SOURCE :- BBC NEWS

ముంతాజ్ కోసం తాజ్ మహల్ కట్టారని షాజహాన్ ప్రేమ కథలో చెబుతుంటారు. అయితే తెలుగునేలపై జరిగిన ఈ బ్రిటిషర్ల ప్రేమ కథలో ప్రియుడు తన ప్రేయసి కోసం చర్చిని నిర్మించాడు. ఈ ప్రేమ కథ వయసు 200 ఏళ్లు.
ఈ కథలో ప్రేమికుడి పేరు జాన్ పాటర్.. ప్రేయసి పేరు అరబెల్లా రాబిన్సన్.
కట్టుబాట్లను కాదని గడపదాటిన అరబెల్లా జాన్‌పాటర్‌ను పెళ్లి చేసుకోకుండానే కన్నుమూశారు.
‘సౌతిండియా తాజ్ మహల్’గా పిలుచుకుంటున్న మచిలీపట్నంలోని సెయింట్ మేరీస్ చర్చి వెనుక దాగి ఉన్న కథ ఇది.


‘అది చర్చి కాదు, ప్రేమకు సజీవ సాక్ష్యం’
మచిలీపట్నంలోని ఆనందపేట ప్రధాన రహదారి పక్కన ఉంటుంది సెయింట్ మేరీస్ చర్చి. చుట్టూ సమాధులతో, శ్వేతవర్ణంలో శిథిలావస్థకు చేరి కనిపిస్తుంటుంది.
నేను అక్కడికి వెళ్లినప్పుడు చర్చి అంతా ఖాళీగా ఉంది.
చర్చి శిథిలావస్థకు చేరడంతో అందులోని బెంచ్(ప్యూ)ను మరో చోటుకు తరలించారని స్థానికులు చెప్పారు.
చర్చి లోపలకు అడుగుపెట్టగానే… ఒకవైపు అరబెల్లా రాబిన్సన్ సమాధి కనిపించింది.
అది సమాధి మాత్రమే కాదు… అరబెల్లా తనతో లేకపోయినా.. ఆమెను చూసుకోవడానికి ఆమె ప్రియుడు జాన్ పాటర్ కట్టుకున్న ‘ప్రేమ పేటిక’.
”అది చర్చి మాత్రమే కాదు, ఒక అద్భుతమైన ప్రేమకథకు సజీవసాక్ష్యం” అంటారు మచిలీపట్నంలోని నోబుల్ కాలేజీ మాజీ ప్రిన్సిపల్ ఎస్.జాన్ ఎర్నెస్ట్.

జాన్ పాటర్, అరబెల్లా ఆప్తమిత్రులా? ప్రేమికులా?
అరబెల్లా సమాధిని ఆనుకుని ఉన్న గోడ పైభాగంలో లాకింగ్ వ్యవస్థ కనిపిస్తుంటుంది. దానిపై ఇలా రాసి ఉంది.
”ఈ పవిత్రమైన కట్టడం కంపెనీ (ఈస్టిండియా కంపెనీ) కెప్టెన్ విలియం రాబిన్సన్ కుమార్తె అరబెల్లా రాబిన్సన్‌ది. ఆమె 1809 నవంబర్ 6న చనిపోయారు. ఆమెకు ఎప్పటికీ కృతజ్ఞతతో ఉండే ఆప్తమిత్రుడు మేజర్ జనరల్ జాన్ పాటర్ ఈ సమాధిని ఏర్పాటు చేశారు.”
జాన్ పాటర్, అరబెల్లా కేవలం ఆప్తమిత్రులు మాత్రమే కాదు, వారిద్ధరూ గాఢమైన ప్రేమికులు అని చరిత్ర పరిశోధకులు చెబుతున్నారు.
“18వ శతాబ్దం చివర్లో ఒక మిలటరీ ఫంక్షన్‌లో రాబిన్సన్, ఆయన భార్య హరియత్, కుమార్తె అరబెల్లా, జాన్ పాటర్ మొదటిసారి కలుసుకున్నారు. తొలిచూపులోనే వారిద్దరిలో ప్రేమ చిగురించింది. ఇద్దరూ ఒకరినొకరు గాఢంగా ప్రేమించుకున్నారు” అని చరిత్ర పరిశోధకుడు మహమ్మద్ సిలార్ ‘మచిలీపట్నం సర్వస్వం’ పుస్తకంలో రాశారు.
ఈ విషయంపై జాన్ ఎర్నెస్ట్ బీబీసీతో మాట్లాడారు.
“కెప్టెన్ విలియం రాబిన్సన్ అనే ఆర్మీ ఆఫీసర్ మచిలీపట్నం కోటలో పనిచేశారు. అప్పట్లో ఇక్కడ బ్రిటిష్ సైనికాధికారులు ఉండేవారు. అరబెల్లాను చూడగానే జాన్ పాటర్ ప్రేమలో పడిపోతే, ఆయన ప్రేమను ఆమె కూడా అంగీకరించినట్టు చరిత్ర చెబుతోంది” అన్నారు.
ఈస్టిండియా కంపెనీ తరఫున జాన్ పాటర్ కెప్టెన్ హోదా నుంచి మేజర్ జనరల్ స్థాయికి ఎదిగారు. ఆ సమయంలో మచిలీపట్నం కోటలో పనిచేశారు.

