Home జాతీయ national telgu సెంటినెల్: వీడియోల కోసం అరుదైన తెగ వద్దకు వెళ్లిన యువకుడు, అదుపులోకి తీసుకున్న అధికారులు

సెంటినెల్: వీడియోల కోసం అరుదైన తెగ వద్దకు వెళ్లిన యువకుడు, అదుపులోకి తీసుకున్న అధికారులు

3
0

SOURCE :- BBC NEWS

సెంటినెల్ తెగ

ఫొటో సోర్స్, Getty Images

3 గంటలు క్రితం

సెంటినెల్ తెగ. ఒక చిన్న దీవిలో ఉన్న ఈ తెగ చుట్టూ ఉన్న రహస్యమే చాలామంది ఔత్సాహికులు వారి వద్దకు వెళ్లేందుకు ప్రోత్సహిస్తోంది. ఇది అరుదైన తెగలకు పెరుగుతున్న సరికొత్తగా ముప్పుగా మారినట్లు స్థానిక నివాసిత హక్కుల సంస్థలు పేర్కొంటున్నాయి.

ముఖ్యంగా మార్చి 31న జరిగిన ఘటనతో ఈ ముప్పు మరోసారి చర్చనీయాంశమైంది. ఎలాంటి అనుమతులు లేకుండా అమెరికా పర్యటకుడు మైఖైలో విక్టోరోవిచ్ పాలీయాకోవ్.. ఈ దీవికి వెళ్లారు. ఈ తెగ ప్రజలను కలిసేందుకు ప్రయత్నించారు.

పాలీయాకోవ్ అక్కడికి వెళ్తూ తన ప్రయాణాన్ని వీడియోలో రికార్డు చేయడమే కాకుండా, ఒక సోడా బాటిల్‌ను, కొబ్బరికాయను అక్కడ తీరంలో వదిలి వచ్చారు.

స్థానిక ప్రజల భద్రతను కాపాడేందుకు 1956 చట్టం ప్రకారం ఆ దీవికి ప్రవేశాన్ని నిషేధించారు. ఈ చట్టాన్ని ఉల్లంఘించి అక్కడికి వెళ్లిన ఈ యువ అమెరికా పర్యటకుడిని స్థానిక భారత అధికారులు అదుపులోకి తీసుకున్నారు.

”బయటి ప్రపంచంతో ఏమాత్రం సంబంధం లేకుండా జీవిస్తున్న తెగకు ఇన్‌ఫ్లుయెన్సర్లు పెరుగుతోన్న ముప్పుగా కనిపిస్తున్నారన్న ఆందోళన ఉంది’’ అని ముంబయిలో పని చేస్తున్న బీబీసీ ప్రతినిధి జాహ్నవి మూలే అన్నారు.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
సెంటినలీస్ తెగ ప్రజలు

ఫొటో సోర్స్, SURVIVAL INTERNATIONAL

ఉత్తర సెంటినెల్ దీవిలో నివసించే ప్రజల గురించి పెద్దగా బయట ప్రపంచానికి తెలియదు. హిందూ మహా సముద్రంలోని మధ్యలో ఈ దీవి ఉంది. భారత ప్రధాన భూభాగానికి 1,200 కి.మీల దూరంలో ఉండే ఈ దీవిలో ఎంత మంది ప్రజలు ఉన్నారు? వారేం భాష మాట్లాడతారు? అన్నది కూడా ఎవరికీ తెలియదు.

ఇటీవల కాలంలో ఈ తెగను సంప్రదించేందుకు కొందరు వ్యక్తులు ప్రయత్నిస్తుండటంతో భారత్‌లోని ఆంత్రోపాలజిస్టులు, కార్యకర్తలు ఆందోళనలు వ్యక్తం చేస్తున్నారు.

బయట వ్యక్తులతో తమకు సంబంధాలు అవసరం లేదన్నట్లుగా ఈ తెగవారు కనిపిస్తారు.

బయటి ప్రపంచపు వ్యక్తులు అక్కడ పర్యటించడం మూలంగా వారి ప్రాణాలకు, తెగకు ముప్పు వాటిల్లే అవకాశం ఉందని స్థానిక నివాసితుల హక్కుల సంస్థ సర్వైవల్ ఇంటర్నేషనల్ తెలిపింది.

ఈ సంఘటన తమని తీవ్రంగా కలచివేసిందని, ఈ రకమైన తెగలకు ఇన్‌ఫ్లూయెన్సర్లు పెరుగుతోన్న సరికొత్త ముప్పుగా మారుతున్నట్లు సర్వైవల్ ఇంటర్నేషనల్ పేర్కొంది.

ఈ కేసు తమ దృష్టికి వచ్చిందని, పరిస్థితిని నిశితంగా పరిశీలిస్తున్నామని అమెరికా అథారిటీలు చెప్పాయి.

సెంటినెల్ తెగ

ఫొటో సోర్స్, INDIAN COASTGUARD/SURVIVAL INTERNATIONAL

సెంటినెల్ నివాసితులు ఎవరు? వారిని ఎందుకు కలవకూడదు?

బయటి ప్రపంచంతో ఏమాత్రం సంబంధం లేకుండా కేవలం ఒక చిన్న దీవికే పరిమితమై జీవిస్తున్న అతి కొద్ది ఆదిమ తెగల్లో సెంటినెల్ తెగ ఒకటి.

వీరు నివసిస్తున్న దీవి అండమాన్ ద్వీప సమూహంలో ఉంది. ఈ దీవి సుమారు 60 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం ఉంటుంది. కానీ వారి గురించి ప్రపంచానికి తెలిసినదంతా.. దూరం నుంచి వారిని గమనించటం ద్వారా తెలుసుకున్నదే.

