Home జాతీయ national telgu సోషల్ మీడియాను అదుపు చేయడానికి కేంద్రం ప్రయత్నిస్తోందంటూ ఆందోళనలు ఎందుకు?

సోషల్ మీడియాను అదుపు చేయడానికి కేంద్రం ప్రయత్నిస్తోందంటూ ఆందోళనలు ఎందుకు?

19
0

SOURCE :- BBC NEWS

భారత ప్రభుత్వం మీడియా నియంత్రణ కొత్త చట్టాలు

ఫొటో సోర్స్, Getty Images

భారత ప్రభుత్వం ఆన్‌లైన్ వార్తా వేదికల నియంత్రణ పరిధిని విస్తరించేందుకు కొత్త మార్పులను ప్రతిపాదించింది.

ఫేస్‌బుక్, యూట్యూబ్, ఎక్స్ వంటి ప్లాట్‌ఫామ్‌లలో పనిచేసే ఇన్‌ఫ్లుయెన్సర్లు, పాడ్‌కాస్టర్లను కూడా ఈ నియంత్రణ పరిధిలోకి తీసుకురావాలని భావిస్తోంది.

గతవారం మినిస్ట్రీ ఆఫ్‌ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ శాఖ, భారత ఐటీ నిబంధనల్లో సవరణలను సూచించింది.

ప్రస్తుతం డిజిటల్ మీడియా కంటెంట్‌ను నియంత్రించే ఈ నిబంధనలను, “పబ్లిషర్లు కాని యూజర్లు’’ షేర్ చేసే కరెంట్ అఫైర్స్, న్యూస్ కంటెంట్‌కు కూడా వర్తింపజేయాలని ప్రతిపాదించింది.

ఈ నిబంధనలు ఇప్పటి వరకు రిజిస్టర్డ్ వార్తా సంస్థలకు మాత్రమే వర్తిస్తుంది.

బీబీసీ వాట్సాప్ చానల్

నిపుణుల అభిప్రాయం ప్రకారం, ఈ మార్పులు సాధారణ యూజర్లకు షేర్ చేసే వార్తల సంబంధిత కంటెంట్‌పై ప్రభుత్వానికి మరింత నియంత్రణశక్తిని కల్పించే అవకాశం ఉంది. ఈ జాబితాలో స్వతంత్ర జర్నలిస్టులు, పాడ్‌కాస్టర్లు కూడా ఉన్నారు.

ఈ ప్రతిపాదనల ప్రకారం, సోషల్ మీడియా కంపెనీలు “సేఫ్ హార్బర్” రక్షణను కొనసాగించాలంటే ప్రభుత్వ ఆదేశాలు, మార్గదర్శకాలను అనుసరించాల్సి ఉంటుంది. ఈ రక్షణ వల్ల యూజర్లు పోస్ట్ చేసే కంటెంట్‌పై కంపెనీలకు న్యాయపరమైన బాధ్యత నుంచి మినహాయింపు లభిస్తుంది.

ఈ సవరణలు డిజిటల్ రైట్స్ కార్యకర్తలు, ఇండిపెండెంట్ కంటెంట్ క్రియేటర్లలో ఆందోళనను కలిగించాయి. సోషల్ మీడియా వేదికలపై ప్రభుత్వ ఆధ్వర్యంలోని సెన్సార్‌ను దాదాపు పూర్తిగా అమలు చేసే పరిస్థితి ఏర్పడవచ్చని వారు చెబుతున్నారు.

అలాగే విమర్శకులను లక్ష్యంగా చేసుకోవడానికి, భిన్నమైన అభిప్రాయాలను అణచివేయడానికి ఈ నిబంధనలను ఆయుధంగా ఉపయోగించవచ్చని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

అయితే, ఈ సవరణలు ప్రస్తుత ఐటీ నిబంధనలను బలోపేతం చేస్తాయని, తప్పుడు వార్తలు, విద్వేష ప్రసంగాలు, డీప్‌ఫేక్‌లను నియంత్రించడంలో సహాయపడతాయని ప్రభుత్వం అంటోంది. ఈ ప్రతిపాదనలపై ప్రజల అభిప్రాయాలను ఏప్రిల్ 14 వరకు ఆహ్వానించింది.

భారత ప్రభుత్వం మీడియా నియంత్రణ కొత్త చట్టాలు

ఫొటో సోర్స్, Sandeep Singh

ఆకాశ్ బెనర్జీ అనే కంటెంట్ క్రియేటర్ నడిపిస్తున్న యూట్యూబ్ చానెల్ ‘ది దేశ్‌భక్త్‌’కు 60 లక్షలకు పైగా సబ్‌స్క్రైబర్లు ఉన్నారు. ఈ నిబంధనలు భయాందోళనకర వాతావరణాన్ని సృష్టించి, అనేకమంది కంటెంట్ క్రియెటర్లను స్వీయ నియంత్రణవైపు నెట్టవచ్చని ఆకాశ్ అభిప్రాయపడ్డారు.

