Home జాతీయ national telgu వంశధార: నదిపై కాదు, భూమిపైకే నీటిని మళ్లించి కట్టిన ఆఫ్‌షోర్ ప్రాజెక్ట్ కథ ఇది..

వంశధార: నదిపై కాదు, భూమిపైకే నీటిని మళ్లించి కట్టిన ఆఫ్‌షోర్ ప్రాజెక్ట్ కథ ఇది..

9
0

SOURCE :- BBC NEWS

హిరమండలం వద్ద సుమారు 8 వేల ఎకరాల విస్తీర్ణంలో నిర్మించిన ఆఫ్ షోర్ ప్రాజెక్ట్

ఫొటో సోర్స్, Irrigation Dept, AP

వంశధార పేరు చెబితే ప్రఖ్యాత బౌద్ధ క్షేత్రం శాలిహుండం గుర్తుకొస్తుంది. ఆ వంశధార నది నీటితో 19 టీఎంసీల సామర్థ్యం గల జలాశయం తుది మెరుగులు దిద్దుకుంటోంది.

సాధారణంగా భారీ జలాశయాలు ఏవైనా నదిపైనే నిర్మిస్తారు. కానీ, ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో తుది దశ నిర్మాణంలో ఉన్న వంశధార ప్రాజెక్ట్ ఒక ఆఫ్ షోర్ ప్రాజెక్టు.

వంశధార స్టేజ్-2 ఫేజ్-2లో భాగంగా హిరమండలం వద్ద సుమారు 8 వేల ఎకరాల విస్తీర్ణంలో భూతలంపై ప్రాజెక్ట్ నిర్మిస్తున్నారు.

వృథాగా పోతున్న వంశధార వరద జలాలను సైడ్ వియర్‌ ద్వారా మళ్లించి, 18 నుంచి 20 మీటర్ల వెడల్పైన 34 కిలోమీటర్ల భారీ కెనాల్‌లోంచి తీసుకొచ్చి సుమారు 19.5 టీఎంసీల మేర నీరు నిల్వ చేయాలనేది ఈ ప్రాజెక్ట్ లక్ష్యమని నీటి పారుదల శాఖ అధికారులు బీబీసీతో చెప్పారు.

అయితే, సైడ్ వియర్ కాకుండా నేరడి వద్ద బరాజ్ నిర్మాణాన్ని సాకారం చేస్తేనే ఈ బృహత్తర ప్రాజెక్టు లక్ష్యం నెరవేరతుందనే వాదనలు ఉన్నాయి. ఇంతకీ ఏమిటీ ప్రాజెక్ట్.. ఎప్పుడు మొదలైంది? ఇప్పుడు ఏ స్థాయిలో ఉంది?

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
వంశధాన ప్రాజెక్టు చిత్రం

ఫొటో సోర్స్, Irrigation Dept, AP

12 వేల కుటుంబాల త్యాగం

నీటి పారుదల శాఖ అధికారుల ప్రకారం…

గంటల వ్యవధిలో ఆకస్మికంగా ఉప్పొంగే వంశధార వరదల నుంచి ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో పంటలు, జనావాసాల ముంపు సమస్యను తప్పించడానికే కాకుండా, ఖరీఫ్‌లో సుమారు 2.56 లక్షల ఎకరాల ఆయకట్టు స్థిరీకరణ, రబీలో దాదాపు 2 లక్షల ఎకరాల్లో వాణిజ్య పంటలకు సాగునీరు అందించాలనేదీ ఈ ప్రాజెక్టు ఉద్దేశం.

అలాగే, ఇప్పుడు ఉద్దానంలో 807 కిడ్నీ వ్యాధి ప్రభావిత గ్రామాలకు వంశధార రిజర్వాయరు డెడ్ స్టోరేజీ నుంచే 1.2 టీఎంసీల వరకూ తాగునీరు సరఫరా అవుతోంది.

