Home జాతీయ national telgu రూబుల్ నేగీ: ‘గ్లోబల్ టీచర్ ప్రైజ్’ అందుకున్న ఈ భారతీయ మహిళ ఎవరు? మురికివాడల చిన్నారుల...

రూబుల్ నేగీ: ‘గ్లోబల్ టీచర్ ప్రైజ్’ అందుకున్న ఈ భారతీయ మహిళ ఎవరు? మురికివాడల చిన్నారుల విద్య కోసం ఏం చేశారు?

6
0

SOURCE :- BBC NEWS

రూబుల్ నేగీ, ముంబయి, ఓపెన్ ఎయిర్ స్కూల్స్, గ్లోబల్ టీచర్ ప్రైజ్

ఫొటో సోర్స్, Cherylann Mollan/BBC

ముంబయి నగరంలోని కొలాబా ప్రాంతంలో అదొక ఇరుకైన వీధి. ఆ మార్గంలో అలా ముందుకెళ్తే చిన్నచిన్న కాంక్రీట్‌ గదులున్న ఓ చోటుకు చేరుకుంటాం. నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి బట్టలు తీసుకొచ్చి ఉతికి, ఆరబెట్టేందుకు ఉపయోగిస్తున్న గదులవి.

ఆ ప్రదేశం చుట్టూ ఎరుపు, నీలం, ఆకుపచ్చ, పసుపు రంగులు వేసిన రేకుల ఇళ్లు కనిపిస్తాయి. వాటిని చూస్తే, ఒకదానిపై మరోటి అమర్చిన పజిల్ బ్లాక్‌ల మాదిరిగా కనిపిస్తాయి. అక్కడ నివసిస్తున్న వారిలో ఎక్కువ మంది బట్టలు ఉతకడం, ఇస్త్రీ చేయడం వంటి పనులు చేసేవారే. అక్కడే నివాసముంటూ, పనులు చేసుకుంటూ ఉంటారు.

గజిబిజిగా కనిపించే ఆ ఇళ్ల మధ్య చూస్తే, ఓ చిన్న విద్యాకేంద్రం కనిపిస్తుంది. ఆ చుట్టుపక్కల ఇళ్లలోని పిల్లలు తొలిసారి బడికి వెళ్లడానికి, లేదా అర్ధంతరంగా చదువు ఆపేసినవారు మళ్లీ విద్యాభ్యాసం కొనసాగించడానికి అదెంతో సహాయపడుతోంది. ప్రాథమిక గణితం, భాషా నైపుణ్యాలను అక్కడ ఉచితంగా నేర్పిస్తున్నారు.

రూబుల్ నేగీ అనే మహిళ స్థాపించిన ఓ స్వచ్ఛంద సేవాసంస్థ ఈ విద్యాకేంద్రాన్ని నిర్వహిస్తోంది.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్

ఎవరీ రూబుల్ నేగీ?

ఆమె 45 ఏళ్ల ఓ కళాకారిణి. గత మూడు దశాబ్దాలుగా ముంబయి నగరంలోని అట్టడుగువర్గాల చిన్నారులకు విద్యను అందించడానికి విశేష కృషి చేస్తున్నారు.

ఉపాధ్యాయ వృత్తిలో విశేష కృషి చేస్తున్న వారిని గుర్తించేందుకు యునెస్కో భాగస్వామ్యంతో వార్కీ ఫౌండేషన్ ‘గ్లోబల్ టీచర్ ప్రైజ్’ను ప్రారంభించింది.

ఈ ప్రైజ్‌ను 2026 సంవత్సరానికి గానూ రూబుల్ నేగీ ఈ నెల ప్రారంభంలో అందుకున్నారు.

ప్రైజ్ విలువ 1 మిలియన్ డాలర్లు. (ప్రైజ్ అందుకున్న రోజు విలువ ప్రకారం, సుమారు రూ.8.3 కోట్లు).

