Home జాతీయ national telgu రాంచీ-దిల్లీ ఎయిర్ అంబులెన్స్‌ కూలి ఏడుగురు మృతి, అసలేం జరిగింది?

రాంచీ-దిల్లీ ఎయిర్ అంబులెన్స్‌ కూలి ఏడుగురు మృతి, అసలేం జరిగింది?

2
0

SOURCE :- BBC NEWS

విమాన ప్రమాదం

ఫొటో సోర్స్, Mohammad Sartaj Alam/BBC

ఝార్ఖండ్‌లోని చత్రా జిల్లా కర్మతాండ్ అడవిలో సోమవారం సాయంత్రం చార్టర్డ్ ఎయిర్ అంబులెన్స్ విమానం కూలిపోవడంతో అందులో ప్రయాణిస్తున్న ఏడుగురు మృతి చెందారు.

గ్యాస్ సిలిండర్ పేలుడుతో తీవ్రంగా గాయపడిన సంజయ్ కుమార్‌ అనే వ్యక్తిని మెరుగైన చికిత్స కోసం రాంచీ నుండి దిల్లీకి తీసుకెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది.

విమానం నడుపుతున్న కెప్టెన్ వివేక్ వికాస్ భగత్, కెప్టెన్ సావ్రాజ్‌దీప్ సింగ్, అగ్ని ప్రమాద బాధితుడు సంజయ్ కుమార్, ఆయన భార్య అర్చనా దేవి, ఆయన మేనల్లుడు ధ్రువ్ కుమార్, ఎయిర్ అంబులెన్స్ డాక్టర్ వికాస్ కుమార్ గుప్తా, పారామెడికల్ సిబ్బంది సచిన్ కుమార్ మిశ్రా సహా మొత్తం ఏడుగురు మరణించారు.

ఈ ప్రమాదాన్ని డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) ధృవీకరించింది.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌

అసలేం జరిగింది?

ఝార్ఖండ్‌లోని లతేహార్ జిల్లాకు చెందిన 41 ఏళ్ల సంజయ్ కుమార్ ఎల్‌పీజీ సిలిండర్ పేలిన ప్రమాదంలో తీవ్ర గాయాలపాలయ్యారు. ఫిబ్రవరి 16 సాయంత్రం ఆయన సతర్‌బర్వాలోని తన ధాబాలో ఉండగా ఈ ప్రమాదం జరిగింది.

కుటుంబ సభ్యులు ఆయన్ను రాంచీలోని దేవ్ కమల్ ఆసుపత్రికి తీసుకెళ్లారు.

‘‘ఆరు రోజులు గడిచినా మా అన్న పరిస్థితి ఏమీ మారలేదు. అప్పటికే 15 లక్షల రూపాయలు ఖర్చయ్యాయి. అందుకే మెరుగైన చికిత్స కోసం ఆయన్ను దిల్లీకి తీసుకెళ్లాలని మా సోదరులందరం నిర్ణయించాం’’ అని సంజయ్ కుమార్ సోదరుడు సుజిత్ కుమార్ బీబీసీకి చెప్పారు.

ఇందుకోసం వారు ఎయిర్ అంబులెన్స్‌ను ఎంచుకున్నారు.

ఝార్ఖండ్ విమాన ప్రమాదం

ఫొటో సోర్స్, Mohammad Sartaj Alam/BBC

‘‘వాళ్లకు భూమి మీద జీవించే రాత లేదు. అందుకే మా అన్నను, వదినను, మేనల్లుడిని ఒక ప్రమాదం ద్వారా ఆ దేవుడు తీసుకెళ్లిపోయాడు’’ అని సుజిత్ కుమార్ ఏడుస్తూ అన్నారు.

మృతుల్లో సంజయ్ కుమార్ భార్య 32 ఏళ్ల అర్చన దేవి ఒక్కరే మహిళ.

ప్రమాదంలో మరణించిన అర్చన దేవి, సంజయ్ కుమార్‌ల సంతానాన్ని చూసుకునే బాధ్యత ఇప్పుడు సంజయ్ కుమార్ సోదరులపై పడింది. సంజయ్ కుమార్‌కు ముగ్గురు సోదరులు ఉన్నారు. వారిది ఉమ్మడి కుటుంబం.

సంజయ్ కుమార్ పెద్ద కొడుకు ఈ సంవత్సరం హైస్కూల్ పరీక్ష రాస్తున్నారు. చిన్న కొడుకు ఐదో తరగతి చదువుతున్నారు.