వంశధార ప్రాజెక్టులో భాగమైన ప్రధాన జలాశయం (హిరమండలం రిజర్వాయర్), రెండు మినీ రిజర్వాయర్లు, కెనాల్ నిర్మాణానికి అవసరమైన మొత్తం 11,305 ఎకరాల భూసేకరణ కోసం 12,091 కుటుంబాలు తమ పొలాలను, ఇళ్లను త్యాగం చేశాయి. అలా 19 గ్రామాల ప్రజలు ఇళ్లను ఖాళీ చేసి నిర్వాసిత కాలనీలకు తరలిపోయారు.

కానీ, నేరడి వద్ద బరాజ్ కడితే ఆ బ్యాక్ వాటర్ వల్ల తమ భూములు మునిగిపోతాయని ఒడిశా తొలి నుంచీ అభ్యంతరం చెబుతోంది. వాస్తవానికి ఆ ముంపు ప్రాంతాన్ని కనిష్ఠ స్థాయికి పరిమితం చేయడానికి, గ్రావిటీ ద్వారానే సాగునీరు, తాగునీరు అందించాలనే ఉద్దేశంతో 1960లోనే ఆంధ్రప్రదేశ్ జలవనరుల శాఖ ఇంజనీర్లు ఈ భారీ ఆఫ్ షోర్ ప్రాజెక్టుకు డిజైన్ చేశారు.

ఈ ప్రాజెక్టుకు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ 1962 సంవత్సరంలోనే ఆంధ్రప్రదేశ్, ఒడిశా ప్రభుత్వాలు ఒప్పందం కుదుర్చుకున్నాయి.

కానీ, కేవలం 106 ఎకరాల ముంపు ప్రాంతం కోసం ఒడిశా అభ్యంతరాలు లేవనెత్తడంతో వంశధార ప్రాజెక్టు ఆరు దశాబ్దాలుగా కొలిక్కిరాని అంతర్ రాష్ట్ర జలవివాదంగా మారిపోయింది.

వంశధార ప్రాజెక్ట్ మ్యాప్

ఫొటో సోర్స్, Irrigation Dept, AP

మూడు దశలలో వంశధార ప్రాజెక్టు…

ఒడిశాతో 106 ఎకరాల ముంపు భూమి వివాదం ఎంతకీ కొలిక్కి వచ్చే అవకాశం కనిపించకపోవడంతో, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒకవైపు న్యాయ పోరాటం చేస్తూనే, మరోవైపు వంశధార ప్రాజెక్టును దశల వారీగా పూర్తి చేయాలని భావిస్తోంది. నీటి పారుదల శాఖ దగ్గరున్న సమాచారం ప్రకారం…

స్టేజ్-1: వంశధార నదిపై గొట్టా వద్ద 1971లో ప్రారంభమైన బరాజ్ నిర్మాణ పనులు, పలాస వరకూ 104 కిలోమీటర్ల పొడవున ఎడమ ప్రధాన కాలువ నిర్మాణం 1977 సంవత్సరంలో పూర్తి అయ్యాయి. దీనివల్ల 12 మండలాల్లో 398 గ్రామాల పరిధిలోని 1,48,230 ఎకరాలకు సాగునీరు అందుతోంది.

స్టేజ్-2లో ఫేజ్-1: సుమారు 53 కిలోమీటర్ల పొడవున కుడి ప్రధాన కాలువ నిర్మాణం, డిస్ట్రిబ్యూటరీ నెటవర్క్ సిస్టమ్ కోసం రూ.123.24 కోట్ల అంచనా వ్యయంతో ప్రభుత్వం 2000, ఆగస్టు 14న అనుమతులు ఇచ్చింది.

దీన్ని రూ.209 కోట్లకు పెంచుతూ 2011 డిసెంబర్ 27వ తేదీన మరోసారి అనుమతులు మంజూరు చేసింది. దీని ద్వారా ఏడు మండలాల్లో 165 గ్రామాల పరిధిలో 63,276 ఎకరాలకు నీరు అందుతోంది.

స్టేజ్-2లో ఫేజ్-2: 2005 సంవత్సరంలో నాటి ముఖ్యమంత్రి వై.ఎస్. రాజశేఖరరెడ్డి ప్రభుత్వం తలపెట్టిన జలయజ్ఞంలో భాగంగా కాట్రగడ వద్ద సైడ్ వియర్, కెనాల్, రెండు మినీ రిజర్వాయర్లు, హిరమండలం వద్ద ప్రధాన జలాశయం (ఆఫ్ షోర్ ప్రాజెక్ట్) నిర్మాణ పనులకు రూ.933.90 కోట్ల అంచనా వ్యయంతో ఆమోదం తెలిపింది.

