Home జాతీయ national telgu యుద్ధం గురించి ఇరాన్ మీడియా ఆ దేశ ప్రజలకు ఏం చెబుతోంది?

యుద్ధం గురించి ఇరాన్ మీడియా ఆ దేశ ప్రజలకు ఏం చెబుతోంది?

22
0

SOURCE :- BBC NEWS

ఇరాన్ ప్రభుత్వ మీడియా, ఏఐ ఇమేజ్‌లు, తప్పుడు ప్రచారం, వార్తా సంస్థలు

ఫొటో సోర్స్, IRTV

ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్ దాడుల గురించిన కథనాలు విదేశాల్లోని టీవీల్లో కనిపించాయి. కానీ, చాలామంది ఇరానియన్లకు వాటి గురించి తెలియదు.

ఫిబ్రవరి 28న, అమెరికా – ఇజ్రాయెల్ సంయుక్త దాడుల్లో ఇరాన్ సుప్రీం లీడర్ ఆయతొల్లా అలీ ఖమేనీ మరణించారని చెబుతూ “ఆ నిరంకుశ పాలకుడు ఇక లేడనే సంకేతాలు వస్తున్నాయి” అని ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు అన్నారు.

అయితే, ప్రభుత్వ చానల్ మాత్రమే చూస్తున్న ఇరానియన్లకు దీనిపై ఎలాంటి సమాచారం లేదు.

ఇరాన్ అధికారులు ఖమేనీ మరణాన్ని ఖండించడం లేదా ధ్రువీకరించడం చేయలేదు.

ప్రభుత్వ చానళ్లలో ఒకటైన ఐఆర్‌టీవీ3లో న్యూస్ ప్రజెంటర్ ఒకరు వీక్షకులతో తనను, ప్రభుత్వం వద్దనున్న “తాజా సమాచారాన్ని విశ్వసించాలి” అని అభ్యర్థించారు.

ఖమేనీ మరణాన్నికొట్టివేస్తూ అవన్నీ “నిరాధారమైన పుకార్లు. త్వరలోనే వాస్తవాలు బయటికొస్తాయి” అని చెప్పారు.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌

ఖమేనీ మరణం గురించి తర్వాతి రోజు డోనల్డ్ ట్రంప్ తన సోషల్ మీడియా అకౌంట్‌లో పోస్ట్ చేసే వరకు ఇదంతా కొనసాగింది.

ట్రంప్ పోస్ట్ పెట్టిన కొన్ని గంటల తర్వాత, ఖమేనీ మరణవార్తను ప్రభుత్వ మీడియా ధ్రువీకరించింది.

యుద్ధం మొదలైన తర్వాత ఇరాన్‌లో 1200 మంది చనిపోయారని, దాడులు లెబనాన్, గల్ఫ్ అరబ్ దేశాలకు విస్తరించాయని ఇరాన్ అధికారిక మీడియా వాస్తవాలను, ఊహలను మిళితం చేసి వార్తలను ప్రసారం చేసింది. అదే అధికారిక సమాచారంగా ప్రజలకు చెప్పింది.

కోట్ల మంది ఇరానియన్లు పర్షియన్ భాషలకు చెందిన శాటిలైట్ టీవీ చానళ్లను చూస్తున్నప్పటికీ, వారికి నిజమైన సమాచారం చేరడం కష్టంగా మారింది.

ఇంటర్నెట్‌లో అంతరాయాలు, సెన్సార్‌షిప్, చానళ్లపై ఆంక్షల వల్ల దేశం మీద జరుగుతున్న దాడులు, దేశంలో అంతర్యుద్ధం గురించి ఇరానియన్లకు సమాచారం తెలియదు. వారికి బయటి ప్రపంచంతో సంబంధాలు దాదాపుగా తెగిపోయాయి.

