Home జాతీయ national telgu ‘సిక్కు వేర్పాటువాది పన్నూ హత్యకు కుట్ర పన్నింది నిజమే’, అమెరికన్ కోర్టులో అంగీకరించిన నిఖిల్ గుప్తా

‘సిక్కు వేర్పాటువాది పన్నూ హత్యకు కుట్ర పన్నింది నిజమే’, అమెరికన్ కోర్టులో అంగీకరించిన నిఖిల్ గుప్తా

6
0

SOURCE :- BBC NEWS

సిక్కు వేర్పాటువాదం, అమెరికా, కెనడా, పంజాబ్, భారత ప్రభుత్వం

ఫొటో సోర్స్, SOCIAL MEDIA

4 గంటలు క్రితం

చదివే సమయం: 7 నిమిషాలు

సిక్కు వేర్పాటువాద నాయకుడు గురుపట్వంత్ సింగ్ పన్నూను హత్య చేసేందుకు 2023లో విఫలయత్నం చేసినట్లు శుక్రవారం(ఫిబ్రవరి 13)న న్యూయార్క్‌లో భారత పౌరుడు నిఖిల్ గుప్తా తన నేరాన్ని అంగీకరించారు.

భారత ప్రభుత్వ అసమ్మతివాదులను అంతమొందించే ప్రయత్నాలతో ముడిపడి ఉందని కెనడా, అమెరికా అధికారులు వాదించిన ఈ కేసులో నేరాన్ని అంగీకరించడం ఇదే మొదటిసారని అమెరికన్ వార్తాపత్రిక న్యూయార్క్ టైమ్స్ రాసింది.

సుపారీ హత్య, హత్యకు కుట్ర, మనీలాండరింగ్‌కు కుట్ర అభియోగాలను 54 ఏళ్ల నిఖిల్ గుప్తా అమెరికాలోని మాన్‌హట్టన్ ఫెడరల్ కోర్టులో అంగీకరించారు.

ఈ కేసులో గుప్తాకు 24 ఏళ్ల వరకు జైలు శిక్ష పడే అవకాశం ఉందని ప్రాసిక్యూటర్లు అంచనా వేస్తున్నారు. అయితే, ఈ ఆరోపణలతో తమకు ఎలాంటి సంబంధం లేదని భారత ప్రభుత్వం తిరస్కరిస్తూ వస్తోంది.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌

మే 29న శిక్ష ఖరారు

న్యూయార్క్ కేంద్రంగా పనిచేస్తున్న ‘సిక్స్ ఫర్ జస్టిస్’ సంస్థకు న్యాయవాదిగా ఉన్నారు గురుపట్వంత్ సింగ్ పన్నూ. ఖలిస్తాన్ మద్దతుదారు. కోర్టు తీర్పు తర్వాత, వేర్పాటువాద మద్దతుదారులు కోర్టులో నినాదాలు చేశారు.

అమెరికా, కెనడా ద్వంద్వ పౌరసత్వం కలిగిన పన్నూను హత్య చేసేందుకు ఓ భారత ప్రభుత్వ అధికారితో కలిసి నిఖిల్ గుప్తా కుట్ర పన్నినట్లు ప్రాసిక్యూషన్ ఆరోపించింది.

అయితే, పన్నూ హత్య కుట్రతో తమకు సంబంధం లేదని, అది ‘ప్రభుత్వ విధానానికి విరుద్ధం’ అని భారత ప్రభుత్వం తిరస్కరించింది.

సిక్కు వేర్పాటువాదం, అమెరికా, కెనడా, పంజాబ్, భారత ప్రభుత్వం

ఫొటో సోర్స్, AFP via Getty Images

అమెరికా న్యాయ శాఖ ఏమంది?

“అమెరికాలో ఒక వ్యక్తిని హత్య చేయించేందుకు మరో వ్యక్తితో ఒప్పందం చేసుకున్నాను. అందుకోసం న్యూయార్క్‌లో ఒకరికి 15 వేల డాలర్లు చెల్లించాను” అని నిఖిల్ గుప్తా చెప్పినట్టు విచారణ పత్రాల్లో ఉంది.

నిఖిల్ గుప్తాను 2023లో చెక్ రిపబ్లిక్‌లో అరెస్టు చేసి అమెరికాకు అప్పగించారు. తాను నిర్దోషినని ఆయన అన్నారు. 2024 జూన్ నుంచి బ్రూక్లిన్ జైలులో ఉన్నారు.

