SOURCE :- BBC NEWS

“ఆరోగ్యం బాలేదని నెల రోజులుగా పనికి వెళ్లలేదు. అప్పులు ఉన్నాయి కదా వెళ్లమని నేనే చెప్పాను. అంతే.. ఆ తర్వాత నా బిడ్డ చనిపోయిన శబ్ధం నేను విన్నాను” అంటూ వేట్లపాలెం ప్రమాదంలో మరణించిన రవి తల్లి వల్లూరి లక్ష్మీ బీబీసీతో చెప్పారు.
రవికి 35 ఏళ్లు. వేట్లపాలెంలోని సూర్యశ్రీ ఫైర్ వర్క్స్‌లో పనిచేసేవారు. ఆయనకి ఐదేళ్ల పాప.
శనివారం మధ్యాహ్నం బాణసంచా తయారీ కేంద్రం నుంచి సమీపంలోనే ఉన్న ఇంటికి భోజనానికి వచ్చారు. తన బిడ్డతో అరగంట ఆడుకున్నారు. బిడ్డని ముద్దు పెట్టుకుని పనికి వెళ్లేందుకు సిద్ధమయ్యారు.
“పనికి వెళ్తూ.. 10 రూపాయలివ్వు, ఖర్చులకి అన్నారు. 70 రూపాయలుంటే ఇంటి ఖర్చులకి అయిపోయాయి. సాయంత్రం చూద్దాంలే అన్నాను. ఆ తర్వాత ఆయన తిరిగి రాలేదు” అని తన ఐదేళ్ల పాపని భూజాన మోస్తూ రవి భార్య చంద్రకళ గుర్తు చేసుకున్నారు.
ఇలాంటి విషాదం వేట్లపాలెం ప్రమాదంలో మరణించిన ప్రతి కుటుంబంలో కనిపించింది. మరణించిన 20 మందిలో గూడపర్తి గ్రామానికి చెందిన వారే 8 మంది ఉన్నారు.
గూడపర్తి వెళ్తే.. ప్రతి వీధిలోనూ ఒక టెంట్ కనిపించింది. ఆ టెంట్లు బాణసంచా ప్రమాదంలో మరణించిన వారి చివరి చూపుల గుర్తుల్లా నిలిచిపోయాయి.

భూకంపం వచ్చిందనుకున్నాం: రాజమణి
“మధ్యాహ్నం పెద్ద శబ్ధం వినిపించింది. ఇంట్లో గ్యాస్ ఏదైనా పేలిందేమో అనుకున్నాం. ఆ తర్వాత వరుసగా మరో రెండుసార్లు ఏదో పేలిపోయినట్లు పెద్ద పెద్ద సౌండ్లు వచ్చాయి. భూకంపమేమో అనుకున్నాను. ఇంతలోనే మందుకొట్టు పేలిపోయిందంటూ ఊరంతా ఒకటే గోల. దాంతో అంతా మందుకొట్టు వైపు పరుగులు తీశాం” అని ప్రమాద తీవ్రతని చూసిన రాజమణి బీబీసీతో చెప్పారు.
ఈ ప్రమాదంలో రాజమణి మరిది ధనరాజ్ మరణించారు.
బాణసంచా తయారీ దుకాణాలను స్థానికులు మందుకొట్టు అంటారు.
ధనరాజ్ 30 ఏళ్లుగా వేట్లపాలెంలోని వివిధ మందుకొట్లలో బాణసంచా తయారీ పని చేస్తున్నారు.
పొలం కూలీ పనులు లేకపోవడం, ఇంటికి సమీపంలోనే ఈ బాణసంచా తయారీ దుకాణాలు ఉండటం, మిగతా పనులతో పోల్చుకుంటే ఇక్కడ కాస్త ఎక్కువ డబ్బులు ఇస్తుండటంతో ఈ పనికే ఈ చుట్టుపక్కల వారంతా వెళ్తుంటారని రాజమణి చెప్పారు.

’20 ఏళ్లు మందుకొట్టు పనే చేశాను..’
“నేను అదే 20 ఏళ్లు మందుకొట్టు పనే చేశాను. నా భార్య కూడా అదే పని చేసింది. ఇప్పుడు నా కొడుకు కూడా ఆ పని చేస్తూనే ప్రాణాలు పోగొట్టుకున్నాడు. మాకు తెలుసు ఆ పని ప్రమాదమని. కానీ.. కుటుంబం గడవాలంటే తప్పదు” అని 63 ఏళ్ల గొడత అన్నారావు చెప్పారు.
అన్నారావు కుమారుడు గొడత మహేష్ ఈ ప్రమాదంలో మరణించారు. అతనికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. తన తండ్రికి ప్రమాదం జరిగిందని తెలిసిన మహేష్ కుమారుడు ఘటనా స్థలానికి వెళ్లి, అక్కడ పడిపోవడంతో కాలికి తీవ్ర గాయమైంది.
మహేష్ తల్లి మరియమ్మకి తన బిడ్డచనిపోయినట్లు రాత్రంతా చెప్పలేదు. ఆరోగ్యం బాలేకపోతే కాకినాడలో ‘నీటి కాయలు’ (సెలైన్ బాటిల్స్) ఎక్కిస్తున్నారంటూ చెప్పుకొచ్చారు. ఉదయం ఇంటికి మహేష్ మృతదేహం తీసుకురావడంతో ఆమెను ఆపడం ఎవరి తరం కాలేదు.

