Home జాతీయ national telgu సర్కే చునర్ తేరీ సర్కే: మంగ్లీ పాటపై సోషల్ మీడియాలో విమర్శలు, అభ్యంతరకర పదాలున్నాయంటూ ఫిర్యాదులు

సర్కే చునర్ తేరీ సర్కే: మంగ్లీ పాటపై సోషల్ మీడియాలో విమర్శలు, అభ్యంతరకర పదాలున్నాయంటూ ఫిర్యాదులు

7
0

SOURCE :- BBC NEWS

కేడీ: ది డెవిల్, సర్కే చునర్ తేరీ సర్కే, హిందీ పాట

ఫొటో సోర్స్, Facebook/KVN production

కన్నడ నటుడు ధ్రువ సర్జా ప్రధాన పాత్రలో దర్శకుడు ప్రేమ్ రూపొందిస్తున్న పాన్-ఇండియా చిత్రం ‘కేడీ: ది డెవిల్’ విడుదలకు ముందే వివాదాలలో చిక్కుకుంది.

ఈ సినిమాలో సంజయ్ దత్, నోరా ఫతేహిలపై చిత్రీకరించిన ‘సర్కే చునర్ తేరీ సర్కే’ (జారిపోతోంది, నీ పైట జారిపోతోంది) అంటూ సాగే హిందీ పాటలోని సాహిత్యంపై సోషల్ మీడియాలో విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

అశ్లీలత, సామాజిక విలువల కోణంలో రేగిన ఈ వివాదం ఇప్పుడు చట్టపరమైన మలుపు తీసుకోవడమే కాకుండా, సెన్సార్ బోర్డు గడప తొక్కింది.

ఈ పాటలోని పదజాలం అసభ్యకరంగా ఉందని, ఇది మైనర్లపై ప్రతికూల ప్రభావం చూపుతుందని పేర్కొంటూ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ (సీబీఎఫ్‌సీ)కు దిల్లీకి చెందిన సుప్రీం కోర్టు న్యాయవాది వినీత్ జిందాల్ ఫిర్యాదు చేసినట్లు వార్తా సంస్థ ఐఏఎన్ఎస్ రిపోర్టు చేసింది.

ఈ వ్యవహారంపై దిల్లీ పోలీస్ సైబర్ సెల్‌లో కూడా విడిగా ఫిర్యాదు చేసినట్లు చెప్పారు.

ఈ ఫిర్యాదులో చిత్ర దర్శకుడు ప్రేమ్, సంగీత దర్శకుడు అర్జున్ జన్య, గాయని మంగ్లీ, గీత రచయిత రకీబ్ ఆలమ్‌లను ప్రతివాదులుగా పేర్కొన్నారు వినీత్.

కేడీ: ది డెవిల్, సర్కే చునర్ తేరీ సర్కే, హిందీ పాట

ఫొటో సోర్స్, Facebook/singermangli

పాటలోని అభ్యంతరకర కంటెంట్‌ను అన్ని డిజిటల్ ప్లాట్‌ఫామ్‌ల నుంచి తొలగించాలని సీబీఎఫ్‌సీని కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ ఆదేశించినట్లు విశ్వసనీయ వర్గాలను ఉటంకిస్తూ ఇండియా టుడే రిపోర్టు చేసింది.

ఈ వ్యవహారాన్ని మంత్రిత్వ శాఖ తీవ్రంగా పరిగణించిందని, అశ్లీల కంటెంట్‌పై పర్యవేక్షణ పెంచాలని, అవసరమైతే ఫిల్మ్ సర్టిఫికేషన్ నిబంధనలను సవరించాలని సెన్సార్ బోర్డును ఆదేశించినట్లు తెలిపింది.

సాహిత్యంపై వివాదం, ఫిర్యాదుల నేపథ్యంలో ఈ పాట యూట్యూబ్ వీడియోలను చిత్ర బృందం ప్రైవేట్‌లో పెట్టింది.

ఈ పాటను చిత్రబృందం కన్నడ, హిందీ, తెలుగు, తమిళం తదితర భాషల్లో విడుదల చేసింది. హిందీ, తెలుగు వెర్షన్ పాటలను గాయని మంగ్లీ పాడారు.

ఈ పాటలోని సాహిత్యం ఎవరి భావోద్వేగాలనైనా గాయపరిచి ఉంటే క్షమాపణలు కోరుతున్నట్లు మంగ్లీ సోషల్ మీడియా వేదికగా చెప్పారు.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
రక్షిత, ప్రేమ్, కేడీ సినిమా వివాదం

ఫొటో సోర్స్, Instagram/Rakshithaofficial

ఇంత వివక్ష ఎందుకు? : నటి రక్షిత

ఈ వివాదంపై దర్శకుడు ప్రేమ్ భార్య, నటి రక్షిత ఇన్‌స్టాగ్రామ్ వేదికగా ఒక ప్రకటన విడుదల చేసినట్లు ‘హిందుస్థాన్ టైమ్స్’ రిపోర్ట్ చేసింది .