పన్నూను అంతమొందించేందుకు భారత ప్రభుత్వ అధికారి వికాస్ యాదవ్ 2023 మే నెలలో గుప్తాను నియమించుకున్న కుట్ర గురించి చార్జిషీట్‌లో వివరించారు.

చార్జిషీట్‌లో పేర్కొన్న వివరాల ప్రకారం.. అంతర్జాతీయంగా మాదకద్రవ్యాలు, ఆయుధ అక్రమ రవాణాలో తన పాత్ర గురించి వికాస్ యాదవ్‌తో పాటు ఇతరులకు కూడా గుప్తా చెప్పారు.

2024లో విడుదల చేసిన సవరించిన రెండో చార్జిషీట్‌ ప్రకారం, “అప్పట్లో భారత ప్రభుత్వ అధికారిగా ఉన్న వికాస్ యాదవ్‌తో పాటు భారత్‌లోని, ఇతర ప్రాంతాల్లోని మరికొందరితో కలిసి న్యాయవాది, రాజకీయ కార్యకర్త అయిన పన్నూను హతమార్చేందుకు గుప్తా కుట్ర పన్నారు.”

“నిఖిల్ గుప్తా భారతీయ పౌరుడు. భారత్‌లో నివసించారు. వికాస్ యాదవ్, ఇతరులకు పంపిన మెసేజ్‌లలో తనను తాను అంతర్జాతీయ మాదకద్రవ్యాలు, ఆయుధాల అక్రమ రవాణాదారుడిగా చెప్పుకున్నారు. వికాస్ యాదవ్ భారత ప్రభుత్వ క్యాబినెట్ సెక్రటేరియట్‌ ఉద్యోగి. అక్కడ దేశ నిఘా సంస్థ అయిన రీసర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్ (రా) పనిచేస్తుంది” అని చార్జిషీట్‌లో పేర్కొన్నారు.

“ఈ కేసు 2023 జూన్‌లో, అప్పటి బైడెన్ ప్రభుత్వానికి అసౌకర్యం కలిగించింది. భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీతో రాజకీయ, ఆర్థిక సంబంధాలను మరింత పెంపొందించుకునేందుకు ప్రయత్నిస్తున్న సమయంలో ఈ సమస్య తలెత్తింది. బైడెన్ ప్రధాని మోదీని అమెరికా పర్యటనకు ఆహ్వానించారు. ప్రాసిక్యూటర్ల వాదనల ప్రకారం, ఆ పర్యటన సమయంలో, ఒక సీనియర్ భారత అధికారి హత్య కుట్రకు ఆమోదం తెలిపారు” అని న్యూయార్క్ టైమ్స్ రాసింది.

సిక్కు వేర్పాటువాదం, అమెరికా, కెనడా, పంజాబ్, భారత ప్రభుత్వం

ఫొటో సోర్స్, US DEPARTMENT OF JUSTICE

అటార్నీ కార్యాలయం ప్రకటనలో ఏముందంటే..

అమెరికాలో పన్నూ హత్య కుట్రను అమలు చేసేందుకు 2023 మే నాటికి నిఖిల్ గుప్తాతో వికాస్ యాదవ్ డీల్ చేసుకున్నారు.

వికాస్ యాదవ్ సూచనల మేరకు, ఈ నేరంలో సాయం కోసం నిఖిల్ గుప్తా ఒక వ్యక్తిని సంప్రదించారు. అయితే, ఆయన వాస్తవానికి డ్రగ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అడ్మినిస్ట్రేషన్‌(డీఈఏ) కోసం పనిచేసే ఓ అండర్ కవర్ ఆఫీసర్.

ఓ కాంట్రాక్ట్ కిల్లర్‌ కోసం గుప్తా ఆ వ్యక్తిని సాయం అడిగారు.

నిఖిల్ గుప్తా, కాంట్రాక్ట్ కిల్లర్‌గా భావిస్తున్న వ్యక్తి (అండర్ కవర్ ఆఫీసర్) మధ్య విశ్వసనీయమైన వర్గాలు సమావేశం ఏర్పాటు చేశాయి. తర్వాత, నిఖిల్ గుప్తా మధ్యవర్తిగా సాగిన ఆ సంభాషణలో సదరు కాంట్రాక్ట్ కిల్లర్‌(అండర్ కవర్ ఆఫీసర్)కు లక్ష డాలర్లు చెల్లించేందుకు వికాస్ యాదవ్ అంగీకరించారు.

