SOURCE :- BBC NEWS
ఫొటో సోర్స్, Getty Images
5 గంటలు క్రితం
చదివే సమయం: 5 నిమిషాలు
బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వ అధినేత మొహమ్మద్ యూనస్ సోమవారం పదవికి రాజీనామా చేశారు. ఈ సందర్భంగా ఆయన చేసిన ప్రసంగంలో వ్యాఖ్యలు భారత్‌ను రెచ్చగొట్టేలా ఉన్నాయి.
వీడ్కోలు ప్రసంగంలో మాట్లాడిన యూనస్ “మనకున్న సముద్ర తీరం మన భౌగోళిక సరిహద్దు మాత్రమే కాదు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థను కలిపే ముఖ ద్వారం. ఈ ప్రాంతంలో నేపాల్, భూటాన్, సెవన్ సిస్టర్స్‌కు అపారమైన ఆర్థిక సామర్థ్యం ఉంది” అని అన్నారు.
ఈశాన్య భారతంలో అరుణాచల్‌ప్రదేశ్, అస్సాం, మణిపుర్, మేఘాలయ, మిజోరం, నాగాలాండ్, త్రిపురను కలిపి సెవన్ సిస్టర్స్ అని పిలుస్తారు.
తన ప్రసంగంలో భాగంగా యూనస్ ‘సెవెన్ సిస్టర్స్’ అని అంటూ భారత్ పేరును మాత్రం ప్రస్తావించలేదు.
ఇలా చెప్పడం ఈశాన్య రాష్ట్రాలు ప్రత్యేక ప్రాంతాలనీ, భారత్‌లో భాగం కావని చెప్పే ప్రయత్నంలా అనిపించింది.

ఈశాన్య రాష్ట్రాల గురించి ఆయన ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ఇదే తొలిసారి కాదు.
గతేడాది మార్చ్ 26 నుంచి 29 వరకు చైనాలో పర్యటించారు యూనస్. ఆ పర్యటనలోనూ ఆయన సెవన్ సిస్టర్స్ గురించి మాట్లాడారు.
సెవన్ సిస్టర్స్‌కు సముద్రంతో ఎలాంటి సంబంధం లేదన్నారు.
“భారత్‌లోని సెవన్ సిస్టర్స్ చుట్టూ నేల ఉంది. వాటికి సముద్ర తీరం లేదు. ఈ ప్రాంతానికి మేము సంరక్షకులం. చైనాకు ఇక్కడ ఆర్థికంగా అపారమైన అవకాశాలు ఉన్నాయి. ఈ ప్రాంతంలో చైనా అనేక వస్తువుల్ని తయారు చేసి ప్రపంచానికి సరఫరా చేయవచ్చు” అని యూనస్ అన్నారు.
ఫొటో సోర్స్, @narendramod
ఈశాన్య రాష్ట్రాల చుట్టూ భూమే..
యూనస్ వ్యాఖ్యలపై అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ ట్విట్టర్‌లో స్పందించారు.
“భారతదేశంలోని ఏడు ఈశాన్య రాష్ట్రాలను ‘ల్యాండ్ లాక్డ్’ అని వాటికి సముద్ర మార్గం కోసం బంగ్లాదేశ్ ఒక్కటే ఆధారం అని వ్యాఖ్యానించడం అభ్యంతకరం. యూనస్ చేసిన ఇలాంటి రెచ్చగొట్టే వ్యాఖ్యలు లోతైన, వ్యూహాత్మక, దీర్ఘకాలిక అజెండాను ప్రతిబింబిస్తాయి. వాటిని తేలిగ్గా తీసుకోకూడదు” అని ఆయన ట్విట్టర్ అకౌంట్‌లో పోస్ట్ చేశారు.
భారత్‌లో ఈ ప్రాంతాన్ని చాలా సున్నితమైనదిగా భావిస్తారు. ప్రత్యేకించి సిలిగురి కారిడార్ విషయంలో ఈ అభిప్రాయం బలంగా ఉంది. 22 కిలోమీటర్ల వెడల్పున్నఈ కారిడార్ ఈశాన్య భారతాన్ని మిగతా దేశంతో కలుపుతోంది.
బంగ్లాదేశ్, నేపాల్ కూడా ఈ కారిడార్‌తో సరిహద్దును పంచుకుంటున్నాయి. దీన్ని’ చికెన్ నెక్’ అని కూడా పిలుస్తారు. భూటాన్, చైనా కూడా ఈ కారిడార్‌కు స్వల్ప దూరంలో ఉన్నాయి.