ఆ తర్వాత గత వైసీపీ ప్రభుత్వం రూ.2,407.79 కోట్లకు సవరిస్తూ.. 2022 జూన్ 26వ తేదీన ఉత్తర్వులు జారీ చేరింది.

అలాగే, తమకు పరిహారం పెంచాలన్న నిర్వాసితుల విజ్ఞప్తి మేరకు అదనపు ఎక్స్‌గ్రేషియాగా రూ.216.71 కోట్లను విడుదల చేసింది. గతంలో కాంగ్రెస్, టీడీపీ ప్రభుత్వాల హయాంలో వారికి పరిహారం, పునరావాసం కింద రూ.745 కోట్ల వరకూ చెల్లించారు.

ఇప్పటివరకూ ఈ ప్రాజెక్ట్ నిర్మాణ వ్యయం రూ.2,624.50 కోట్లకు చేరింది. 93 శాతం పనులు పూర్తి అయ్యాయి.

వంశధార ప్రాజెక్టులో ప్రధానమైన పనులన్నీ దాదాపుగా పూర్తి అయ్యాయని, తుది మెరుగులు మాత్రమే పెండింగ్ ఉన్నాయని, అవి పూర్తి చేస్తే రానున్న ఖరీఫ్ నాటికే సాగునీరు అందించవచ్చని ఈ ప్రాజెక్టులో సుదీర్ఘకాలం పనిచేసిన జలవనరుల శాఖ ఎస్ఈ డోల తిరుమల రావు బీబీసీకి చెప్పారు.

Dharmana Prasad Rao

మిగులు పనులు కొంతమేరే…

సైడ్ వియర్, హెడ్ రెగ్యులేటర్, వరద ప్రవాహ కాలువ (ఫ్లడ్ ఫ్లో కెనాల్) కొంత భాగం, సింగిడి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ నిర్మాణ పనులను హైదరాబాద్‌కు చెందిన రిత్విక్ ప్రాజెక్ట్స్ సంస్థ చేస్తోంది.

ఇప్పటివరకూ రూ.137.32 కోట్ల వ్యయంతో 80 శాతం పనులను పూర్తి చేసింది. మరో రూ.40 కోట్ల విలువైన పనులు పూర్తి చేయాల్సి ఉంది.

ఫ్లడ్ ఫ్లో కెనాల్‌లో మిగతా భాగం, పారాపురం బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ నిర్మాణ పనులను విజయవాడకు చెందిన శ్రీ సాయిలక్ష్మి కన్‌స్ట్రక్షన్స్ కంపెనీ చేస్తోంది.

ఇప్పటివరకూ దాదాపు రూ.190 కోట్ల వ్యయంతో 96 శాతం పనులు పూర్తి చేసింది. మరో రూ.44 కోట్ల మేర పనులు చేయాల్సి ఉంది.

ఇక ప్రధానమైన హిరమండలం ఎర్త్ డ్యామ్‌ నిర్మాణ పనులతో పాటు లింక్ కెనాల్ కోసం లెఫ్ట్ హెడ్ స్లూయిస్, హైలెవల్ కెనాల్ (వంశధార-నాగావళి నదుల అనుసంధానం) కోసం రైట్ హెడ్ స్లూయిస్‌ తదితర పనులను హైదరాబాద్‌కు చెందిన సోమా-పటేల్-ఏఎస్ఐ (జేవీ) చేస్తోంది.

ఇప్పటివరకూ రూ.521.76 కోట్ల వ్యయంతో 96 శాతం పనులను పూర్తి చేసింది. ఇంకా రూ.84 కోట్ల విలువైన పనులు పెండింగ్ ఉన్నాయి.

