SOURCE :- BBC NEWS
ఫొటో సోర్స్, Getty Images
-
- రచయిత, యాస్మిన్ రుఫో
- హోదా, బీబీసీ న్యూస్
-
19 ఫిబ్రవరి 2026, 12:23 IST
-
చదివే సమయం: 4 నిమిషాలు
ముఖాన్ని ఐస్ వాటర్ ఉన్న గిన్నెలో ముంచడం నుంచి చెంపలపై ఫ్రోజెన్ టూల్స్ రోలింగ్ చేయడం వరకు కొన్ని నిమిషాల్లోనే ముఖం డీ-పఫ్ అవుతుందని చెప్పే చిట్కాలు సోషల్ మీడియాలో కనిపిస్తుంటాయి. డీ-పఫ్పింగ్ అంటే ఉబ్బినట్లు ఉన్న ముఖాన్ని మామూలుగా మార్చడం.
స్క్రీన్‌పై ఈ టెక్నిక్స్ ఆకర్షణీయంగా కనిపించినా, ఇవి చాలా వరకు తప్పుగా అర్థం చేసుకున్నవి, అతిగా ప్రచారం పొందినవి, తాత్కాలిక ఫలితాలు మాత్రమే ఇస్తాయి అని డెర్మటాలజిస్టులు చెబుతున్నారు.
ముఖం ఉబ్బడానికి ప్రధాన కారణం అక్కడ ద్రవాలు నిల్వ ఉండడమే. ఎక్కువ ఉప్పు తినడం, మద్యం సేవించడం, అలర్జీలు, నిద్రలేమివల్ల ఇలా జరుగుతుంది అని డాక్టర్ ఐజా జమిల్ చెప్పారు.
‘‘వైరల్ హ్యాక్స్ అన్నీ మూడు కేటగిరీల్లో ఉంటాయి. చల్లదనం (కోల్డ్ ఎక్స్‌పోజర్), మసాజ్, చర్మాన్ని తాత్కాలికంగా బిగుతుగా చేయడం” అని మరో డెర్మటాలజిస్ట్ టీనా టియాన్ చెప్పారు.
‘‘ఇవి ఉబ్బినట్లుగా ఉన్న ముఖాన్ని కొంతవరకు మామూలుగా చేస్తాయి. ఉపశమనం కలిగిస్తాయి. కానీ ఇది తాత్కాలికం మాత్రమే. ఇవి ముఖ ఆకృతిని శాశ్వతంగా మార్చేలవు” అని ఆమె వివరించారు.

ఫొటో సోర్స్, Getty Images
1) కోల్డ్ థెరపీ
మీరు ఎప్పుడైనా సింక్ దగ్గర నిలబడి, ముఖాన్ని ఐస్ వాటర్ బౌల్‌లో ముంచాలా వద్దా అని ఆలోచించారా?.. ‘ఐస్ ఫేషియల్’ ఇప్పుడు సోషల్ మీడియాలో ఒక ట్రెండ్‌గా మారింది. ఇది సగం బ్యూటీ హ్యాక్, సగం ఓర్పుకి పరీక్ష.
చల్లదనం రక్తనాళాలు కుచించుకుపోయేలా చేస్తుందని టీనా అంటున్నారు.
ఐస్ ఫేషియల్స్, క్రయో గ్లోబ్స్, ఫ్రిజ్‌లో పెట్టిన షీట్ మాస్క్స్ వెనుక ఉన్న లాజిక్ ఇదే. కానీ ఐస్‌లో ముఖం ముంచాల్సిన అవసరం లేదు. చల్లటి కంప్రెస్ లేదా కేవలం చల్లటి నీటితో ముఖం కడగడం వల్ల కూడా అదే ప్రయోజనం ఉంటుంది అని టీనా అంటున్నారు.
“ఇది ముఖం కొంచెం టైట్‌గా, ఫ్రెష్‌గా కనిపించేలా చేస్తుంది. ముఖ్యంగా ఉదయం సమయంలో. కానీ ఫలితం తాత్కాలికమే, ఇది కొన్ని గంటల పాటు మాత్రమే ఉంటుంది” అని డాక్టర్ ఐజా జమిల్ చెప్పారు.
“చల్లదనం కొంతవరకు ముఖాన్ని తాజాగా ఉంచుతుంది. కానీ ఎక్కువగా ఐస్ వాడితే సున్నితమైన చర్మం ఇరిటేట్ అవుతుంది లేదా రోసేసియా అనే సమస్యను పెంచుతుంది. అందుకే మృదువుగా, జాగ్రత్తగా వాడాలి” అని డెర్మటాలజిస్ట్ టీనా చెప్పారు.
