SOURCE :- BBC NEWS
ఫొటో సోర్స్, Reuters
ఒక గంట క్రితం
చదివే సమయం: 5 నిమిషాలు
రష్యా చమురు విషయంలో అమెరికా అనుసరిస్తున్న వైఖరిని ఇరాన్ విదేశీ వ్యవహారాల మంత్రి అబ్బాస్ అరాగ్చీ తీవ్రంగా విమర్శించారు. రష్యా నుంచి చమురు కొనాలంటూ అమెరికా ఇప్పుడు భారత్ సహా ప్రపంచంలోని పలు దేశాలను ‘వేడుకుంటోందని’ ఆయన అన్నారు.
మిడిల్ ఈస్ట్‌లో పెరుగుతున్న ఉద్రిక్తతల మధ్య, సముద్ర మార్గాల్లో ఇప్పటికే ఉన్న రష్యా చమురును భారత్ వంటి దేశాలు కొనుగోలు చేసేలా అమెరికా తాత్కాలికంగా ఆంక్షలను సడలించిన తరుణంలో అరాగ్చీ ఈ వ్యాఖ్యలు చేశారు.
అమెరికా అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్, ఆర్థిక మంత్రి స్కాట్ బెసెంట్, జాతీయ భద్రతా బృందం ఈ నిర్ణయం తీసుకున్నట్లు వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీ కరోలిన్ లెవిట్ మంగళవారం ప్రెస్ కాన్ఫెరెన్స్‌లో తెలిపారు.
భారత్ బాధ్యతాయుతమైన వైఖరిని ప్రదర్శించిందని, ఆంక్షలు ఉన్న రష్యా చమురును కొనుగోలు చేయడం నిలిపివేసిందని కరోలిన్ లెవిట్ పేర్కొన్నారు.
రష్యాకు సంబంధించి కొత్త జనరల్ లైసెన్స్ గురించి అమెరికా ఆర్థిక శాఖ మంత్రి బెసెంట్ చేసిన ప్రకటన ప్రకారం.. ఏప్రిల్ 11వ తేదీలోపు నౌకల్లో లోడ్ చేసిన రష్యా ముడిచమురు, పెట్రోలియం ఉత్పత్తుల అమ్మకానికి అనుమతి లభిస్తుందని అమెరికా ఆర్థిక విభాగం వెబ్‌సైట్ పేర్కొన్నట్లు వార్తా సంస్థ రాయిటర్స్ వెల్లడించింది.
ఈ లైసెన్స్ కింద ఆంక్షలు ఎదుర్కొంటున్న రష్యా సంస్థలు ఉత్పత్తి చేసే చమురును కూడా కొనుగోలు చేయడానికి అనుమతి ఉంది.

ఫొటో సోర్స్, Stocktrek / Getty Image
అమెరికా విధానంపై అరాగ్చీ విమర్శలు
”రష్యా నుంచి చమురు దిగుమతులను నిలిపివేయాలని అమెరికా నెలల తరబడి భారత్‌ను బెదిరిస్తూ వచ్చింది. కానీ ఇరాన్‌తో కేవలం రెండు వారాల ఘర్షణ తర్వాత, వైట్‌హౌస్ ఇప్పుడు భారత్ సహా ప్రపంచ దేశాలను రష్యా చమురు కొనాలని వేడుకుంటోంది” అని ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చీ సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ ‘ఎక్స్’ లో రాశారు.
అలాగే ‘చమురు ద్వారా రష్యాకు ప్రతిరోజూ 15 కోట్ల డాలర్లు సంపాదన’ శీర్షికతో వచ్చిన ‘ఫైనాన్షియల్ టైమ్స్’ కథనాన్ని ఆయన ప్రస్తావించారు.
యూరోపియన్ దేశాలనూ అబ్బాస్ అరాగ్చీ విమర్శించారు. రష్యాకు వ్యతిరేకంగా తమకు అమెరికా నుంచి మద్దతు లభిస్తుందనే ఆశతో, ఇరాన్‌పై ‘చట్టవిరుద్ధమైన యుద్ధానికి’ మద్దతు ఇచ్చాయని ఆరోపించారు.