“గతంలో ఫీలింగ్స్, డ్రీమమ్ వేకపమ్, చోళీ కే పీచే వంటి పాటలు వచ్చినప్పుడు అందరికీ అవి సాధారణంగానే అనిపించాయి. శృంగారమే ప్రధానాంశంగా సినిమాలు వచ్చినప్పుడు కూడా ఎవరికీ ఇబ్బంది కలగలేదు. కానీ ఒక్క ‘కేడీ’ పాట విషయంలోనే ఇంత గందరగోళం ఎందుకు జరుగుతుందో నాకు అర్థం కావడం లేదు” అని రక్షిత ప్రశ్నించారు.

“ఒక్క పాట సరిగ్గా లేనంత మాత్రాన ఆయన (ప్రేమ్) చెడ్డ రచయిత అయిపోరు. ఆయనను ప్రశ్నించే హక్కు మీకుంది. ఎందుకు ఇలా చేశారని అడగవచ్చు. కానీ, ఆయనను వ్యక్తిగతంగా దూషించే హక్కు మాత్రం ఎవరికీ లేదు. కొంతమంది మహిళలు సోషల్ మీడియాలో వ్యక్తిగతంగా అసభ్యంగా మాట్లాడుతున్నారు. ఇది సోషల్ మీడియాలోని మరో కోణాన్ని చూపిస్తోంది” అని అన్నారామె.

“రాబోయే కొన్ని రోజుల్లో అంతా సర్దుకుంటుందనే నమ్మకం ఉంది. మాకు కొంచెం సమయం ఇవ్వండి. ప్రేమ్, నేను ధైర్యంగా ఉన్నాం. ‘కేడీ’ మాకు బిడ్డ లాంటిది. చివరికి మేం ఏది సరైనదో అదే చేస్తాం. మమ్మల్ని నమ్మండి” అని రక్షిత తన పోస్ట్‌లో పేర్కొన్నారు.

రకీబ్ ఆలం, కేడీ: ది డెవిల్, సర్కే చునర్ తేరీ సర్కే, హిందీ పాట

ఫొటో సోర్స్, Instagram/lyricistraqueebalam

నేను రాయలేదు: గీత రచయిత రకీబ్ ఆలమ్

‘సర్కే చునర్ తేరీ సర్కే’ గీత రచయిత రకీబ్ ఆలమ్ సైతం ఈ వివాదంపై ఐఏఎన్ఎస్ వార్తా సంస్థ వద్ద స్పందించారు. ఆ పాటలోని సాహిత్యాన్ని తాను ఒరిజినల్‌గా రాయలేదని, అనువాదమే చేశానని రకీబ్ ఆలమ్ చెప్పారు.

“ఆ పాటను దర్శకుడే కన్నడలో రాశారు. నన్ను అనువాదం చేయమని అడిగారు” అని తెలిపారు.

కన్నడలో ‘సర్సే నిన్న సెరగ సర్సే’ పేరుతో విడుదలైన ఈ పాటను యూట్యూబ్‌లో పరిశీలించగా, పాట రచయిత పేరు ‘ప్రేమ్’ అని ఉంది.

“ఈ సినిమా కోసం నేను మరో ఐదు పాటలు రాశాను. ‘సర్కే చునర్ తేరీ సర్కే’ పాట రాయడానికి నిరాకరించాను. కానీ, పాటలోని మీటర్ (వరుస)కు సరిపోయేలా కొన్ని హిందీ పదాలను కూర్చమని, వాటిని తనే సెట్ చేస్తానని దర్శకుడు చెప్పారు. ఇప్పుడు తీరా చూస్తే హిందీ వెర్షన్‌కు నన్నే గీత రచయితగా చూపించారు. దీనిపై వారితో మాట్లాడుతాను” అని చెప్పారు రకీబ్ ఆలం.

“ఈ పాటలోని సాహిత్యం కొంత అతిగా ఉందన్న విషయాన్ని అంగీకరిస్తున్నాను” అన్నారు రకీబ్.

“గత రెండు రోజులుగా ‘కేడీ: ది డెవిల్’ సినిమాలోని ఒక పాట గురించి జరుగుతున్న చర్చ నా దృష్టికి వచ్చింది. ఒక సింగర్‌గా నా పని పాటను పాడటం మాత్రమే. ఆ పాటలోని సాహిత్యం లేదా దృశ్యాల చిత్రీకరణలో నా పాత్ర ఏమీ ఉండదు. పాట రికార్డింగ్ సమయంలో నాకు అప్పగించిన బాధ్యతను మాత్రమే నెరవేర్చాను. ఎవరి భావోద్వేగాలనైనా గాయపరిచి ఉంటే క్షమాపణలు కోరుతున్నాను” అని తెలిపారు.

