SOURCE :- BBC NEWS

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, లక్కోజు శ్రీనివాస్
- హోదా, బీబీసీ కోసం
-
23 మే 2025, 15:04 IST
అప్‌డేట్ అయ్యింది 2 గంటలు క్రితం
విశాఖపట్నంలోని మద్దిలపాలెం ప్రాంతానికి చెందిన ఓ మహిళకు గురువారం (మే 22న) కరోనా పాజిటివ్ నిర్ధరణ అయిందని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది.
2025 సీజన్‌లో ఆంధ్రప్రదేశ్‌లో నమోదైన తొలి కరోనా కేసు ఇదే.
చలి జ్వరం రావడంతో ఆ మహిళ ఆస్పత్రికి వెళ్లారు. డాక్టర్లు వైద్య పరీక్షలు చేయగా కోవిడ్ నిర్ధరణ అయింది.
ఆమెతో పాటు భర్త, ఇద్దరు పిల్లలకు కూడా వైద్యులు ఆర్‌టీపీసీఆర్ పరీక్షలు చేశారు. ఆ ముగ్గురికి నెగిటివ్ వచ్చింది.
కరోనా సోకిన ఆమెను వారం రోజుల పాటు హోం క్వారంటైన్‌లో ఉండాలని సూచించినట్లు జిల్లా వైద్యఆరోగ్య శాఖాధికారి పి. జగదీశ్వరరావు బీబీసీతో చెప్పారు.
“ఆమె ఆరోగ్యం నిలకడగా ఉంది. అందుకే నిన్న సాయంత్రమే ఆమెను ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ చేశాం. క్వారంటైన్‌లో ఉండాలని సూచించాం” అని జగదీశ్వరరావు తెలిపారు.

హెల్త్ సర్వే చేశాం: డీఎం అండ్ హెచ్ఓ

ఫొటో సోర్స్, Getty Images
విశాఖలో కోవిడ్ కేసు నమోదు కావడంతో… జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అప్రమత్తమైంది. కోవిడ్ కేసు నమోదైన ఏరియాపై దృష్టి పెట్టింది.
ఆ ప్రాంతంలో ఆరోగ్య సర్వే నిర్వహించింది. కొందరికి ఆర్టీపీసీఆర్ పరీక్షలు చేసింది. వేరే ఎవరికీ పాజిటివ్ రాలేదని జగదీశ్వరరావు బీబీసీకి తెలిపారు.
‘‘కోవిడ్ నిర్ధరణ పరీక్షలు అందరికి చేయం. జ్వరం, దగ్గు, జలుబు లక్షణాలు ఉన్నవారికే పరీక్షలు చేస్తాం. ఇటువంటి లక్షణాలున్న వారేవరైనా తప్పనిసరిగా కోవిడ్ పరీక్షలు చేయించుకోవాలి” అని జగదీశ్వరరావు సూచించారు.

ఫొటో సోర్స్, Getty Images
‘జాగ్రత్తలు అవసరం’
కోవిడ్ కేసు నమోదు కావడంతో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని వైద్యఆరోగ్యశాఖ సూచించింది.
ముఖ్యంగా చిన్నపిల్లలు, వృద్ధులు, దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నవారు ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాలని… బహిరంగ సమావేశాలు, ప్రయాణాలు నివారించాలని వైద్యఆరోగ్యశాఖ అధికారులు చెప్పారు.
“జ్వరం, దగ్గు, గొంతు నొప్పి, చమటలు, వాసన లేదా రుచి కోల్పోవడం వంటి కోవిడ్ లక్షణాలు ఉన్నవారు వెంటనే పరీక్షలు చేయించుకోవాలి. ప్రయాణాలు చేసిన వారు, కోవిడ్ ప్రభావిత ప్రాంతాల నుంచి వచ్చిన వారు క్వారంటైన్ పాటించడం మంచిది’’ అని జిల్లా వైద్యఆరోగ్య శాఖాధికారి జగదీశ్వరరావు సూచించారు.
‘‘ప్రభుత్వ కార్యాలయాలు, రవాణా కేంద్రాలు వంటి ప్రదేశాల్లో కోవిడ్ నియంత్రణ చర్యలు అమలు చేస్తున్నాం. ప్రజలకు సూచనలు ఇవ్వడానికి ప్రత్యేక హెల్ప్‌లైన్‌లు ఏర్పాటు చేశాం” అని తెలిపారు.

ఫొటో సోర్స్, Getty Images
కోవిడ్ కేసులతో అలర్ట్
దేశవ్యాప్తంగా కోవిడ్ కేసులు నమోదవుతున్న తరుణంలో ఏపీ ప్రభుత్వం అప్రమత్తమైంది. ప్రజలు పాటించాల్సిన జాగ్రత్తలను ఆరోగ్యశాఖ సూచించింది.
అన్ని రకాల కోవిడ్ నిబంధనలు పాటించాలని తెలిపింది. బయటకు వెళ్లేటప్పుడు మాస్కులు, శానిటైజర్లు వాడాలని చెప్పింది.
ప్రజలు అప్రమత్తంగా ఉండాలని చెబుతూ ఏపీ ఆరోగ్యశాఖ కీలక ఆదేశాలు జారీ చేసింది.
కరోనా వైరస్‌పై మరోసారి ప్రజలకు అవగాహన కల్పించాలని అధికారులను అప్రమత్తం చేసింది.
రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాల మేరకు కోవిడ్ మార్గదర్శకాలు:
- రైల్వే స్టేషన్లు, బస్ స్టాండ్‌లు, విమానాశ్రయాల్లో కోవిడ్-19 నియమాలను పాటించాలి.
- వృద్ధులు (60 ఏళ్లు పైబడినవారు), గర్భిణులు అత్యవసరమైతే తప్ప బయటికి వెళ్లకూడదు. ఇంటికి పరిమితమవడం మంచిది.
- పరిశుభ్రతను పాటించండి. తరచూ చేతులు కడుక్కోండి.
- రద్దీ ప్రాంతాల్లో మాస్క్ ధరించండి.
- కోవిడ్ ప్రభావిత దేశాల్లో ప్రయాణించిన వారు పరీక్షలు చేయించుకోవాలి.
- అన్ని ఆసుపత్రుల్లో మాస్క్, పీపీఈ కిట్, ట్రిపుల్ లేయర్ మాస్క్‌లను తగినన్ని అందుబాటులో ఉంచాలి.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)