రష్యా తన చమురు ఆదాయాన్ని యుక్రెయిన్‌తో యుద్ధం చేయడానికి ఉపయోగిస్తోందని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పలుమార్లు ఆరోపించారు. రష్యా చమురును కొనుగోలు చేసినందుకు ట్రంప్ ప్రభుత్వం భారత్‌పై 25 శాతం అదనపు టారిఫ్‌ను అమెరికా విధించింది.
అంతర్జాతీయ మార్కెట్‌లో పెరుగుతున్న చమురు ధరల దృష్ట్యా ట్రంప్ ప్రభుత్వం ఇప్పుడు తీసుకున్న నిర్ణయాన్ని అరాగ్చీ విమర్శించారు.
అయితే, అమెరికా ఆర్థిక మంత్రి స్కాట్ బెసెంట్ దీనిపై వివరణ ఇస్తూ, ”ఇది తాత్కాలిక ప్రయోజనాల కోసం తీసుకున్న చర్య. దీనివల్ల రష్యా ప్రభుత్వానికి పెద్దగా ఆర్థిక ప్రయోజనం ఉండదు. ఎందుకంటే ఇప్పటికే సముద్రంలో చిక్కుకుపోయిన చమురు లావాదేవీలకు మాత్రమే ఇందులో అనుమతి ఉంది” అని ఆయన పేర్కొన్నారు.
ఫొటో సోర్స్, Getty Images
అమెరికా వైఖరిలో అనూహ్య మార్పు ఎందుకు?
గల్ఫ్ ప్రాంతం నుంచి వచ్చే చమురు, గ్యాస్‌పై ప్రపంచం ఎంతగా ఆధారపడి ఉందో ఇరాన్‌తో అమెరికా, ఇజ్రాయెల్ చేస్తున్న యుద్ధంతో స్పష్టమైంది.
ఈ యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి చమురు ధరలు ఆకాశాన్ని తాకాయి. ప్రస్తుతం బ్యారెల్ ధర 100 డాలర్లకు చేరుకుంది. షిప్పింగ్, ఇంధన మౌలిక సదుపాయాలపై వైమానిక దాడులు, అలాగే హార్ముజ్ జలసంధి పూర్తిగా మూతపడటంతో ఈ పరిస్థితి మరింత తీవ్రమైంది.
ప్రపంచవ్యాప్త చమురు సరఫరాలో దాదాపు 20 శాతం హార్ముజ్ జలసంధి మీదుగానే వెళ్తుంది. ఇది ఇంధన రవాణాకు అత్యంత కీలకమైన మార్గం.
అమెరికాలో పెట్రోల్ సగటు ధర గత నెలతో పోలిస్తే 23 శాతం పెరిగింది. డీజిల్ ధరలు మూడో వంతు పెరిగాయి. బ్రిటన్‌లో కూడా డీజిల్ ధర 9 శాతం పెరిగింది.
అంటే, ఈ యుద్ధం తాలూకా సెగలు అమెరికాలోని సామాన్య ప్రజల వరకూ చేరవచ్చు. అందుకే చమురు ధరలను నియంత్రణలో ఉంచడానికి ప్రపంచవ్యాప్తంగా సరఫరాను కొనసాగించడం చాలా ముఖ్యం.
చమురు, గ్యాస్ సంక్షోభం ఆసియా దేశాలలో ఉన్నంతగా మరెక్కడా కనిపించడం లేదు. గత ఏడాది, హార్ముజ్ జలసంధి మీదుగా రవాణా అయిన మొత్తం చమురు, గ్యాస్‌లో దాదాపు 90 శాతం ఇప్పుడు స్తంభించింది.
ఈ యుద్ధం మొదలైన తర్వాత భారతదేశంలో గ్యాస్ ధరలు పెరిగాయి. ప్రజలలో చమురు, గ్యాస్ కొరతపై ఆందోళన కనిపిస్తోంది. ప్రభుత్వం భరోసా ఇచ్చినప్పటికీ, సామాన్యులలో ఇది చర్చనీయమైంది.
