Home జాతీయ national telgu మార్కెట్‌లోకి 14 కోట్ల బ్యారళ్ల ఇరాన్ చమురు.. తాత్కాలికంగా ఆంక్షలు ఎత్తివేసిన అమెరికా, ఎక్కువ ప్రయోజనం...

మార్కెట్‌లోకి 14 కోట్ల బ్యారళ్ల ఇరాన్ చమురు.. తాత్కాలికంగా ఆంక్షలు ఎత్తివేసిన అమెరికా, ఎక్కువ ప్రయోజనం ఇండియాకేనా?

10
0

SOURCE :- BBC NEWS

ఇరాన్, చమురు, మార్కెట్, అమెరికా, భారత్‌, ఇంధన ధరలు, రష్యా, చైనా, నిల్వలు, హార్ముజ్

ఫొటో సోర్స్, LightRocket via Getty Images

ప్రస్తుతం సముద్రంలో ఉన్న ఇరాన్ చమురుపై అమెరికా తాత్కాలికంగా ఆంక్షలను ఎత్తివేసింది. దీంతో సుమారు 14 కోట్ల బ్యారళ్ల చమురు అంతర్జాతీయ మార్కెట్లోకి రావడానికి వీలు కలుగుతుంది. ఈ మేరకు అమెరికా ట్రెజరీ సెక్రటరీ స్కాట్ బెసెంట్ ‘ఎక్స్’లో పోస్ట్ చేశారు.

అయతే ప్రస్తుతం సముద్రంలో రవాణాలో ఉన్న ఆయిల్‌కు మాత్రమే ఇది వర్తిస్తుందని.. ఇరాన్ కొత్త ఆర్డర్లు తీసుకుని ఆర్థికంగా ప్రయోజనం పొందడానికి వీలు లేదని స్పష్టం చేశారు.

కాగా అంతకుముందు ఫాక్స్ న్యూస్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో బెసెంట్ ఇలాంటి సంకేతాలిచ్చారు. ఆ ఇంటర్వ్యూలో బెసెంట్ మాట్లాడుతూ.. ఇప్పటికే సముద్రంపై ఉన్న ఇరాన్ చమురు మీద పరిమితులను సడలించడానికి ప్రభుత్వం ఆలోచిస్తుందని అన్నారు.

ఈ నిర్ణయంతో యుద్ధం వల్ల ఉత్పత్తి, రవాణాలో ఏర్పడిన ఇబ్బందులనుదాటి పదుల కోట్ల బ్యారెళ్ల చమురు మార్కెట్‌లోకి విడుదల అయ్యే అవకాశం ఉంది.

ఇండియా తన చమురు అవసరాలలో 90% దిగుమతులపైనే ఆధారపడుతోంది. తక్కువ ధరకు చమురు దొరికినప్పుడు వెంటనే కొనుగోలు చేసే అలవాటున్న కారణంగా చిన్న అవకాశం అయినా భారత్‌కు ఉపశమనం కలిగిస్తుందని నిపుణులు అంటున్నారు.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
ఇరాన్, చమురు, మార్కెట్, అమెరికా, భారత్‌, ఇంధన ధరలు, రష్యా, చైనా, నిల్వలు, హార్ముజ్

ఫొటో సోర్స్, Bloomberg via Getty Images

ప్రస్తుతం సముద్రంలో ఉన్న ఇరానియన్ కార్గో ద్వారా దాదాపు 14 కోట్ల బ్యారెళ్ల చమురు కొనుగోలుదారులకు చేరేలా అనుమతించి సరఫరా లోటును తాత్కాలికంగా తగ్గించాలని, ధరలను నియంత్రించాలననుకుంటున్నట్టు అమెరికా అధికారులు తెలిపారు.

‘ఈ చర్య చైనాకు వెళ్లే చమురు సరఫరాను మళ్లించే అవకాశం ఉంది. కాబట్టి చైనా మార్కెట్‌పై ప్రత్యక్ష ప్రభావం పడుతుంది. కానీ భారత్, జపాన్, మలేషియా వంటి ఇతర ఆసియా వినియోగదారులకు ముడి చమురు అందుబాటులోకి వస్తుంది’ అని బెసెంట్ చెప్పారు.

