SOURCE :- BBC NEWS
ఫొటో సోర్స్, Instagram mirzapur.police
-
- రచయిత, సయ్యద్ మౌజిజ్ ఇమామ్
- హోదా, బీబీసీ ప్రతినిధి
-
22 మార్చి 2026, 11:16 IST
-
చదివే సమయం: 5 నిమిషాలు
గత కొన్నిరోజులుగా సోషల్ మీడియాలో ఒక వీడియో వైరల్ అవుతోంది, ఇందులో ఉత్తరప్రదేశ్‌లోని మీర్జాపూర్ జిల్లా ఎస్పీ అపర్ణ రజత్ కౌశిక్ ఒక ప్రెస్ బ్రీఫింగ్ చేస్తున్నారు. ఆ వీడియోలో ఎస్పీ ఏ విషయం మాట్లాడుతున్నారనే విషయంపై చర్చ జరగడానికి బదులుగా, ఆమె ఎలా కనిపిస్తున్నారనే దానిపై ప్రజలు కామెంట్ చేస్తున్నారు.
వాస్తవానికి, ఒక అరెస్టుకు సంబంధించిన సమాచారాన్ని అందించడానికి ఎస్పీ అపర్ణ కౌశిక్ ప్రెస్ బ్రీఫింగ్ వీడియోను మీర్జాపూర్ పోలీసులు ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. ఇటీవల అప్‌లోడ్ చేసిన ఈ వీడియోకు లక్షలాది వ్యూస్, వేలాది కామెంట్లు వచ్చాయి.
కానీ, మెజారిటీ సోషల్ మీడియా యూజర్లు పోలీసుల పనితీరుపై వ్యాఖ్యానించడానికి బదులుగా, ఎస్పీ కదలికలు, శారీరక ఆకృతిని ఉద్దేశించి అసభ్యకరమైన కామెంట్లు చేశారు.
బాడీ షేమింగ్ వ్యవహారం వెలుగులోకి వచ్చిన తర్వాత, పోలీసులు ఈ పోస్ట్‌లో కామెంట్ సెక్షన్‌ను మూసివేశారు.
బీబీసీ ఈ విషయంపై అపర్ణ రజత్ కౌశిక్‌తో మాట్లాడేందుకు ప్రయత్నించింది. కానీ, ఆమెను సంప్రదించడం సాధ్యం కాలేదు. ఆమె డ్యూటీలో బిజీగా ఉన్నారని పోలీసులు చెప్పారు.
ఈ ఘటన అనంతరం, మరోసారి బాడీ షేమింగ్‌పై చర్చ మొదలైంది.

ఫొటో సోర్స్, Getty Images
‘సమాజం ఎంతగా దిగజారిపోయిందో’
ఎస్పీ అపర్ణపై సోషల్ మీడియా కామెంట్ల పట్ల అమేథీకి చెందిన కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్సీ దీపక్ సింగ్ విచారం వ్యక్తం చేశారు. ఇలాంటిది మరెవరికీ జరగకూడదన్నారు.
“అపర్ణ గారిని అమేథీలో ఉన్నప్పుడు చాలాసార్లు కలిశాం. ఆమె చాలా మర్యాదపూర్వకమైన మహిళ. ఒక అధికారి గురించి వ్యాఖ్యలు వారి పనితీరుపై ఉండాలి తప్ప, ఇతర కారణాల వల్ల కాదు. ఇప్పుడు చేసిన వ్యాఖ్యలు సరైనవి కావు” అన్నారు దీపక్ సింగ్.
“ఒక బాధ్యతాయుతమైన పదవిలో ఉండి, వేలాది మంది ప్రజల సమస్యలను పరిష్కరిస్తున్న మహిళ పట్ల ఇంతటి తప్పుడు భాషను ఉపయోగిస్తూ గౌరవానికి భంగం కలిగించడం చూస్తుంటే, మన సమాజం గత కొంతకాలంగా ఎంతగా దిగజారిపోయిందో, ఎంత క్రూరంగా మారిందో తెలుస్తోంది” అని లక్నో విశ్వవిద్యాలయం మాజీ వైస్ ఛాన్సలర్, సామాజిక కార్యకర్త రూప్ రేఖ వర్మ అన్నారు.
“ఒక వ్యక్తిని ఏ విధంగా చూస్తారనేది అవతలి మనిషి దృక్పథంపై ఆధారపడి ఉంటుంది” అని రేఖ వర్మ చెప్పారు.