2023 జూన్ 9న.. నిఖిల్ గుప్తా, వికాస్ యాదవ్ మరో సహచరుడి ద్వారా అండర్ కవర్ ఆఫీసర్‌కు అడ్వాన్స్‌గా 15 వేల డాలర్లు అందజేసేందుకు ఏర్పాట్లు చేశారు.

హత్య కుట్ర అమలు చేసేందుకు, 2023 జూన్ నాటికి పన్నూ న్యూయార్క్ ఇంటి అడ్రస్, ఫోన్ నంబర్, ఆయన రోజువారీ కార్యకలాపాల వివరాలతో సహా ఆయన వ్యక్తిగత సమాచారం మొత్తాన్ని నిఖిల్ గుప్తాకు వికాస్ యాదవ్ అందించారు.

నిఖిల్ గుప్తా ఈ సమాచారాన్ని రహస్య అధికారికి అందజేశారు. ఆ తర్వాత, పన్నూపై నిఘా పెట్టిన ఫోటోలతో సహా హత్య కుట్రలో పురోగతిని నిత్యం వికాస్ యాదవ్‌కు అప్డేట్ చేసేవారు.

సిక్కు వేర్పాటువాదం, అమెరికా, కెనడా, పంజాబ్, భారత ప్రభుత్వం

ఫొటో సోర్స్, Getty Images

‘అమెరికా పౌరులకు హాని తలపెడితే వదిలిపెట్టబోం’

అటార్నీ కార్యాలయం నుంచి వచ్చిన ఒక ప్రకటన ప్రకారం, కాంట్రాక్ట్ హత్యకు గరిష్ట శిక్ష 10 సంవత్సరాలు. హత్యకు కుట్ర పన్నినందుకు గరిష్ట శిక్ష 10 సంవత్సరాలు. మనీలాండరింగ్ కుట్రకు గరిష్ట శిక్ష 20 సంవత్సరాలు.

గరిష్ట శిక్షను కాంగ్రెస్ ప్రస్తావించిందని, ఇది కేవలం సమాచారం కోసం మాత్రమేనని, అయితే ఈ కేసులో గరిష్ట శిక్షను న్యాయమూర్తి నిర్ణయిస్తారని కూడా ఆ ప్రకటన పేర్కొంది.

“ఒక అమెరికన్ పౌరుడిని హత్య చేయడానికి కుట్ర పన్నడంలో నిఖిల్ గుప్తా కీలక పాత్ర పోషించారు. అమెరికా భద్రతా సంస్థల చొరవతో ఈ హత్య పథకం అమలు కాలేదు” అని ఎఫ్‌బీఐ అసిస్టెంట్ డైరెక్టర్ రోమన్ రోగవ్స్కీ చెప్పినట్టు ఆ ప్రకటన పేర్కొంది.

“ఒక అమెరికన్ పౌరుడు తన భావ ప్రకటనా స్వేచ్ఛ హక్కును వినియోగించుకున్నందుకు అంతర్జాతీయ అణచివేతకు గురయ్యారు. ఎఫ్‌బీఐ స్పష్టంగా చెబుతోంది. మీరు ప్రపంచంలో ఎక్కడ ఉన్నా, మా పౌరులకు హాని తలపెట్టేందుకు ప్రయత్నిస్తే, వారికి న్యాయం జరిగే వరకూ వదిలిపెట్టం” అని రోగవ్స్కీ చెప్పారు.

సిక్కు వేర్పాటువాదం, అమెరికా, కెనడా, పంజాబ్, భారత ప్రభుత్వం

ఫొటో సోర్స్, Getty Images

భారత ప్రభుత్వం ఏమంటోంది?

అమెరికా లేవనెత్తిన భద్రతా ఆందోళనలను పరిశీలించేందుకు భారత్ గత ఏడాది నవంబర్‌లో ఒక ఉన్నత స్థాయి విచారణ కమిటీని ఏర్పాటు చేసింది. జాతీయ భద్రతా సమస్యలను దృష్టిలో ఉంచుకుని ఇలాంటి విషయాలను తీవ్రంగా పరిగణిస్తున్నట్టు విదేశాంగ మంత్రిత్వ శాఖ పేర్కొంది.