హైలెవల్ కెనాల్ నిర్మాణ పనులు

ఫొటో సోర్స్, Irrigation Dept, AP

నదుల అనుసంధానానికి మచ్చుతునక…

ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో వంశధార, నాగావళి, సువర్ణముఖి, మహేంద్రతనయ, బాహుదా నదులు ప్రవహిస్తున్నాయి. వాటిలో ప్రధానమైన వంశధార, నాగావళి నదులు రెండూ తూర్పు కనుమల్లోనే జన్మిస్తున్నాయి.

ఒడిశా రాష్ట్రంలోని కలహండి జిల్లాలో లాంజిగఢ్ సమీపంలో జన్మిస్తున్న వంశధార తన ప్రవాహ క్రమంలో చిన్నచిన్న వాగులను కలుపుకుంటూ రాయగడ, గజపతి జిల్లాల మీదుగా కాట్రగడకు కొంత ఎగువన శ్రీకాకుళం జిల్లాలో ప్రవేశిస్తోంది. కళింగపట్నం వద్ద బంగాళాఖాతంలో కలుస్తుంది. దీని మీద నిర్మించిన గొట్టా బరాజ్ తప్ప మరే పెద్ద ప్రాజెక్టులుగానీ, ఆనకట్టలు కానీ లేవు.

నాగావళి నది కూడా కలహండి జిల్లాలోనే వంశధార జన్మస్థానానికి సమీపంలో ఉన్న లాంగుల్య వద్ద జన్మిస్తోంది. రాయగడ జిల్లా మీదుగా ఆంధ్రప్రదేశ్‌లో అడుగుపెట్టి ఉమ్మడి విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో ప్రవహిస్తోంది.

శ్రీకాకుళం నగరానికి సమీపంలోని కల్లేపల్లి వద్ద బంగాళాఖాతంలో కలుస్తుంది. దీనిపై సువర్ణముఖి కలిసేచోట మడ్డువలస వద్ద నిర్మించిన రిజర్వాయర్, తోటపల్లి వద్ద నిర్మించిన బరాజ్ మాత్రమే చెప్పుకోదగినవి.

ఇంచుమించు సమాంతరంగా ప్రవహించే వంశధార, నాగావళి నదులు వర్షాకాలంలో, ముఖ్యంగా తూర్పు కనుమల్లో ఏమాత్రం పెద్ద వర్షాలు పడినా ఒకేసారి పోటెత్తుతాయి.

ఇక వంశధార నదిపై గొట్టా వద్ద బరాజ్ ఒక్కటే కావడంతో దాని వరదకు అడ్డే ఉండదు. వరద వచ్చిందంటే వేలాది ఎకరాల్లో పంట నష్టం తప్పట్లేదు. ఒకటీ రెండు రోజుల ముంపు అయితే కొంత ఫర్వాలేదు కానీ అంతకుమించి ముంపు ఉంటే పంటలు పూర్తిగా పాడైపోతున్నాయి.

ఈ వరదలకు అడ్డుకట్ట వేయడానికే గాకుండా ఖరీఫ్‌లో ఆయకట్టు స్థిరీకరణకు, రబీలో వాణిజ్య పంటలకు సాగునీరు అందించడానికి వంశధార ప్రాజెక్టు ప్రతిపాదనను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దశాబ్దాల క్రితమే తెరపైకి తెచ్చింది.

అంతేగాకుండా ఎండాకాలంలో అడుగంటిపోయే నాగావళి నదిలోకి వంశధార జలాలను మళ్లించడం ద్వారా శ్రీకాకుళం జిల్లా కేంద్రంతో పాటు కొన్ని వందల గ్రామాల తాగునీటి ప్రాజెక్టులకు ఎద్దడి లేకుండా చేయడానికి, అలాగే నారాయణపురం ఆనకట్ట పరిధిలోని 18 వేల ఎకరాల ఆయకట్టు స్థిరీకరణకు, అదనంగా మరో 5 వేల ఎకరాలకు సాగునీరు అందించడానికి ‘వంశధార-నాగావళి నదుల అనుసంధానం’ ప్రతిపాదన కూడా వచ్చింది.

ఈమేరకు హిరమండలం రిజర్వాయర్ నుంచి నారాయణపురం ఆనకట్ట వరకూ 33.5 కిలోమీటర్ల పొడవున హైలెవల్ కెనాల్ నిర్మించడానికి 2017-18 సంవత్సరంలో నాటి టీడీపీ ప్రభుత్వం ఆమోదం తెలిపింది.