నిజానికి..ప్రపంచంలో ఇప్పుడున్న అన్ని ఆదిమ జాతి ప్రజలకన్నా కూడా వీరు మిగతా ప్రపంచానికి దూరంగా నివసిస్తుంటారని నిపుణులు భావిస్తున్నారు.

వీరు.. ఆఫ్రికాలో ఆవిర్భవించిన మొట్టమొదటి మానవ జనాభా ప్రత్యక్ష వారసులు కావచ్చునని, దాదాపు 60 వేల సంవత్సరాల నుంచీ ఈ అండమాన్ దీవుల్లో నివసిస్తున్నారని భావిస్తున్నారు. వీళ్ల సంఖ్య స్పష్టంగా తెలియనప్పటికీ, 50 నుంచి 200 మంది వరకు ఈ తెగ వారు ఉండొచ్చని నిపుణుల అంచనా.

ఇతర అండమాన్ దీవుల్లోని ఆదిమజాతుల భాషకూ.. ఈ సెంటినలీస్ భాషకూ ఏమాత్రం పోలిక లేకపోవటాన్నిబట్టి.. వీరు తమ చుట్టుపక్కల దీవుల్లోని ఆదిమజాతుల వారితో కూడా కొన్ని వేల ఏళ్లుగా సంబంధాలు పెట్టుకోలేదని అర్థమవుతోంది.

అండమాన్‌లో 5 రకాల ఆదివాసీ తెగలున్నాయి. జారావా, ఉత్తర సెంటినలీస్, గ్రేట్ అండమానీస్, ఓంగా, షోంపెన్ అనేవి ఈ ఐదు తెగలు. వీరిలో జారావా, ఉత్తర సెంటినెలీస్ తెగ ప్రజలు ఇంకా బయటి ప్రపంచానికి దూరంగా జీవిస్తున్నారు.

1974లో ఒక దర్శకుడు ఈ ప్రాంతాన్ని సందర్శించినప్పుడు, బాణంతో ఆయన కాలికి గాయం చేశారు. నేషనల్ జియోగ్రఫిక్ చానల్ కోసం డాక్యుమెంటరీ ఫిల్మ్ చేసేందుకు ఆయన సిబ్బంది ప్రయత్నించారు.

2018 నవంబర్‌లో అమెరికాకు చెందిన 27 ఏళ్ల జాన్ అలెన్ చౌ.. ప్రపంచానికి దూరంగా జీవించే సెంటినలీస్ జాతి ప్రజలకు క్రిస్టియన్ మత ప్రచారం చేసేందుకు అక్కడికి వెళ్లగా ఆయన హత్యకు గురయ్యారు.

బాణంతో కొట్టి ఆయన్ను చంపేశారని, ఆ దీవికి తనను తీసుకెళ్లేందుకు జాన్ అలెన్ మత్స్యకారులకు లంచం ఇచ్చినట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి.

సెంటినెల్ తెగ ప్రజలు

ఫొటో సోర్స్, Getty Images

వీళ్లకు డబ్బు గురించి తెలియదు

ఆ తెగ వారిని కలవటం నేరం. బయటి వ్యాధులు ఆ తెగవారికి సోకే ప్రమాదాన్ని నివారించటానికి.. వారిని ఎవరూ కలవరాదన్న నిషేధం విధించారు.

1956 నుంచి ఈ నిషేధం కొనసాగుతోంది. ఎవరూ ఈ ప్రాంతానికి వెళ్లకుండా ఉండేందుకు ఈ దీవి చుట్టూ ఇండియన్ కోస్ట్ గార్డు పర్యవేక్షిస్తూ ఉంటోంది.

”సెంటినలీస్ తెగ జనసంఖ్య చాలా తక్కువగా ఉంది. వారిని ఏ విధంగా కలవటమైనా చట్టవిరుద్ధం” అని సుబీర్ భౌమిక్ అనే జర్నలిస్ట్ గతంలో బీబీసీకి తెలిపారు. ఆయన చాలా సంవత్సరాలుగా ఈ దీవుల్లో పాత్రికేయుడిగా పని చేశారు.

అండమాన్ ఆదివాసీ తెగల వారిని ఫోటోలు, వీడియోలు తీయటం కూడా.. మూడేళ్ల వరకూ జైలు శిక్ష విధించగల నేరమని భారత ప్రభుత్వం 2017లో ప్రకటించింది.

సెంటినలీస్ తెగ జీవనాధారం ఆహారం కోసం వేటాడటం. అయితే.. 60 వేల ఏళ్ల కిందట వీరు ఎలా జీవించారో ఇప్పుడూ అలాగే జీవిస్తున్నారని అనుకోవడానికి వీలులేదని పరిశోధకులు చెప్తున్నారు.

బయటి ప్రపంచంతో ఏమాత్రం సంబంధం లేకపోయినా.. బ్రిటిష్ వలస పాలనా కాలంలో అండమాన్ దీవుల్లోని ఆదిమ తెగలు కొన్నింటి గురించి బయటి ప్రపంచానికి తెలిసింది.

కానీ.. ”బ్రిటిష్ వలస రాజ్య ఆక్రమణ.. అండమాన్ నికోబార్ దీవుల్లో నివసించే తెగలను ధ్వంసం చేసింది. వేలమంది ఆదివాసీలను తుడిచిపెట్టింది. వాస్తవ జనాభాలో కేవలం అతి చిన్న భాగం మాత్రమే ఇప్పుడు బతికుంది. కాబట్టి బయటివారు అంటే వారి భయం అర్థం చేసుకోగలిగేదే” అని సర్వైవల్ ఇంటర్నేషనల్ డైరెక్టర్‌గా పనిచేసిన స్టీఫెన్ కోరీ గతంలో బీబీసీతో అన్నారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)