ఆసియాలోని ఇతర దేశాల విషయానికి వస్తే, ఫిలిప్పీన్స్ తన ముడిచమురులో దాదాపు 95 శాతం మిడిల్ ఈస్ట్ నుంచే దిగుమతి చేసుకుంటోంది. ప్రస్తుత పరిస్థితుల్లో ఇంధనాన్ని ఆదా చేసేందుకు అక్కడ ప్రభుత్వ ఉద్యోగులను వారానికి నాలుగు రోజులు మాత్రమే పని చేయాలని ఆ దేశ అధ్యక్షుడు సూచించారు.
థాయిలాండ్ ఇంధనశాఖ మంత్రి మంగళవారం మాట్లాడుతూ, ఇంధనం పొదుపు కోసం ప్రభుత్వ కార్యాలయాల్లో ఎయిర్ కండిషనర్ల ఉష్ణోగ్రతను సాధారణం కంటే ఎక్కువగా ఉంచడం వంటి పలు చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు.
మరోవైపు, సింగపుర్ ఆహార అవసరాలకు 90 శాతం దిగుమతులే ఆధారం.
ఇండోనేసియాకు అవసరమైన గోధుమలన్నీ విదేశాల నుంచే దిగుమతి అవుతున్నాయి. రవాణా ఖర్చులు పెరగడం వల్ల ఈ దేశాల్లో ఆహార పదార్థాల ధరలపై కూడా ప్రభావం పడవచ్చు.
ఫొటో సోర్స్, Getty Images
భారతదేశంలో చమురు సరఫరాపై యుద్ధ ప్రభావం…
చమురు ధరల పెరుగుదలను దృష్టిలో ఉంచుకుని, ఇతర దేశాలు రష్యా చమురును కొనుగోలు చేయడానికి ట్రంప్ ప్రభుత్వం మార్చి 13వ తేదీన తాత్కాలిక అనుమతిని ప్రకటించింది.
ప్రస్తుతం ఈ చమురు సముద్రంలో చిక్కుకుపోయింది. అంతకుముందు మార్చి 6న అమెరికా ఆర్థిక విభాగం ‘భారతీయ రిఫైనరీలు రష్యా చమురును కొనుగోలు చేయడానికి 30 రోజుల తాత్కాలిక మినహాయింపు’ ఇచ్చింది.
”భారతీయులు చాలా మంచి పని చేశారు. రష్యా చమురు కొనడం ఆపమని మేం వారిని కోరాం, వారు అలాగే చేశారు. దానికి బదులుగా వారు అమెరికా నుంచి చమురు కొనాల్సి ఉంది” అని అమెరికా ఆర్థిక మంత్రి స్కాట్ బెసెంట్ మార్చి 7న ‘ఫాక్స్ బిజినెస్’కు ఇచ్చిన ఇంటర్వ్యూలో అన్నారని ‘ది హిందూ’ కథనంలో పేర్కొన్నారు.
”అయితే ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న తాత్కాలిక చమురు కొరతను తీర్చడానికి, రష్యా చమురును కొనడానికి మేం వారికి అనుమతి ఇచ్చాం. ఇతర రష్యా చమురు ఉత్పత్తులపై కూడా ఆంక్షలను తొలగించే అవకాశం ఉంది” అని ఆయన వెల్లడించారు.
మరోవైపు, దేశంలో చమురు, గ్యాస్ కొరత ఏమీ లేదని భారత ప్రభుత్వం పేర్కొంది. అయినప్పటికీ, పలు నగరాల్లో ప్రజలు వంట గ్యాస్ కోసం పొడవైన క్యూలలో కనిపిస్తున్నారు. అనేకచోట్ల పెట్రోల్ బంకుల వద్ద భారీ రద్దీ కనిపిస్తోంది.
శనివారం భారత పెట్రోలియం మంత్రిత్వ శాఖ ఒక అడ్వైజరీ జారీ చేస్తూ… దేశంలోని పెట్రోల్ బంకుల్లో తగినంత డీజిల్, పెట్రోల్ అందుబాటులో ఉన్నాయని, కాబట్టి ప్రజలు కంటైనర్లలో పెట్రోల్, డీజిల్‌ను కొనుగోలు చేసి నిల్వ చేయవద్దని కోరింది.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)



