్చిమ దేశాలలో అమెరికా ప్రభావాన్ని విస్తరించడంలో ఆయన పాత్ర కీలకంగా మారుతోంది.

ఈ సంవత్సరం ప్రారంభంలో ట్రంప్ ప్రభుత్వం స్వదేశంలో, విదేశాల్లో తీసుకున్న అత్యంత వేగవంతమైన నిర్ణయాలు మిల్లర్‌ను అత్యంత శక్తిమంతమైన వ్యక్తుల్లో ఒకరిగా నిలబెట్టాయి.

కానీ, వామపక్ష భావజాలం ఉన్నవారికి మాత్రం ఆయన ఒక విలన్‌లా కనిపిస్తారు.

వాషింగ్టన్ డీసీలోని బహిరంగ ప్రదేశాల్లో మిల్లర్ ముఖంతో ఉన్న పోస్టర్లు వెలిశాయి. వాటిపై ‘ఫాసిజం అంత బాగోదు’ అనే క్యాప్షన్లు ఉన్నాయి.

మిల్లర్ రాజీనామా చేయాలని డెమొక్రాట్లు డిమాండ్ చేస్తున్నారు. చివరికి ఆయన సొంత పార్టీకి చెందిన కొందరు సభ్యులు కూడా ఆయన రాజకీయ నిర్ణయాలను, పనితీరును బహిరంగంగానే ప్రశ్నిస్తున్నారు.

అలాంటి మిల్లర్ గత కొన్ని వారాలుగా తనకు అలవాటు లేని పరిస్థితులను ఎదుర్కొంటున్నారు.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్
ట్రంప్‌తో మిల్లర్

ఫొటో సోర్స్, Getty Images

రెచ్చగొడుతున్నారంటూ డెమొక్రాట్లపై ఆరోపణలు..

తెరవెనుక ఉంటూ వ్యవహారాలు నడిపించే వ్యూహకర్తగా పేరున్న మిల్లర్, ఇప్పుడు అకస్మాత్తుగా దేశవ్యాప్త దృష్టిని ఆకర్షిస్తున్నారు. ఆయన ప్రతిమాట, చేసే ప్రతి పనిని ఇప్పుడు విమర్శకులు నిశితంగా పరిశీలిస్తున్నారు.

ఇలాంటి పరిస్థితుల్లో, ఆయన ప్రస్తుతానికి కాస్త వెనక్కి తగ్గాల్సి వచ్చింది.

మిన్నియా పోలిస్‌లో ఇద్దరు ఫెడరల్ ఇమ్మిగ్రేషన్ అధికారులు గత నెలలో అలెక్స్ ప్రెట్టి అనే వ్యక్తిని కాల్చి చంపిన కొద్దిసేపటికే, మిల్లర్ సోషల్ మీడియా ప్లాట్‌ఫాం ‘ఎక్స్‌’ లో వరుసగా మెసేజ్‌లు పోస్ట్ చేశారు.

అలెక్స్ ప్రెట్టి ఒక డొమెస్టిక్ టెర్రరిస్ట్ అని, హంతకుడు అని మిల్లర్ ఆరోపించారు.

వాస్తవానికి, 2016 ఎన్నికల ప్రచార ర్యాలీలలో ట్రంప్ రావడానికి ముందు జనాన్ని ఉత్తేజపరిచే ప్రసంగాలు చేసిన మిల్లర్‌కు ఇలాంటి పరుష వ్యాఖ్యలు సహజమే.

డెమొక్రాట్లు ‘తిరుగుబాటును ఎగదోస్తున్నారు’ అని మిల్లర్ ఆరోపించారు. అయితే, ఆయన వాదనలు వాస్తవానికి విరుద్ధమని తేలింది.

ఆ తర్వాత వెలుగులోకి వచ్చిన వీడియో ఆధారాల ప్రకారం… ప్రెట్టి వద్ద లైసెన్స్‌డ్ హ్యాండ్‌గన్ ఉన్నప్పటికీ, కస్టమ్స్ అండ్ బోర్డర్ ప్రొటెక్షన్ (సీబీపీ) అధికారులు అతనిపై పెప్పర్ స్ప్రే చేసి, కాల్పులు జరపడానికి ముందు వరకు ఆయన వారిని ఏ విధంగానూ బెదిరించలేదని వెల్లడైంది.

