Home LATEST NEWS telugu తాజా వార్తలు లాఫింగ్ గ్యాస్: ఈ ‘నవ్వించే వాయువు’ను బ్యాన్ చేయాలని అమెరికాలో డిమాండ్లు ఎందుకు వినిపిస్తున్నాయి?

లాఫింగ్ గ్యాస్: ఈ ‘నవ్వించే వాయువు’ను బ్యాన్ చేయాలని అమెరికాలో డిమాండ్లు ఎందుకు వినిపిస్తున్నాయి?

3
0

SOURCE :- BBC NEWS

నైట్రస్ ఆక్సైడ్

ఫొటో సోర్స్, Getty Images

  • రచయిత, ఈవ్ వెబ్‌స్టర్
  • హోదా, బీబీసీ న్యూస్
  • 29 మే 2025

నైట్రస్ ఆక్సైడ్. లాఫింగ్ గ్యాస్ గానూ ప్రసిద్ధి. దీనిని అనేక రూపాలలో వాడుతుంటారు. దంత చికిత్సలో పెయిన్ కిల్లర్‌గా, చాక్లెట్లు, కేకులపైన ఉండే క్రీమ్‌ను తయారు చేయడంతో విప్పింగ్ ఏజెంట్‌గా దీనిని వాడుతుంటారు.

దీనిని పీల్చితే ఏం జరుగుతుందన్న విషయం చాలాకాలం నుంచి తెలిసినప్పటికీ, యువతలో ఇది క్రమక్రమంగా వ్యసనంగా మారుతోందని, వాపింగ్ ( సిగరెట్ తరహా పరికరం) ద్వారా ఈ ధోరణి వేగంగా విస్తరిస్తోందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

మెగ్ కాల్డ్‌వెల్డ్ చాలా చిన్న వయసులోనే చనిపోయింది. ఎనిమిదేళ్ల కిందట ఆమె యూనివర్సిటీలో సరదాగా నైట్రస్ ఆక్సైడ్‌ పీల్చడం మొదలుపెట్టారు. కరోనా మహమ్మారి సమయంలో ఆమె కూడా చాలామంది యువతలానే దీనిని ఎక్కువగా తీసుకోవడం మొదలుపెట్టారు.

నలుగురు అక్కాచెల్లెళ్లల్లో కాల్డ్‌వెల్డ్ అందరికంటే చిన్నది. కొద్దికొద్దిగా తీసుకోవడంతో మొదలైన అలవాటు కాస్తా, అదే జీవితంగా మారే స్థితికి వెళ్లింది.

అతిగా (ఓవర్‌డోస్ ) ఈ గ్యాస్‌ను పీల్చడంతో ఆమె శరీరభాగాలు దెబ్బతిన్నాయి. ఆమె కొన్నాళ్లు కాళ్లను కదిలించలేని పరిస్థితిలోకి వెళ్లారు. అయినా తన అలవాటును మానుకోలేకపోయారు.

స్థానిక సిగరెట్ షాపులలో కొనడం, కారుపార్కింగ్‌ ఏరియాల్లో కూర్చుని పీల్చడం, మళ్లీ షాపుకు వెళ్లడం, కొనడం, పీల్చడం…ఇలా ఆమె దాని కోసం రోజూ వందల డాలర్లు ఖర్చు చేసేవారు.

గత నవంబర్‌లో ఆమె ఓ వాప్ షాపు దగ్గర్లలోని కారు పార్కింగ్‌లో చనిపోయి కనిపించారు.

”ఆమె సిగరెట్ షాపుల్లో వాటిని కొనడం వల్ల చట్టపరంగా అనుమతి ఉన్న పదార్థాన్నే తాను కొంటున్నానని అనుకున్నారు. అది తనకు హాని చేస్తుందని ఆమె గ్రహించలేకపోయారు” అని కాల్డ్‌వెల్ సోదరి కాథ్లీన్ డయల్ చెప్పారు.

యవ్వనంలో ఆకతాయితనంతో మొదలైన కాల్డ్‌వెల్ వ్యసనం, చివరకు ఆమె జీవితానికే ప్రమాదకారిగా మారింది.