ఎయిర్ అంబులెన్స్

ఫొటో సోర్స్, Mohammad Sartaj Alam/BBC

‘ఎన్నో ఆశలతో నా కొడుకును పైలట్‌ను చేశా’

మరోవైపు, విమానం కెప్టెన్ వివేక్ వికాస్ భగత్ ఇంట్లో దు:ఖపూరిత వాతావరణం నెలకొంది.

‘‘ఇప్పుడు నేనేం మాట్లాడగలను. నా ప్రపంచం కూలిపోయింది. చాలా ఆశలతో మా అబ్బాయి వివేక్‌ను పైలట్‌ను చేశాం’’ అని వివేక్ తండ్రి దేవ్ సహాయ్ భగత్ అన్నారు.

వివేక్ వికాస్ భగత్ 2022 సెప్టెంబర్‌లో ఎయిర్ అంబులెన్స్ పైలట్‌గా కెరీర్‌ను ప్రారంభించారు.

ఆయన తన సోదరి, తల్లిదండ్రులతో కలిసి ఉండేవారు. దేవ్ సహాయ్ ఇంజినీర్‌గా పని చేస్తున్నారు.

‘‘ఫిబ్రవరి 21న నన్ను కలిసి వెళ్లాడు. ఫిబ్రవరి 22న వాడితో మాట్లాడా. 24 గంటల్లోనే దేవుడు తీసుకెళ్లిపోయాడు’’ అంటూ కన్నీరు పెట్టుకున్నారు దేవ్ సహాయ్.

విమాన ప్రమాదాలు

ఫొటో సోర్స్, Mohammad Sartaj Alam/BBC

డీజీసీఏ ఏం చెప్పింది?

ఎయిర్ అంబులెన్స్ విమాన ప్రమాదంపై డైరక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) ఒక ప్రకటన విడుదల చేసింది.

ఆ ప్రకటన ప్రకారం,

‘‘2026 ఫిబ్రవరి 23న, రాంచీ-దిల్లీ మార్గంలో ఎయిర్ అంబులెన్స్‌గా పనిచేస్తున్న రెడ్‌బర్డ్ ఎయిర్‌వేస్ ప్రైవేట్ లిమిటెడ్‌కు చెందిన బీచ్‌క్రాఫ్ట్ సీ90 విమానం (వీటీ-ఏజేవీ) ఝార్ఖండ్‌లోని చత్రా జిల్లా కసారియా పంచాయతీలో కూలిపోయింది.

ఇద్దరు సిబ్బందితో సహా ఏడుగురు వ్యక్తులతో ప్రయాణిస్తున్న విమానం రాంచీ నుండి రాత్రి 7:11 గంటలకు బయలుదేరింది.

అయితే, కోల్‌కతాతో సంబంధాలు ఏర్పరచుకున్న తర్వాత, వాతావరణం సరిగా లేకపోవడంతో విమానం మళ్లింపు కోసం పైలట్‌లు అభ్యర్ధించారు.

సాయంత్రం 7:34 గంటలకు, విమానం వారణాసికి ఆగ్నేయంగా 100 నాటికల్ మైళ్ల దూరంలో కోల్‌కతాతో రాడార్‌ సంబంధాలు కోల్పోయింది. ఆ తర్వాత విమానం కూలిపోయింది.

లతేహార్ జిల్లాలోని కర్మాతాండ్‌లో విమానం కూలిన ప్రాంతం నుంచి సెర్చ్ అండ్ రెస్క్యూ బృందం మృతదేహాలను వెలికితీసింది.’’

ఝార్ఖండ్

ఫొటో సోర్స్, Mohammad Sartaj Alam/BBC

రాష్ట్ర ఆరోగ్య మంత్రి ఏం చెప్పారు?

ఝార్ఖండ్ ఆరోగ్య మంత్రి ఇర్ఫాన్ అన్సారీ మృతుల కుటుంబాలను కలిశారు.

“ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారందరి కుటుంబాలకు ప్రభుత్వం పరిహారం అందజేస్తుంది. దీనికి అవసరమైన ప్రక్రియను త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించాం” అని మంత్రి ఇర్ఫాన్ అన్సారీ అన్నారు.

ఈ సంఘటనపై ఆందోళన వ్యక్తం చేస్తూ, “చార్టర్డ్ విమానాలు పూర్తిగా సురక్షితంగా ఉన్నాయా లేదా అనేది అతిపెద్ద ఆందోళన? సాంకేతిక లోపాలు ఉంటే వాటిని దర్యాప్తు చేయాలి” అని ఆయన అన్నారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)