అమెరికా న్యాయ శాఖ అభియోగ పత్రంలో పేర్కొన్న వ్యక్తి (వికాస్ యాదవ్) భారత ప్రభుత్వ సర్వీసులో లేరని 2024 అక్టోబర్‌లో భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ ధ్రువీకరించింది.

మొదటి చార్జిషీట్‌లో ప్రభుత్వ అధికారిని “సీసీ-1” అని పేర్కొన్నారు. 2024 అక్టోబర్‌లో అమెరికా అధికారులు విడుదల చేసిన రెండవ, సవరించిన చార్జిషీట్‌లో “సీసీ-1″ని వికాస్ యాదవ్‌గా పేర్కొన్నారు.

సిక్కు వేర్పాటువాదం, అమెరికా, కెనడా, పంజాబ్, భారత ప్రభుత్వం

ఫొటో సోర్స్, EPA

ఎవరీ గురుపట్వంత్ సింగ్ పన్నూ?

వృత్తిరీత్యా న్యాయవాది అయిన పన్నూ కుటుంబం మొదట పంజాబ్‌లోని నాథు చక్ గ్రామంలో నివసించి, తరువాత అమృత్‌సర్ సమీపంలోని ఖాన్‌కోట్‌లో స్థిరపడింది. పన్నూ తండ్రి మహీందర్ సింగ్ పంజాబ్ మార్కెటింగ్ బోర్డు కార్యదర్శిగా పనిచేశారు.

పన్నూకు ఒక సోదరుడు, ఒక సోదరి ఉన్నారు. ఆయన తన ప్రాథమిక విద్యను లుథియానాలో పూర్తి చేశారు. 1990లలో పన్నూ పంజాబ్ విశ్వవిద్యాలయంలో న్యాయశాస్త్రం అభ్యసించారు. కళాశాల రోజుల్లో ఆయన విద్యార్థి రాజకీయాల్లో చురుగ్గా పాల్గొన్నారు.

1991-92లో పన్నూ అమెరికాకు వెళ్లి, అక్కడ కనెక్టికట్ విశ్వవిద్యాలయంలో చేరారు. న్యూయార్క్ విశ్వవిద్యాలయం నుంచి ఫైనాన్స్‌లో ఎంబీఏ, న్యాయ పట్టా పొందారు.

అమెరికాలో చదువు పూర్తి చేసిన తర్వాత, పన్నూ2014 వరకు న్యూయార్క్‌లోని వాల్ స్ట్రీట్‌లో సిస్టమ్స్ అనలిస్ట్‌గా పనిచేశారు. ఆ సమయంలో కూడా ఆయన రాజకీయంగా చురుగ్గా ఉన్నారు.

పన్నూ 2007లో సిక్స్ ఫర్ జస్టిస్‌ను స్థాపించారు. ఈ సంస్థ రిజిస్టర్డ్ కార్యాలయం అమెరికాలోని వాషింగ్టన్‌లో ఉంది. పన్నూ తన న్యూయార్క్ కార్యాలయం నుంచి కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు. అక్కడే ఆయన తన న్యాయ సంస్థను కూడా నడుపుతున్నారు.

ఖలిస్తాన్ నినాదంతో భారతీయ పంజాబ్‌ను ‘విముక్తి’ చేయడానికి, పంజాబీలకు స్వయం నిర్ణయాధికార హక్కును ఇవ్వడానికి ‘సిక్స్ ఫర్ జస్టిస్’ ‘ఫరెండం-2020’ ప్రచారాన్ని ప్రారంభించింది.

దీని కింద, పంజాబ్, ప్రపంచవ్యాప్తంగా నివసిస్తున్న సిక్కులు ఆన్‌లైన్‌లో ఓటు వేయమని కోరారు. కానీ ఓటింగ్‌కు ముందే, భారత ప్రభుత్వం సిక్ ఫర్ జస్టిస్, ఖలిస్తాన్ మద్దతుదారులు అని ఆరోపిస్తూ 40 వెబ్‌సైట్‌లను నిషేధించింది.

ఈ సంస్థ, తమది మానవ హక్కుల సంస్థగా చెప్పుకుంటుంది. కానీ, భారత్ దీనిని ‘టెర్రరిస్ట్’ సంస్థగా ప్రకటించింది.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)