రూ.145.34 కోట్ల అంచనా వ్యయంతో పనులు చేపట్టిన నెల్లూరుకు చెందిన పీవీ వెంకటరమణయ్య అండ్ కో కంపెనీ ఇప్పటివరకూ 73 శాతం పనులు పూర్తి చేసింది. మరో రూ.50 కోట్ల విలువైన పనులు చేయాల్సి ఉంది.

గత టీడీపీ ప్రభుత్వ హయాంలోనే ‘వంశధార-బాహుదా అనుసంధానం’ ప్రాజెక్టు కూడా తెరపైకి వచ్చింది. మొత్తం రూ.6,326.62 కోట్లతో చేపట్టడానికి 2019 ఫిబ్రవరి 6న ప్రభుత్వం అనుమతులు ఇచ్చింది. అయితే కొద్ది రోజులకే వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి రావడంతో అది కార్యరూపం దాల్చలేదు.

వంశధార నదిపై ఉన్న ఏకైక ఆనకట్ట గొట్టా బరాజ్

ఫొటో సోర్స్, AP Irrigation Department

‘ఉద్దానం’ వరకూ వంశధార నీరు…

‘వంశధార-బాహుదా నదుల అనుసంధానం’ అనే భారీ బడ్జెట్ ప్రాజెక్టు గాకుండా సుమారు రూ.700 కోట్ల వ్యయంతో ఉద్దానం ప్రాంతంలో కిడ్నీ వ్యాధుల ప్రభావం ఉన్న దాదాపు 807 గ్రామాల్లో ఇంటింటికీ తాగునీరు సరఫరా చేసే ప్రాజెక్టుకు వైసీపీ ప్రభుత్వం 2019 సెప్టెంబర్ 6న ఆమోదముద్ర వేసింది.

ఇందుకోసం హిరమండలం రిజర్వాయర్ నుంచి వంశధార నీటిని తీసుకొచ్చేందుకు సుమారు వంద కిలోమీటర్ల పొడవైన ప్రధాన పైప్‌లైన్‌తో పాటు ఇంటింటికీ కొళాయి వేసేందుకు 1,200 కిలోమీటర్ల మేర పైపులు వేశారు.

2023 డిసెంబర్ 14న అప్పటి ముఖ్యమంత్రి వై.ఎస్ జగన్‌మోహన్ రెడ్డి ప్రారంభించిన ఈ ప్రాజెక్టు ద్వారా ప్రతి రోజూ దాదాపు 8 కోట్ల లీటర్ల వంశధార జలాలను శుద్ధి చేసి సరఫరా చేస్తున్నారు.

సైడ్ వియర్ నుంచి కెనాల్‌లోకి వస్తున్న వంశధార వరద నీరు

ఫొటో సోర్స్, AP Irrigation Department

‘నేరడి బరాజ్’ కడితేనే కలల సాకారం…

శ్రీకాకుళం జిల్లాలో లక్షలాది ఎకరాలకు సాగునీటికి, లక్షలాది మంది ప్రజల తాగునీటికి, గంటల వ్యవధిలోనే ముంచెత్తే వరదల నుంచి పంటల రక్షణకు సంబంధించిన వంశధార ప్రాజెక్టు ఆశయం సాకారమవ్వాలంటే నేరడి బరాజ్ నిర్మాణం చాలా కీలకం.

ప్రసుత్తం సైడ్ వియర్ నిర్మించిన కాట్రగడ గ్రామానికి కాస్త దిగువున నేరడి వద్ద బరాజ్ కడితేనే హిరమండలం ప్రధాన రిజర్వాయర్‌ పూర్తి సామర్థ్యం 19 టీఎంసీల నీటిని నింపడం సాధ్యమవుతుందని నీటి పారుదల శాఖ అధికారులు చెబుతున్నారు.

115 టీఎంసీల (2007లో కాశీనగర్ వద్ద 105 టీఎంసీలుగా సీడబ్ల్యూసీ అంచనా వేసింది) వంశధార నదీజలాల పంపిణీ కోసం 1962లో ఆంధ్రప్రదేశ్, ఒడిశా రాష్ట్రాలు కుదుర్చుకున్న ఒప్పందంలో నేరడి బరాజ్ ప్రతిపాదన కూడా ఉంది.

