Home LATEST NEWS telugu తాజా వార్తలు షార్ట్ సర్క్యూట్ అంటే ఏంటి, ఎన్ని రకాలుగా జరగొచ్చు, ప్రధాన కారణాలేంటి?

షార్ట్ సర్క్యూట్ అంటే ఏంటి, ఎన్ని రకాలుగా జరగొచ్చు, ప్రధాన కారణాలేంటి?

8
0

SOURCE :- BBC NEWS

విద్యుత్, షార్ట్ సర్క్యూట్, అగ్ని ప్రమాదాలు

ఫొటో సోర్స్, Getty Images

  • రచయిత, లక్కోజు శ్రీనివాస్
  • హోదా, బీబీసీ కోసం
  • 28 మే 2025

హైదరాబాద్ పాతబస్తీలో గుల్జార్ హౌస్ సమీపంలో మే 18న జరిగిన అగ్నిప్రమాదంలో 17 మంది మరణించారు. ఈ ప్రమాదానికి షార్ట్‌సర్క్యూట్ కారణమని అధికారులు చెప్పారు.

ఇళ్లు… పరిశ్రమలు… గోడౌన్లు… కార్లు…రైళ్లు..ఇలా ఎక్కడైనా అగ్ని ప్రమాదాలు జరిగినప్పుడు, ఆ ప్రమాదాలకు తరచుగా వినిపించే కారణం.. షార్ట్ సర్క్యూట్.

అసలు ఏమిటీ షార్ట్ సర్క్యూట్?

షార్ట్‌ సర్క్యూట్ జరగకుండా నివారించగలమా?

ఈ అంశంపై విజయనగరంలోని సెంచూరియన్ యూనివర్సిటీలో ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ విభాగంలో అసిస్టెంట్ ప్రొఫెసర్ గా పని చేస్తున్న కె. మాధవరావుతో బీబీసీ మాట్లాడింది.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
షార్ట్ సర్క్యూట్, అగ్ని ప్రమాదాలు

ఫొటో సోర్స్, Getty Images

షార్ట్ సర్క్యూట్ అంటే ఏమిటి?

షార్ట్ సర్క్యూట్ అంటే ఒక విద్యుత్ సర్క్యూట్‌లో లోపం వల్ల విద్యుత్ వైర్లలో ఎక్కువ విద్యుత్ ప్రవహించడం అని చెప్పుకోవచ్చు.

అసలు ఎలక్ట్రిక్ సర్క్యూట్ అంటే ఏమిటో తెలుసుకుందాం.

“మన ఇంట్లో ఉన్న ఫ్యాన్లు బల్బులు, టీవీ, ఫ్రిజ్ ఇలా ఏవైతే కరెంట్ తో నడిచే వస్తువులు ఉన్నాయో…వాటన్నింటినీ ఎలక్ట్రిక్ వైర్లతో కలుపుతాం కదా. ఈ వస్తువులన్నింటినీ ఎలక్ట్రిక్ వైర్లతో కలిపి ఉంచడాన్నే ఎలక్ట్రిక్ సర్క్యూట్ లేదా వలయం అంటాం. ఇది ఒక లూప్ వంటింది. ఇక, షార్ట్ సర్క్యూట్ అంటే ఆ వలయంలో వచ్చే సమస్య. దాని వలన ఒక వైరులో కావలసిన దాని కంటే ఎక్కువ కరెంట్ ప్రవహిస్తుంది. వైర్ల సామర్థ్యం తక్కువ ఉండటంతో…వైర్లు వేడెక్కి మంటలు చెలరేగుతాయి. దీనినే షార్ట్ సర్క్యూట్ అంటాం” అని మాధవరావు చెప్పారు.

మరింత సులభంగా చెప్పాలంటే కరెంట్ సాధారణంగా ఒక నిర్ధిష్టమైన మార్గంలో ప్రవహిస్తుంది. అలా కాకుండా షార్ట్‌కట్‌లో వెళ్లడమే షార్ట్ సర్క్యూట్.

వైర్లలో ఎక్కువ విద్యుత్ ప్రవహించినప్పుడు…తక్కువ నిరోధకత ఉన్న తీగల వైపు విద్యుత్ ప్రవహిస్తుంది.

షార్ట్ సర్క్యూట్, అగ్ని ప్రమాదాలు

షార్ట్ సర్క్యూట్‌కు కారణాలు

విద్యుత్ వైర్లు పాడవడం కూడా షార్ట్ సర్క్యూట్‌కు ఓ ప్రధాన కారణం.

“వైర్ల ఇన్సులేషన్ పాడైనప్పుడు కూడా వైర్లు ఒకదానికొకటి తగిలి షార్ట్ సర్క్యూట్ ఏర్పడుతుంది. MCB (Miniature Circuit Breaker) ఉంటే అది ఆ ప్రమాదాన్ని అపుతుంది.” అని మాధవరావు చెప్పారు.

ఎంసీబీ ఒక విద్యుత్ భద్రతా పరికరం, ఇది విద్యుత్ సరఫరాలో లోపం ఏర్పడినప్పుడు…ఆ ప్రవాహాన్ని వెంటనే ఆపుతుంది.

