SOURCE :- BBC NEWS

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, కొటేరు శ్రావణి
- హోదా, బీబీసీ ప్రతినిధి
-
7 ఏప్రిల్ 2025, 19:18 IST
అప్‌డేట్ అయ్యింది 3 గంటలు క్రితం
ఆరెంజ్ అంటే అదరగొట్టేస్తారని, బరిలోకి దిగితే రికార్డులు కురిపిస్తారని.. ఈసారి పక్కా 300 పరుగుల స్కోర్‌తో ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో నయా రికార్డు ఖాయం అంటూ.. సన్‌రైజర్స్ హైదరాబాద్ అభిమానులు ఈ సీజన్ ప్రారంభం కాకముందే భారీగా ఆశలు పెంచేసుకున్నారు. కానీ, వారి ఆశలను ఊసూరుమనిపిస్తోంది సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH).
300 కాదు కదా.. 200 పరుగులు కూడా చేయలేకపోతుంది ఈ జట్టు.
గత సీజన్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ మూడుసార్లు 250 కంటే ఎక్కువ పరుగులు సాధించింది.
ఒక మ్యాచ్‌లో ఏకంగా 287 పరుగులు చేసి ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) చరిత్రలోనే అత్యధిక స్కోరును సాధించింది. ఫైనల్ వరకు వచ్చి ఆ మ్యాచ్‌లో ఓటమి పాలైంది.
ఈ సీజన్‌లో తొలి మ్యాచ్‌లోనే 286 పరుగులు చేసి భారీ విజయం సాధించడంతో ఆ జట్టు దూకుడు గత సీజన్ తరహాలోనే ఉంటుందని అభిమానులు ఆశించారు.
ఆ జట్టు బ్యాటింగ్ లైనప్ బలంగా ఉండడం, భారీ హిట్టర్లు ఉండడంతో విశ్లేషకులూ అలాంటి అంచనాలే వేశారు.
కానీ, ఆ దూకుడు తొలి మ్యాచ్‌తోనే ఆగిపోయింది, ఆ తరువాత వరుస పరాజయాలే ఎదుర్కొంటోంది సన్‌రైజర్స్ హైదరాబాద్.


ఫొటో సోర్స్, Getty Images
సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టులో వచ్చిన మార్పులేంటి?
2008-12 మధ్య ఐపీఎల్‌లో హైదరాబాద్ జట్టును డెక్కన్ క్రానికల్ సంస్థ నిర్వహించేది. అప్పట్లో దీని పేరు డెక్కన్ చార్జర్స్.
తరువాత తమిళనాడుకు చెందిన సన్ గ్రూపు 2012లో ఈ ఫ్రాంచైజీని టేకోవర్ చేసింది.
అప్పటి నుంచి జరిగిన సీజన్లలో డేవిడ్ వార్నర్ సారథ్యంలో సన్‌రైజర్స్ హైదరాబాద్ 2016లో కప్ గెలుచుకుంది. ఆ తరువాత విలియమ్సన్ కెప్టెన్సీలో 2018లో రన్నరప్‌గా నిలిచింది.
ఆ తరువాత వివిధ కారణాల వల్ల నాయకత్వ మార్పులతో జట్టు సతమతమైంది. ఆ సమయంలో సరైన నాయకత్వం కోసం సన్‌రైజర్స్ హైదరాబాద్ ఎదురుచూసింది.
అదే సమయంలో, 2023 వన్డే వరల్డ్‌కప్ సాధించిన ఆస్ట్రేలియా టీమ్ కెప్టెన్ పాట్ కమిన్స్ మినీ వేలంలోకి వచ్చాడు. దీంతో, ఏకంగా 20.5 కోట్లు వెచ్చించి అతడిని ఎస్ఆర్‌హెచ్ దక్కించుకుంది. అందుకు తగ్గట్లుగానే కమిన్స్ కెప్టెన్సీలో తనదైన మార్క్ చూపించాడు.
సాధారణంగా బౌలింగ్ బలంతో బరిలోకి దిగే సన్ రైజర్స్ హైదరాబాద్ 2024 సీజన్‌లో దూకుడైన బ్యాటింగ్‌తో సరికొత్త రికార్డులు నెలకొల్పింది.
2020 తరువాత తొలిసారిగా 2024లో ‘ప్లే ఆఫ్స్’లో అడుగుపెట్టింది. ఈ సీజన్‌లో రన్నరప్‌గా నిలిచింది. అందుకే కమిన్స్‌ను వదులుకోవడానికి సన్‌రైజర్స్ హైదరాబాద్ ఇష్టపడలేదు.

