Home జాతీయ national telgu రణ్ ఆఫ్ కచ్ఛ్‌లో తప్పిపోయి శవంగా కనిపించిన ప్రైవేటు కంపెనీ ఉద్యోగి, ఇంతకీ జనం అక్కడ...

రణ్ ఆఫ్ కచ్ఛ్‌లో తప్పిపోయి శవంగా కనిపించిన ప్రైవేటు కంపెనీ ఉద్యోగి, ఇంతకీ జనం అక్కడ ఎందుకు తప్పిపోతున్నారు?

6
0

SOURCE :- BBC NEWS

కచ్ ఎడారి

ఫొటో సోర్స్, Getty Images

గుజరాత్ రాష్ట్రంలోని కచ్ఛ్‌లో ఇటీవల జరిగిన ఒక సంఘటన చర్చకు దారితీసింది. వాగడ్ ప్రాంతంలో ఉన్న రాపర్ తాలూకాలో గల బేలారణ్ ప్రాంతంలో సోలార్ పార్క్ ప్రాజెక్టుకు సంబంధించిన రోడ్డు నిర్మాణం కోసం ఒక ప్రైవేట్ కంపెనీ సర్వే నిర్వహిస్తోంది. ఈ సర్వే సమయంలో అర్నాబ్ పాల్ అనే కంపెనీ ఉద్యోగి కనిపించకుండా పోయారు.

సరిహద్దు భద్రతాదళం, పోలీసులు డ్రోన్లు ఉపయోగించి పెద్ద ఎత్తున గాలించారు. ఐదురోజుల తర్వాత బేలా రణ్‌లో ఆయన మృతదేహం దొరికింది.

డీహైడ్రేషన్, తీవ్ర దాహం కారణంగా అర్నాబ్ మరణించినట్లు పోస్ట్‌మార్టం నివేదిక వెల్లడించింది.

దారి తప్పిపోవడం, నీరు అందుబాటులో లేకపోవడం వల్ల రణ్ ఆఫ్ కచ్ఛ్‌లో ఇలా మనుషులు మరణించడం ఇదే తొలిసారి కాదు. రణ్ ప్రాంతంపై ప్రాథమిక అవగాహన లేకుండా సరైన జాగ్రత్తలు తీసుకోకపోతే, అది తీవ్రమైన పరిణామాలకు దారితీస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

రణ్ ఆఫ్ కచ్ఛ్‌లో ప్రజలు తరచుగా దారితప్పి మరణిస్తున్నారు. కచ్ఛ్ సంక్లిష్టమైన, విశాలమైన భౌగోళిక రూపం ఇటువంటి విషాదాలకు ఎలా కారణమవుతుందో అర్థం చేసుకోవడానికి బీబీసీ గుజరాతీ ఆ ప్రాంత పరిశోధకులతో మాట్లాడింది.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
ఎడారి కచ్

ఫొటో సోర్స్, Getty Images

‘భౌగోళిక నిర్మాణం’

భారతదేశానికి పశ్చిమంగా ‘రణ్ ఆఫ్ కచ్ఛ్‌’ ఉంది, అంతేకాదు, పాకిస్తాన్ దక్షిణ, తూర్పు సరిహద్దును పంచుకుంటోంది.

‘రణ్ ఆఫ్ కచ్ఛ్‌’లో ఎక్కువ ఇసుక ఉండదు. గుజరాత్ విశ్వకోష్ (గుజరాతీ ఎన్‌సైక్లోపీడియా) ప్రకారం.. ఈ ప్రాంతం ఒకప్పుడు టెథిస్ సముద్రంలో భాగంగా ఉండేది, సాంబార్ సరస్సు వరకు ఇది విస్తరించి ఉండేది.

గుజరాత్ వాయువ్య సరిహద్దులో సముద్ర మట్టానికి కొంచెం ఎత్తులో ఉన్న ‘రణ్ ఆఫ్ కచ్ఛ్‌’ను భారత ఉపఖండంలో ఒక ప్రత్యేకమైన భూభాగంగా పరిగణిస్తుంటారు.