గ్లోబల్ టీచర్ ప్రైజ్ వెబ్‌సైట్ ప్రకారం, ఈ ప్రైజ్ కోసం 139 దేశాల నుంచి 5 వేలకు పైగా నామినేషన్లు, దరఖాస్తులు వచ్చాయి.

ఇంతటి తీవ్ర పోటీ మధ్య ఈ ప్రైజ్‌కు నేగీ ఎంపికయ్యారు.

‘రూబుల్ నేగీ ఆర్ట్ ఫౌండేషన్ (ఆర్‌ఎన్‌ఏఎఫ్) అనే స్వచ్ఛంద సంస్థ ద్వారా నేగీ భారత్‌లో వందకు పైగా వెనుకబడిన ప్రాంతాలు, గ్రామాల్లో 800కు పైగా విద్యాకేంద్రాలను ఏర్పాటు చేశారు’ అని ఆ వెబ్‌సైట్‌లో పేర్కొన్నారు.

రూబుల్ నేగీ, ముంబయి, ఓపెన్ ఎయిర్ స్కూల్స్, గ్లోబల్ టీచర్ ప్రైజ్

ఫొటో సోర్స్, Cherylann Mollan/BBC

పిల్లాడి మాటలతో మురికివాడకు..

సుమారు మూడు దశాబ్దాల కిందట ముంబయిలో ఒక ఆర్ట్ వర్క్ షాప్ నిర్వహిస్తున్న సమయంలో అక్కడికి వచ్చిన బాలుడిని చూసినప్పుడు, విద్యను పేదలకు చేరువ చేయాలనే ఆలోచన వచ్చినట్లు నేగీ చెప్పారు. ఆ బాలుడి గురించి ఆరా తీస్తే, అతనొక మురికివాడలో ఉంటున్నాడని, పాఠశాలకు వెళ్లే ఆర్థిక స్తోమత లేదని ఆమెకు తెలిసింది.

ఆ బాలుడితో మాట్లాడినప్పుడు, ఆ చిన్నారి మాటలు ఆ మురికివాడను సందర్శించేలా ప్రేరేపించాయని నేగీ తెలిపారు.

అక్కడున్న ఇళ్ల గోడలపై అందమైన చిత్రాలను వేయడం ద్వారా ఆ ప్రాంతాన్ని చక్కగా తీర్చిదిద్దాలని అప్పుడే ఆమె నిర్ణయించుకున్నారు.

”అక్కడున్న పిల్లలంతా మేం పెయింటింగ్ వేస్తున్నచోట గుమిగూడారు. ఒక కథ చెబుతాను వింటారా? అని వారిని అడిగాను. వారంతా ముక్తకంఠంతో ‘వింటాం’ అని చెప్పారు” అంటూ నాటి ఆ క్షణాలను నేగీ గుర్తుచేసుకున్నారు.

పేదవర్గాల పిల్లలకూ చదువుకోవాలనే తపన ఉందని, ఆర్ట్ ద్వారా వారిలో విద్య పట్ల ఆసక్తిని రేకెత్తించవచ్చని ఆ క్షణంలోనే తాను గ్రహించినట్లు నేగీ చెప్పారు.

రూబుల్ నేగీ, ముంబయి, ఓపెన్ ఎయిర్ స్కూల్స్, గ్లోబల్ టీచర్ ప్రైజ్

ఫొటో సోర్స్, Cherylann Mollan/BBC

‘ఆర్ట్’ ద్వారా బోధన..

గత కొన్నేళ్లలో నేగీ, ఆమె బృందం దేశంలోని పలు నగరాల్లో విద్యాకేంద్రాలను ఏర్పాటు చేశారు.

ఆ కేంద్రాల్లో చేరే విద్యార్థులకు క్లిష్టమైన విషయాలను సైతం సులభంగా బొమ్మల ఆధారంగా వివరించడానికి ఉపాధ్యాయులు ‘ఆర్డ్ ఆధారిత బోధనా విధానం’ అనుసరిస్తున్నారు.