ఫొటో సోర్స్, @IPL/X
గత సీజన్‌లో ఓపెనింగ్ జోడి ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మలు భారీ హిట్టింగ్‌తో మ్యాచ్‌లు గెలిపించారు.
ట్రావిస్ హెడ్ 190కుపైగా స్ట్రైక్‌రేట్‌తో 567 పరుగులు సాధించాడు. అభిషేక్ శర్మ 200కుపైగా స్ట్రైక్‌రేట్‌తో 484 పరుగులు సాధించాడు.
వీరిద్దరు పవర్ ప్లేలోనే భారీగా పరుగులు రాబడుతూ మంచి ఆరంభాన్ని ఇచ్చేవారు. అందుకే, ఇలాంటి ఐదుగురు కీలక ఆటగాళ్లను ఎస్‌ఆర్‌హెచ్ అట్టిపెట్టుకుంది.
హెన్రిచ్ క్లాసెన్‌ను రూ.23 కోట్లకు, పాట్ కమిన్స్‌ను రూ.18 కోట్లకు, అభిషేక్ శర్మను రూ. 14 కోట్లకు, ట్రావిస్ హెడ్‌ను రూ. 14 కోట్లకు, హైదరాబాదీ కుర్రాడు నితీశ్ కుమార్ రెడ్డిని రూ. 6 కోట్లతో రిటెయిన్ చేసుకుంది.

ఫొటో సోర్స్, Getty Images
ఎస్‌ఆర్‌హెచ్‌కు ఎందుకీ పరిస్థితి?
” మిడిల్ ఓవర్లలో, కీలకమైన వికెట్లను తీసి, ప్రత్యర్థిని ఒత్తిడిలో పడేసే బౌలర్లు ఎస్‌ఆర్‌హెచ్‌కు లేరు. వికెట్లు తీసేందుకు ఎస్‌ఆర్‌హెచ్ ప్రయత్నిస్తున్నట్లు నాకపించడం లేదు. వారు డిఫెన్సివ్‌గా ఉంటూ.. బంతి బౌండరీలు దాటకుండా బ్యాటర్లను అడ్డుకునేందుకు మాత్రమే ప్రయత్నిస్తున్నారు” అని అంబటి రాయుడు అన్నారు.
మిడిల్ ఓవర్లలో వికెట్లు తీయగలిగే బౌలర్లు ఆ జట్టుకు అవసరమని రాయుడు అన్నారు.
టీమ్‌కు మంచి ఆరంభాన్ని ఇవ్వలేకపోతున్నారు ఓపెనర్లు ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ. హెడ్ రెండు మ్యాచ్‌లలో 67, 47 పరుగులతో రాణించినప్పటికీ అభిషేక్ శర్మ మాత్రం ఐదు ఇన్నింగ్స్‌లో కలిపి ఇప్పటివరకు 51 పరుగులు మాత్రమే చేశాడు.
గత సీజన్‌లో దూకుడైన ఆరంభాన్ని ఇచ్చిన వీరిద్దరూ ప్రస్తుతం తడబడుతున్నారు.