కొన్ని రోజుల తర్వాత, మిల్లర్ మీడియాకు ఒక ప్రకటన విడుదల చేశారు.

ఆ కాల్పుల ఘటనపై ప్రభుత్వ ప్రాథమిక అంచనా.. క్షేత్రస్థాయిలోని ఇమ్మిగ్రేషన్ అధికారుల నివేదికల ఆధారంగా జరిగిందని ఆయన వాదించారు. అంతేకాకుండా, ఆ అధికారులు సరైన ప్రోటోకాల్‌ను పాటించి ఉండకపోవచ్చని పేర్కొన్నారు.

మిల్లర్ ఇలా వెనక్కి తగ్గడం చాలా అరుదు, అయినప్పటికీ డెమొక్రాట్ విమర్శకులు సంతృప్తి చెందలేదు. నిరసనలపై కఠినంగా వ్యవహరించేలా ఇమ్మిగ్రేషన్, కస్టమ్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ (ఐసీఈ) అధికారులను ఆయన ప్రోత్సహిస్తున్నారని వారు ఆరోపిస్తున్నారు.

”ఈ అమెరికన్ పౌరులను ఐసీఈ, సీబీపీ హత్య చేయడం స్టీఫెన్ మిల్లర్‌కు సరిపోలేదు. చనిపోయిన తర్వాత కూడా వారిపై నిందలు వేశారు” అని వర్జీనియాకు చెందిన కాంగ్రెస్ సభ్యుడు డాన్ బేయర్ సోషల్ మీడియా వెబ్‌సైట్ ‘బ్లూస్కై’లో రాశారు.

”మిల్లర్ ఒక ఉన్మాది, రక్తపిపాసి అయిన మతతత్వవాది. ఆయన అధికారంలో ఉన్న ప్రతిరోజూ ప్రజలను ప్రమాదంలో పడేస్తుంది” అని పేర్కొన్నారు.

గత మే నెలలో అమెరికాలోని పలు నగరాల్లో సరైన పత్రాల్లేకుండా ఉంటున్న వలసదారులను అదుపులోకి తీసుకోవడానికి, వారిని దేశం నుంచి బహిష్కరించడానికి ఇమ్మిగ్రేషన్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు మరిన్ని కఠిన చర్యలు తీసుకోవాలని మిల్లర్ డిమాండ్ చేశారు.

ప్రభుత్వం రోజుకు 3 వేల మందిని అరెస్ట్ చేయాలని లక్ష్యంగా పెట్టుకుందని ఆయన ఫాక్స్ న్యూస్‌కు తెలిపారు. ఈ సంఖ్య మునుపటి గణాంకాల కంటే చాలా రెట్లు ఎక్కువ.

‘అమెరికావ్యాప్తంగా ఉన్న అక్రమ వలసదారులను అదుపులోకి తీసుకోవడంలో తగినంత కృషి చేయడం లేదంటూ ఒక సమావేశంలో మిల్లర్ ఫెడరల్ ఇమ్మిగ్రేషన్ అధికారులపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. అప్పటి నుంచి వాషింగ్టన్ డీసీ, షార్లెట్, షికాగో, మిన్నియా పోలిస్ సహా అమెరికాలోని ప్రధాన నగరాల్లో తనిఖీలు, అక్రమ వలసదారులపై చర్యలు ముమ్మరమయ్యాయి’ అని వాషింగ్టన్ ఎగ్జామినర్ తన కథనంలో పేర్కొంది.

”ప్రతి పనీ అధ్యక్షుడు ట్రంప్, స్టీఫెన్ ఆదేశాల మేరకే చేశాను” అని హోమ్‌ల్యాండ్ సెక్యూరిటీ సెక్రటరీ క్రిస్టీ నోయెమ్ ఇటీవల ఆక్సియోస్‌తో చెప్పారు. బలవంతపు ఇమ్మిగ్రేషన్ చర్యలకు ఆమెనే ప్రధాన సూత్రధారి అని వస్తున్న విమర్శలపై క్రిస్టీ నోయెమ్ ఇలా స్పందించారు.