‘మాలాంటి ముసలోళ్లని తీసుకోరు’
వేట్లపాలెం ప్రమాదంలో మరణించిన వారిలో మధ్యవయస్కులు, యువతే ఎక్కువగా ఉన్నారు.
ముఖ్యంగా మహిళలు కూడా ఉన్నారు. మహిళలు తక్కువ కూలీకే పనికి దొరకడం, అలాగే తమ ఇళ్లకు సమీపంలోనే ఈ బాణసంచా తయారీ కేంద్రాలు ఉండటంతో మహిళలు కూడా ఈ పనికి ఎక్కువగా వెళ్తున్నారు.
వేట్లపాలెం ప్రమాదంలో మరణించిన వారిలో 10 మంది మహిళలు ఉన్నారు.
“వేట్లపాలెం అంతా ఈ మందుకొట్లే ఉంటాయి బాబు. ఆడళ్లైనా, మగోళ్లైనా కుర్రోళ్లనే పనికి తీసుకుంటారు. ముసలోళ్లని తీసుకోరు. ఎందుకంటే, మేం మెల్లగా పని చేస్తాం. కుర్రోళ్లైతే లెక్క తెలియకుండా, ప్రమాదాన్ని అంచనా వేయకుండా యజమాని చెప్పినట్లు చేస్తారు. అందుకే మమ్మల్ని తీసుకోరు, నేను ఈ మందుకొట్టు పనే 30 ఏళ్లు చేశాను” అని 65 ఏళ్ల యేసు బీబీసీతో చెప్పారు.

నలుగురు మనుషులు, 15 కేజీలకే అనుమతి…
వేట్లపాలెం బాణసంచా తయారీకి పేరు పొందింది.
రెండు తెలుగు రాష్ట్రాల్లో భారీగా బాణసంచా తయారీ చేసే కేంద్రాలు గోదావరి జిల్లాల్లో ఉంటే.. అందులో వేట్లపాలెం తయారీకి, అనధికార నిల్వలకి పేరు పొందింది. ఇక్కడ ఏ కేంద్రానికి కూడా భారీ బాణసంచా తయారీకి అనుమతులు లేవని ఫైర్ డిపార్ట్‌మెంట్ అధికారులు బీబీసీతో చెప్పారు.
ఈ విషయంపై ఏపీ స్టేట్ ఫైర్ సర్వీసెస్ డైరెక్టర్ మురళీమెహన్ మాట్లాడారు.
బాణసంచా తయారీ, నిల్వ, విక్రయాలకు సంబంధించి ఐదు రకాల లైసెన్సులు ఉంటాయి. ది ఎక్స్‌ప్లోజివ్ యాక్ట్–1884, ఎక్స్‌ప్లోజివ్ రూల్స్–2008 నిబంధనల ప్రకారం అనుమతులిస్తారు.

అనుమతులు ఉన్నాయి, కానీ..
లైసెన్స్ ఫర్ ఎక్స్‌ప్లోజివ్ – టైప్1: బాణసంచా తయారీకి మాత్రమే అనుమతి.
లైసెన్స్ ఫర్ ఎక్స్‌ప్లోజివ్ – టైప్ 2: బాణసంచాను ప్యాకింగ్/రీప్యాకింగ్ చేసి అమ్మకానికి సిద్ధం చేయడం (అమ్మకూడదు).
లైసెన్స్ ఫర్ ఎక్స్‌ప్లోజివ్ – టైప్ 3: పేలుడు పదార్థాలు లేదా బాణసంచాను నిల్వ చేయడానికి ఇచ్చే లైసెన్స్. దీనిని పెట్రోలియం అండ్ ఎక్స్‌ప్లోజివ్ సేఫ్టీ ఆర్గనైజేషన్ (పీఈఎస్ఓ) జారీ చేస్తుంది.
లైసెన్స్ ఫర్ ఎక్స్‌ప్లోజివ్ – టైప్ 4: తయారైన బాణసంచాను గోదాములో నిల్వ చేయవచ్చు, ఫ్యాక్టరీ నుంచి వచ్చిన స్టాక్ ఉంచుకోవచ్చు.
లైసెన్స్ ఫర్ ఎక్స్‌ప్లోజివ్ – టైప్ 5: బాణసంచా లైసెన్సులో ప్రజలకు ఎక్కువగా కనిపించేది ఇదే. బాణసంచా అమ్మడానికి (రిటైల్ సేల్) ఇచ్చే లైసెన్స్. దుకాణం లేదా తాత్కాలిక సేల్స్ నిర్వహించుకోవచ్చు. దీపావళి వంటి పండుగల సమయంలో అమ్మకాలు జరపవచ్చు.