ఈశాన్య రాష్ట్రాల చుట్టూ భౌగోళికంగా బంగ్లాదేశ్, భూటాన్, చైనా, మియన్మార్ ఉన్నాయి. వాటికి కూడా సముద్ర తీరం లేదు. భారత దేశానికి వాటితో భూ సరిహద్దు ఉంది. అందుకే చైనా పర్యటనలో యూనస్ చేసిన ప్రకటన వివాదానికి దారి తీసింది.
ఈశాన్య రాష్ట్రాల్లో ఒకటైన అరుణాచల్‌ప్రదేశ్ తమదేనని చైనా వాదిస్తోంది. దీనిని దక్షిణ టిబెట్ అని పిలుస్తోంది. అరుణాచల్ ప్రదేశ్‌లోని అనేక ప్రాంతాలకు చైనీస్ పేర్లు పెట్టింది. పేర్లు మార్చడం వల్ల వాస్తవాలు మారవని భారత్ పేర్కొంది.
సెవన్ సిస్టర్స్ ల్యాండ్ లాక్డ్ ప్రాంతాలని యూనస్ ప్రస్తావించినప్పుడు, ప్రధాని నరేంద్ర మోదీ ఆర్థిక సలహాదారు సంజీవ్ సన్యాల్ ఎక్స్‌లో స్పందించారు.
“భారతదేశంలోని ఏడు రాష్ట్రాలకు సముద్ర తీరం లేదని యూనస్ చైనాకు బహిరంగంగా విజ్ఞప్తి చేయడం ఆసక్తికరంగా ఉంది. బంగ్లాదేశ్‌లో చైనా పెట్టుబడులు పెడితే మంచిదే. అయితే దీనికి ఈశాన్య రాష్ట్రాలకు సంబంధం ఏంటి?” అని ఆయన ప్రశ్నించారు.
ఫొటో సోర్స్, @ChiefAdviserGo
ఈశాన్య రాష్ట్రాలను లక్ష్యంగా చేసుకున్నారా?
గతంలోనూ యూనస్ ప్రకటన రెచ్చగొట్టేలా ఉందని భావించారు. ఇప్పుడు పునరావృతం చేశారు.
యూనస్ మాత్రమే కాదు, గతేడాది ఆగస్టు ఉద్యమంలో పాల్గొన్న విద్యార్థి నాయకులు కూడా ఈశాన్య రాష్ట్రాల గురించి వివాదాస్పద ప్రకటనలు చేశారు.
బంగ్లాదేశ్‌ను అస్థిర పరచాలని చూస్తే, ఈశాన్య రాష్ట్రాలు ఒంటరిగా మారతాయని బంగ్లాదేశ్ నేషనల్ సిటిజన్ పార్టీ దక్షిణ చీఫ్ ఆర్గనైజర్ హస్నత్ అబ్దుల్లా గతేడాది డిసెంబర్‌లో హెచ్చరించారు.
“బంగ్లాదేశ్ సార్వభౌమాధికారం, సామర్థ్యాలు, ఓటు హక్కులు, మానవ హక్కులను గౌరవించని శక్తులకు భారత్ ఆశ్రయం ఇస్తే మేము దీటుగా స్పందిస్తామని స్పష్టం చేయదలచుకున్నాను. బంగ్లాదేశ్‌లో అస్థిరత ఏర్పడితే అది సరిహద్దులను దాటి విస్తరిస్తుంది” అని హస్నత్ అన్నారు.
ఫొటో సోర్స్, @ChiefAdviserGoB
పహల్గామ్ దాడికి ప్రతీకారంగా పాక్‌పై భారత్ దాడి చేస్తే , ఈశాన్య రాష్ట్రాలను స్వాధీనం చేసుకునేందుకు బంగ్లాదేశ్‌కు చైనా సహకరించాలని బంగ్లాదేశ్ ఆర్మీ మాజీ అధికారి, యూనస్ స్నేహితుడైన మేజర్ జనరల్( రిటైర్డ్) ఫజ్లుర్ రెహమాన్ గతేడాది ఏప్రిల్‌లో చెప్పారు. యూనస్ ప్రభుత్వం ఈ వ్యాఖ్యలపై స్పందించలేదు.