అమెరికాలో 2023-24 మధ్య నైట్రస్ ఆక్సైడ్‌ను ఉద్దేశపూర్వకంగా పీల్చేవారు 58 శాతం పెరిగినట్టు అమెరికా పాయిజన్ సెంటర్ల రిపోర్టులు చెబుతున్నాయి.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్
నైట్రస్ ఆక్సైడ్

నైట్రస్ ఆక్సైడ్ పీల్చితే ఏమవుతుంది?

నైట్రస్ ఆక్సైడ్‌ను పీల్చినప్పుడు ఏర్పడటానికి అవకాశం ఉన్న అత్యంత తీవ్ర పరిణామం హైపోక్సియా. ఇలాంటి సందర్భంలో మెదడుకు తగినంత ఆక్సిజన్ అందక చనిపోయే ప్రమాదముంది. ఇది రోజూ పీల్చితే విటమిన్ బీ12 లోపానికి దారితీస్తుంది. దీనివల్ల నరాలు దెబ్బతినడం, వెన్నెముక క్షీణించి, పక్షవాతానికీ కారణం కావచ్చు.

సెంటర్స్ ఫర్ డిసీజెస్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ ప్రకారం 2019, 2023 మధ్య నైట్రస్ ఆక్సైడ్ పీల్చడం వల్ల కలిగిన మరణాలు 110శాతం పెరిగాయి.

కరోనా మహమ్మారి సమయంలో యూకేలో యువత నైట్రస్ ఆక్సైడ్‌ను వాడటం ఎక్కువ కావడంతో, 2023 నుంచి నైట్రస్ ఆక్సైడ్‌తో తిరగడం నేరంగా పరిగణిస్తున్నారు.

అమెరికాలోని అనేక రాష్ట్రాలు దీనిని సరదా( రిక్రియేషన్)గా వాడటాన్ని బ్యాన్ చేసినప్పటికీ, వంట దినుసుగా దీని అమ్మకాలు అమెరికాలో ఇప్పటికీ చట్టబద్ధమే. కేవలం లూసియానా రాష్ట్రం మాత్రమే ఈ గ్యాస్ రిటైల్ అమ్మకాలను పూర్తిగా నిషేధించింది.

నైట్రస్ ఆక్సైడ్‌ను తయారు చేసే గెలాక్సీ గ్యాస్ సంస్థ, పీనట్ చిల్లీ ఫోమ్ చికెన్, పుచ్చకాయ జ్యూస్ తయారీ విధానాలను అలాగే బ్లూ రాస్‌బెర్రీ, స్ట్రాబెర్రీస్, క్రీముల వంటి రెసిపీల గురించి తమ వెబ్‌సైట్‌లో అందిస్తుంటారు. ఇది వారి ప్రధాన వ్యాపారానికి సంబంధం లేనిదిగా కనిపిస్తుంటుంది. ప్యాకింగ్‌‌లో, రిటైల్ ఉత్పత్తుల విక్రయం సహా ఈ లొసుగులపై నిపుణులు హెచ్చరిస్తూ ఇది నైట్రస్ ఆక్సైడ్ దుర్వినియోగానికి కారణమవుతోందని అంటున్నారు.

నైట్రస్ ఆక్సైడ్

ఫొటో సోర్స్, Getty Images

ఆకర్షణీయంగా క్యాన్ల తయారీ

ఇటీవలి వరకు 8 గ్రాముల బరువుండే సాధారణ మెటల్ కానిస్టర్స్‌‌లో ఈ గ్యాస్‌ను అమ్మేవారు. ఈ క్యాన్‌లను ఒక్కసారి ఉపయోగించి పడేసేవారు. ఎప్పుడైతే మహమ్మారి సమయంలో వీటి వాడకం పెరిగిందో నైట్రస్ ఆక్సైడ్ తయారీదారులు 2 కేజీల బరువుడే కానిస్టర్స్‌ను కూడా ఆన్‌లైన్‌లో అమ్మడం మొదలుపెట్టారు. చివరకు ఇవి ఎలక్ట్రానిక్ వాప్స్, ఇతర స్మోకింగ్ గూడ్స్ అమ్మే షాపులకు చేరాయి.