ఈ ఉదంతం కేవలం ఐపీఎస్ అధికారిణి అపర్ణ రజత్ కౌశిక్‌కు మాత్రమే పరిమితం కాదు. అలాగే, కేవలం మహిళలే దీనికి లక్ష్యంగా మారుతున్నారని కాదు.
సోషల్ మీడియాలో లేదా సామాన్య జీవితంలో మనందరం మన శారీరక ఆకృతి, రంగు లేదా రూపురేఖల గురించి ఏదో ఒక సమయంలో వినే ఉంటాం.

సోషల్ మీడియాకే పరిమితం కాలేదు
ఫోర్టిస్ హెల్త్‌కేర్‌కు చెందిన మెంటల్ హెల్త్ అండ్ బిహేవియరల్ సైన్సెస్ విభాగం 2019లో ఓ సర్వే నిర్వహించింది. బాడీ షేమింగ్ కేవలం సోషల్ మీడియాకే పరిమితం కాలేదని, పాఠశాలలు, పని ప్రదేశాలలో కూడా ఉందని ఆ సర్వే తెలిపింది.
సర్వే ప్రకారం, ఆందోళనకరమైన విషయం ఏమిటంటే, తరచుగా ఈ ప్రతికూల వ్యాఖ్యలు అపరిచితుల నుంచి కాకుండా, స్నేహితులు, తెలిసిన వారి నుంచి కూడా వస్తున్నాయి. సర్వే గణాంకాల ప్రకారం 47.5 శాతం మంది మహిళలు పాఠశాల లేదా పని ప్రదేశంలో బాడీ షేమింగ్‌ను ఎదుర్కొన్నట్లు తెలిపారు. సురక్షితంగా, సహకారంతో ఉండాల్సిన ప్రదేశాలు, కొన్నిసార్లు అసౌకర్యంగా, మానసిక సవాళ్లతో కూడినవిగా మారుతున్నాయని ఇది సూచిస్తోంది.
అదే సమయంలో 32.5 శాతం కేసుల్లో ప్రతికూల వ్యాఖ్యలు అపరిచితులు చేసినవి కావు, అత్యంత సన్నిహితులైన స్నేహితులే చేశారు. బాడీ షేమింగ్ కేవలం బాహ్య సామాజిక ప్రవర్తన మాత్రమే కాదు, మన రోజువారీ సంబంధాలు, సంభాషణల్లో కూడా భాగమైపోయిందని ఈ సర్వే వెల్లడిస్తోంది.
బరువు, శరీర ఆకృతి, చర్మం రంగు, జుట్టు నాణ్యత వంటి అంశాలపై చేసే వ్యాఖ్యలు ఒక వ్యక్తి ఆత్మవిశ్వాసంపై చాలా లోతైన ప్రభావాన్ని చూపుతాయని మానసిక వైద్య నిపుణులు చెబుతున్నారు.
“బాడీ షేమింగ్ కేవలం ఒక వ్యక్తిగత అనుభవం మాత్రమే కాదు. ఇదొక విస్తృతమైన సామాజిక సమస్య. ప్రజల్లో అవగాహన, సున్నితత్వం, బాధ్యతాయుతమైన ప్రవర్తన చాలా అవసరం” అని లక్నోలోని యూనిటీ పీజీ కాలేజీలో సైకాలజీ విభాగం అసిస్టెంట్ ప్రొఫెసర్ శమ్సీ అక్బర్ అన్నారు.
“శరీరం గురించి పదేపదే అవమానకరమైన వ్యాఖ్యలు వినడం వల్ల వ్యక్తి ఆత్మగౌరవం క్రమంగా దెబ్బతింటుంది. వారు తమను తాము ఇతరుల కంటే తక్కువగా భావించడం మొదలుపెడతారు. వారిలో న్యూనతా భావం ఏర్పడుతుంది” అన్నారు.

చట్టం ఏం చెబుతోంది?
అపర్ణ రజత్ కౌశిక్ వంటి అధికారిణిపైనే ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారంటే, ఆన్‌లైన్ వేదికల్లో సామాన్య మహిళల పరిస్థితేంటో అర్థం చేసుకోవచ్చని అలహాబాద్ హైకోర్టు లక్నో బెంచ్ న్యాయవాది సాయమా ఖాన్ అన్నారు.
