SOURCE :- BBC NEWS

ఫొటో సోర్స్, Getty Images
ఛత్తీస్‌గఢ్‌లోని నారాయణపూర్‌లో జరిగిన ఆపరేషన్‌లో సీపీఐ మావోయిస్ట్ ప్రధాన కార్యదర్శి ( జనరల్ సెక్రటరీ), అగ్రశ్రేణి నాయకుడు, నక్సల్స్ ఉద్యమానికి వెన్నెముక నంబాల కేశవ్ రావు అలియాస్ బసవరాజు సహా 27 మంది మావోయిస్టులు, భద్రతా బలగాల చేతుల్లో మృతి చెందినట్లు కేంద్ర హోం మంత్రి అమిత్ షా ప్రకటించారు.
ఈ మేరకు, సోషల్ మీడియా వేదిక ఎక్స్‌లో పోస్ట్ చేశారు.
నక్సలిజాన్ని రూపుమాపే యుద్ధంలో దీన్నొక మైలురాయి విజయంగా ఆయన అభివర్ణించారు.
నక్సలిజానికి వ్యతిరేకంగా భారత్ గత 30 ఏళ్లుగా చేస్తోన్న యుద్ధంలో ఒక జనరల్ సెక్రటరీ స్థాయి నాయకుడు చనిపోవడం ఇదే మొదటిసారని ఆయన పేర్కొన్నారు.
”ఈ మైలురాయిని అందుకున్నందుకు మన భద్రతా బలగాలు, ఏజెన్సీల ధైర్యాన్ని ప్రశంసిస్తున్నా. ఆపరేషన్ బ్లాక్ ఫారెస్ట్ పూర్తయ్యేసరికి తెలంగాణ, మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్‌లకు చెందిన 84 మంది నక్సలైట్లు సరెండర్ కాగా, 54 మంది నక్సలైట్లు అరెస్ట్ అయ్యారు” అని ఆయన ట్వీట్ చేశారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.
పోస్ట్ of X ముగిసింది, 1

ఈ ఘటనపై ప్రధాని నరేంద్ర మోదీ ఎక్స్ వేదికగా స్పందించారు.
ఈ విజయం సాధించిన మన బలగాలను చూసి గర్విస్తున్నా అంటూ అమిత్ షా ట్వీట్‌ను ప్రధాని నరేంద్ర మోదీ రీ ట్వీట్ చేశారు.
మావోయిజం ముప్పును తొలగించడానికి, దేశ ప్రజలు శాంతియుత జీవనం అందించేందుకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని ట్వీట్‌లో మోదీ పేర్కొన్నారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.
పోస్ట్ of X ముగిసింది, 2
అంతకుముందు, ఛత్తీస్‌గఢ్‌లోని మావోయిస్టు ప్రభావిత ప్రాంతమైన నారాయణపూర్ జిల్లాలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో 26 మందికి పైగా మావోయిస్టులు మరణించినట్లు పోలీసులు తెలిపారు.
ఓర్ఛా ప్రాంతంలో దాదాపు 50 గంటలుగా సెర్చ్ ఆపరేషన్ జరుగుతోందని ఛత్తీస్‌గఢ్ హోం మంత్రి విజయ్ శర్మ బుధవారం చెప్పారు.
ఈ ఆపరేషన్‌లో 26 మందికి పైగా మావోయిస్టులు మరణించారని ఆయన తెలిపారు. అగ్ర నాయకత్వానికి చెందిన కొంతమంది మావోయిస్టులు చనిపోయినట్లు నివేదికలు వచ్చాయని ఆయన అన్నారు.
మావోయిస్టు మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని చెబుతున్నారు.
”సెర్చ్ ఆపరేషన్ ఇంకా కొనసాగుతోంది. ఛత్తీస్‌గఢ్‌కు రెడ్ టెర్రర్ నుంచి విముక్తి కల్పించడానికి మా ప్రభుత్వం కట్టుబడి ఉంది” అని మంత్రి విజయ్ శర్మ అన్నారు.
గతంలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా మాట్లాడుతూ, 2026 మార్చి 31 నాటికి దేశంలో మావోయిస్టులను పూర్తిగా అంతం చేస్తామని అన్నారు.
‘మావోయిస్టులతో చర్చలు జరపాలి’
నారాయణపూర్‌లో సీపీఐ జనరల్ సెక్రటరీ సహా 27 మంది మావోయిస్టుల ఎన్‌కౌంటర్‌ను శాంతి సమన్వయ కమిటీ (కో ఆర్డినేషన్ కమిటీ ఫర్ పీస్) ఖండించింది. ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేసింది.
”ఈ ఆపరేషన్‌లో 27 మంది మావోయిస్టులతో పాటు ఒక డీఆర్జీ కూడా చనిపోగా, అనేక మంది గాయపడ్డారు. సీపీఐ (మావోయిస్ట్) జనరల్ సెక్రటరీ నంబాల కేశవ రావు అలియాస్ బసవరాజు మరణం మావోయిస్టులకు తీవ్ర లోటని, ప్రభుత్వం సాధించిన విజయం అంటూ మీడియా, ప్రభుత్వం పేర్కొంటోంది.
మావోయిస్టులు పిలుపునిచ్చిన శాంతి చర్చలు, కాల్పుల విరమణకు స్పందించడానికి బదులుగా ప్రభుత్వం ఇలా చేయడాన్ని శాంతి సమన్వయ కమిటీ ఖండిస్తోంది” అని ఆ ప్రకనటలో పేర్కొంది.
”అంతర్జాతీయ మావనతా సూత్రాలకు అనుగుణంగా తక్షణమే, బేషరతు కాల్పుల విరమణ పాటించాలి. ఆపరేషన్ కగార్‌ను వెంటనే నిలిపేయాలి. మావోయిస్టులతో శాంతి చర్చలు జరపాలి” అని అందులో కోరింది.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)