స్టీఫెన్ మిల్లర్‌కు వ్యతిరేకంగా నిరసనలు

ఫొటో సోర్స్, Getty Images

‘ఐస్’కి తగ్గిపోతున్న మద్దతు…

మిల్లర్ తనపై వచ్చిన జాత్యహంకారం లేదా మతతత్వ ఆరోపణలను తోసిపుచ్చారు. ప్రజలు ఎందుకోసమైతే ట్రంప్‌ను ఎన్నుకున్నారో, ఆ ఆశయాలను నెరవేర్చడమే ఈ ఇమ్మిగ్రేషన్ విధానం అంటూ ఆయన సమర్థించుకుంటున్నారు.

అయితే, మిన్నియాపోలిస్‌లో అలెక్స్ ప్రెట్టి, రెనీ గుడ్ అనే ఇద్దరు పౌరులు ఇమ్మిగ్రేషన్ అధికారుల చేతిలో మరణించిన నేపథ్యంలో, మిల్లర్ అనుసరిస్తున్న ఈ దూకుడు వైఖరికి భిన్నంగా ట్రంప్ ఇటీవల కీలక వ్యాఖ్యలు చేశారు. తన కఠిన చర్యలకు కాస్త ‘మృదువైన స్పర్శ’ అవసరమని వ్యాఖ్యానించారు.

రాయిటర్స్ – ఇప్సోస్ తాజా సర్వే ప్రకారం, ట్రంప్ ఇమ్మిగ్రేషన్ విధానానికి ప్రజల మద్దతు 39 శాతానికి పడిపోయింది.

ట్రంప్ రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత ఇదే అత్యల్ప స్థాయి. అంతేకాకుండా, ‘ఐస్’ (ఐసీఈ) ఏజెంట్లు అనుసరిస్తున్న విధానాలు మరీ శ్రుతిమించాయని మెజారిటీ సంఖ్యలో 58 శాతం మంది ప్రజలు అభిప్రాయం వ్యక్తం చేశారు.

నవంబర్‌లో జరగనున్న మధ్యంతర ఎన్నికలకు రిపబ్లికన్లు సిద్ధమవుతున్న తరుణంలో, ఈ పరిణామాలు మిల్లర్‌‌పై విమర్శల వెల్లువకు కారణమయ్యాయి.

”ఈ సామూహిక బహిష్కరణ విధానానికి మిల్లరే రూపకర్త. దీని ప్రభావం ఎలా ఉంటుందో నవంబర్‌లో మనకు తెలుస్తుంది. ఓటర్ల తీర్పు చాలా తీవ్రంగా ఉండొచ్చు” అని ట్రంప్ 2016, 2024 ఎన్నికల ప్రచారాల్లో పనిచేసిన కన్జర్వేటివ్ వ్యూహకర్త బ్రియాన్ లాంజా అన్నారు.

స్టీఫెన్ మిల్లర్

ఫొటో సోర్స్, Getty Images

ఇలాంటి సవాళ్లు మిల్లర్‌కు అనుభవమే…

రాజకీయాల్లో ఎలా నిలదొక్కుకోవాలో మిల్లర్‌కు ఏళ్లుగా అనుభవమే. ఉదారవాద భావజాలం ఉన్న కాలిఫోర్నియాలో తన హైస్కూల్ రోజుల నుంచే ముక్కుసూటిగా ఉండే కన్జర్వేటివ్‌గా ఆయనకు పేరు.

సెనేట్ స్టాఫ్ స్థాయి నుంచి ప్రచార సహాయకుడిగా, ఆపై వైట్ హౌస్ వరకూ ఎదిగారు. ట్రంప్ మొదటి పాలనాకాలంలో చోటుచేసుకున్న వ్యక్తిగత విభేదాలను, అంతర్గత రాజకీయాలను ఆయన సమర్థంగా ఎదుర్కొన్నారు.

