Home జాతీయ national telgu యుద్ధ సమయంలో ప్యాసింజర్ విమానాలు ఎలా వెళ్తాయి?

యుద్ధ సమయంలో ప్యాసింజర్ విమానాలు ఎలా వెళ్తాయి?

12
0

SOURCE :- BBC NEWS

ప్యాసింజర్ విమానాలు

ఫొటో సోర్స్, Getty Images

ఇరాన్, గల్ఫ్ దేశాల గగనతలాల్లో గత రెండు వారాలుగా డ్రోన్లు, మిసైళ్లు దూసుకుపోతున్నాయి. దీంతో ఎయిర్‌ ట్రాఫిక్ కంట్రోలర్లు, ప్యాసింజర్ విమానాలను యుద్ధ ప్రాంతాలకు దూరంగా, సురక్షితమైన మార్గాల్లో పంపిస్తున్నారు. అయితే, ఈ మార్గాల్లో విమానాల రద్దీ బాగా పెరిగింది.

ఫ్లైట్ ట్రాకర్ మ్యాప్‌ను గమనిస్తే ఈజిప్టు, జార్జియా గగనతలాలు ఎంత రద్దీగా మారాయో అర్థమవుతుంది.

కంట్రోలర్లు ఒకరికొకరు సహకరించుకుంటూ, తమ ఏరియాలోకి ఏ విమానం వస్తోంది, ఏది వెళ్తోంది అనే విషయాలను ఎప్పటికప్పుడు సమన్వయం చేసుకుంటున్నారు.

మామూలు రోజుల్లో ఒక కంట్రోలర్ తన పరిధిలోని ఆరు విమానాలను ఒకేసారి పర్యవేక్షిస్తారు. కానీ, యుద్ధ పరిస్థితుల నేపథ్యంలో ఈ సంఖ్య రెట్టింపు కావొచ్చు.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

‘అంత ఒత్తిడితో కూడిన పనిలో మన మెదడు కేవలం 20 నుంచి 30 నిమిషాలు మాత్రమే పూర్తి ఏకాగ్రతతో ఉండగలదు’ అని బీబీసీకి రిటైర్డ్ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్ బ్రియాన్ రోచ్ చెప్పారు.

ఆయన 18 ఏళ్లు ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్‌గా పనిచేశారు. మొదట వివిధ దేశాల్లో రాయల్ ఎయిర్‌ఫోర్స్ కోసం, తర్వాత లండన్‌లో ప్యాసింజర్ విమానాల కోసం ఈ విధులు నిర్వహించారు. విమానాల అత్యవసర విపత్తు నిర్వహణ విభాగంలోనూ ఆయన సభ్యునిగా పని చేశారు.

ఫ్లైట్ రాడార్ డేటా

ఫొటో సోర్స్, FlightRadar24

రద్దీ ఎక్కువగా ఉన్నప్పుడు, విమానాలను పర్యవేక్షించడానికి ఆయా విభాగాల్లో ఎక్కువమంది కంట్రోలర్లను విధుల్లో ఉంచుతారు. వారు అలసిపోకుండా ఉండేందుకు తరచుగా విధులను మార్చుతుంటారు.

మామూలుగా ఒక కంట్రోలర్ తన షిఫ్టులో 45 నుంచి 60 నిమిషాలు పనిచేసి తర్వాత 20 నుంచి 30 నిమిషాలు విరామం తీసుకుంటారని బ్రియాన్ రోచ్ తెలిపారు.

కానీ, యుద్ధం వంటి ఉద్రిక్త పరిస్థితులు ఉన్నప్పుడు వారు 20 నిమిషాలు పనిచేసి, మళ్లీ 20 నిమిషాల పాటు విశ్రాంతి తీసుకోవాల్సి వస్తుంది.

‘విమానాల రద్దీ పెరగడంతో ప్రస్తుతం పనిచేస్తున్న కంట్రోలర్లు చాలా కష్టమైన షిఫ్టుల్లో, విపరీతమైన పని ఒత్తిడిలో విధులు నిర్వహిస్తున్నారు’ అని బ్రియాన్ చెప్పారు.