యుద్ధం గురించి మొదటి వారంలో ఇరాన్ అధికారిక మీడియా కవరేజ్ ఎలా ఉంది? అనే విషయాన్ని బీబీసీ పరిశీలించింది. వాళ్లు ప్రజల కష్టాల మీద ఎక్కువగా రిపోర్టింగ్ చేశారు.

శత్రువులపై దాడులు చేయాలని పిలుపిచ్చారు. ఇస్లామిక్ రిపబ్లిక్ పట్ల ప్రజలు విధేయత చూపాలని చెప్పేవారు. అమెరికా, ఇజ్రాయెల్ దాడుల్లో ఇరాన్ సైన్యం, ప్రభుత్వ భవనాలకు జరిగిన నష్టం గురించి పెద్దగా పట్టించుకునే వారు కాదు.

ప్రజలకు తప్పుడు సమాచారం ఇచ్చిన సంఘటనలను కూడా బీబీసీ గుర్తించింది.

ఇరాన్ ప్రభుత్వ మీడియా, ఏఐ ఇమేజ్‌లు, తప్పుడు ప్రచారం, వార్తా సంస్థలు

ఇరాన్ మీడియా ఉపకరణాలేంటి?

ప్రపంచవ్యాప్తంగా పత్రికా స్వేచ్ఛను అణచివేసిన దేశాల్లో ఇరాన్ ఒకటని మీడియా వాచ్ డాగ్ “రిపోర్టర్స్ వితౌట్ బోర్డర్స్” చెబుతోంది.

1979 తిరుగుబాటుతో ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ ఇరాన్ ఏర్పడిన తర్వాత మీడియా కఠిన ఆంక్షల మధ్య పని చేస్తోంది.

బీబీసీ పర్షియన్ సహా పర్షియన్ భాషకు చెందిన, పాశ్చాత్య దేశాలకు చెందిన వార్తా సంస్థలు ఇరాన్ నుంచి రిపోర్టింగ్ చేసేందుకు వీల్లేకుండా నిషేధం విధించారు.

ఇరాన్ పాలకులకు టీవీ, రేడియో కీలక వేదికలుగా ఉన్నాయి. వాటితో పాటు న్యూస్ వెబ్‌సైట్లు, ఇన్‌స్టాగ్రామ్, టెలిగ్రామ్, ఎక్స్ వంటి ఆన్‌లైన్ ప్లాట్‌ఫాంలను కూడా ఆపరేట్ చేస్తోంది. ఇరాన్‌లో ఉన్నవారు ఈ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్ ఉపయోగించుకోవాలంటే వర్చువల్ ప్రైవేట్ నెట్‌వర్క్(వీపీఎన్) అవసరం.

ఇంటర్నెట్ అందుబాటులో లేనప్పుడు సమాచారం తెలుసుకునేందుకు ప్రజలకు అందుబాటులో ఉన్న ప్రధాన ఉపకరణం మీడియానే.

“వాళ్లు అనుకున్న దాన్ని ప్రజల మీద రుద్దుతున్నారు” అని మహ్సా అలీ మర్దానీ అన్నారు.

“ఎలాగంటే.. తాము సంపూర్ణ విజయం సాధించామని, తమ సైన్యం శక్తివంతమైనదని.”

ఇరాన్ సైనిక బలగాల దాడిలో అనేక మంది అమెరికన్లు చనిపోయారని లేదా గాయపడ్డారని ఇరాన్‌కు చెందిన అనేక అధికారిక మీడియా సంస్థలు ప్రసారం చేస్తున్నాయి. శత్రువుల మరణాలను పెంచి చూపిస్తున్నాయి.

యుద్ధం మొదలైన తొలి రెండు రోజుల్లోనే అమెరికాకు చెందిన 650 మంది సైనికులు ఇరాన్ దాడుల్లో మరణించినట్లు ఇరాన్ రివల్యూషనరీ గార్డ్ కోర్‌తో సంబంధం ఉన్న ఇరాన్ అధికారిక వార్తా సంస్థ తస్నీమ్ న్యూస్ మార్చి 3న రిపోర్ట్ చేసింది. ఐఆర్‌జీసీకి అధికార ప్రతినిధిని కోట్ చేస్తూ ఈ వార్త రాసింది.

