SOURCE :- BBC NEWS
ఫొటో సోర్స్, kanakadurgamma.org
ఆంధ్రప్రదేశ్ దేవాదాయ శాఖ పరిధిలో ఉన్న దేవస్థానాల్లోని ప్రధాన గర్భాలయాల్లో పూజాదికాలు నిర్వహించేందుకు విదేశాలకు వెళ్లి తిరిగొచ్చిన అర్చకులకు అనుమతి లేదంటూ ఏపీ హైకోర్టు ఉత్తర్వులిచ్చింది. ఈ మేరకు హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ నిమ్మగడ్డ వెంకటేశ్వరరావు మార్చి 30న ఉత్తర్వులు జారీ చేశారు.
ఈ అంశానికి సంబంధించి దేవాదాయ శాఖ 2010 నవంబర్ 10న జారీ చేసిన సర్క్యులర్, శృంగేరి శారదాపీఠం 2024 డిసెంబర్ 20న జారీ చేసిన మార్గదర్శకాలను అమలు చేయాలని దేవాదాయ శాఖ ముఖ్య కార్యదర్శి, కమిషనర్‌ను హైకోర్టు ఆదేశించింది.
దేవాదాయశాఖ (ధార్మిక పరిషత్) ఇచ్చిన మార్గదర్శకాలను అమలు చేయడం లేదంటూ విజయవాడ శ్రీదుర్గామల్లేశ్వర స్వామి దేవస్థానానికి చెందిన శ్రీచక్ర నవావరణ అర్చన పారాయణదారు డీఎస్‌ఎస్‌ఎస్ సుబ్రమణ్యం సోమయాజి దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ జరిపిన న్యాయస్థానం ఆదేశాలిచ్చింది.
అయితే, హైకోర్టు ఉత్తర్వులపై అప్పీల్‌కు వెళ్తామని, లేదంటే సుప్రీంకోర్టును ఆశ్రయిస్తామని ప్రతివాది, దుర్గమ్మ గుడిలో ఉపప్రధాన పూజారిగా పనిచేస్తున్న శంకర శాండిల్య అన్నారు.

పిటిషనర్ తరఫున వాదనలు వినిపించిన న్యాయవాది కేఆర్ శ్రీనివాస్ ఈ కేసు వివరాలను వెల్లడించారు.
“విదేశీయానం చేసిన అర్చకులను గత నిబంధనలకు విరుద్ధంగా దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో ఉన్న దేవస్థానాల్లోని ప్రధాన గర్భాలయాల్లో సైతం పూజలు చేసేందుకు అనుమతినిస్తున్నారని, అలా ఇవ్వకూడదని న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్లాం.
శృంగేరి శారదాపీఠం గురువులు భారతీస్వామి ప్రామాణిక ప్రకారం.. విదేశాలకు వెళ్లి తిరిగొచ్చిన పురోహితులు గర్భాలయంలో పూజలు చేయడానికి వీల్లేదని.. కేవలం ఆలయం వెలుపల పూజలు, వ్రతాలు చేసేందుకు అనుమతినివ్వాలని పిటిషన్‌లో కోరాం” అని శ్రీనివాస్ తెలిపారు.
వాదనలు విన్న న్యాయమూర్తి గతంలో దేవాదాయశాఖ, శృంగేరి శారదాపీఠం ఇచ్చిన మార్గదర్శకాలను కచ్చితంగా అమలు చేయాలని దేవాదాయశాఖ అధికారులను ఆదేశించినట్లు న్యాయవాది శ్రీనివాస్ బీబీసీకి వెల్లడించారు.
ఫొటో సోర్స్, Advocate Srinivas
పిటిషనర్ వాదనేంటి?
విజయవాడ కనకదుర్గమ్మ గుడిలో ఇరవై ఏళ్లుగా అర్చకుడిగా పనిచేస్తూ.. ప్రస్తుతం శ్రీచక్ర నవావరణ అర్చన పారాయణదారుగా ఉన్న సుబ్రమణ్యంతో బీబీసీ మాట్లాడింది.
తనపై చాలామంది అర్చకుల్లో వ్యతిరేకత వస్తుందని తెలిసినప్పటికీ శాస్త్రనియమాలు పక్కాగా అమలు కావాలనే తాను హైకోర్టు వరకు వెళ్లానని ఆయన చెప్పారు.