కంపెనీలు కూడా రంగురంగుల డిజైన్లు, కంప్యూటర్ గేమ్స్‌, టెలివిజన్ సిరీస్‌లోని పాత్రలతో కానిస్టర్స్‌ను తయారుచేసి వాటిలో గ్యాస్ నింపడం మొదలుపెట్టాయి.

నైట్రస్ ఆక్సైడ్ దుర్వినియోగం పెరగడం వెనుక ఈ పరిణామాలు కూడా ఒక కారణమని ‘ఎండ్ అడిక్షన్’‌కు చెందిన పాట్ అసెమ్ అభిప్రాయపడ్డారు.

‘‘గెలాక్సీ గ్యాస్ లేదా మయామీ మ్యాజిక్ అని పిలవడం కూడా మార్కెటింగ్’’ అని ఆమె అన్నారు. ‘‘మీ దగ్గర పెద్ద పెద్ద డబ్బాలు కనిపిస్తుంటే, ఎక్కువమందికి దీని మీద ఆసక్తి పెరుగుతుంది. తాము కూడా దీన్ని తీసుకోవచ్చేమోనని మిగిలినవారు భావించే అవకాశం ఏర్పడుతుంది” అని పాట్ అసెమ్ అన్నారు.

దీనిపై ప్రతిస్పందన కోసం గెలాక్సీ గ్యాస్, మయామీ మ్యాజిక్‌ను బీబీసీ సంప్రదించింది. కానీ స్పందన రాలేదు. నైట్రస్ ఆక్సైడ్‌ను దుర్వినియోగం చేస్తున్నారనే విషయం తమకు తెలుసని, మరిన్ని భద్రతాపరమైన చర్యలు అమలు చేయడానికి కృషిచేస్తున్నామని ఆన్‌లైన్‌లో ఈ గ్యాస్‌ను అమ్మే అమెజాన్ తెలిపింది.

అమెరికాలో బీబీసీ న్యూస్ భాగస్వామి సీబీఎస్‌ న్యూస్‌లో వచ్చిన రిపోర్టింగ్‌పై ప్రతిస్పందనగా, తమ ఉత్పత్తులు కేవలం వంటకాలకు మాత్రమే ఉద్దేశించినవని, దాని దుర్వినియోగానికి వ్యతిరేకంగా తమ సైట్‌లో హెచ్చరికలు జారీ చేసినట్టు గెలాక్సీ గ్యాస్ తెలిపింది.

నైట్రస్ ఆక్సైడ్‌ను వినియోగిస్తున్న వీడియోలు అనేకం ఆన్‌లైన్‌లో వైరల్‌గా మారడంతో, దీని వాడకంపై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.

నైట్రస్ ఆక్సైడ్

ఫొటో సోర్స్, Submitted to BBC

ఆన్‌లైన్ ట్రెండ్..

నైట్రస్ ఆక్సైడ్‌ను వాడి గాల్లో తేలిపోతున్న అనుభూతిని పొందే యువకుల వీడియోలు సోషల్ మీడియాలో ట్రెండ్‌గా మారాయి. 2024 జూలైలో అట్లాంటాకు చెందిన ఫాస్ట్‌ఫుడ్ రెస్టారెంట్ అప్‌లోడ్ చేసిన వీడియోలో, ఒక యువకుడు స్ట్రాబెర్రీస్, క్రీమ్ ఫ్లేవర్డ్ నైట్రస్ ఆక్సైడ్‌ను పీల్చుతూ “మై నేమ్స్ లిల్ టి, మ్యాన్” అని చెప్పడం కనిపిస్తుంది.

ఇప్పటి వరకు ఈ క్లిప్‌ను 4 కోట్లమంది వీక్షించారు. ఈ వీడియోను చూసి తరువాత ఇలాంటి వీడియోలు వేలాదిగా వచ్చాయి.