యుద్ధం వల్ల ప్యాసింజర్ విమాన మార్గాలు ఎలా ప్రభావితం అవుతాయో చెప్పడానికి 2014 నాటి మలేసియా ఎయిర్‌లైన్ ఎంహెచ్17 ఘటన ఒక ఉదాహరణ. రష్యా క్షిపణి కారణంగా యుక్రెయిన్‌ గగనతలంలో ప్రయాణిస్తున్న ఆ విమానం కూలడంతో అందులోని 298 మంది ప్రయాణికులు చనిపోయారు.

తాజాగా అమెరికాకు చెందిన ఇంధనం నింపే విమానం ఇరాక్‌లో కూలిపోయింది. ఈ ఘటనలో అందులోని ఆరుగురు సిబ్బంది మరణించారు.

కూలిపోయిన ఆ ఇంధన విమానం, ఇరాన్‌కు వ్యతిరేకంగా అమెరికా చేపట్టిన ఆపరేషన్లలో పాల్గొంది. ఈ ఘటన జరిగినప్పుడు అక్కడ రెండు విమానాలు ఉండగా, ఆ రెండో విమానం క్షేమంగా కిందకు దిగింది. అయితే, ఆ విమానం శత్రువుల దాడి వల్ల, లేదా ఫ్రెండ్లీ ఫైర్ కారణంగా గానీ కూలిపోలేదని అమెరికా సెంట్రల్ కమాండ్ స్పష్టం చేసింది.

గగనతలం అకస్మాత్తుగా మూతపడినా లేదా రద్దీ పెరిగినా పైలట్లకు కంట్రోలర్లు దిశానిర్దేశం చేస్తారు. విమానం ఎటు వెళ్లాలి? అందులో ఎంత ఇంధనం ఉంది? ఆయా విమాన రకాన్ని బట్టి ఏ విమానాశ్రయంలో ల్యాండ్ చేయొచ్చు వంటి అంశాలను పైలట్లకు కంట్రోలర్లు వివరిస్తారు.

రకరకాల సైజుల్లో ఉండే విమానాలు గాలిలో ప్రయాణించేటప్పుడు ఒకదానికొకటి తగలకుండా పైకి, కిందకు, పక్కకు సురక్షితమైన దూరం ఉండేలా కంట్రోలర్లు చూస్తారు. ఎందుకంటే, పెద్ద విమానాలు వెళ్తున్నప్పుడు అవి ఎక్కువగా గాలిలో అలజడిని (టర్బులెన్స్) సృష్టిస్తాయి. ఇది దాని పక్కనే నడిచే చిన్న విమానాలను అదుపు తప్పేలా చేస్తుంది. అందుకే చిన్న విమానాలను వాటికి దూరంగా ఉంచుతూ, సురక్షిత దూరాన్ని పాటించేలా కంట్రోలర్లు చూస్తారు. అలాగే చిన్న బిజినెస్ విమానాలను పూర్తిగా వేరే దారిలోకి మళ్లిస్తారు.

టెల్ అవీవ్‌లోని డ్రోన్ ఎయిర్ కంట్రోల్ సెంటర్‌లో ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్లు ఒక ప్రదర్శన నిర్వహించారు

ఫొటో సోర్స్, AFP

గగనతలాన్ని అకస్మాత్తుగా మూసేయడం చాలా అరుదుగా జరుగుతుందని 20 ఏళ్లకు పైగా పైలట్‌గా పనిచేస్తున్న జాన్ తెలిపారు. మధ్య ప్రాచ్యం మీదుగా విమానాలను నడిపే ఆయన తన అసలు పేరును చెప్పడానికి ఇష్టపడలేదు.

ప్రతికూల వాతావరణం లేదా యుద్ధం వంటి పరిస్థితుల్లో ఏదైనా గగనతలంలోకి వెళ్లకూదనుకున్నప్పుడు మెజారిటీ విమానయాన సంస్థలు ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటాయని ఆయన చెప్పారు.