ఇస్రో రిటైర్డ్ శాస్త్రవేత్త పి.ఎస్. ఠక్కర్ రణ్‌లో అనేక పురావస్తు ప్రదేశాలను కనుగొన్నారు. అక్కడ విస్తృతమైన పరిశోధనలు చేశారు.

ఈ నేపథ్యంలో ఆయన బీబీసీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో అక్కడి విషయాలను వివరించారు.

“రణ్ ఆఫ్ కచ్ఛ్‌ ఇసుక ఎడారి కాదు. సముద్రం నుంచి ఉద్భవించిన ప్రత్యేకమైన ఎడారి. రణ్ ఆఫ్ కచ్ఛ్‌ రెండు భాగాలుగా ఉంది. గ్రేట్ రణ్, లిటిల్ రణ్. గ్రేట్ రణ్ దాదాపు 270 కి.మీ పొడవు, 50 నుంచి 90 కి.మీ వెడల్పు ఉంటుంది. లిటిల్ రణ్ దాదాపు 100 కి.మీ పొడవు, దాదాపు 70 కి.మీ వెడల్పు ఉంటుంది” అని తెలిపారు.

“కచ్ఛ్‌లో ఎక్కువ భాగం సముద్ర మట్టానికి దిగువన ఉంది. ఏప్రిల్ నుంచి అక్టోబర్ వరకు, ఇది 30 సెం.మీ నుంచి 1 మీటర్ నీటితో నిండి ఉంటుంది. నవంబర్ నుంచి మార్చి వరకు నీటి మట్టం ఎక్కువగా ఉంటుంది” అని ఠక్కర్ తెలిపారు.

రణ్ ఆఫ్ కచ్ఛ్‌

ఫొటో సోర్స్, Getty Images

ఎందుకు తప్పిపోతున్నారు?

విశాలమైన రణ్ ఆఫ్ కచ్ఛ్‌లో ప్రయాణించే వారికి దిశానిర్దేశం చేసే ల్యాండ్‌మార్క్‌లు లేకపోవడం వల్ల దారి తప్పుతున్నారు.

“చోరాద్, బేలా, ఖాదిర్, ఖావ్డా వంటి ప్రాంతాలలో మానవ నివాసాలు ఉన్నాయి. కానీ, రణ్‌లో ఉప్పు మైదానాలు తప్ప మొక్కలు, జంతువులు కనపడవు, కిలోమీటర్ల వరకు ఏమీ చూడలేరు. ఎడారిలో మెరుస్తూ ఉండే ఎండమావులు నీరులా కనిపించడంతో దిశలను అర్థం చేసుకోవడం కష్టం అవుతుంది” అని ఠక్కర్ అన్నారు.

“గ్రేట్ రణ్‌లో బీఎస్ఎఫ్ సైన్యం కోసం లింక్ రోడ్లు నిర్మించారు. ఈ రోడ్లను అనుసరిస్తే ఎటువంటి సమస్యా ఉండదు. అయితే, ఉప్పు మైదాన ప్రాంతాలలో ఎటువంటి సైన్‌పోస్టులు లేవు. దిక్సూచి లేకుండా దిశను తెలుసుకోవడం కష్టం. నెట్‌వర్క్ కవరేజ్ సరిగా లేకపోవడం వల్ల రణ్‌లోని చాలా ప్రాంతాలలో మొబైల్ ఫోన్‌లు కూడా పనిచేయవు. ఈ కఠినమైన పరిస్థితులు తరచుగా ప్రజలు దారి తప్పడానికి కారణమవుతాయి” అని ఆయన వివరించారు.

కచ్ఛ్ ప్రాంతంలో చాలా సంవత్సరాలుగా రిపోర్టర్‌గా పనిచేస్తున్న, రణ్ ప్రాంతం గురించి బాగా తెలిసిన జర్నలిస్ట్ విపుల్ వైద్య ఈ విషయంతో ఏకీభవిస్తున్నారు.