ప్రమాదం జరిగిన వేట్లపాలెం బాణసంచా తయారీ కేంద్రం లైసెన్స్ ఫర్ ఎక్స్‌ప్లోజివ్ టైప్ 1 కేటగిరీ కిందకు వస్తుంది. వీళ్లు కేవలం 15 కేజీల రా మెటీరియల్ (ముడి సరుకు), నలుగురు మనుషులను మాత్రమే పనిలో ఉపయోగించుకోవాలి.
“ప్రమాదం జరిగిన సూర్యశ్రీ ఫైర్ వర్క్స్‌కి అనుమతులు ఉన్నాయి. కాకపోతే రోజుకి 15 కేజీల మందుగుండుతో నలుగురు మాత్రమే పని చేసేందుకు అనుమతి ఉంది. కానీ, ఇక్కడ 40 మంది పని చేస్తున్నారు. మేం తనిఖీలకు వచ్చినప్పుడు నిబంధనలు పాటిస్తున్నట్లు కనిపిస్తుంది. ఆ తర్వాత, తమకి వచ్చిన ఆర్డర్లు వెంటవెంటనే పూర్తి చేసేందుకు పెద్దయెత్తున మనుషులను నియమించుకుని పనులు చేస్తుంటారు. ఈ ప్రమాదానికి ఇప్పటివరకు కారణాలు తెలియలేదు” అని మురళీమెహన్ చెప్పారు.

పేలుడులో 20 మంది మృతి
సామర్లకోట మండలం వేట్లపాలెంలోని బాణసంచా తయారీ కేంద్రంలో జరిగిన ప్రమాదంలో 20 మంది మృతి చెందినట్లు ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శనివారం తెలిపారు.
”పేలుడు ఘటనలో 20 మంది చనిపోయారు. మరో 9 మంది పరిస్థితి విషమంగా ఉంది. ప్రమాదం నుంచి ఇద్దరు సురక్షితంగా బయటపడ్డారు. మొత్తం 31 మంది” అని ఆయన చెప్పారు.
రోజువారీ కూలీపని కోసం వచ్చి ప్రమాదం బారినపడ్డారని చంద్రబాబు విచారం వ్యక్తం చేశారు.
మృతుల కుటుంబాలకు 20 లక్షలరూపాయల చొప్పున పరిహారం అందజేస్తామని, బాధిత కుటుంబాలను అన్నివిధాలుగా ఆదుకుంటామని చంద్రబాబు అన్నారు.

అసలేం జరిగింది?
కాకినాడ జిల్లా, సామర్లకోట మండలం వేట్లపాలెంలోని బాణసంచా తయారీ కేంద్రంలో శనివారం మధ్యాహ్నం పేలుడు జరిగింది.
పేలుడు శబ్దం ఐదు కిలోమేటర్ల వరకు వినిపించినట్లు బాధిత కుటుంబాలు బీబీసీకి తెలిపాయి. దీన్నిబట్టి పేలుడు తీవ్రత ఎంత ఉందో అర్థమవుతుంది
శనివారం మధ్యాహ్నం రెండు గంటల సమయంలో ఒక్కసారిగా పేలుడు సంభవించిందని, తన భర్త పని చేస్తున్న చోటునుంచేనని తనకి అర్థమైందని భర్త మహేష్‌ను కోల్పోయిన సింధు బీబీసీతో చెప్పారు.
“పెద్ద శబ్ధం రావడం, కొద్దిసేపటికే మొత్తమంతా పొగ అంతా కమ్మేసింది. చాలా భయపడ్డాం. నా భర్తని కూడా కోల్పోయాను. ఇప్పుడు బాబు, పాపని ఎలా పోషించాలో తెలియడం లేదు” అని సింధు కన్నీళ్లు పెట్టుకున్నారు.
“మేం ఇక్కడికి వచ్చేసరికి పంటపొలాల్లో కొన్ని, రోడ్డు మీద కొన్ని మృతదేహాలు కనిపించాయి. అంటే, ఫైర్ వర్క్క్ చేస్తున్న చోటు నుంచి కనీసం 500 మీటర్లు ఎగిరిపడ్డాయని అర్థమవుతుంది” అని కాకినాడ ఫైర్ డిపార్టెమెంట్ అధికారి రాజ్ కుమార్ బీబీసీకి తెలిపారు.
( బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)