ఈ బరాజ్‌ని నిర్మించుకోవడానికి వంశధార జలవివాదాల ట్రిబ్యునల్ 2021 జూన్ 21న అనుమతి ఇచ్చింది. కానీ, దీన్ని సవాలు చేస్తూ ఒడిశా ప్రభుత్వం సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్లు దాఖలు చేసింది. ప్రస్తుతం అవి విచారణలో ఉన్నాయి.

”నేరడి బరాజ్ పూర్తి అయితే ఒడిశా రాష్ట్ర పరిధిలో 50 వేల ఎకరాలకు సాగునీరు ఇవ్వడానికి అవకాశం ఉంది. కానీ కేవలం 105 ఎకరాలు ముంపు అవుతుందని అక్కడి అధికారులు అభ్యంతరం చెబుతున్నారు. ముంపు అవుతుందని చెబుతున్న భూమిలో 60 ఎకరాలు కొండ పోరంబోకు భూములే. నష్టపోతున్న రైతులకు నష్టపరిహారం ఇవ్వడానికి కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సిద్ధంగా ఉన్నా వారు అంగీకరించట్లేదు” అని ఎస్ఈ డోల తిరుమలరావు బీబీసీతో అన్నారు.

నేరడి బరాజ్ వల్ల 105 ఎకరాల ముంపు సమస్య ఒక్కటే కాదని, అక్కడి నుంచి గొట్టా బరాజ్ వరకూ ఉన్న మధ్యప్రాంతంలో కూడా ఒడిశా వైపు పంటలకు వరదల సమయంలో ముంపు ప్రమాదం ఉంటుందని, అందుకే తమ ప్రభుత్వం అభ్యంతరం చెబుతోందని ఒడిశా జలవనరుల శాఖ అధికారిగా ఇటీవలై రిటైరైన జ్యోతిరాజ్ అధికారి చెప్పారు.

ఆయన ఫోన్‌లో బీబీసీతో మాట్లాడుతూ, వంశధార జన్మస్థలం, క్యాచ్‌మెంట్ ఏరియా అంతా ఒడిశాలోనే ఉన్నా జలాల వినియోగంలో తగిన న్యాయం లేదనే ట్రిబ్యునల్ తీర్పుపై తమ ప్రభుత్వం సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్లు వేసిందన్నారు. ఈ అంశం కోర్టు విచారణ పరిధిలో ఉన్నందున అంతకుమించి ఈ వివాదం గురించి చెప్పలేనన్నారు.

1962లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రికి ఒడిశా ముఖ్యమంత్రి పంపిన లేఖ

ఫొటో సోర్స్, AP Irrigation Department

తొలుత అంగీకరించి, తర్వాత అభ్యంతరం…

వంశధార నది నుంచి ఏటా115 టీఎంసీల జలాలను చెరో సగం ఉపయోగించుకోవడానికి ఆంధ్రప్రదేశ్, ఒడిశా రాష్ట్రాల మధ్య 1962 సెప్టెంబర్ 30వ తేదీన ఒప్పందం కుదిరింది.

ఈ ఒప్పందం ప్రకారం ఇరు రాష్ట్రాలు ఏమేమీ చేయాలో పేర్కొంటూ అప్పటి ఒడిశా ముఖ్యమంత్రి బిజూ పట్నాయక్ నాటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నీలం సంజీవరెడ్డికి 1962 అక్టోబర్ 3న లేఖ రాశారు. అందులో ముఖ్యమైన విషయాలేమిటంటే…

1962, సెప్టెంబర్ 4న ఇరు రాష్ట్రాల ఇంజనీరింగ్ అధికారుల మధ్య జరిగిన చర్చల ప్రకారం, వంశధార నది ఎడమగట్టుపై ఒడిశా ఇంజనీర్లు సూచించిన చోట ఒక స్లూయిస్ నిర్మించాలి. ప్రతిపాదిత ఆనకట్ట ఖర్చును ఇరు ప్రభుత్వాలు ఆయకట్టు ఆధారంగా పంచుకుంటాయి.

