Home జాతీయ national telgu వీధికుక్క ఎందుకు మొరగలేదు? ఈ ఒక్క ప్రశ్న హత్య కేసును ఛేదించేలా చేసింది.. ఎలాగంటే?

వీధికుక్క ఎందుకు మొరగలేదు? ఈ ఒక్క ప్రశ్న హత్య కేసును ఛేదించేలా చేసింది.. ఎలాగంటే?

5
0

SOURCE :- BBC NEWS

ప్రతీకాత్మక చిత్రం

ఫొటో సోర్స్, Getty Images

ముంబయి సమీపంలోని నవీ ముంబయి శివారు నెరుల్‌లోని రద్దీగా ఉండే రహదారిపై రక్తపు మడుగులో ఉన్న ఒక మృతదేహం పడి ఉండటంతో అక్కడ కలకలం చెలరేగింది.

ఈ ఘటన గురించి సమాచారం అందిన వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. కేసు నమోదు చేసి నిందితులను పట్టుకునే ప్రయత్నాలు మొదలుపెట్టారు. అయితే, సరైన ఆధారాలు లేకపోవడంతో నిందితుడిని పట్టుకోలేకపోయారు.

దారుణంగా హత్య చేశారు. కానీ, ఎలాంటి ఆధారాలు వదల్లేదు.

ఈ హత్యకు సంబంధించిన ఒక చిన్న క్లూ ఆధారంగా పోలీసులు నిందితుడి కోసం వెతికారు.

కొన్ని రోజుల పాటు కేసును వివిధ కోణాల్లో దర్యాప్తు చేసిన పోలీసులు చివరకు వీధి కుక్క ద్వారా నిందితుడిని కనిపెట్టారు.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌

అసలు ఏమైంది?

నెరుల్ ప్రాంతంలో 2024 ఏప్రిల్ 13వ తేదీ ఉదయాన ఈ ఘటన జరిగింది.

అక్కడి స్కైవాక్ కింద ఉన్న రోడ్డుపై ఉదయం 6:30- 7 గంటల సమయంలో ఒక వ్యక్తి రక్తపు మడుగులో కనిపించారు.

నెరుల్ పోలీస్ స్టేషన్‌కు చెందిన పోలీసు అధికారులు, సిబ్బంది ఈ సమాచారం అందిన వెంటనే నెరుల్ సెక్టార్ 10లోని ఘటనా స్థలానికి చేరుకున్నారు.

రక్తపు మరకలతో ఉన్న ఆ వ్యక్తిని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. అతను చనిపోయినట్లుగా వైద్యులు నిర్ధరించారు. గుర్తు తెలియని వ్యక్తిపై కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

నవీ ముంబయి

ఫొటో సోర్స్, Alpesh Karkare

వివిధ కోణాల్లో దర్యాప్తు

పోలీసులు రెండు మూడు బృందాలుగా ఏర్పడి దర్యాప్తు మొదలుపెట్టారు.

ఘటన జరిగిన ప్రాంతంలోని దుకాణాల్లో సీసీటీవీ ఫుటేజీలను పోలీసులు తనిఖీ చేశారు. ఇన్ఫార్మర్ల సాయం తీసుకున్నారు, నేర చరిత్ర కలిగిన పలువురిని అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు.

మృతుడు చెత్త సేకరించే వ్యక్తి అని పోలీసుల దర్యాప్తులో తేలింది. అయితే, హత్య ఎవరు చేశారో, ఎందుకు చేశారో పోలీసులు అర్థం చేసుకోలేకపోయారు.

ఒక బృందం రోజంతా సీసీటీవీ ఫుటేజీని తనిఖీ చేస్తుండగా, మరో బృందం అనేక మందిని ప్రశ్నించింది. కానీ, రెండు రోజులు గడిచినా పోలీసులు ఏమీ కనుక్కోలేకపోయారు.

ప్రతీకాత్మక చిత్రం

ఫొటో సోర్స్, Getty Images

దర్యాప్తులో అనేక ఇబ్బందులు.. కానీ, ఆ ఒక్క ప్రశ్న…

సీసీటీవీ ఫుటేజీ, అనుమానితుల విచారణ, ఇలా అన్ని కోణాల్లో పరిశీలిస్తున్నప్పటికీ పోలీసులకు నిందితుడి గురించి లేదా మృతుడి గురించి ఎటువంటి సమాచారం లభించలేదు.

మృతుడి తలకు తీవ్ర గాయాలు అయ్యాయని, దానివల్లే ఆయన మరణించారని ప్రాథమిక దర్యాప్తులో తేలింది. మృతుడి జేబులో కూడా ఏమీ దొరక్కపోవడంతో, అతని వివరాలను కనుక్కోవడం కష్టమైంది.

చివరకు మృతుడు, అనుమానితుడికి సంబంధించిన ఫుటేజీని అసిస్టెంట్ పోలీస్ ఇన్‌స్పెక్టర్ సచిన్ ధాగే, ఆయన బృందం గుర్తించింది. వారిద్దరూ గొడవపడుతున్నట్లుగా సీసీటీవీ ఫుటేజీలో ఆ బృందం చూసింది.

టాయిలెట్ సమీపంలో ఇద్దరూ ఒకరితో ఒకరు వాదించుకుంటున్నట్లు సీసీటీవీ ఫుటేజీలో కనిపించింది. ఆ తర్వాత, సీసీటీవీలో ఏమీ కనిపించకపోవడంతో దర్యాప్తు సమయంలో చాలా ఇబ్బందులు ఎదురయ్యాయి.