“ఆన్‌లైన్ కంటెంట్‌ను నియంత్రించే అనేక చట్టాలు ఉన్నప్పటికీ, దేశంలో విద్వేష ప్రసంగాలు, తప్పుడు వార్తలు తగ్గలేదు. మరోవైపు, ప్రభుత్వంపై విమర్శలు చేసే పోస్టులు, అవి జోక్‌లాగా ఉన్నా, ఎక్కువగా నిషేధానికి గురవుతున్నాయి లేదా వాటిని పూర్తిగా తొలగించేస్తున్నారు” అని బెనర్జీ అన్నారు. అయితే, ఈ ఆరోపణలను అధికారులు తిరస్కరిస్తున్నారు.

ఇంటర్నెట్ హక్కుల కార్యకర్తలు, ఈ కొత్త నిబంధనలు భిన్నాభిప్రాయాలను అణచివేయడానికి దుర్వినియోగం కావచ్చని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

గతనెలలో, భారత ఐటీ చట్టంలోని సెక్షన్ 69ఏ ప్రకారం జారీ చేసిన ఆదేశాల మేరకు, సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఎక్స్ సుమారు డజన్ అకౌంట్లను బ్లాక్ చేసింది. వీటిలో చాలా అకౌంట్లు ప్రభుత్వంపై వ్యంగ్యంగా పోస్టులు చేసేవే.

భారత ప్రభుత్వం మీడియా నియంత్రణ కొత్త చట్టాలు

ఫొటో సోర్స్, Getty Images

కుమార్ నయన్ అనే వ్యక్తి, తన సోషల్ మీడియా అకౌంట్‌కు సుమారు 2.42 లక్షల ఫాలోయర్లు ఉన్నాయని చెబుతూ, తన అకౌంట్‌ను బ్లాక్ చేసే ముందు ఎలాంటి నోటీసు లేదా వివరణ ఇవ్వలేదని బీబీసీకి తెలిపారు.

కోర్టు ఆదేశాలతో ఈవారం ఆయన అకౌంట్ తిరిగి అందుబాటులోకి వచ్చిందని నయన్ అన్నారు. అయితే, ఆయన చేసిన 10 పోస్టులు ఇంకా భారత్‌లో బ్లాక్ అయ్యే ఉన్నాయి. అవి ప్రభుత్వం నియమించిన కమిటీ సమీక్షలో ఉన్నాయి. బీబీసీ ఆ పోస్టులను పరిశీలించగా, అవన్నీ ప్రధానమంత్రి నరేంద్ర మోదీని వ్యంగ్యంగా చూపించడం లేదా ఆయన నేతృత్వంలోని భారతీయ జనతా పార్టీ ప్రభుత్వాన్ని విమర్శించడమే లక్ష్యంగా ఉన్నాయి.

“ఈ పోస్టులు దేశ భద్రతకు ముప్పు కలిగిస్తాయనో సామాజిక సమతుల్యతను భంగం కలిగిస్తాయనో ఎవరూ అనరు. ఇవి కేవలం ఫన్నీగా చేసిన పోస్టులే. మరి ప్రభుత్వం వాటిని ఎందుకు తొలగించాలని కోరుతోంది?” అని నయన్ ప్రశ్నించారు.

కోర్టులో ఈ ఆదేశాలను సవాలు చేయడంతో తన వివరాలు బయటకు వచ్చాయని, ఇది తన భద్రతపై ఆందోళన కలిగిస్తోందని ఆయన తెలిపారు.

“సోషల్ మీడియాలో ఉండే గోప్యతను నేను కోల్పోయాను. అంటే అన్ని విధాలుగా ప్రమాదకరమే, కాని విజిల్ బ్లోయర్లకు, విమర్శకులకు వేధింపుల నుంచి ఇది రక్షణ కల్పించే అవకాశం కూడా ఉంది” అని ఆయన చెప్పారు.

తన గుర్తింపు బయటపడిన తరువాత నయన్ తన నివాసాన్ని మార్చుకున్నారు.

బీబీసీ ఈ విషయంపై కేంద్ర ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ శాఖకు ప్రశ్నల జాబితాను పంపింది.

ఇదిలా ఉండగా, అమెరికా ప్రభుత్వానికి చెందిన తాజా నివేదిక ప్రకారం, అమెరికన్ సోషల్ మీడియా కంపెనీలకు “రాజకీయ ప్రేరణతో కనిపించే కంటెంట్, అకౌంట్ల తొలగింపు కోసం 2021 నుంచి అభ్యర్థనలు పెరిగాయి.

ఈ ప్రతిపాదిత సవరణలు ప్రభుత్వానికి ఇప్పటికే ఉన్న “విస్తృత నియంత్రణ వ్యవస్థను” మరింత బలపరుస్తాయని డిజిటల్ హక్కుల కార్యకర్త నిఖిల్ పహ్వా అన్నారు.

టైమ్స్ ఆఫ్ ఇండియా వార్తా పత్రికలో అపార్ గుప్తాతో కలిసి రాసిన వ్యాసంలో, 2021లో ప్రవేశపెట్టిన ఐటీ నిబంధనల తర్వాతి సవరణలు ఎలా ప్రభుత్వ నియంత్రణను పెంచాయో పహ్వా వివరించారు.