స్మారక చిహ్నం

ఫొటో సోర్స్, Getty Images

“రణ్ ప్రాంతం విశాలంగా ఉండటం, ల్యాండ్‌మార్క్‌లు లేకపోవడంతో ప్రయాణికులకు సరైన దారి దొరకదు. చాలాచోట్ల మొబైల్ నెట్‌వర్క్‌లు పనిచేయవు, కాబట్టి దారి కోసం జీపీఎస్, ఫోన్‌లు ఎక్కువ ఉపయోగపడవు. బోర్డర్ ఏరియా డెవలప్‌మెంట్ స్కీమ్ కింద రోడ్లు నిర్మించినప్పటికీ, కమ్యూనికేషన్ పరిమితమే. మీరు ఎక్కడ ఉన్నారో ఖచ్చితంగా తెలియకపోవడం వల్ల మార్గనిర్దేశం చేయడం కష్టం అవుతుంది. అందుకే తప్పిపోయిన వ్యక్తిని కనుగొనడం కష్టం” అని అన్నారు విపుల్.

“ఇప్పుడు, ప్రధాన సరిహద్దు పోస్టుల వరకు రోడ్లున్నాయి. కానీ, 15 సంవత్సరాల కిందట ఇక్కడ రోడ్లే లేవు. బండ్లు లేదా జీపులు వెళ్లిన ట్రాక్‌లను ప్రజలు అనుసరించాల్సి వచ్చింది. ముందు వెళ్లిన వాహనం దారి తప్పితే, దానిని అనుసరించే ఇతరులు కూడా తప్పిపోతారు” అని విపుల్ చెప్పారు.

కచ్ఛ్‌లో రాత్రిపూట కనిపించే చిర్‌బత్తీ అనే వెలుగుల (నీలం, నారింజ రంగు వెలుగులు) కారణంగా ప్రజలు తప్పుదారి పడతారు. ఈ లైట్ల శాస్త్రీయ వివరణ ఇప్పటికీ తెలియదు. గతంలో ఇక్కడ ప్రజలు ఎడ్ల బండ్లతో గుంపులుగా వెళ్లేవారని విపుల్ వైద్య తెలిపారు.

రణ్ ఆఫ్ కచ్ఛ్‌

ఫొటో సోర్స్, Getty Images

‘పాకిస్తాన్‌లోకి..’

“రణ్ ఆఫ్ కచ్ఛ్‌లో దారి తప్పిపోవడం, నీరు లేకపోవడం వల్ల మరణిస్తున్నారు. కచ్ఛ్ మైదానాలు చదునుగా ఉంటాయి. కచ్ఛ్ మధ్యలో నిలబడి చూస్తే భూమి గుండ్రంగా ఉన్నట్లు కనిపిస్తుంది. ఇక్కడ దారి తప్పిన ప్రయాణికుడు నాలుగు దిక్కులు తెలియక వృత్తంలా తిరుగుతుంటాడు. ప్రయాణికుడు ముందుకే వెళుతున్నట్లు భావిస్తాడు కానీ, అర కిలోమీటరు వ్యాసార్థంలో తిరుగుతుంటాడు. చివరికి దాహంతో కింద పడతాడు” అని రణ్ ఆఫ్ కచ్ఛ్‌కు చెందిన జర్నలిస్ట్ అన్బు పటేల్ చెప్పారు.

రణ్‌లో తప్పిపోయిన వ్యక్తులు అనుకోకుండా పాకిస్తాన్ భూభాగంలోకి ప్రవేశించిన సందర్భాలు చాలా ఉన్నాయి.

జర్నలిస్ట్ విపుల్ వైద్య వివరిస్తూ “రణ్ ఆఫ్ కచ్ఛ్ విస్తారంగా ఉంటుంది. గ్రేట్, లిటిల్ రణ్ రెండింటిలోనూ ప్రజలు తప్పిపోయిన సంఘటనలు క్రమం తప్పకుండా జరుగుతున్నాయి. జనం ఉండే ప్రాంతాలు గ్రేట్ రణ్ నుంచి దాదాపు 50 కి.మీ దూరంలో ఉన్నాయి. బేలా సరిహద్దుకు సమీపంలో ఉన్న కొన్ని భాగాలకు ఇప్పటికీ ఫెన్సింగ్ లేదు. ఎవరైనా అక్కడ తప్పిపోతే, పాకిస్తాన్‌లోకి ప్రవేశించే ప్రమాదం ఉంది” అని అన్నారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)