ఘటనా స్థలానికి కొంత దూరంలో ఒక వ్యక్తి ఉన్నట్లుగా సీసీటీవీ ఫుటేజీలో సచిన్ ధాగే గుర్తించారు. అయితే, దాడి చేసిన వ్యక్తి ముఖం స్పష్టంగా కనిపించకపోవడంతో దర్యాప్తు కష్టమైంది.

అనుమానితుడితో పాటు తెల్లటి చారలతో కూడిన ఒక నల్ల కుక్క ఉన్నట్లు ధాగే బృందం గుర్తించింది.

మరికొన్ని సీసీటీవీ ఫుటేజీల్లోనూ ఆ వ్యక్తితో పాటు ఈ కుక్క కూడా ఉన్నట్లు కనిపించింది.

వీధిలోని ఇతరులను చూసి మొరుగుతున్న ఆ కుక్క అనుమానితుడిని చూసినప్పుడు మాత్రం మొరగట్లేదని పోలీసులు గుర్తించారు. అతన్ని చూసి అది ఎందుకు మొరగడం లేదని పోలీసులు ఆశ్చర్యపోయారు.

ఆ కుక్కకు, నిందితుడికి మధ్య ఏదో సంబంధం ఉందని అనుమానించిన పోలీసులు ఆ కుక్క కోసం వెదకడం మొదలుపెట్టారు.

వీధి కుక్కను వెదుకుతుంటే చిక్కిన అనుమానితుడు

సీసీటీవీ ఫుటేజీలో చూసిన కుక్కను నెరుల్‌లోని శిర్వానే ప్రాంతంలో స్కైవాక్ కాలిబాటపై పోలీసులు గుర్తించారు.

ఆ ప్రాంతంలో కుక్క గురించి ఆరా తీసినప్పుడు, భూర్యా అనే వ్యక్తితో అది ఎప్పుడూ తిరుగుతుంటుందని అక్కడికి చెందిన కొంతమంది పోలీసులకు చెప్పారు. భూర్యా గురించి పోలీసులు వెదకడం మొదలుపెట్టారు.

ఒకరోజు స్కైవాక్ మీద నిద్రపోతున్న భూర్యాను పోలీసులు చూశారు. అతన్ని అదుపులోకి తీసుకుని మరింత విచారించారు.

అనుమానితుడు జరిగినదంతా చెప్పడం ప్రారంభించారు. అలా ఈ హత్యకు సంబధించిన దర్యాప్తులో పురోగతి మొదలైంది.

ప్రతీకాత్మక చిత్రం

ఫొటో సోర్స్, Getty Images

ఎందుకు ఈ హత్య చేశారు?

పోలీసులు వెల్లడించిన సమాచారం ప్రకారం, ఈ ఘటనలో నిందితుడి పేరు భూర్యా అలియాస్ మనోజ్ ప్రజాపతి (20). దుకాణాల్లో ఆయన క్లీనర్‌గా పనిచేసేవారు. ఈ హత్యకు కారణం, మరణించిన 45 ఏళ్ల వ్యక్తి కొన్నిసార్లు మనోజ్ ప్రజాపతిని కొట్టి, మరికొన్నిసార్లు నిద్రపోతున్నప్పుడు అతని జేబుల నుంచి డబ్బు తీసుకునేవాడు.

2024 ఏప్రిల్ 13కి ఒకట్రెండు రోజుల ముందు కూడా ఇలాగే జరిగింది. దీంతో మృతుడికి, మనోజ్ ప్రజాపతికి మధ్య వాగ్వాదం, గొడవ జరిగింది.

మనోజ్ ప్రజాపతి కోపంతో చేతికి దొరికిన కర్రతో మృతుడి తలపై గట్టిగా కొట్టడంతో రక్తస్రావం జరిగింది.

నిందితుడు తానే హత్య చేసినట్లు అంగీకరించారని దర్యాప్తు అధికారులు వెల్లడించారు.

”అందరిపై మొరుగుతుంది.. కానీ నాపై కాదు”

కుక్క గురించి కూడా మనోజ్ ప్రజాపతి పోలీసులకు చెప్పారు.

ఆ వీధి కుక్కకు తాను రోజూ ఆహారం పెడతానని, దానితో తనకు మంచి అనుబంధం ఉందని పోలీసులకు మనోజ్ చెప్పారు.

అందరిని చూసి మొరిగే ఆ కుక్క, ఈ కారణంగానే తనను చూసి మొరగదని అన్నారు.

ఆ కుక్క అంటే తనకు చాలా ఇష్టమని, అదెప్పుడూ తనతోనే ఉంటుందని తెలిపారు.

నేరాలు

ఫొటో సోర్స్, Getty Images

దర్యాప్తులో కీలకంగా మారిన వీధికుక్క

ఈ కేసును దర్యాప్తు చేసిన అప్పటి అసిస్టెంట్ పోలీస్ ఇన్‌స్పెక్టర్ సచిన్ ధాగేతో బీబీసీ మాట్లాడింది.

”ఈ కేసు దర్యాప్తులో చాలా ఇబ్బందులు ఎదురయ్యాయి. సీసీటీవీ ఫుటేజీ, అండర్‌కవర్ ఇన్ఫార్మర్లు, కొందరు అనుమానితులను విచారించడం ద్వారా మేం నిందితుడిని గుర్తించాం. మా దర్యాప్తులో వీధికుక్క చాలా కీలకమైన లింక్” అని ఆయన చెప్పారు.

ఈ కేసులో నిందితుడిని అరెస్టు చేసి, కోర్టులో హాజరుపరిచారు పోలీసులు. నిందితుడు ప్రస్తుతం జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నారు.

హత్యకు గురైన వ్యక్తి పని కోసం ముంబయికి వచ్చిన వలసదారుడని తర్వాత పోలీసుల దర్యాప్తులో తేలింది.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)