దీని ద్వారా ఇరాన్ చమురును ఎవరికి ఇవ్వాలన్న నిర్ణయం మారుతుంది. చైనీస్ రిఫైనర్స్ ఎక్కువ పోటీకి సిద్ధం అయి, మార్కెట్ రేట్లకు దగ్గరగా చెల్లించాల్సి వస్తుంది. అదే సమయంలో భారత్ సహా ఆసియా వినియోగదారులకు సరఫరా అవకాశం పెరుగుతుంది.

ఈ మార్పులలో భారత్ ముఖ్య పాత్ర

భారత్ చమురు దిగుమతిలో 60% కంటే ఎక్కువ గల్ఫ్ దేశాల నుంచి వస్తుంది. ముఖ్యంగా ఇరాక్, సౌదీ అరేబియా, కువైట్, యూఏఈ నుంచే వస్తుంది. ఇందులో దాదాపు సగంవరకు హార్ముజ్ జలసంధి మీదుగానే వస్తుంది.

“చైనా ప్రభుత్వ కంపెనీలు, ప్రైవేట్ రిఫైనర్లు, ఇతర ఆసియా దేశాలతో పాటు, భారత్ కూడా ముఖ్యమైన డిమాండ్ కేంద్రంగా ఎదిగే అవకాశం ఉంది” అని మారిటైమ్ ఇంటెలిజెన్స్ కంపెనీ కేప్లర్‌లో రిఫైనరీ, చమురు మార్కెట్ల విశ్లేషకులు సుమిత్ రిటోలియా చెప్పారు.

గతంలో ఇరాన్ క్రూడ్ ఆయిల్‌ను ఎక్కువగా భారత్ కొనుగోలు చేసేది. భారత్ మొత్తం చమురు దిగుమతిలో సుమారు 11.5% ఇరాన్ నుంచే వచ్చేది.

లైట్, హెవీ గ్రేడ్ ఇరాన్ ముడి చమురు భారతీయ రిఫైనరీలకు అనుకూలంగా ఉండేది. ఈ గ్రేడ్‌లు భారత రిఫైనరీల ప్రాసెసింగ్ సామర్థ్యాలకు సరిపోయేవి. అలాగే అనుకూలమైన ధరలు, సౌకర్యవంతమైన చెల్లింపు నిబంధనలు కూడా ఉండేవి.

ఇరాన్, చమురు, మార్కెట్, అమెరికా, భారత్‌, ఇంధన ధరలు, రష్యా, చైనా, నిల్వలు, హార్ముజ్

ఫొటో సోర్స్, Anadolu via Getty Images

రష్యా చమురు రాయితీ ధరలతో అందుబాటులోకి వచ్చిన వెంటనే భారతీయ రిఫైనరీలు వేగంగా స్పందించాయి. పెద్దగా అంతరాయం లేకుండా దిగుమతులను పెంచుకున్నాయి.

ఇరాన్ చమురు మార్కెట్లో తిరిగి ప్రవేశిస్తే మళ్లీ ఇదే పరిస్థితి తలెత్తవచ్చని విశ్లేషకులు అంటున్నారు.

ప్రస్తుతం సముద్రంపై(ఆయిల్ ఆన్ వాటర్) సుమారు 17 కోట్ల బ్యారెళ్ల ఇరాన్ క్రూడ్ ఆయిల్ ఉంది, ఇందులో నిల్వలు, రవాణాలో ఉన్నవి కూడా ఉన్నాయని కెప్లర్ కంపెనీ అంచానా వేసింది.

“ఆయిల్ ఆన్ వాటర్” అనే పదం ముడి చమురును ఇప్పటికే నౌకల్లో లోడ్ చేసి, సముద్రంలో ప్రయాణిస్తున్న లేదా అక్కడే నిల్వ ఉంచిన స్థితిని సూచిస్తుంది.

ఇందులో రెండురకాలున్నాయి. కొనుగోలుదారుల వద్దకు చేరుతున్న చమురు, ఫ్లోటింగ్ స్టోరేజ్.

“ఫ్లోటింగ్ స్టోరేజ్ అంటే కొనుగోలుదారులకు రవాణా చేస్తున్నది కాకుండా సముద్రంలో నౌకల్లో, ఇతర విధానాల్లో నిల్వ ఉంచిన చమురు” అని కెప్లరు సీనియర్ మార్కెట్ విశ్లేషకులు యింగ్ కాంగ్ లో చెప్పారు.