అలాగే, తడి ప్రదేశాల్లో వైర్లు ఉన్నా షార్ట్ సర్క్యూట్ జరిగే అవకాశం ఉందని మాధవరావు హెచ్చరించారు.

“నీటి వల్ల వైర్లు తడిస్తే, షార్ట్ సర్క్యూట్ జరిగే ప్రమాదం ఉంటుంది.” అని ఆయన చెప్పారు.

ప్రధానంగా షార్ట్ సర్క్యూట్ జరిగే అవకాశమున్న అంశాలు…

1. పాడైన ఎలక్ట్రిక్ వస్తువులు: ఫ్యాన్, బల్బ్ వంటి వస్తువుల్లో లోపం వల్ల..

2. వైర్ల ఇన్సులేషన్ పాడవడం: వైర్ల పై భాగం కరిగిపోతే లేదా పాడైతే..

3. తడి ప్రదేశాలు: నీటి వల్ల వైర్లు తడిస్తే..

4. లైవ్ వైర్ తాకడం: విద్యుత్ ఉన్న వైర్ ఏదైనా లోహాన్ని తాకితే…

“విద్యుత్ ఉన్న ప్రతి చోటా షార్ట్ సర్క్యూట్ జరిగే అవకాశం ఉంటుంది,” అని మాధవరావు హెచ్చరించారు.

షార్ట్ సర్క్యూట్, అగ్ని ప్రమాదాలు

ఫొటో సోర్స్, Getty Images

రెగ్యులర్ చెకప్ అవసరం

“మనం అప్పుడప్పుడు ఆరోగ్య పరీక్షలు చేయించుకున్నట్లే, ఇంటి విద్యుత్ వ్యవస్థను కూడా ఎలక్ట్రిషియన్ తో అప్పుడప్పుడు చెక్ చేయించాలి.” అని మాధవరావు చెప్పారు. కొన్ని జాగ్రత్తలు పాటించడం ద్వారా షార్ట్ సర్క్యూట్‌ను నివారించవచ్చని మాధవరావు చెప్పారు.

రక్షణ సాధనాలు: ప్రతి సర్క్యూట్‌కు ఎంసీబీ (MCB) వినియోగించాలి. ఎంసీబీ ఉంటే విద్యుత్ ప్రవాహంలో లోపం వస్తే విద్యుత్ సరఫరా ఆగిపోతుంది.

రెగ్యులర్ చెక్-అప్: ఎలక్ట్రిషియన్‌తో వైర్లు, వస్తువులను తనిఖీ చేయించుకోవాలి.

పాత వైర్లు మార్చుకోవాలి: ఐదు నుంచి పదేళ్లకు వైర్లు మార్చడం ద్వారా చాలా ప్రమాదాలు నివారించవచ్చు.

ప్రతి గదికి ఒక MCB: ఇంట్లో ఎన్ని గదులుంటే, అన్ని గదులకు వేర్వేరు MCBలు పెట్టండి. ఒక గదిలో షార్ట్ సర్క్యూట్ జరిగితే, అది ఆ గదికే పరిమితమవుతుంది. మిగతా గదులపై షార్ట్ షార్క్యూట్ ప్రభావం ఉండదు.

షార్ట్ సర్క్యూట్, అగ్ని ప్రమాదాలు

షార్ట్ సర్క్యూట్‌ను నివారించాలంటే…

1. పాత వైరింగ్ మార్చుకోవడం: ఇంటికి, ఫ్యాక్టరీలకు, దుకాణాలకు ఎక్కడైనా…వైరింగ్ చేసి ఐదు నుంచి పదేళ్లు దాటితే…ఆ వైర్లు పాడయ్యే అవకాశం ఉంది. అవి షార్ట్ సర్క్యూట్ ప్రమాదాన్ని తీసుకురావచ్చు. అందుకే వాటిని మార్చుకోవాలి. కొంత ఖర్చవుతుంది. కానీ తప్పదనుకుని చేయించుకోవాలి.

2.తేమ లేకుండా చూడాలి: ప్లగ్ పాయింట్ల దగ్గర నీరు ఉండకూడదు. తడిగా ఉన్న చేతులతో స్విచ్ ఆన్ చేయొద్దు.

3. ఓవర్‌లోడ్ చేయకూడదు: ఒకే ప్లగ్‌తో చాలా పరికరాలు కలిపితే, విద్యుత్ ఓవర్‌లోడ్ అయ్యి షార్ట్ సర్క్యూట్ అవుతుంది. అందుకే ప్లగ్ కెపాసిటీకి తగ్గట్టుగానే వాటికి విద్యుత్ పరికరాలు కలపాలి.

4. ఎంసీబీ లేదా ఫ్యూజ్ బాక్స్ తప్పనిసరి: ఇవి ఉంటే షార్ట్ సర్క్యూట్ జరిగినపుడు తక్షణమే విద్యుత్ కట్ అవుతుంది. ఇంటికి, ఎలక్ట్రిక్ వస్తువులకు రక్షణ ఏర్పడుతుంది.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

SOURCE : BBC NEWS