“వైదిక కార్యక్రమాలన్నీ ధర్మసింధు, నిర్ణయసింధు ప్రకారమే నిర్వహిస్తారు. ఆ రెండింటి ప్రకారం సముద్రయానం చేసిన వాళ్లు తిరిగి వచ్చి అమ్మవారి, అయ్యవారి విగ్రహాలను తాకితే వాటి శక్తి తగ్గిపోతుంది. ఫలితంగా భక్తులకు ఇచ్చే ఫలితాలు తగ్గిపోతాయి. క్రమంగా ఆ ప్రభావం గుడి ఆదరణపై పడుతుంది. ఇక్కడ శక్తి లేదని భక్తులు వేరే చోటకు వెళతారు” అని ఆయన అన్నారు.
“నేను చెప్పేది విచిత్రంగా అనిపించవచ్చు.. కానీ వాస్తవంగా జరుగుతోంది ఇదే. అందుకే నా మీద వ్యతిరేకత వస్తుందని తెలిసినా హైకోర్టు వరకు వెళ్లాను” అని సుబ్రమణ్యం బీబీసీతో అన్నారు.
“చాలామంది విదేశాలకు వెళ్తే ఏమవుతుంది, ప్రాయశ్చిత్తం చేస్తే తిరిగి గర్భాలయాల పూజలు చేయొచ్చని అంటున్నారు. అది సరికాదు. భారతదేశం కర్మభూమి, ఇతర దేశాలన్నీ మనకి మర్మభూములే. ఒక్కసారి కర్మభూమి దాటితే ద్విజాధికారం కోల్పోతారు. ఎన్ని ప్రాయశ్చిత్తాలు చేసినా ఆ శక్తి రాదు” అని పిటిషనర్ సుబ్రమణ్యం అభిప్రాయపడ్డారు.
ఫొటో సోర్స్, kanakadurgamma.org
‘విదేశాల్లో గుడులు వేరు, మన దేవతామూర్తులు వేరు..’
“విదేశాల్లో కూడా గుడులు ఉన్నాయి, అక్కడ కూడా గర్భాలయాలు ఉన్నాయి, అక్కడ కూడా పూజారులు ఉన్నారు కదా అని చాలామంది విమర్శిస్తున్నారు.
అయితే మన దేశంలో, మన రాష్ట్రంలో ధర్మాదాయ శాఖ పరిధిలో ఉన్న దేవాలయాలు వేరు, అవి స్వయంగా వెలిసిన క్షేత్రాలు, వాటిల్లోని దేవతామూర్తుల శక్తి వేరు, చాలాచోట్ల శంకరాచార్యుల వారు శ్రీచక్రంతో ప్రాణప్రతిష్ఠ చేసిన దేవుళ్ల విగ్రహాలు ఉన్నాయి. వాటికీ.. ప్రభుత్వేతర గుడులు, విదేశాల్లో ఉన్న గుడుల్లో ఉన్న దేవతామూర్తులకు చాలా తేడా ఉంటుంది” అని సుబ్రమణ్యం చెప్పుకొచ్చారు.
ఫొటో సోర్స్, UGC
‘హైకోర్టు ఉత్తర్వులపై సుప్రీంకోర్టును ఆశ్రయిస్తాం’
హైకోర్టు ఉత్తర్వులు, సుబ్రమణ్యం వాదనలపై విజయవాడ దుర్గమ్మ గుడిలో ఉపప్రధాన పూజారిగా పనిచేస్తున్న శంకర శాండిల్య స్పందించారు.
సుబ్రమణ్యం వ్యక్తిగత అజెండాతో కోర్టుకు వెళ్లారని, దాని ఆధారంగా ఉత్తర్వులు ఇవ్వడం సరికాదని ఆయన అభిప్రాయపడ్డారు. హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులపై అప్పీల్‌కు వెళ్తామని, లేదంటే సుప్రీంకోర్టును ఆశ్రయిస్తామని శాండిల్య స్పష్టం చేశారు.
“హిందూధర్మ వ్యాప్తికి ఎన్నో ధార్మిక పీఠాలు విదేశాల్లోని ఎన్నో నగరాల్లో దేవాలయాలు నిర్మిస్తుంటే, మేము వెళ్లి పూజలు చేస్తే తప్పు వచ్చిందా? అక్కడికి వెళ్లి పూజలు చేసి రాగానే మేం పనికిరాకుండా పోతామా? ఇదెక్కడి విడ్డూరం” అని ఆయన వ్యాఖ్యానించారు.
ఫొటో సోర్స్, Shankara Sandilya
‘అప్పటి నియమాలు ఆనాటి పరిస్థితులకే..’