“ఈ నౌకలు చమురు తీసుకెళ్తాయి, కానీ చాలా నెమ్మదిగా కదులుతాయి లేదా కొన్ని రోజుల పాటు ఒకే చోట ఉంటాయి. ట్రాకింగ్ ద్వారా అవి చమురు డెలివరీ చేయడంలేదని తెలుస్తుంది” అని ఆయన చెప్పారు.

‘ఇందులో కొంత భాగం చమురు ఇంకా విక్రయించలేదు, ఆంక్షలు సడలిస్తే సరఫరా చేస్తారు’ అని సుమిత్ రిటోలియా చెప్పారు.

అంటే, ఇరాన్ చమురు మళ్లీ మార్కెట్‌లోకి వస్తే దాన్ని తక్కువ ఆపరేషనల్ మార్పులతోనే తిరిగి ప్రాసెస్ చేయగల సామర్థ్యం భారతీయ రిఫైనరీలకు ఉంది.

నాల్గవ అతిపెద్ద రిఫైనర్‌గా ఉన్న భారత్ సరఫరా సమస్యలను ఎదుర్కొంది, కానీ చైనాతో పోల్చితే, ఇంకా రిఫైన్ చేసిన ఇంధనాలను ఎగుమతి చేస్తూనే ఉంది.

కానీ, ఈ నియంత్రణలు చాలా కఠినంగా ఉన్నాయి.

ఇరాన్ చమురు తిరిగి మార్కెట్‌లోకి రావడం అనేది రిఫైనింగ్ సామర్థ్యంపై కాకుండా వాణిజ్యం, భౌగోళిక రాజకీయాలపై ఎక్కువగా ఆధారపడి ఉంటుందని నిపుణులు అంటున్నారు.

ఇరాన్, చమురు, మార్కెట్, అమెరికా, భారత్‌, ఇంధన ధరలు, రష్యా, చైనా, నిల్వలు, హార్ముజ్

ఫొటో సోర్స్, LightRocket via Getty Images

ఆంక్షలు కేవలం అమ్మకాలను మాత్రమే పరిమితం చేయవు. షిప్పింగ్, ఇన్సూరెన్స్, చెల్లింపులను కూడా క్లిష్టతరం చేస్తాయి.

‘ఆంక్షలను ఎంతవరకు సడలిస్తారు, ఎంతకాలం ఉపశమనం ఉంటుంది, చమురు ధరలు, చెల్లింపు, ఇన్సూరెన్స్, షిప్పింగ్ సౌకర్యాలు లభ్యమా అనేవి కీలకాంశాలు’ అని సుమిత్ అన్నారు.

చెల్లింపు, ఇన్సూరెన్స్, షిప్పింగ్ నియమాలు స్పష్టంగా లేకపోతే లేదా సడలించకపోతే, లావాదేవీలు చేయడం కష్టమవుతుంది.

ఆంక్షల సడలింపు ఎంతవరకు ఉంటుంది, రాబడి తిరిగి తెహ్రాన్‌కి వెళ్ళకుండా అరికట్టే రక్షణలు ఉంటాయా అనే విషయాలు అమెరికా ట్రెజరీ ఇంకా స్పష్టంగా వివరించలేదని బెసెంట్ తెలిపారు.

ట్రంప్ ఈ ఆలోచనను అంగీకరిస్తారా అనే విషయంలో స్పష్టతివ్వలేదు బెసెంట్. చమురు ధరలు స్థిరంగా ఉండేందుకు అవసరమైంది చేస్తానని మాత్రమే ట్రంప్ అన్నారని ఆయన చెప్పారు.

బెసెంట్ ప్రతిపాదన వాషింగ్టన్‌లో ముందుకు సాగుతుందో లేదో స్పష్టంగా తెలీదు. ఎందుకంటే అమెరికా ప్రతినిధుల సభ తాజాగా ఇరాన్ చమురు రంగంపై ఆంక్షలను మరింత కఠినతరం చేసే బిల్లును ఆమోదించింది.

చమురు సరఫరాను పెంచడానికి నిల్వల నుంచి చమురు విడుదల చేయడం, రష్యన్ చమురు మీద కొన్ని ఆంక్షలను సడలించడం వంటి ఇతర చర్యల తరువాత అమెరికా ఈ ప్రతిపాదన తెచ్చింది.

( బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)