గొట్టా వద్ద వేసిన అంచనా ప్రకారం వంశధార నదిలో లభ్యమైన సుమారు 115 టీఎంసీల నీటిలో ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించి గొట్టా, నేరడి ప్రాజెక్టులకు 47.40 టీఎంసీల నీరు అవసరం. అయితే ఆంధ్రప్రదేశ్ ప్రస్తుత, ప్రతిపాదిత ప్రాజెక్టుల కోసం మొత్తం జలాల వినియోగం 54.5 టీఎంసీలకు మించకూడదని, ఒడిశా రాష్ట్ర అవసరాలకు సుమారు 55 టీఎంసీలు ఉండాలని ఇరు రాష్ట్రాల ఇంజనీర్లు 1962, సెప్టెంబర్ 30వ తేదీన భువనేశ్వర్‌లో జరిగిన చర్చలలో అంగీకరించారు.

గొట్టా ప్రాజెక్టు వల్ల ముంపు సమస్యలన్నీ తొలగిపోయాయని పేర్కొంటూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 1962 జూలై 17న పంపిన లేఖ ద్వారా తెలుసుకున్నాం.

పైన పేర్కొన్న పరిస్థితులను పరిగణనలోకి తీసుకొని, మీరు (ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం) ఇప్పుడు నేరడి ప్రాజెక్టు నిర్మాణంతో ముందుకు వెళ్లవచ్చు…. అని ఆ లేఖలో అప్పటి ఒడిశా ముఖ్యమంత్రి తెలిపారు.

”1962లో ఆంధ్రప్రదేశ్, ఒడిశా ముఖ్యమంత్రుల మధ్య కుదిరిన ఒప్పందం మేరకు అప్పుడే నేరడి బరాజ్ సహా వంశధార ప్రాజెక్టు నిర్మాణానికి శంకుస్థాపన జరిగింది. కానీ కొద్దిరోజులకే ఒడిశా అధికారులు అభ్యంతరం చెప్పి, సుప్రీంకోర్టులో పిటిషన్లు వేయడంతో చిక్కుముడి పడింది” అని రాష్ట్ర మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు బీబీసీతో చెప్పారు.

సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ ముకుందకం శర్మ నేతృత్వంలో 2010లో ఏర్పాటైన వంశధార జలవివాదాల ట్రిబ్యునల్ (వీడబ్ల్యూడీటీ) దాదాపు పదేళ్ల పాటు క్షేత్రస్థాయికి వచ్చి పరిశీలించడమే గాక ఇరు రాష్ట్రాల నాయకులు, అధికారులతో మాట్లాడిందని ఆయన ప్రస్తావించారు. ఇంత సుదీర్ఘ విచారణ తర్వాత నేరడి బరాజ్ కట్టడానికి అనుమతి ఇస్తూ ట్రైబ్యునల్ తీర్పు ఇచ్చిందన్నారు.

తుది దశకు చేరుకున్న ప్రాజెక్టు నిర్మాణ పనులు

ఫొటో సోర్స్, AP Irrigation Department

ముఖ్యమంత్రుల భేటీలతోనూ కొలిక్కిరాని వివాదం…

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపట్టిన వంశధార ప్రాజెక్టు రెండో దశ పనులపై ఒడిశా లేవనెత్తిన అభ్యంతరాలను పరిష్కరించేందుకు పలుమార్లు ఇరు రాష్ట్రాల అధికారులు, చివరకు ముఖ్యమంత్రుల స్థాయిలో చర్చలు జరిగాయి.

1987 జనవరి 15వ తేదీన నాటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్‌టీ రామారావు, ఒడిశా ముఖ్యమంత్రి జేబీ పట్నాయక్ న్యూదిల్లీలో భేటీ అయ్యారు. అప్పటి కేంద్ర జలవనరుల శాఖ మంత్రి బి.శంకరానంద్ మధ్యవర్తిత్వం వహించారు.