“అప్పట్లో సముద్రయానం చేసేందుకు ఓడలే ప్రధానంగా అందుబాటులో ఉండేవి. ఓడల్లో ప్రయాణం ఎక్కువ రోజుల సమయం పట్టేది. దాంతో రోజూ త్రికాల సంధ్యావందనం, మంత్రజపం, వేద అధ్యయనం వంటి కఠిన నియమాలు పాటించడం సరిగ్గా కుదిరేది కాదని అప్పట్లో సముద్రయానం చేసిన వారు ద్విజాధికారం కోల్పోతారని అనేవాళ్లు.
మూడురోజులు సంధ్యావందనం చేయకపోతే మళ్లీ ఉపనయనం చేయాల్సి ఉండేది. కానీ, ఇప్పుడు విమానాలు అందుబాటులోకి వచ్చాయి. ఎక్కడికైనా కొన్ని గంటల వ్యవధిలోనే వెళ్లగలిగే పరిస్థితులొచ్చాయి. కాబట్టి ఆచార నియమాల్లో కూడా మార్పులు వచ్చాయి” అని శాండిల్య అంటున్నారు.
“పైగా విమానయానం చేయకూడనేది ఎక్కడా లేదు. ధర్మసింధు, నిర్ణయసింధుల్లో కూడా సముద్రయానం చేయకూడదనే ఉంది. విమానయానం గురించి లేదు. అయినా అప్పటి పరిస్థితులను బట్టి రాసినవి ఇప్పుడు ఎలా వర్తిస్తాయి” అని శాండిల్య అభిప్రాయపడ్డారు.
2016లో అప్పటి రాష్ట్ర ప్రభుత్వ అధికారులే స్వయంగా కొంతమంది పురోహితులను విదేశాలకు తీసుకెళ్లారని, విదేశాల్లో అక్కడి హిందూ భక్తుల కోరిక మేరకు ధార్మిక కార్యక్రమాలు నిర్వహించి వచ్చామన్నారు.
అప్పుడు స్వయంగా ప్రభుత్వమే విదేశాలకు తీసుకువెళ్లిందని, ఇప్పుడు కూడా ప్రభుత్వం మా వైపు నిలబడుతుందని భావిస్తున్నామని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.
ఫొటో సోర్స్, UGC
హైకోర్టు ఉత్తర్వులను పరిశీలిస్తున్నాం: మంత్రి ఆనం
హైకోర్టు తాజా ఉత్తుర్వులు, అర్చకుల భిన్నాభిప్రాయాల నేపథ్యంలో ప్రభుత్వం ఏం చేయనుందనే విషయమై ఏపీ దేవాదాయశాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డితో బీబీసీ మాట్లాడింది. ఆయన మాట్లాడుతూ, “హైకోర్టు ఉత్తర్వుల కాపీని పూర్తిగా పరిశీలించిన తర్వాతే మాట్లాడగలం” అని అన్నారు.
దీనిపై తొందరపాటుగా మాట్లాడలేమని, హైకోర్టు ఉత్తర్వులు, పండితుల అభిప్రాయాలు పరిగణనలోకి తీసుకునే స్పందిస్తామన్నారు.
రాష్ట్ర దేవాదాయశాఖ కమిషనర్ కె.రామచంద్రమోహన్ బీబీసీతో మాట్లాడుతూ, “హైకోర్టు ఆదేశాలను పత్రికల్లో చూశాం. ఇంకా జడ్జిమెంట్ కాపీ పూర్తిగా పరిశీలించలేదు. సమగ్రంగా అధ్యయనం చేసిన తర్వాతే మాట్లాడగలం” అని అన్నారు.
2010లో స్వయంగా ప్రభుత్వమే ఆ విధంగా సర్క్యులర్ ఇచ్చిన విషయాన్ని హైకోర్టు ప్రస్తావించింది కదా అని బీబీసీ ప్రశ్నించగా, “అప్పటి పరిస్థితులను బట్టి ప్రభుత్వమే ఇచ్చింది, కాదనం. కానీ, ఇప్పటి పరిస్థితులను బట్టి అధ్యయనం చేసి స్పందిస్తాం” అని కమిషనర్ అన్నారు.
కాగా, శృంగేరి శారదాపీఠం గురువులు భారతీ స్వామి 2024 డిసెంబర్ 20న విడుదల చేసిన “ప్రామాణిక”ను అమలు చేయాలంటూ ఏపీ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులపై కర్ణాటకలోని శృంగేరి శారదాపీఠం ప్రధాన కార్యాలయాన్ని బీబీసీ సంప్రదించింది.
అక్కడి ప్రతినిధి దక్షిణామూర్తి బీబీసీతో మాట్లాడుతూ.. పీఠం ప్రామాణికను అమలు చేయాలంటూ ఉన్నత న్యాయస్థానం ఆదేశాలివ్వడం మంచిదే కదా అని వ్యాఖ్యానించారు.



