Home జాతీయ national telgu సైన్స్ ఆఫ్ లవ్: ప్రేమంటే ఏంటి, మీరిప్పుడు ప్రేమలో ఉన్నారా?

సైన్స్ ఆఫ్ లవ్: ప్రేమంటే ఏంటి, మీరిప్పుడు ప్రేమలో ఉన్నారా?

6
0

SOURCE :- BBC NEWS

సైన్స్ ఆఫ్ లవ్

ఫొటో సోర్స్, iStock

5 గంటలు క్రితం

చదివే సమయం: 6 నిమిషాలు

చాలామంది ప్రేమలో పడతారు. ప్రేమించిన వ్యక్తి ఒక్క క్షణం కనిపించకపోయినా తపించిపోతారు. అయితే, ప్రేమ అనే ఆ రెండక్షరాల వెనుక ఉన్న అసలు గుట్టు మీకు తెలుసా?

ప్రేమ అసలు ఎలా పుడుతుందో, దానికి కారణం ఏంటో ఎప్పుడైనా తెలుసుకోవాలని అనిపించిందా?

ఎవరైనా ప్రేమలో పడ్డారంటే, అందులో మూడు దశలు ఉంటాయి. ఈ మూడు దశల్లో వేరు వేరు హార్మోన్లు వారిని ప్రేమలో ముందుకు నడిపిస్తాయి.

మనం ప్రేమలో పడ్డప్పుడు మెదడులో జరిగేవన్నీ ఒక మానసిక రుగ్మతలాగే ఉంటాయి. మనల్ని ఒకరు ఆకర్షిస్తున్నారు అంటే, మనకు తెలీకుండానే మనం వారి జన్యువులను ఇష్టపడడం కూడా ఒక కారణం కావచ్చు. లైంగిక ఆకర్షణ విషయానికి మన రూపురేఖలతోపాటు వాసనకు కూడా చాలా ప్రాధాన్యం ఉంటుంది.

ప్రేమ బంధం సుదీర్ఘ కాలం కొనసాగుతుందా లేదా అనేది నిర్ధరించుకోడానికి కూడా సైన్స్ సాయం చేయగలదు.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
ప్రేమ, రసాయనాలు, మన్మథ బాణాలు

ఫొటో సోర్స్, Getty Images

ఈ రసాయనాలు-మన్మధ బాణాలు

బుగ్గలు ఎరుపెక్కితే, గుండె వేగంగా కొట్టుకుంటుంటే, చేతులు జిగురులా అతుక్కుంటుంటే కచ్చితంగా మీరు ప్రేమలో పడ్డారనే లెక్క. ప్రేమలో పడిన ఎవరికైనా మొదట బయటకు కనిపించే లక్షణాలు ఇవే.

కానీ, ఆ మన్మధ బాణం మనసులో గుచ్చుకోగానే శరీరం లోపల రకరకాల రసాయన సంకేతాలు వెలువడడం మొదలవుతుంది.

ఇక ప్రేమ విషయానికి వస్తే అది మన జీవరసాయన శాస్త్రంపై ఆధారపడి ఉంటుంది. దీనిపై పరిశోధనలు చేసిన ప్రముఖుల్లో న్యూజెర్సీలోని రట్‌గర్స్ యూనివర్సిటీకి చెందిన హెలెన్ ఫిషర్ ఒకరు.

ఎవరైనా ప్రేమలో పీకల్లోతు మునిగిపోవడానికి మూడు దశలే కారణమని ఆమె చెప్పారు. అయితే ప్రతి దశలో వేరు వేరు రసాయనాల ప్రమేయం ఉంటుందని తెలిపారు.

ప్రేమ, మూడు దశలు

ఫొటో సోర్స్, Getty Images

ప్రేమలో మొదటి దశ- వ్యామోహం

వ్యామోహం అనేది సెక్స్ హార్మోన్లు, ఈస్ట్రోజెన్ వల్ల కలుగుతుంది. టెస్టోస్టిరాన్ అనేది పురుషుల్లో మాత్రమే ఉండదు.

