Home LATEST NEWS telugu తాజా వార్తలు మియన్మార్ భూకంపానికి కారణమేమిటి? బ్యాంకాక్‌లో ఆ ఒక్క భవనమే ఎందుకు కూలింది?

మియన్మార్ భూకంపానికి కారణమేమిటి? బ్యాంకాక్‌లో ఆ ఒక్క భవనమే ఎందుకు కూలింది?

7
0

SOURCE :- BBC NEWS

మియన్మార్‌

ఫొటో సోర్స్, Getty Images

మియన్మార్‌లో భారీ భూకంపం ధాటికి 1,600 మందికి పైగా మృతి చెందగా, అనేక భవనాలు కూలిపోయాయి.

మియన్మార్ భూకంపాలు సంభవించే ప్రమాదం ఎక్కువగా ఉన్న దేశమే కానీ దాని పొరుగున ఉన్న థాయిలాండ్, చైనాలకు మాత్రం అలాంటి ప్రమాదం లేదు. అయినా, ఈ భూకంప ప్రభావం ఆ దేశాలపైనా పడింది.

శుక్రవారం నాటి భూకంప కేంద్రం నుంచి థాయ్ రాజధాని బ్యాంకాక్‌కు 1,000 కి.మీ. కంటే ఎక్కువ దూరంలో ఉంది. అయినప్పటికీ బ్యాంకాక్‌లో నిర్మాణంలో ఉన్న ఎత్తైన భవనం ఒకటి కూలిపోయింది.

ఇంతకీ ఈ భూకంపానికి కారణమేమిటి, అంత దూరం వరకు దాని ప్రభావం ఎందుకు ఉంది?

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
భూకంపం

ఫొటో సోర్స్, Getty Images

భూకంపానికి కారణమేమిటి?

భూమి పైపొర టెక్టోనిక్ ప్లేట్లు అని పిలిచే వివిధ విభాగాలతో ఉంటుంది. అవన్నీ నిరంతరం కదులుతూ ఉంటాయి. కొన్ని ఒకదానిపక్కన ఒకటి కదులుతుంటే మరికొన్ని పైన, కింద కదులుతుంటాయి.

ఈ కదలికలే భూకంపాలకు, అగ్నిపర్వతాలు బద్దలవడానికి కారణమవుతాయి.

నాలుగు టెక్టోనిక్ ప్లేట్లు కలిసే చోట ఉంది మియన్మార్

మియన్మార్‌ను ప్రపంచంలోనే భౌగోళికంగా అత్యంత యాక్టివ్‌గా ఉండే ప్రాంతంగా పరిగణిస్తారు. దానికి కారణం.. ఈ ప్రాంతం నాలుగు టెక్టోనిక్ ప్లేట్లు( యూరేసియన్ ప్లేట్, ఇండియన్ ప్లేట్, సుండా ప్లేట్, బర్మా మైక్రోప్లేట్ ) కలిసే చోట ఉంటుంది.

ఇండియన్ ప్లేట్… యూరేసియన్ ప్లేట్‌ను ఢీకొట్టడం వల్ల హిమాలయాలు ఏర్పడ్డాయి. ఇండియన్ ప్లేట్ బర్మా మైక్రోప్లేట్ కిందకు చొచ్చుకు పోవడం వల్ల 2004లో సునామీ వచ్చింది.

లండన్‌లోని ఇంపీరియల్ కాలేజ్ టెక్టోనిక్స్ రీడర్ అయిన డాక్టర్ రెబెక్కా బెల్ మాట్లాడుతూ.. ‘ఈ కదలికలన్నింటినీ సర్దుబాటు చేయడానికి శిలలో పగుళ్లు ఏర్పడతాయి, దీని వల్ల టెక్టోనిక్ ప్లేట్లు పక్కకు జారుతాయి’ అని చెప్పారు.

సాగింగ్ ఫాల్ట్ అని పిలిచే ఒక పెద్ద ఫాల్ట్ ఉంది, ఇది మయన్మార్‌ భూగర్భంలో ఉత్తరం నుంచి దక్షిణానికి 1,200 కి.మీ. కంటే ఎక్కువ పొడవున ఉంటుంది.

శుక్రవారం 7.7 తీవ్రతతో సంభవించిన భూకంపానికి కారణమైన కదలిక “స్ట్రైక్-స్లిప్” అని నిపుణులు చెప్తున్నారు. అంటే రెండు ఎర్త్ బ్లాక్‌లు ఎదురెదురుగా అడ్డంగా కదలడం.

ఎర్త్ బ్లాకులు పక్కపక్కన కదులుతున్నప్పుడు అవి రాసుకుపోయి ఘర్షణను పెంచుతాయి, అవి రెండూ అకస్మాత్తుగా వేరైనప్పుడు ప్రకంపనలు వస్తాయి.

కూలిన భవనం

ఫొటో సోర్స్, Getty Images

అంతదూరంలో కూడా భూకంపం ఎలా ప్రభావం చూపింది?

భూకంపాలు భూమికి 700 కి.మీ లోపల వరకూ సంభవిస్తాయి. అయితే మియన్మార్‌లో భూకంపం భుఉపరితలం నుండి కేవలం 10 కి.మీ. లోపలే సంభవించింది. కాబట్టి ఇది భూఉపరితలంపై కంపనాలను పెంచుతుంది.

ఇది చాలా పెద్ద భూకంపం. తీవ్రత 7.7 గా నమోదైంది. ఇది హిరోషిమాపై వేసిన అణు బాంబు కంటే ఎక్కువ శక్తిని ఉత్పత్తి చేసింది అని అమెరికా జియోలాజికల్ సర్వే పేర్కొంది.