ఫొటో సోర్స్, Getty Images
‘కమిన్స్! ఆ విషయంపై దృష్టిపెట్టు’
సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు వైఫల్యాలకు కారణాలను టీం ఇండియా మాజీ క్రికెటర్, క్రికెట్ అనలిస్ట్ నోయల్ డేవిడ్ విశ్లేషించారు.
బీబీసీతో మాట్లాడిన ఆయన.. ఇక నుంచి ఒక్క మ్యాచ్ ఓడిపోయినా సన్‌రైజర్స్ ప్లేఆఫ్‌కు చేరడం కష్టమేనన్నారు.
“సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టులో అన్ని విభాగాల్లో అస్థిరత నెలకొంది. ముఖ్యంగా బౌలింగ్.. పాత టీమ్‌లో మాదిరి డెత్ ఓవర్లలో కట్టడి చేసే భువనేశ్వర్, నటరాజన్‌లు లేరు. కొత్త బంతితో పవర్ ప్లేలో బ్రేక్‌త్రూ అందించడంలో షమి, కమిన్స్ విఫలమవుతున్నారు” అన్నారు నోయల్ డేవిడ్.
“తొలి మ్యాచ్‌లో రాజస్తాన్‌పై 286 పరుగులు చేసి కేవలం 40కిపైగా పరుగులతో గెలవడం పెద్ద విజయమేమి కాదు. రెగ్యూలర్ స్పిన్నర్లైన రాహుల్ చాహర్ వంటి వాళ్లకు అవకాశాలు ఇవ్వట్లేదు. మొత్తంగా ప్లేయింగ్ 11లో బౌలర్లు సరిగ్గా సెట్ అవ్వట్లేదు. అదే పెద్ద మైనస్. కెప్టెన్ కమిన్స్ దీనిపై ఫోకస్ చేయాలి” అన్నారాయన.
“బ్యాటర్లు ఎవరు ఒత్తిడిలో లేరు. స్థాయికి తగ్గట్లు ఆడట్లేదు అంతే. ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మల ఆటతీరు అంతే ధనాధన్ ఆడుతారు. కానీ, మిడిల్ ఓవర్స్ లో వికెట్లు ఆపాల్సిన ఇషాన్ కిషన్, నితీశ్ కుమార్ రెడ్డి, క్లాసెన్‌లు నిరాశపరుస్తున్నారు. కుర్రాడు అనికేత్ వర్మ ఒక్కడే బ్యాటింగ్‌లో ఇంప్రెస్ చేస్తున్నాడు. ప్లే ఆఫ్స్‌లో అడుగుపెట్టాలంటే మిగిలిన 9 మ్యాచుల్లో కనీసం 7 గెలిస్తేనే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ప్రతి మ్యాచ్‌లో గెలిస్తేనే రేసులో ఉంటారు. ఇక నుంచి ఒక్క మ్యాచ్ ఓడిపోయినా ప్లే ఆఫ్స్ ఆశలు వదులుకోవాల్సిందే” అన్నారు నోయల్ డేవిడ్.

ఫొటో సోర్స్, Getty Images
‘సమష్టి ఆట కనిపించడం లేదు’
” సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టులో అభిషేక్ శర్మ, నితీశ్, హెన్రిచ్ క్లాసెన్ వంటి మంచి ఆటగాళ్లు ఉన్నారు. బౌలింగ్, బ్యాటింగ్, ఫీల్డింగ్ విభాగాలలో సమష్టి ప్రదర్శన కనిపించడం లేదు” అని క్రికెట్ విశ్లేషకుడు బి.మోహన్ అభిప్రాయపడ్డారు.
”ఆటతీరు బాగుండకపోతే వచ్చే ఏడాది ఐపీఎల్ వేలంలో ఈ ఆటగాళ్లకు డిమాండ్ తగ్గుతుంది. ఫామ్‌లో ఉన్న వేరే ఆటగాళ్లను తీసుకుంటారు. మహమ్మద్ షమీ ఈ జట్టుకు ప్రధాన బౌలర్. కానీ షమీ వికెట్లు తీయడం లేదు. వచ్చే ఐపీఎల్ సీజన్‌లో జట్టులో మార్పులు ఉండొచ్చు” అని మోహన్ అన్నారు.