మహిళల్లో సెక్స్ కోరికలు పెరగడానికి కూడా అది కీలక పాత్ర పోషిస్తుంది. హెలెన్ ఫిషర్ చెప్పినట్టు ఈ హార్మోన్లు “మీరు బయట దేనికోసమో వెతికేలా” చేస్తాయి.

రెండో దశ-ఆకర్షణ

ఫొటో సోర్స్, Getty Images

రెండో దశ-ఆకర్షణ

ఈ దశలో ‘లవ్ అటాక్’ మొదలవుతుంది. ఎవరైనా ప్రేమలో పడితే, వాళ్లు ఇక దేనిగురించీ ఆలోచించరు. ఏదీ తినాలనిపించదు, సరిగా నిద్రపట్టదు.

ఎప్పుడూ తమ జీవితంలోకి కొత్తగా అడుగుపెట్టిన వారి గురించే ఆలోచనలు. పగటి కలలు కంటూ, వారి ఊహల్లో తేలిపోతూ గంటలు, రోజులు, వారాలు, నెలలు గడిపేయాలని అనిపిస్తుంది.

ఈ ఆకర్షణ దశలో ‘మోనోఅమైన్స్’ అనే న్యూరోట్రాన్స్‌మిటర్ల గ్రూప్ కీలక పాత్ర పోషిస్తుంది.

  • డోపమైన్ – ఇది కొకైన్, నికోటిన్ వల్ల కూడా యాక్టివేట్ అవుతుంది.
  • నోరెపినెఫ్రిన్ – లేదా దీన్ని అడ్రినలిన్ అని కూడా అంటారు. ఇది మనకు చెమటలు పట్టేలా, గుండె వేగంగా కొట్టుకునేలా చేస్తుంది.
  • సెరొటోనిన్ – ప్రేమకు అవసరమైన అతి ముఖ్యమైన రసాయనాల్లో ఇది ఒకటి. నిజానికి ఇది మనకు తాత్కాలికంగా “పిచ్చెక్కించినట్టుగా” అనిపించే భావాలను కలిగిస్తుంది.
మూడో దశ, అనుబంధం

ఫొటో సోర్స్, Getty Images

మూడో దశ-అనుబంధం

ప్రేమబంధం ఎక్కువ రోజులు ఉండాలనుకుంటే, ఆకర్షణ దశను దాటాక ప్రేమికులు ఈ దశలోకి అడుగుపెడతారు.

ఒక జంట సాధారణంగా ఆకర్షణ దశలో ఎక్కువ కాలం ఉండదు. అలా ఉంటే, వారు ఏ పనినీ పూర్తిగా చేయలేరు.

అనుబంధం అనేది జంటలో సుదీర్ఘకాలం కలిసి ఉండాలనే అంకితభావాన్ని కలిగిస్తుంది. పిల్లలు కావాలనుకునేవరకు ఈ బంధం ఇద్దరినీ కలిపి ఉంచుతుంది.

ఈ దశలో మన నాడీ వ్యవస్థలో విడుదలయ్యే రెండు రసాయనాలు చాలా కీలకం. సామాజిక బంధం ఏర్పడటంలో అవి ముఖ్యమైన పాత్ర పోషిస్తాయని భావిస్తున్నారు.

ఆక్సిటోసిన్

  • ఇది పిల్లలు పుట్టే సమయంలో హైపోథాలమస్‌లో నుంచి విడుదలవుతుంది.
  • తల్లిలో పాలు పట్టే ప్రక్రియను ప్రారంభిస్తుంది.
  • తల్లి–శిశువుల మధ్య బంధాన్ని బలపరుస్తుంది.
  • ఇది స్కలనం సమయంలో స్త్రీ–పురుషులిద్దరిలోనూ విడుదల అవుతుంది.

సన్నిహితంగా ఉన్నప్పుడు జంట మధ్య బంధాన్ని మరింత దృఢంగా చేస్తుందని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు.

ఒక సిద్ధాంతం ప్రకారం, జంట ఎంత ఎక్కువ సెక్స్ జీవితం గడిపితే, వారి మధ్య అంత గాఢమైన అనుబంధం ఏర్పడుతుంది.