అర్మాన్ మాలిక్, సింగర్, కేడీ: ది డెవిల్, సర్కే చునర్ తేరీ సర్కే, హిందీ పాట

ఫొటో సోర్స్, Instagram/Armanmalik

దిగజారడం బాధాకరం: గాయకుడు అర్మాన్ మాలిక్

ఈ పాటపై సోషల్ మీడియా వేదికగా ‘ఎక్స్’ లో తీవ్ర నిరసనలు వ్యక్తమవుతున్నాయి.

“నా టైమ్‌లైన్‌లో ఈ పాట కనిపించింది, నేను సరిగ్గానే విన్నానా లేదా అని నిర్ధరించుకోవడానికి మళ్లీ ప్లే చేసి చూడాల్సి వచ్చింది. కమర్షియల్ సాంగ్‌రైటింగ్ ప్రమాణాలు ఇంతలా దిగజారిపోవడం చూస్తుండటం నిజంగా బాధాకరం” అని ప్రముఖ గాయకుడు అర్మాన్ మాలిక్ తెలిపారు.

ఈ వివాదంపై బీజేపీ ఎంపీ, నటి కంగనా రనౌత్ తీవ్రంగా స్పందించారు.

ఏఎన్ఐ వార్తాసంస్థతో ఆమె మాట్లాడుతూ “అశ్లీలత, ప్రచార యావతో బాలీవుడ్ అన్ని హద్దులు దాటేసింది. యావత్ దేశం వారి చర్యలను ఖండిస్తోంది, చీత్కరించుకుంటోంది. కానీ, వారికి ఏమాత్రం సిగ్గు ఉన్నట్లు నాకు అనిపించడం లేదు. ఇలాంటి అశ్లీలతను ప్రదర్శించడంపై ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది” అన్నారు.

కాగా, ఈ ‘సర్కే చునర్ తేరీ’ పాటను నిషేధించాలని ఆల్ ఇండియన్ సినీ వర్కర్స్ అసోసియేషన్ డిమాండ్ చేసినట్లు న్యూస్ 18 రిపోర్ట్ చేసింది. ఈ వివాదాస్పద పాటపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ చైర్మన్ ప్రసూన్ జోషికి అసోసియేషన్ తాజాగా లేఖ రాసినట్లు తెలిపింది.

అశ్లీలతను ప్రోత్సహించడానికి, భారతీయ సాంస్కృతిక విలువలను కించపరచడానికి భావ ప్రకటనా స్వేచ్ఛను దుర్వినియోగం చేయకూడదని అసోసియేషన్ పేర్కొన్నట్లు ఆ కథనంలో రాసింది.

సోషల్ మీడియా విమర్శల నేపథ్యంలో చిత్ర బృందం ‘సర్కే చునర్ తేరీ సర్కే’ పాటను యూట్యూబ్ నుంచి తొలగించింది. కాగా, ఇదే పాటను తెలుగులోకి ప్రముఖ గీత రచయిత చంద్రబోస్ అనువదించారు. హిందీ వెర్షన్‌లో ఏ పదాలైతే అభ్యంతరకరంగా ఉన్నాయంటూ ఫిర్యాదుదారు పేర్కొన్నారో, అవి తెలుగు పాటలో ప్రస్తుతం కనిపించలేదు.

కేవీఎన్ ప్రొడక్షన్, జననాయగన్, కేడీ: ది డెవిల్, సర్కే చునర్ తేరీ సర్కే, హిందీ పాట

ఫొటో సోర్స్, FB/ KVN Productions

కేవీఎన్ ప్రొడక్షన్స్: వరుస వివాదాలు

నిర్మాణ సంస్థ కేవీఎన్ ప్రొడక్షన్స్ కొన్ని రోజులుగా వివాదాల్లో చిక్కుకుంటోంది. ఇదే కాకుండా, ఈ సంస్థ నిర్మిస్తున్న ఇతర ప్రాజెక్టులు కూడా ఇబ్బందుల్లో ఉన్నాయి.

తమిళ నటుడు విజయ్ నటించిన జన నాయగన్ సినిమా సెన్సార్ బోర్డ్ సర్టిఫికేషన్ ప్రక్రియలో జాప్యం కారణంగా విడుదల నిలిచిపోయింది.

కన్నడ స్టార్ హీరో యష్ నటించిన టాక్సిక్ సినిమా మధ్యప్రాచ్యంలో నెలకొన్న భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతల కారణంగా విడుదల వాయిదా వేసినట్లు నిర్మాణ సంస్థ ప్రకటించింది. అంతకుముందు ఈ సినిమా టీజర్‌పై కూడా ఆప్ మహిళా విభాగం కర్ణాటక మహిళా కమిషన్‌కు ఫిర్యాదు చేసింది.

అయితే, ఈ వివాదం ‘కేడీ: ది డెవిల్’ సినిమా విజయానికి అడ్డంకిగా మారుతుందా? లేదంటే పబ్లిసిటీగా మారుతుందా? అనేది చూడాలి.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)