2021 సవరణతో డిజిటల్ వార్తా సంస్థలు ప్రభుత్వ పర్యవేక్షణలోకి వచ్చాయి. 2025లో జరిగిన మరో మార్పుతో కేంద్ర హోంశాఖ నిర్వహించే “సహయోగ్ పోర్టల్” మరింత బలపడింది. ఈ కేంద్రీకృత వేదిక ద్వారా అనేక ప్రభుత్వ సంస్థలు తక్కువ పారదర్శకతతో, పరిమిత రక్షణలతో సోషల్ మీడియా కంపెనీలకు కంటెంట్ తొలగింపు ఆదేశాలు జారీ చేయగలవని ఆయన పేర్కొన్నారు.

భారత ప్రభుత్వం మీడియా నియంత్రణ కొత్త చట్టాలు

ఫొటో సోర్స్, Getty Images

కంటెంట్‌ను తొలగించేందుకు ప్రత్యేకంగా పనిచేసే మరో వ్యవస్థగా ఈ పోర్టల్ ఉంటుంది. ఇది ఐటీ చట్టంలోని సెక్షన్ 69ఏ కింద కేంద్ర ప్రభుత్వానికి ఉన్న బ్లాకింగ్ అధికారాలకు భిన్నంగా పనిచేస్తుంది.

2026 ప్రారంభంలో ఐటీ నిబంధనలను మళ్లీ సవరించారు. ఇందులో సోషల్ మీడియా కంపెనీలు ప్రభుత్వ బ్లాకింగ్ ఆదేశాలను అమలు చేయడానికి ఉన్న గడువును 36 గంటల నుంచి కేవలం 3 గంటలకు తగ్గించారు. దీంతో చట్టపరమైన సమీక్షకు ఉన్న అవకాశం గణనీయంగా తగ్గింది.

“భారత మార్కెట్‌ను కోల్పోకుండా ఉండేందుకు ప్లాట్‌ఫామ్‌లు ఈ ఆదేశాలను పాటిస్తున్నాయి. కానీ తమ అభిప్రాయాలను వ్యక్తం చేసిన పౌరులకు ఎలాంటి నోటీసు, లేదా కారణాలు చూపించడం లేదు. అలాగే, వేగంగా మారుతున్న నియంత్రణలతో పోలిస్తే చట్ట వ్యవస్థ వెనుకబడుతోంది. దీంతో ప్రభుత్వం లేదా ప్లాట్‌ఫామ్‌ల నుంచి బాధ్యత కోరడం కష్టమవుతోంది” అని పహ్వా పేర్కొన్నారు.

ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ శాఖా కార్యదర్శి ఎస్.కృష్ణన్ ఐటీ నిబంధనలను, తాజా సవరణలను సమర్థించారు. ఈ మార్గదర్శకాలు చట్టానికి రాజ్యాంగానికి అనుగుణంగా ఉన్నాయని ఆయన అన్నారు.

‘‘న్యూస్, కరెంట్ అఫైర్స్‌కు ఒకే విధమైన పాలసీ లేదా సాధారణ చట్రం అవసరం ఉంది. ఎందుకంటే ఈ కంటెంట్‌ను ఇప్పుడు కేవలం వార్తా సంస్థలే కాకుండా సాధారణ పౌరులు కూడా షేర్ చేస్తున్నారు” అని ఆయన బీబీసీతో అన్నారు.

మార్చిలో బ్లాక్ అయిన ఖాతాల్లో ఒకటి @ActivistSandeep. మెయిన్‌స్ట్రీమ్ మీడియా బీజేపీకి అనుకూలంగా వ్యవహరిస్తోందని భావించిన తర్వాత తాను విమర్శాత్మక పోస్టులు చేయడం ప్రారంభించానని దీన్ని నిర్వహించే సందీప్ సింగ్ చెప్పారు.

ఈ కథనం రాసే సమయానికి ఆయన అకౌంట్ భారత్‌లో ఇంకా బ్లాక్ అయ్యే ఉంది.

“నేను నిజం కోసం నిలబడుతున్నాను. నా అకౌంట్లను లేదా పోస్టులను బ్లాక్ చేయడం వల్ల నేను నిజం చెప్పడం ఆపను” అని బీబీసీతో అన్నారు సింగ్.

కోర్టులో సవాలు చేయగల సామర్ధ్యం తనకు ఉందని, కానీ ప్రతి ఒక్కరూ అలా చేయలేరని కుమార్ నయన్ అంటున్నారు

“ప్రజాస్వామ్యంలో, కొన్ని పరిమితులు ఉన్నప్పటికీ, ప్రజలు భయంలేకుండా తమ అభిప్రాయాలను వ్యక్తం చేసే స్వేచ్ఛ ఉండాలి. భారత్ ఒక ప్రజాస్వామ్య దేశమైనప్పుడు ఇది ఎందుకు అంత కష్టమైందో అర్థం కావడం లేదు” అని ఆయన అన్నారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)