ర్యాప్ మ్యూజిక్, ట్విచ్ స్ట్రీమింగ్‌లోనూ ఈ గ్యాస్ వాడకం వీడియోలు ఎక్కువగా కనిపించాయి. యే (గతంలో కాన్యే వెస్ట్)లాంటి రాపర్స్ ఈ పదార్థాన్ని బహిరంగంగా వాడటాన్ని తప్పు పట్టారు. యే అయితే ప్రమాదకరస్థాయిలో నైట్రస్ ఆక్సైడ్‌ను నిర్లక్యంగా తనకు సరఫరా చేశాడంటూ తన దంతవైద్యుడిపై కేసు కూడా వేశారు.

ఆన్‌లైన్ ట్రెండ్‌కు ప్రతిస్పందనగా, టిక్‌టాక్ ‘గెలాక్సీ గ్యాస్’ కోసం సెర్చ్‌ను అడ్డుకునే టూల్స్‌ను ఏర్పాటు చేసి, డ్రగ్స్ వ్యసనం గురించి సమాచారాన్ని అందించే మెసేజ్‌లకు రీడైరెక్ట్ చేసింది.

నైట్రస్ ఆక్సైడ్ పీల్చడం వల్ల ఏర్పడే ప్రమాదాలలో పెరుగుదలను గుర్తించిన ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ (ఎఫ్‌డీఏ) ఈ గ్యాస్‌ను పీల్చరాదంటూ ఈ ఏడాదిలో మార్చిలో హెచ్చరికలు జారీ చేసింది.

నైట్రస్ ఆక్సైడ్ దుర్వినియోగానికి సంబంధించిన వార్తలను గమనిస్తున్నామని, ప్రజారోగ్యాన్ని కాపాడటంలో తగు జాగ్రత్తలు సూచిస్తున్నామని బీబీసీకి తెలిపింది ఎఫ్‌డీఏ.

నైట్రస్ ఆక్సైడ్‌ను ఎక్కువగా తీసుకున్న ఓ డ్రైవర్ కారణంగా తమ కుటుంబీకులు చనిపోయారంటూ అమెరికాకు చెందిన చెందిన మారిస్సా పోలిట్ అనే రేడియాలజిస్ట్ బంధువులు యునైటెడ్ బ్రాండ్స్ అనే నైట్రస్ ఆక్సైడ్ డిస్ట్రిబ్యూటర్‌పై 2023లో కేసు వేశారు.

ఈ గ్యాస్ వాడకం దుర్వినియోగమవుతోందని తెలిసి కూడా ఆ కంపెనీ దానిని సరఫరా చేసిందని కోర్టు గుర్తించింది.

”మారిస్సా పోలిట్ చనిపోవాల్సింది కాదు. ఇలాంటి మరణాలలో ఇదే చివరిది కావాలి” అని పోలిట్ కుటుంబ న్యాయవాది జానీ సిమన్ అన్నారు.

నైట్రస్ ఆక్సైడ్ తయారీదారులు, పంపిణీదారులపై కాల్డ్‌వెల్ కుటుంబం కూడా దావా వేసింది. అమెరికా అంతటా నైట్రస్ ఆక్సైడ్ రిటైల్ అమ్మకాలను నిషేధించాలని ఆ దావాలో కోరారు.

దంతవైద్యశాలల్లో నైట్రస్ ఆక్సైడ్ ఇచ్చేవారు ఇప్పుడు గంటల తరబడి ట్రైనింగ్ తీసుకోవాల్సి ఉందని కాథ్లీన్ డయల్ అన్నారు.

‘‘స్మోక్ షాపులోకి వెళ్లి సింపుల్‌గా ఈ డ్రగ్‌ను కొనుక్కోగలగడం ఎంత దారుణం’’ అని డయల్ అభిప్రాయపడ్డారు.

‘‘దురదృష్టవశాత్తు, స్మోక్ షాపులు, తయారీదారులు నైతికంగా వ్యవహరించరని, వాటి అమ్మకాలను వారంతటవారుగా ఆపరని అర్ధమైంది” అని డయల్ అన్నారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

SOURCE : BBC NEWS