ఫొటో సోర్స్, Getty Images
క్రికెట్ అభిమానులు ఏమంటున్నారు?
సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు వరుస ఓటములకు కారణమేంటంటూ ‘బీబీసీ న్యూస్ తెలుగు’ సోషల్ మీడియాలో యూజర్ల అభిప్రాయం తెలుసుకునే ప్రయత్నం చేసింది.
ఆ పోస్ట్‌కు యూజర్లు స్పందించారు. ఎక్కువ మంది బౌలింగ్ బలహీనంగా ఉందన్న అభిప్రాయం వ్యక్తం చేశారు.
”టాప్ ఆర్డర్ విఫలమవుతుంది. ఓవర్ కాన్ఫిడెన్స్‌తో మేమే తోపులమనే ఫీలింగ్‌తో ఆడుతున్నారు”
”హోమ్ గ్రౌండ్ పిచ్ సరిగ్గా ఇవ్వలేదు”
”టాస్ గెలిచిన తర్వాత తప్పుడు నిర్ణయాలు తీసుకోవడం వల్లే ఈ పరిస్థితి ఎదురవుతుంది”
”మంచి బౌలర్లను తీసుకుంటే బెటర్” అంటూ యూజర్లు తమ అభిప్రాయాలు చెప్పారు.
మరో యూజర్ ఇంకాస్త వివరంగా కామెంట్ చేశారు. ”తక్కువ స్కోర్ చేసినా గెలిచిన చరిత్ర ఎస్ఆర్‌హెచ్‌కు ఉంది. ప్రస్తుత టీమ్‌లో బౌలర్ల వైఫల్యం, నాసిరకం ఫీల్డింగ్‌తో క్యాచ్‌లు వదిలేస్తుండడంతో మ్యాచ్‌లు ఓడిపోతున్నారు. దీనికి బ్యాటర్ల వైఫల్యం తోడైంది. ఒకే టీమ్‌గా రాణించడం లేదు. ఇక పుంజుకోవడం కష్టమే. నేను ఎస్‌ఆర్‌హెచ్ అభిమానినే గత రెండు మ్యాచ్‌లు వికెట్స్ పడడం మొదలు కాగానే మ్యాచ్ చూడడం మానేశా” అని కామెంట్ పెట్టారు.

ఫొటో సోర్స్, Getty Images
ఎస్‌ఆర్‌హెచ్ జట్టులో ఎవరెవరున్నారు?
ఐపీఎల్ వేలంలో గరిష్ఠంగా 25 మంది క్రీడాకారులను ప్రతి టీమ్ కొనుగోలు చేసుకోవచ్చు. వీరిలో గరిష్ఠంగా 8 మంది విదేశీ క్రీడాకారులు ఉండాలి. స్క్వాడ్‌లో కనీసం 18 మంది ఉండాలి.
వారిలో ఇషాన్ కిషాన్, అథర్వ తైడే, అభినవ్ మనోహర్, అనికేత్ వర్మ, సచిన్ బేబీ, హెన్రిచ్ క్లాసెన్, ట్రావిస్ హెడ్ బ్యాటర్లు కాగా.. హర్షల్ పటేల్, అభిషేక్ శర్మ, నితీశ్ కుమార్ రెడ్డి, వియాన్ ముల్డర్, కమిందు మెండిస్‌లు ఆల్‌రౌండర్లు.
ఇక పాట్ కమిన్స్ (కెప్టెన్), మహమ్మద్ షమీ, రాహుల్ చాహర్, ఆడమ్ జంపా, సిమర్‌జీత్ సింగ్, జీషాన్ అన్సారీ, జయదేవ్, మలింగ ఇషాన్ బౌలర్లు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)