“ఒక మహిళ శారీరక ఆకృతిపై అసభ్యకరమైన, అవమానకరమైన లేదా అశ్లీల వ్యాఖ్యలు చేయడం ఆమె గౌరవం, మర్యాదకు సంబంధించిన ప్రాథమిక హక్కును ఉల్లంఘించడమే. బీఎన్ఎస్ (భారతీయ న్యాయ సంహిత) లోని సెక్షన్ 79 (మహిళా గౌరవానికి భంగం కలిగించడం), సెక్షన్ 294 (అశ్లీల చర్యలు/పదాలు), సెక్షన్ 356 (మానహాని) కింద ఇది నేరం కిందకు వస్తుంది. దీంతో పాటు, ఐటీ యాక్ట్ 2000లోని సెక్షన్ 66ఈ (గోప్యత ఉల్లంఘన), సెక్షన్ 67 (అశ్లీల కంటెంట్ ప్రచురణ/ప్రసారం) కూడా వర్తించవచ్చు” అని తెలిపారు.
“ఇలాంటి ట్రోలింగ్, బాడీ షేమింగ్‌కు వ్యతిరేకంగా కఠినమైన చట్టపరమైన చర్యలు అవసరం. తద్వారా కేవలం ఒక సీనియర్ మహిళా పోలీసు అధికారిణికి మాత్రమే కాకుండా, సమాజంలోని ప్రతి మహిళ గౌరవం, భద్రతకు హామీ ఇవ్వచ్చు” అన్నారు సాయమా ఖాన్.
దీర్ఘకాలిక ప్రభావం
బాడీ షేమింగ్ వల్ల వ్యక్తిపై దీర్ఘకాలిక ప్రభావం పడే అవకాశం ఉందని సైకాలజీ నిపుణులు భావిస్తున్నారు.
ప్రొఫెసర్ శమ్సీ అక్బర్ మాట్లాడుతూ “బాడీ షేమింగ్‌కు గురయ్యే వారిలో యాంగ్జయిటీ డిజార్డర్, డిప్రెషన్, ఆత్మగౌరవం తగ్గడం వంటి సమస్యలు తలెత్తవచ్చు. చాలా సందర్భాల్లో ఇది ‘బాడీ డిస్మోర్ఫిక్ డిజార్డర్’గా మారి, వారు తమ శరీరం గురించి ప్రతికూల ఆలోచనలను పెంచుకుంటారు. ఫలితంగా పదేపదే అద్దంలో చూసుకుంటూ, ఇతరులతో పోల్చుకుంటూ ఎప్పటికీ అసంతృప్తిగానే ఉంటారు” అని వివరించారు.
“ఈ సమస్య మున్ముందు ‘ఈటింగ్ డిజార్డర్’ వంటి ప్రమాదకరమైన ప్రవర్తనలకు దారితీయవచ్చు. తద్వారా వారు తమ శరీరాన్ని మార్చుకోవడానికి ఆరోగ్యం దెబ్బతినే మార్గాలను అవలంబిస్తారు’’ అన్నారు శమ్సీ అక్బర్.
ఫొటో సోర్స్, Instagram mirzapur.police
ఎవరీ అపర్ణ రజత్ కౌశిక్?
ఉత్తరప్రదేశ్‌లోని రాంపూర్‌కు చెందిన అపర్ణ రజత్ కౌశిక్, 2015 బ్యాచ్‌కు చెందిన ఐపీఎస్ అధికారిణి. ఆమెకు నేరస్థుల పట్ల కఠినమైన వైఖరి అవలంభిస్తారనే పేరుంది.
ఐపీఎస్ అధికారిణి కావడానికి ముందు ఆమె గురుగ్రామ్‌లోని ఒక ప్రైవేట్ కంపెనీలో పనిచేశారు. ఐపీఎస్ అయిన తర్వాత ఉత్తరప్రదేశ్‌లోని పలు జిల్లాల్లో పనిచేశారు అపర్ణ.
ఆమె అమేథీలో పోలీస్ సూపరింటెండెంట్‌గా బాధ్యతలు నిర్వర్తించారు. కాస్‌గంజ్, ఔరైయా వంటి జిల్లాల బాధ్యతలను కూడా నిర్వహించారు.
లక్నోలో డీసీపీ పదవిలో పనిచేశారు అపర్ణ. ఆమె ఎన్ఐటీ ప్రయాగ్‌రాజ్ నుంచి బీ.టెక్ పూర్తి చేశారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)