ఈ వాదనలను భారత్, తుర్కియే, నైజీరియాకు చెందిన కొన్ని వార్తా సంస్థలు కూడా ప్రచురించాయి.

అదే సమయంలో, అమెరికన్ సైనికులు ఆరుగురు చనిపోయినట్లు పెంటగాన్ స్పష్టం చేసింది.

తమ సైనికులు మరో ఏడుగురు చనిపోయారని మార్చి 13న అమెరికన్ సెంట్రల్ కమాండ్ నిర్ధరించింది.

ఇరాన్ ప్రభుత్వ మీడియా, ఏఐ ఇమేజ్‌లు, తప్పుడు ప్రచారం, వార్తా సంస్థలు

వాస్తవాల వక్రీకరణ

తప్పుడు ప్రచార వ్యాప్తిలో ఇరాన్ ప్రభుత్వ మీడియాకు నూతన సాంకేతికత కూడా సాయపడుతోంది.

తగలబడుతున్న ఒక భవనంలో నుంచి అగ్ని కీలలు, పొగ ఎగసిపడుతున్న వీడియోను ఇరాన్ ప్రభుత్వ ఇంగ్లిష్ చానల్ ప్రెస్ టీవీ ఫేస్‌బుక్ పోస్ట్‌లో షేర్ చేసింది.

“ఇరాన్ దాడుల తర్వాత బహ్రెయిన్‌లోని ఒక బహుళ అంతస్తుల భవనం నుచి ఎగసిపడుతున్న పొగ” అని ఆ వీడియో కింద రాసింది.

అయితే, నిశితంగా పరిశీలించగా, అందులో రెండు కార్లు ఒకటిగా కలిసిపోయినట్లు అసాధారణ దృశ్యాలు కనిపించాయి. ఇది ఈ వీడియో నకిలీదని, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉపయోగించి తయారు చేసినట్లు సూచించే సంకేతం.

“యుద్ధానికి సంబంధించి తప్పుడు ప్రచారం చేసేందుకు ఏఐను ఉపయోగించడం కొత్తేమీ కాదు. వాస్తవాలను ప్రసారం చేయాల్సిన ప్రభుత్వ మీడియా సంస్థలు కూడా ఇలాంటి ఏఐ నకిలీ వీడియోలను ఉపయోగించడం ఆశ్చర్యంగా ఉంది” అని బ్రిటన్‌కు చెందిన థింక్ ట్యాంక్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ స్ట్రాటజిక్ డైలాగ్‌లో సీనియర్ డైరెక్టర్ బ్రెట్ షాఫెర్ చెప్పారు.

“ఇరాన్ మీడియా పదే పదే డీప్ ఫేక్ వీడియోలను ఉపయోగించడం చూస్తే యుద్ధ వార్తల రిపోర్టింగ్‌లో వాళ్లు చేస్తోంది పొరపాటు కాదని, వారికది అలవాటుగా మారినట్లు కనిపిస్తోంది” అని ఆయన అన్నారు.

యుద్ధం గురించి సోషల్ మీడియాలో వరద కొనసాగుతోంది. దాన్ని ఎవరు తయారు చేశారు, ఎక్కడ నుంచి వచ్చిందనే దానిపై స్పష్టత లేదు.

ఏదేమైనప్పటికీ యుద్ధం మొదలైనప్పటి నుంచి వివిధ ప్రభుత్వ మీడియా సంస్థలు తమకు నచ్చినట్లుగా కథనాలను ప్రసారం చేసేందుకు ఏఐ ద్వారా సృష్టించిన ఫోటోలను ఉపయోగించడాన్ని బీబీసీ గుర్తించింది.