వలంటీర్లు పిల్లలకు వివిధ నైపుణ్యాలలో శిక్షణ ఇస్తున్నారు.

అలాగే వారికి పుస్తకాలు, బ్యాగులు, ఇతర సామగ్రిని దాతల విరాళాలతో సమకూరుస్తున్నారు.

అన్ని విద్యాకేంద్రాలూ పక్కా భవనాల్లో ఉండవని, కొన్నిసార్లు మురికివాడల్లోని ఖాళీ ప్రదేశాల్లో బహిరంగంగానే తరగతులు జరుగుతాయని, చాపలపై కూర్చునే విద్యార్థులు పాఠాలు వింటారని నేగీ వివరించారు.

”నేర్చుకోవాలనే తపన ఉంటే ఎక్కడైనా నేర్చుకోవచ్చు. మనం చేయాల్సిందల్లా వారిలో ఆసక్తిని కలిగించడమే” అని నేగీ అంటున్నారు.

అయితే, ఈ విద్యాకేంద్రాలను నడపడంలోనూ ఎన్నో సవాళ్లున్నాయని ఆమె చెప్పారు.

కుటుంబ నేపథ్యం సరిగ్గా లేని పిల్లలే అక్కడకు ఎక్కువగా వస్తుంటారని, అందుకే ఉపాధ్యాయులు తరచూ కౌన్సిలర్లుగా, సంరక్షకులుగా వ్యవహరించాల్సి ఉంటుందని అన్నారు.

”మా కేంద్రంలో చదువుకునే పిల్లలు ఎవరైనా వారం రోజులు రాకపోతే, ఒక వలంటీర్ స్వయంగా వాళ్ల ఇంటికి వెళ్లి యోగక్షేమాలు ఆరా తీస్తారు” అని నేగీ చెప్పారు.

అలాగే, తమ పిల్లల చదువు పట్ల తల్లిదండ్రులకు కూడా ఆసక్తి కలిగేలా వారితో క్రమం తప్పకుండా సమావేశాలు నిర్వహిస్తామన్నారు.

తమ విద్యాకేంద్రాల నుంచి బయటకు వెళ్లిన తర్వాత కూడా చాలామంది విద్యార్థులు తమ పాఠశాల విద్యను విజయవంతంగా పూర్తి చేయడమే గాకుండా ఉన్నత చదువుల కోసం కళాశాలల్లోనూ చేరుతున్నారని ఆమె తెలిపారు.

రూబుల్ నేగీ, ముంబయి, ఓపెన్ ఎయిర్ స్కూల్స్, గ్లోబల్ టీచర్ ప్రైజ్

ఫొటో సోర్స్, Cherylann Mollan/BBC

పూర్వ విద్యార్థి సేవలు…

పూర్వ విద్యార్థి మయూర్, ఇప్పుడు సొంతంగా ఆర్ట్ క్లాసులు నిర్వహిస్తున్నారు. అంతేకాదు ఓ చిన్న ప్రింటింగ్ వ్యాపారం కూడా చేస్తున్నారు. మరోవైపు, తనకు లభించిన అటువంటి అవకాశాలనే తన వర్గంలోని పిల్లలకూ అందించాలనే ఆశయంతో వారాంతరాల్లో ఆర్‌ఎన్ఏఎఫ్‌లో వలంటీర్‌గా సేవలందిస్తున్నారు.

”ఇలాంటి ప్రాంతాల్లో పనిచేసేటప్పుడు కేవలం విద్యార్థులతోనే కాకుండా అక్కడి వారితోనూ కలిసిపోవాలి. అది ఆర్థిక సాయం ద్వారా కావొచ్చు, కష్టకాలంలో నిత్యవసరాలు అందించడం ద్వారా కావొచ్చు, లేదా మానసిక ఒత్తిడిలో ఉన్నవారికి అండగా నిలబడి వారి బాధలను వినడం ద్వారా కావొచ్చు. ఆ సమాజం మద్దతు లభించినప్పుడే అవాంతరాలను దాటి మన లక్ష్యాన్ని ముందుకు తీసుకెళ్లగలం” అని నేగీ వివరించారు.