వంశధార నదిపై నేరడి ప్రాజెక్టు వల్ల ఒడిశాలో ముంపు ప్రభావాన్ని తగ్గించేలా ప్రాజెక్టు రీడిజైన్ చేయడానికి, తుదకు ఒడిశాలో ముంపునకు గురయ్యే 106 ఎకరాలకు నష్టపరిహారం చెల్లించడానికి ఎన్‌టీ రామారావు అంగీకరించారు. అయినప్పటికీ ఒడిశా అధికారుల నుంచి ఏవొక అభ్యంతరాలు వస్తుండటంతో నేరడి ప్రాజెక్టు ప్రతిపాదన దశలోనే మిగిలిపోయింది.

2021 నవంబర్ 9వ తేదీన నాటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్‌మోహన్‌రెడ్డి స్వయంగా భువనేశ్వర్ వెళ్లి అప్పటి ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్‌ను కలిశారు. దాదాపు గంట పాటు ఇరువురు ముఖ్యమంత్రులు చర్చలు జరిపారు. అయినప్పటికీ, నేరడి ప్రాజెక్టుపై ఒడిశా అభ్యంతరాలు తొలగిపోలేదు.

”నేరడి బరాజ్ పూర్తయితేనే వంశధార ప్రాజెక్టులో పూర్తిస్థాయి సామర్థ్యం మేరకు 19 టీఎంసీల నీటిని నింపుకోవడానికి అవకాశం కలుగుతుంది. అది నిండితేనే ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా ప్రజలకు మండువేసవిలోనూ తాగునీరు, సాగునీరు అందుతాయి” అని మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు అన్నారు.

హిరమండలం రిజర్వాయర్‌లో డెడ్ స్టోరేజీ స్థాయిలో నీరు

ఫొటో సోర్స్, AP Irrigation Department

‘ఎత్తిపోతలు’ తాత్కాలిక ఉపశమనమే…

వంశధార ప్రాజెక్టుకు ఆయువుపట్టులాంటి నేరడి బరాజ్ నిర్మాణానికి ఒడిశా ప్రభుత్వం అంగీకరించకపోవడంతో, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తాత్కాలికంగా ‘ఎత్తిపోతల పథకం’ నిర్మాణం చేపట్టింది.

గొట్టా బరాజ్ నుంచి హిరమండలం ప్రధాన రిజర్వాయర్‌లోకి ఏటా 12 టీఎంసీల నీటిని తోడిపోసేలా రూ.176.35 కోట్లతో లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్‌ ఏర్పాటు చేయడానికి గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం 2022 సెప్టెంబర్ 14న అనుమతి ఇచ్చింది. ప్రస్తుతం 45 శాతం పనులు పూర్తి అయ్యాయి.

”వాస్తవానికి గొట్టా బరాజ్ సముద్ర మట్టానికి 38 మీటర్ల ఎత్తులో ఉంటే, హిర మండలం రిజర్వాయర్ 67 మీటర్ల ఎత్తున ఉంది. అదే నేరడి వద్ద బ్యారేజ్ కడితే 72 మీటర్ల ఎత్తులో ఉంటుంది. దాని నుంచి గ్రావిటీ ద్వారానే హిరమండలం రిజర్వాయర్‌లోకి జలాలు ప్రవహిస్తాయి” అని ఎస్ఈ డోల తిరుమలరావు చెప్పారు.

”ఐదు నదులు ప్రవహిస్తున్నా, సుదీర్ఘ తీర ప్రాంతం ఉన్నా, జిల్లా పొడవునా హౌరా-చెన్నై రైల్వే లైన్, చెన్నై-కలకత్తా జాతీయ రహదారి ఉన్నా ఈరోజుకూ శ్రీకాకుళం వెనుకబడిన జిల్లాగా ఉండటానికి ప్రభుత్వాల నిర్లక్ష్యమేనని ఇక్కడి ప్రజల ఆవేదన. వంశధార సమస్య పరిష్కరించేలా ప్రధానమంత్రిని ఒప్పించాలి” అని ధర్మాన ప్రసాదరావు అభిప్రాయపడ్డారు.

ఈ విషయమై శ్రీకాకుళం జిల్లాకే చెందిన రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడును ఫోన్‌లో సంప్రదించడానికి బీబీసీ ప్రయత్నించింది. ఆయన నుంచి స్పందన రాలేదు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)