మిల్లర్ 2019లో వాషింగ్టన్ పోస్ట్‌తో మాట్లాడుతూ, ‘ట్రంప్ 2016లో అధ్యక్ష ఎన్నికల బరిలోకి దిగుతున్నట్లు ప్రకటించినప్పుడు, నా ఆత్మకు ఒక విద్యుత్ ప్రవాహం వచ్చినట్లైంది’ అని చెప్పారు.

”ట్రంప్ మనస్తత్వానికి స్టీఫెన్ మిల్లర్ చాలా కీలకం” అని బ్రియాన్ పేర్కొన్నారు.

”ఎప్పుడూ బలంగా ఉండాలి, ఎన్నడూ వెనక్కి తగ్గకూడదు అనే తన నైజానికి ఏ విషయంలోనైనా మిల్లర్ అండగా ఉంటారని ట్రంప్ నమ్ముతారు” అని బ్రియాన్ వ్యాఖ్యానించారు.

ట్రంప్‌తో మిల్లర్

ఫొటో సోర్స్, Getty Images

ట్రంప్ గొంతుకగా మిల్లర్…

వైట్ హౌస్‌లో మిల్లర్ అధికారిక హోదా.. డిప్యూటీ చీఫ్ ఆఫ్ స్టాఫ్ ఫర్ పాలసీ, హోమ్‌లాండ్ సెక్యూరిటీ అడ్వైజర్.

”స్టీఫెన్ మిల్లర్ తెలివైనవాడు, కష్టపడేతత్వం ఉన్నవాడు, విధేయుడు కాబట్టే గత కొన్నేళ్లుగా అధ్యక్షుడు ట్రంప్‌కు నమ్మకమైన సేవలు అందిస్తున్నారు” అని వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీ కరోలిన్ లెవిట్ బీబీసీతో అన్నారు.

”ప్రభుత్వంలోని అన్ని విభాగాలను సమన్వయం చేస్తూ, విదేశీ, స్వదేశీ విధానాలన్నీ రికార్డు వేగంతో అమలయ్యేలా స్టీఫెన్ చూస్తారు. గత ఏడాది కాలంలో సాధించిన ఫలితాలే అందుకు నిదర్శనం” అని ఆమె అభిప్రాయపడ్డారు.

గత ఏడాది ఒకానొక సమయంలో, జాతీయ భద్రతా సలహాదారు పదవి నుంచి మైకేల్ వాల్ట్జ్‌ను తొలగించినప్పుడు ఆ స్థానంలో మిల్లర్‌ను నియమిస్తారనే వార్తలొచ్చాయి.

వీటిపై ట్రంప్ స్పందిస్తూ, ”స్టీఫెన్ అంతకంటే చాలా ఉన్నతమైన స్థానంలో ఉన్నారు” అని వ్యాఖ్యానించారు.

నిరుడు మార్చిలో, యెమెన్‌లోని హూతీ తిరుగుబాటుదారులపై వైమానిక దాడులు చేయడానికి అమెరికా సిద్ధమవుతున్న తరుణంలో, సిగ్నల్ యాప్‌లో జరిగిన కొన్ని సందేశాలు బయటకు వచ్చాయి. అవి ‘ది అట్లాంటిక్’ ఎడిటర్ జెఫ్రీ గోల్డ్‌బర్గ్‌కు చేరాయి.

వైట్‌హౌస్ ప్రణాళికల్లో మిల్లర్ కీలక పాత్ర పోషిస్తున్నారని ఆ సందేశాలతో బయటపడింది. ఆ దాడిని కొనసాగించాలనే అధ్యక్షుడి ఆకాంక్షను ఆయన అధికారులకు స్పష్టం చేసినట్లు తెలిసింది.

ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్, రక్షణ మంత్రి పీట్ హెగ్సేత్, విదేశాంగ మంత్రి మార్కో రూబియో వంటి అత్యున్నత పదవుల్లోని నాయకులు, ఉన్నతాధికారుల బృందానికి మిల్లర్ పంపిన సందేశంలో, ”నేను విన్న దాని ప్రకారం, అధ్యక్షుడి నిర్ణయం స్పష్టంగా ఉంది: గ్రీన్ సిగ్నల్” అని రాశారు.