రూబుల్ నేగీ, ముంబయి, ఓపెన్ ఎయిర్ స్కూల్స్, గ్లోబల్ టీచర్ ప్రైజ్

ఫొటో సోర్స్, Cherylann Mollan/BBC

ఓపెన్ ఎయిర్ క్లాస్‌రూమ్స్..

ఆర్‌ఎన్ఏఎఫ్‌ చేపట్టిన ‘మిసాల్'(అంటే, ఒక ఉదాహరణ) ప్రాజెక్ట్ ద్వారా మురికివాడల్లోని ఇళ్ల గోడలపై సైన్స్, పరిశుభ్రత, పర్యావరణం, సామాజిక బాధ్యత వంటి అంశాలపై అవగాహన కల్పిచేలా చిత్రాలు వేస్తారు. అలా మురికివాడలను ‘ఓపెన్-ఎయిర్ క్లాస్‌రూమ్స్’గా మార్చడమే ఈ ప్రాజెక్ట్ ప్రధాన ఉద్దేశం.

అక్కడ నివాసం ఉంటున్న వారిని ఈ చిత్రాలు ఉత్సాహపరుస్తాయని, దీర్ఘకాలంలో ఇవి వారి ప్రవర్తనలో, ఆలోచనా విధానంలో మార్పు తీసుకురావడానికి దోహదం చేస్తాయని నేగీ అభిప్రాయపడ్డారు.

అలాగే, తన ప్రైజ్ మనీ ద్వారా ఆర్‌ఎన్ఏఎఫ్‌ కార్యకలాపాలను మరిన్ని ప్రాంతాలకు విస్తరించాలని యోచిస్తున్న రూబుల్ నేగీ.. తాను పుట్టిపెరిగిన జమ్మూ కశ్మీర్ నుంచే ప్రారంభించాలని అనుకుంటున్నారు.

అక్కడ ఒక స్కిల్ కమ్ లెర్నింగ్ సెంటర్ ఏర్పాటు చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.

ఇక ముంబయిలోని కొలాబా విషయానికొస్తే, అక్కడి బస్తీలోని ఇళ్ల గోడలపై భారీ పెయింటింగ్స్, స్ఫూర్తిదాయకమైన సూక్తులు కనిపిస్తాయి. అక్కడి విద్యాకేంద్రం గోడలపై కూడా ఆకర్షణీయమైన చిత్రాలు ఉన్నాయి. మొక్కల నుంచి జంతు ప్రపంచం వరకూ వివిధ రకాల అంశాలను అక్కడ చిత్రించారు.

ఇక్కడ చదువుకుంటున్న ఏడేళ్ల ఖుషీతో మాట్లాడితే, ఈ స్కూల్‌కు రావడం తనకెంతో ఇష్టమని, పెద్దయ్యాక టీచర్ అవుతానని చెబుతున్నారు. ఆమె తల్లి ఇళ్లలో సహాయకురాలిగా పనిచేస్తారు. అలా వచ్చే ఆదాయమే ఆ కుటుంబానికి ఏకైక ఆధారం.

ఇలాంటి ఆర్థిక నేపథ్యం నుంచి వచ్చిన చిన్నారులే ఆ కేంద్రంలో ఎక్కువ మంది ఉన్నారు. కానీ, వారికీ ఖుషీలాగే గొప్ప ఆశయాలు ఉన్నాయి.

వారి కలలను నిజం చేయడంలో తమవంతు పాత్ర పోషించాలని నేగీ విద్యాకేంద్రాలు ఆశిస్తున్నాయి.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)