ఈశాన్య రాష్ట్రాల ల్యాండ్ లాక్డ్ అని యూనస్ చెబుతున్నారు. అయితే భారత్‌తో బంగ్లాదేశ్ పరిస్థితి కూడా అదే. రెండు దేశాల మధ్య 4,367 కిలోమీటర్ల దూరం దాని అంతర్జాతీయ సరిహద్దులో 94శాతంగా ఉంది. అంటే బంగ్లాదేశ్ చుట్టూ భారత్ ఉంది.
బంగ్లాదేశ్ భద్రత, వాణిజ్యం విషయంలో భారత్‌పై ఎక్కువగా ఆధారపడి ఉంది. బంగ్లాదేశ్ నుంచి ఈశాన్య రాష్ట్రాలకు కనెక్టివిటీ చౌకగా, అందుబాటులో ఉంది,
ఈశాన్య రాష్ట్రాలను భారత్‌లోని మిగిలిన ప్రాంతాలతో అనుసంధానించడంలో బంగ్లాదేశ్ కీలక పాత్ర పోషిస్తోంది.
ఫొటో సోర్స్, Getty Images
రోడ్ల నిర్మాణానికి ముందుకు రాని బంగ్లాదేశ్
బంగ్లాదేశ్‌లోని లాల్మోనిర్హాట్‌లో చైనా సాయంతో నిర్మించిన పాత వైమానిక స్థావరాన్ని మళ్లీ కార్యాచరణలోకి తీసుకు వస్తోందని గతేడాది సోషల్ మీడియాలో చాలా చర్చ జరిగింది.
లాల్మోనిర్హాట్ భారత సరిహద్దుల నుంచి 12-15 కిలోమీటర్లు, సిలిగురి కారిడార్ నుంచి 135 కిలోమీటర్ల దూరంలో ఉంది.
బంగ్లాదేశ్‌తో చర్చలలో ఈశాన్య రాష్ట్రాలకు రవాణా అంశం కూడా కీలకంగా మారింది.
ఈశాన్య రాష్ట్రాలను బంగ్లాదేశ్ ద్వారా భారత్‌లోని ఇతర ప్రాంతాలతో అనుసంధానించాలనే ప్రతిపాదన రెండు దేశాల చర్చల్లో ప్రధానంగా ప్రస్తావనకు వస్తోంది.
ఈ రాష్ట్రాల కోసం చిట్టగాంగ్ హార్బర్‌ను ఉపయోగించాలని భారత్ డిమాండ్ చేస్తోందని బంగ్లాదేశ్ మాజీ రాయబారి సిరాజుల్ ఇస్లాం డైలీ స్టార్ పత్రికలో రాశారు.
“తమ కంటే 23 రెట్లు పెద్దదిగా ఉండి, మూడు వైపులా తమ దేశాన్ని చుట్టిముట్టిన భారత్ వల్ల బంగ్లాదేశ్ సార్వభౌమత్వానికి ముప్పు ఏర్పడవచ్చని బంగ్లాదేశ్ ప్రజలు భయపడుతున్నారు. చర్చల్లో భారత ఏకపక్ష ధోరణి వల్ల ఈ భయం మరింత పెరిగింది” ఆయన అందులో పేర్కొన్నారు.
“బంగ్లాదేశ్, ఈశాన్య రాష్ట్రాలు, భారత్‌లోని మిగిలిన ప్రాంతాల మధ్య ఉన్నాయి. వీటికి పోర్టు అవసరం ఉంది” అని సిరాజుల్ ఇస్లాం తన కథనంలో తెలిపారు.
“ఈశాన్య రాష్ట్రాలను బంగ్లాదేశ్ ద్వారా మిగతా భారత దేశంతో కలిపితే దాని వల్ల సమయం, ధనం ఆదా అవుతాయి. దీని వల్ల బంగ్లాదేశ్‌కు ఆర్థిక అవకాశాలు పెరుగుతాయి” అని సిరాజుల్ అభిప్రాయపడ్డారు.
“చిట్టగాంగ్ హార్బర్ నుంచి రవాణాతో ఈశాన్య రాష్ట్రాల ఆర్థిక వ్యవస్థలను బంగ్లాదేశ్‌తో అనుసంధానించవచ్చు. దీని వల్ల భవిష్యత్ చర్చలలో బంగ్లాదేశ్‌కు ప్రయోజనం చేకూరుతుంది. నేపాల్, భూటాన్ కూడా ఇందులో భాగస్వాములు కావచ్చు. రవాణా హక్కులు శాశ్వత ప్రాతిపదికన ఉండవు. పరస్పర సంబంధాల సమీక్షకు లోబడి ఉంటాయి” అని సిరాజుల్ అన్నారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)