ఫొటో సోర్స్, Getty Images
2) ఫేషియల్ రోలర్స్
ఇంతకుముందు ప్రత్యేకమైన స్పా పరికరాలుగా ఉన్న ఫేషియల్ రోలర్స్, గ్వా షా స్టోన్స్ ఇప్పుడు చాలా మందికి బాత్రూమ్‌లో సాధారణంగా వాడే వస్తువులుగా మారాయి.
ఇవి ముఖ ఆకృతిని మార్చే పరికరాలుగా, లిఫ్టింగ్, కాంటూరింగ్‌లో ప్రచారం పొందాయి.
కానీ ఇవి శాశ్వతంగా చర్మాన్ని బిగుతుగా చేయవు, చర్మ నిర్మాణాన్ని మార్చవు, లేదా కొవ్వును తొలగించవు అని ఐజా అంటున్నారు.
“ముఖానికి మృదువుగా మసాజ్ చేస్తే, శరీరంలో నిల్వ ఉన్న ద్రవాలు బయటకు వెళ్లి వాపు తగ్గుతుంది. ఇది క్రమం తప్పకుండా చేస్తే మరింత ఉపయోగం ఉంటుంది” అని టీనా చెప్పారు.
ఈ రోలర్స్ లేదా గ్వా షా స్టోన్స్‌ను ముఖంపై నెమ్మదిగా జరిపితే, ముఖంలో నిల్వ ద్రవం బయటకు పోయి ఉబ్బడం తగ్గుతుంది.
వీటిని ఫ్రిజ్‌లో పెట్టి వాడితే, కొంచెం ఎక్కువ ఫలితం కనిపిస్తుంది.
సరిగ్గా చేస్తే హాని ఉండదు.
“కానీ ఎక్కువ బలంగా ఒత్తితే గాయాలు లేదా చిన్న రక్తనాళాలు పగిలే అవకాశం ఉంటుంది. అందుకే మృదువుగా వాడాలి” అని టీనా చెప్పారు.
ఫొటో సోర్స్, Getty Images
3) కెఫీన్ క్రీమ్స్
కెఫీన్ ఐ క్రీమ్‌ను చాలాచోట్ల చూసుంటారు. ఇన్‌ఫ్లూయెన్సర్లు దీన్ని సిఫారసు చేస్తున్నారు. స్కిన్‌కేర్ షాపుల్లో సులభంగా దొరుకుతుంది. అలాగే ‘మార్నింగ్ రొటీన్’ వీడియోల్లో కళ్లు వెంటనే ప్రకాశవంతంగా మారుతాయని చూపిస్తూ వాడుతున్నారు.
కళ్ల చుట్టూ ఉన్న చర్మం తొందరగా ఉబ్బుతుంది. ఎందుకంటే అక్కడ ద్రవం సులభంగా చేరుతుంది.
చాలా బ్యూటీ ట్రెండ్స్‌లా కాకుండా, దీనికి కొంత ఆధారం ఉందని టీనా అంటున్నారు.
కెఫీన్ రక్తనాళాలను కాస్త కుదిస్తుంది. అందుకే కెఫీన్ ఉన్న ఐ క్రీములు నిజంగా వాపు తగ్గించగలవు”
ఒకవేళ మీరు ఐ క్రీమ్ వాడాలనుకుంటే అందులో హైడ్రేటింగ్ పదార్థాలు కూడా ఉంటే చర్మానికి మరింత మంచిదని టీనా అంటున్నారు.
క్రీమ్‌ను ఫ్రిజ్‌లో ఉంచి వాడవచ్చు లేదా చల్లటి స్పూన్ వెనుక భాగంతో రాసుకోవచ్చు అని ఆమె చెప్పారు.
DIY పద్ధతులు (చల్లటి స్పూన్, టీ బ్యాగ్స్) వాడితే కూడా తాత్కాలికంగా వాపు తగ్గి చర్మం కూల్‌గా ఉంటుంది. కానీ వీటివల్ల తక్కువ ప్రభావం ఉంటుందని టీనా చెప్పారు.
కెఫీన్ ఐ క్రీమ్ వాపు తగ్గించడంలో సహాయపడుతుంది, కానీ అసలు ముఖం ఎందుకు ఉబ్బుతుందో తెలుసుకుని దానిపై దృష్టి పెట్టడం అవసరం అని టీనా చెప్పారు.
( బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)