మాదకద్రవ్యాల అక్రమ రవాణాకు ఉపయోగిస్తున్నారనే అనుమానం ఉన్న నౌకలను గుర్తించి, వాటిని ధ్వంసం చేసేందుకు కరేబియన్ సముద్రంలో జరుగుతున్న సైనిక చర్యలను పర్యవేక్షించే బాధ్యతను మిల్లర్‌కు అప్పగించినట్లు సమాచారం.

ఆ తర్వాత, ఈ ఆపరేషన్ మరింత విస్తృతమై, జనవరి ప్రారంభంలో వెనెజ్వెలా అధ్యక్షుడు నికోలస్ మదురోను అధికారం నుంచి తప్పించడంలో విజయవంతమైంది.

ఈ ఆపరేషన్ గురించి ట్రంప్ తన ‘మార్-ఎ-లాగో’ రిసార్ట్‌లో ప్రకటించినప్పుడు, ఆయన వెనుక నిలబడివున్న అతికొద్ది మంది ఉన్నత స్థాయి వ్యక్తులతో మిల్లర్ ఒకరు.

విదేశాంగ విధానంలో మిల్లర్ పోషిస్తున్న ఈ పాత్ర అసాధారణమైనదని, అయితే ఇది సంప్రదాయేతర వైట్‌హౌస్ శైలికి అనుగుణంగానే ఉందని బ్రియాన్ అన్నారు.

”డోనల్డ్ ట్రంప్ ఒక సంప్రదాయ అధ్యక్షుడు కాదని గ్రహించేంత తెలివైనవాడు స్టీఫెన్. సలహాలు, సూచనల కోసం ట్రంప్ తన చుట్టూ ఉన్నవారిపై ఆధారపడతారని ఆయనకు తెలుసు” అని చెప్పారు.

”స్టీఫెన్ ఎల్లప్పుడూ అధ్యక్షుడికి అందుబాటులో ఉంటూ తగిన సలహాలను అందించడంలో విజయవంతమయ్యారు. ఒకవేళ ఎవరైనా మామూలు అధ్యక్షుడు గనుక ఉండి ఉంటే, స్టీఫెన్‌కు ఈ స్థాయి ప్రాధాన్యం లభించి ఉండేది కాదు” అని బ్రియాన్ అభిప్రాయపడ్డారు.

భార్యతో మిల్లర్

ఫొటో సోర్స్, Getty Images

మిల్లర్ చిన్నప్పటి నుంచీ అంతే…

వివాదాలు, కవ్వింపు చర్యలపై తన ఆసక్తిని మిల్లర్‌ చిన్న వయస్సులోనే పెంచుకున్నారు.

గ్రేటర్ లాస్ ఏంజెలెస్‌లోని తీరప్రాంత నగరమైన శాంటా మోనికాలోని హైస్కూల్‌లో మిల్లర్ చదువుకున్నారు. అక్కడ కేవలం ‘ఇంగ్లిష్ మాత్రమే’ బోధించాలని, ఇతర సంప్రదాయవాద అంశాల కోసం వాదించేవారు.

హైస్కూల్ స్టూడెంట్ ఎన్నికల ప్రచారంలో చిత్రీకరించిన ప్రసంగం వీడియోలో, తమ చెత్తను తామే ఏరివేయాలని చెప్పడంపై ఆయన ఫిర్యాదు చేశారు. ఆ పని జీతం తీసుకునే పారిశుద్ధ్య సిబ్బంది చేయాలని వాదించారు.

ఆ తర్వాత డ్యూక్ యూనివర్సిటీలో పొలిటికల్ సైన్స్ చదివారు.

అక్కడ విద్యార్థి పత్రికలో రైట్ వింగ్ భావజాలంతో కూడిన కాలమ్స్ రాసేవారు.

‘డ్యూక్ కన్జర్వేటివ్ యూనియన్’కు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా పనిచేశారు.

గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన వెంటనే మిల్లర్ మిన్నెసోటాకు చెందిన ప్రముఖ కన్జర్వేటివ్ కాంగ్రెస్ మహిళా నాయకురాలు మిషెల్ బాచ్‌మన్ వద్ద ప్రెస్ సెక్రటరీగా ఉద్యోగంలో చేరారు.