ఇందులో అనేక ఫోటోలు వాస్తవానికి దూరంగా, తప్పుదారి పట్టించేలా ఉన్నాయి.

తమ ఘనతను చాటుకునేలా ఏఐతో రూపొందించిన ఫోటోలు, వీడియోలను అమెరికా అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్, వైట్ హౌస్ తరచుగా షేర్ చేస్తుంటారు.

ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు ఇటీవల తన ఇన్‌స్టా అకౌంట్‌లో ఒక ఫోటో షేర్ చేశారు. అందులో ఆయన, డోనల్డ్ ట్రంప్‌తో పాటు విన్‌స్టన్ చర్చిల్ ఉన్నారు. ఓ మీడియా సంస్థ “సోషల్ మీడియా సహకారంతో” అని చెబుతూ ఈ పోస్ట్‌ను ప్రచురించింది.

ఇరాన్ ప్రభుత్వ మీడియా, ఏఐ ఇమేజ్‌లు, తప్పుడు ప్రచారం, వార్తా సంస్థలు

ఫొటో సోర్స్, Iranian Press Center/AFP via Getty Images

వాస్తవాలేంటి?

తప్పుడు సమాచారానికి కొంత నిజాన్ని జతచేసి ప్రచారం చేసే ఇరాన్ ట్రాక్ రికార్డ్ కారణంగా, ఇంటా బయటా ఎంతోమంది ఇరాన్ పాలనా విమర్శకుల్లో సందేహాలను రేపింది.

మార్చి 3న ఓ స్కూలు మీద దాడిలో 160 మంది పిల్లలు చనిపోయారని ఇరాన్ ప్రభుత్వ మీడియా రిపోర్ట్ చేసింది. అయితే, అమెరికా స్థానికంగా ఉన్న సైనిక స్థావరాన్ని లక్ష్యంగా చేసుకుని ఉండవచ్చని స్వతంత్ర నిపుణులు అంటున్నారు. అదే సమయంలో, ఇరాన్ మీడియా ఒక సామూహిక అంత్యక్రియల ఫోటోను కూడా షేర్ చేసింది.

ఈ అంత్యక్రియల చిత్రం ఏఐ ద్వారా సృష్టించినదని ప్రభుత్వ వ్యతిరేకులు ఆరోపించారు.

కానీ, ఆ ఫోటో నిజమైనదే. స్కూలుకు 3.7 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఆ శ్మశాన వాటికను శాటిలైట్ చిత్రాల సాయంతో బీబీసీ సరిపోల్చింది. ఆ ఫోటోలో ఉన్న చెట్లు, రోడ్డు మార్గం, పక్కనే ఉన్న భవనాలు సరిపోయాయి.

శాటిలైట్ చిత్రంలో అప్పుడే తవ్విన సమాధులు కనిపించాయి. అంతకు ముందురోజు ఆ ప్రాంతం మామూలుగా ఉంది.

“మేం రెండు నిజాలను, ఒకేసారి భరించాలి” అని విట్నెస్ సంస్ధ ప్రతినిధి మహ్సా అలీ మర్దానీ అన్నారు.

“ఇరాన్ పాలకులు తాము దురాగతాలకు పాల్పడినప్పుడు కావాలనే ఆధారాలను దాచి పెడుతుంది, కానీ యుద్ధ సమయంలో పౌరుల మరణాలను భారీగా చూపించేందుకు పనిచేస్తుంది.”

ఇవి ప్రచారానికి ఉపయోగపడవచ్చు కానీ, కచ్చితంగా తప్పుడు ప్రచారమని అనుకోవాల్సిన అవసరం లేదని ఆమె అన్నారు.

అయితే, ఇరాన్ ప్రభుత్వ మీడియా రిపోర్టు విషయంలో ప్రతి ఒక్కరూ “హేతుబద్దమైన సందేహాస్పద దృక్పథం” కలిగివుండాలని సూచించారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)