“గత శతాబ్దకాలంలో ఈ ప్రాంతంలో 7 లేదా అంతకంటే ఎక్కువ తీవ్రతతో ఆరు భూకంపాలు వచ్చాయి”

ఫాల్ట్ లైన్ ఎంతవరకు ఉందో అందులో చాలా దూరం వరకు భూకంప ప్రభావం ఉండొచ్చు.. మియన్మార్ భూకంప ప్రభావం కూడా థాయిలాండ్ వైపు 1200 కిలోమీటర్ల దూరం వరకు కనిపించింది.

భూకంప ప్రభావం భూమి ఉపరితలంపై ఎలా ఉంటుందనేది అక్కడి నేల స్వభావం బట్టి కూడా ఉంటుంది.

బ్యాంకాక్ నిర్మితమైన మృదువైన నేలలో భూకంప తరంగాల వేగం నెమ్మదిస్తుంది కానీ తరంగాలు పెద్దవవుతాయి.

బ్యాంకాక్‌లో ప్రకంపనలు తీవ్రం కావడానికి అది కూడా కారణం కావొచ్చు.

మయన్మార్

బ్యాంకాక్‌లోని ఎత్తయిన భవనాల్లో ఒక్కటి మాత్రమే ఎందుకు కూలిపోయింది?

భూకంపం సమయంలో బ్యాంకాక్‌లోని ఎత్తైన భవనాలు ఊగుతున్న దృశ్యాలు, బిల్డింగ్‍పైన ఉన్న ఈతకొలనుల నుంచి నీరు ఎగసిపడుతున్న దృశ్యాలు బయటకు వచ్చాయి. బ్యాంకాక్‌లోని చతుహక్ జిల్లాలోని అసంపూర్తిగా ఉన్న ఆడిటర్ జనరల్ ప్రధాన కార్యాలయమే భూకంప సమయంలో కూలిపోయిన ఏకైక బిల్డింగ్ అని తెలుస్తోంది.

2009 కి ముందు, బ్యాంకాక్‌లో భూకంపాలను తట్టుకునేలా భవనాలను నిర్మించడానికి సమగ్ర భద్రతా ప్రమాణాలు లేవని…ఇంపీరియల్ కాలేజ్ లండన్‌లో ఎర్త్‌క్వేక్ ఇంజనీరింగ్‌లో సీనియర్ లెక్చరర్ డాక్టర్ క్రిస్టియన్ మాలాగా-చుక్విటేప్ తెలిపారు.

పాత భవనాలు, ముఖ్యంగా శిథిలావస్థకు చేరిన భవనాలు కూలిపోయే అవకాశం ఉంది అని అన్నారు.

భూకంపాలను తట్టుకునేలా భవనాలను నిర్మించడం ఖర్చుతో కూడుకున్న పని.

అయితే మియన్మార్‌లో వచ్చినట్లుగా థాయిలాండ్‌లో తరచూ భూకంపాలు రావు.

బ్యాంకాక్‌లో కూలిపోయిన భవనం కొత్తది – వాస్తవానికి, భూకంపం వచ్చినప్పుడు అది ఇంకా నిర్మాణంలో ఉంది . కాబట్టి దీనికి కొత్త నిబంధనలు వర్తిస్తాయి.

బ్యాంకాక్ మృదువైన నేల కూడా బిల్డింగ్ కూలిపోవడానికి ఒక కారణం కావొచ్చని థాయిలాండ్ స్ట్రక్చరల్ ఇంజినీరింగ్ అసోసియేషన్ అధ్యక్షుడు డాక్టర్ పిమర్న్‌మాస్ అన్నారు. ఇలాంటి నేలలో ప్రకంపనలు మూడు నుంచి నాలుగు రెట్లు అధికంగా ఉంటాయన్నారు.

అయితే ఈ బిల్డింగ్ నిర్మాణంలో ఉపయోగించిన సామాగ్రి కూడా నాణ్యమైనది కాకపోవచ్చని అంచనా వేస్తున్నారు. దీనిపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉందని ఆయన చెప్పారు.

వీడియోను అధ్యయనం చేసిన తర్వాత.. లండన్ ఇంపీరియల్ కాలేజ్‌లో ఎర్త్‌క్వేక్ ఇంజినీరింగ్‌లో సీనియర్ లెక్చరర్‌గా పనిచేస్తున్న డాక్టర్ మాలాగా-చుక్విటేప్ మాట్లాడుతూ కూలిపోయిన భవనాన్ని “ఫ్లాట్ స్లాబ్” పద్ధతిలో నిర్మించి ఉండొచ్చన్నారు.

ఫ్లాట్ స్లాబ్ పద్ధతి అంటే కేవలం పిల్లర్లపైనే స్లాబ్ నిర్మించడం, అంటే పిల్లర్లపై అడ్డంగా బీమ్స్ వేయకుండా స్లాబ్ వేసే పద్ధతి అని వివరించారు.

నాలుగు కాళ్లపై నిర్మించిన టేబుల్‌లా నిర్మించడం అని చెప్పారు. అలా నిర్మిస్తే భూకంపాల సమయంలో ఒక్కసారిగా కుప్పకూలుతాయన్నారు.

భూకంప ముప్పు ఉన్న ప్రాంతాల్లో ఇలాంటి తరహా నిర్మాణ పద్ధతి పనికిరాదన్నారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

SOURCE : BBC NEWS