గ్రీన్ లాండ్

ట్రంప్ రెండోసారి వైట్ హౌస్‌లోకి అడుగుపెట్టిన మొదటి ఏడాది కాలంలో, ప్రభుత్వం చేపట్టిన అత్యంత ప్రతిష్టాత్మకమైన రాజకీయ చర్యలు, కీలక నిర్ణయాలన్నింటిలోనూ మిల్లర్ కీలక పాత్ర పోషించారు.

మిల్లర్ భార్య, ప్రముఖ పాడ్‌కాస్టర్ కేటీ మిల్లర్ కూడా వెనెజ్వెలాపై దాడి జరిగిన కొద్ది గంటలకే గ్రీన్‌లాండ్ ద్వీపాన్ని అమెరికా జెండాతో కప్పినట్లు ఉన్న ఒక చిత్రాన్ని ‘ఎక్స్’లో పోస్ట్ చేశారు. దీనితో డెన్మార్క్‌కు చెందిన ఆ భూభాగాన్ని స్వాధీనం చేసుకోవాలనే ట్రంప్ ఆకాంక్ష గురించి చర్చ మళ్లీ తెరపైకి వచ్చింది.

తర్వాత, కెమెరా ముందుకు వచ్చిన స్టీఫెన్ మిల్లర్, అమెరికా శక్తి సామర్థ్యాల గురించి, గ్రీన్‌లాండ్‌పై ట్రంప్‌కు ఉన్న ఆసక్తి గురించి ఎంతో నిక్కచ్చిగా తన అభిప్రాయాలను వ్యక్తం చేశారు.

”గ్రీన్‌లాండ్‌ను నియంత్రించడానికి డెన్మార్క్‌కు ఉన్న హక్కు ఏమిటి” అని మిల్లర్ ప్రశ్నించారు.

”గ్రీన్‌లాండ్ భవిష్యత్తు గురించి అమెరికాతో సైనికపరంగా పోరాడే సాహసం ఎవరూ చేయలేరు” అని వ్యాఖ్యానించారు.

ప్రపంచం కొన్ని కఠిన సూత్రాల ప్రకారం నడుస్తుందన్న మిల్లర్, ”మనం ఒక వాస్తవిక ప్రపంచంలో జీవిస్తున్నాం. ఇది కేవలం శక్తి, బలం, అధికారం ద్వారా మాత్రమే నడుస్తోంది” అని ఆయన వ్యాఖ్యానించారు.

వెనెజ్వెలాలో అమెరికా అత్యంత కచ్చితత్వంతో ప్రదర్శించిన సైనిక శక్తి విజయవంతమైన వెంటనే ఇటువంటి వ్యాఖ్యలు రావడం సంచలనం సృష్టించింది.

ఆ తర్వాత కొద్ది రోజులకే న్యూయార్క్ టైమ్స్‌తో మాట్లాడుతూ, తన ప్రపంచ స్థాయి అధికారాలకు ఉన్న ఏకైక పరిమితులు తన స్వీయ నైతికత, స్వీయ ఆలోచనలు మాత్రమే అని ప్రకటించిన ట్రంప్‌కు మిల్లర్ వ్యాఖ్యలు ఎంతో సంతృప్తిని ఇచ్చి ఉండవచ్చు.

కానీ, ఈ వైఖరి ట్రంప్ సొంత పార్టీలోని కొందరు సభ్యులకు ఆగ్రహం కలిగించింది.

ఇటీవల కాలంలో ట్రంప్‌ను తరచుగా విమర్శిస్తున్న నార్త్ కరోలినా రిపబ్లికన్ సెనేటర్ థామ్ టిల్లిస్ సీఎన్‌ఎన్‌తో మాట్లాడుతూ, ”స్టీఫెన్ మిల్లర్ తనకు అవగాహన ఉన్న విషయాలకే పరిమితం కావాలి, లేదంటే ఈ ఉద్యోగం వదిలేసి వెళ్లిపోవాలి” అని అన్నారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)