‘మధ్య ప్రాచ్యంలో ఏదో జరుగబోతున్నట్లుగా అందరికీ ముందే తెలుసు. అది ఎప్పుడు జరుగుతుందన్నదే ప్రశ్న తప్ప, జరుగుతుందా లేదా అనే సందేహమే లేదు’ అని ఆయన అన్నారు.

యుద్ధ ప్రాంతాలను తప్పించుకోవడానికి ప్రత్యామ్నాయ మార్గాలపై అవగాహనతో ఉండటంతో పాటు, పైలట్లు వీలైనంత ఎక్కువ ఇంధనాన్ని కూడా తీసుకెళ్తుంటారు. ఒకవేళ అత్యవసర పరిస్థితి వస్తే బయల్దేరిన ప్రాంతానికే తిరిగి రావడానికి లేదా గమ్యానికి బదులుగా దానికి దూరంగా ఉన్న మరో విమానాశ్రయానికి విమానాన్ని మళ్లించడానికి ఈ ఇంధనం అవసరం అవుతుంది.

‘రోడ్ల మీద జరిగే ట్రాఫిక్ జామ్‌లా ఇదంతా గందరగోళంగా ఉండదు. ఇదంతా సాధారణ ప్రక్రియే. దీనిపై శిక్షణ ఇస్తారు, అంతా మన నియంత్రణలో ఉంటుంది’ అని జాన్ అన్నారు. విమానాల రద్దీ అదుపు తప్పకుండా ఉండటానికి పైలట్లు, కంట్రోలర్లు నిబంధనలను ఎంత కచ్చితంగా పాటిస్తారో జాన్ చెప్పారు.

ఫ్లైట్ రాడార్ డేటా

సుదీర్ఘ ప్రయాణం చేసే విమానాల్లో పనిచేసే క్యాబిన్ క్రూ బృందానికి హన్నా నాయకత్వం వహిస్తారు. ఇది ఆమె అసలు పేరు కాదు. తమ విమానయాన సంస్థ తరఫున మాట్లాడే అధికారం ఆమెకు లేనందున మేం ఆమె అసలు పేరును ఉపయోగించడం లేదు.

మిడిల్ ఈస్ట్ మీదుగా ప్రయాణించే విమానాల్లో ఆమె తరచుగా పనిచేస్తుంటారు. యుద్ధం వంటి ఉద్రిక్త సమయాల్లో ప్రయాణికులు ఆందోళన చెందుతుంటారని, అలాంటి సమయాల్లో తమ బృందం పోషించే పాత్ర కీలకమని ఆమె అన్నారు.

‘విమానంలోని ప్రయాణికులకు భోజనం అందించడమే మా పని అని అనుకుంటారు. ఇది ఒక అపోహ మాత్రమే. మా విధుల్లో భాగంగా ఉండే భద్రతా అంశాలను చాలామంది మర్చిపోతుంటారు. ప్రయాణికులను సురక్షితంగా ఉంచడం మా బాధ్యత. ఇదంతా సజావుగా ఉన్నప్పుడు మాత్రమే మేం భోజనం అందిస్తుంటాం’ అని హన్నా చెప్పారు.

యుద్ధ పరిస్థితుల కారణంగా విమానాల దారి మళ్లింపు, షెడ్యూల్స్ అస్తవ్యస్థం కావడం వల్ల పైలట్లు, క్యాబిన్ సిబ్బంది అంతా వర్క్ లైఫ్ బ్యాలెన్స్ విషయంలో ఇబ్బందులు పడుతున్నారని హన్నా అన్నారు.

ఇరాన్ మీదుగా విమానాలు నడిచే అవకాశం లేకపోవడంతో విమానాలు ఇతర ప్రాంతాల్లో ఆగాల్సి వస్తుందని చెప్పారు.

దీనివల్ల పని భారం పెరిగినప్పటికీ, ఇలాంటివన్నీ తమ వృత్తిలో భాగమేనని ఆమె అంటున్నారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)