వాసోప్రెస్సిన్

  • సుదీర్ఘకాల బంధం కొనసాగటానికి ఇది మరో ముఖ్యమైన రసాయనం.
  • ఇది అసలుగా మూత్రపిండాల్లో నీరు నిల్వ చేయడాన్ని నియంత్రించే హార్మోన్.
  • ప్రెయిరీ వోల్స్ అనే జంతువులపై జరిగిన పరిశోధనల్లో, స్త్రీ–పురుష జంటల దీర్ఘకాల సంబంధాల్లో దీని పాత్ర ఉన్నట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు.
ప్రయిరీ వోల్

ఫొటో సోర్స్, Getty Images

అనుబంధానికి చిరునామా ప్రెయిరి వోల్

మగ, ఆడ మధ్య సుదీర్ఘ బంధం గురించి చెప్పేటప్పుడు ప్రెయిరీ వోల్ అనే ప్రాణి సమాజ జీవితం, సెక్స్‌ను ఒక చిరునామాగా చెబుతారు.

ప్రెయిరీ వోల్స్ మిగతా జంతువుల్లా పునరుత్పత్తి అవసరం ఉన్నప్పుడు మాత్రమే సంభోగంలో పాల్గొనకుండా, సుదీర్ఘ కాలం పాటు సెక్స్‌లో పాల్గొంటాయి.

వాసోప్రెస్సిన్, ఆక్సిటోసిన్ అనే రెండు హార్మోన్లే దీనికి కారణమని భావిస్తున్నారు. కలయిక తర్వాత వాటిలో విడుదలయ్యే ఈ హార్మోన్లు ఆ జంట మధ్య బంధాన్ని మరింత దృఢంగా మారుస్తాయి.

ఒక ప్రయోగంలో భాగంగా మగ ప్రెయిరీ వోల్‌కు వాసోప్రెస్సిన్ ప్రభావాన్ని తగ్గించే మందు ఇచ్చారు. ఆ తర్వాత వెంటనే తన భాగస్వామిపై దానికి ఆసక్తి తగ్గిపోయింది. అంతకు ముందులా ఉండడం మానేసింది.

అది కొత్తగా వచ్చిన మగవాళ్ల నుంచి తన భాగస్వామిని కాపాడుకోలేకపోయింది.

జన్యువుల ప్రభావం

ఫొటో సోర్స్, Getty Images

భాగస్వామి జన్యువుల ప్రభావం

భాగస్వామిని ఎంచుకునే విషయానికి వస్తే, మనం మనకు తెలీకుండానే వారి వైపు ఆకర్షితులవుతామని కూడా చెబుతున్నారు.

ఆకర్షణ వెనుక సైన్స్ ప్రభావం గురించి అధ్యయనం చేసిన పరిశోధకులు మనుషులు తమ భాగస్వాములను ఎలా ఎంపిక చేసుకుంటారు అనేదానిపై ఒక పరిణామ సిద్ధాంతం రూపొందించారు.

అత్యుత్తమ జన్యువులు ఉన్న ఎవరితోనైనా సంభోగం వల్ల మనకు ప్రయోజనం లభిస్తుంది. తర్వాత వాటినే మనం మన పిల్లలకు కూడా అందిస్తాం, వారు ఆరోగ్యంగా ఉండేలా చూసుకుంటాం. అలా మనం మన ఆరోగ్యకరమైన జన్యువులను రాబోవు తరాలకు కూడా అందిస్తుంటాం.

మనం ఒక సమర్థమైన భాగస్వామిని చూసినపుడు, మన పిల్లల్లో వారి జన్యువులు ఉండాలని కోరుకుంటున్నామా, లేదా అని మనం అంచనా వేస్తాం.

అలా చేయడంలో కూడా రెండు పద్ధతులు ఉన్నాయని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. వాటిపై ప్రస్తుతం విస్తృతంగా పరిశోధనలు జరుగుతున్నాయి.

ప్రేమ వెనుక, అనుబంధం వెనుక ఉన్న గుట్టును పూర్తిగా విప్పే ప్రయత్నాలు కొనసాగుతున్నాయి.

(గమనిక: ఈ కథనం తొలిసారి 2019 ఫిబ్రవరి 14న బీబీసీ తెలుగులో ప్రచురితమైంది)

( బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)