పెళ్లికి అంగీకరించని పెద్దలు
అరబెల్లా, జాన్ పాటర్ వివాహానికి అరబెల్లా తండ్రి రాబిన్సన్, క్రైస్తవ మతాధికారులు అంగీకరించలేదు.
వారి వివాహానికి రాబిన్సన్ అంగీకరించకపోవడానికి మూడు కారణాలున్నట్లు తెలుస్తోందని నోబుల్ కళాశాల హిస్టరీ రిటైర్డ్ లెక్చరర్ ఎం.జాషువా బీబీసీతో చెప్పారు.
“అప్పట్లో మతాచారాలు చాలా కచ్చితంగా అనుసరించేవారు. ఇద్దరూ క్రిస్టియన్సే అయినా, అరబెల్లా క్యాథలిక్, జాన్ పాటర్ ప్రొటెస్టెంట్. అందుకే వారి పెళ్లికి రాబిన్సన్ అంగీకరించలేదని చెబుతారు’’ అన్నారు జాషువా.
‘‘రాబిన్సన్‌కు రావాల్సిన ప్రమోషన్ విషయంలో జాన్ పాటర్ అడ్డుపడ్డారని, ఆ కోపంతో పెళ్లికి అంగీకరించలేదనే మరో కథనం కూడా ప్రచారంలో ఉంది” అన్నారు.
ఈ రెండు కారణాలతోపాటు మరో కారణం ఉందని నోబుల్ కళాశాల మాజీ ప్రిన్సిపల్ జాన్ ఎర్నెస్ట్ బీబీసీతో చెప్పారు.
“అప్పటికే జాన్ పాటర్‌కు వివాహమై భార్య ఇంగ్లండ్‌లో ఉండేదని, అందుకే రాబిన్సన్ ఒప్పుకోలేదని చెప్పేవారు” అని తెలిపారు.
ఈ విషయాలను ‘మచిలీపట్నం సర్వస్వం’ పుస్తకంలోనూ ప్రస్తావించారు.
‘ఫైండ్ గ్రేవ్’ వెబ్ సైట్ , దేశంలో విదేశీయుల సమాధుల వివరాలను వెల్లడిస్తూ జాన్ పాటర్‌కు అప్పటికే పెళ్లైందని, మతాచారాలు వేరు కావడం పెళ్లికి అంగీకరించకపోవడానికి కారణాలుగా ప్రస్తావించింది.

‘గ్రేట్ స్కాండల్ ఆఫ్ మసులీపటం’ అని ఎందుకన్నారు?
పెళ్లికి పెద్దలు అంగీకరించకపోవడంతో అరబెల్లా ఇంటి నుంచి వెళ్లిపోయి జాన్ పాటర్‌తో కలిసి జీవించడం మొదలుపెట్టినట్లు చరిత్రకారులు చెబుతున్నారు.
అందరినీ ఒప్పించి పెళ్లి చేసుకోవాలనే ఉద్దేశంతో, అందుకు అవసరమైన రింగ్, గౌను, కిరీటం వంటివి సిద్ధం చేసుకున్నారు.
”ఆ కాలంలో ఒక అమ్మాయి ఇంటి నుంచి వెళ్లిపోవడం మచిలీపట్నంలో పెద్ద సంచలన మైంది. ‘బ్రిటిష్ అధికారి కుమార్తె ప్రేమించిన వ్యక్తి వద్దకు వెళ్లిపోయిందట’ అంటూ ప్రచారం జరిగింది. అప్పట్లో దాన్ని ‘గ్రేట్ స్కాండల్ ఆఫ్ మసులీపటం’ అనేవారు” అని జాన్ ఎర్నెస్ట్ చెప్పారు.
వీరికి 1790లో సఫిరా అనే పాప పుట్టినట్లు ‘ఫైండ్ గ్రేవ్’ వెబ్ సైట్‌లో ప్రస్తావన ఉంది. కానీ, ఈ విషయాన్ని తెలుగు చరిత్రకారులు తమ పుస్తకాల్లో ప్రస్తావించలేదు.

40 ఏళ్ల వయసులో అరబెల్లా మరణం
జాన్ పాటర్, అరబెల్లా కలుసుకునే సమయానికి వారి వయసు ఎంతో ఇప్పటివరకు లభించిన ఆధారాల్లో ఎక్కడా స్పష్టత లేదు. యుక్త వయసులో ఉండొచ్చని చరిత్రకారులు చెబుతున్నారు.
పెళ్లి కాలేదనే మానసిక వ్యథకు తోడు మలేరియా కూడా సోకడంతో 40 ఏళ్ల వయసులో 1809 నవంబర్ 6న అరబెల్లా చనిపోయినట్లు చరిత్రకారులు చెబుతుంటారు.
జులియన్ జేమ్స్ కాటన్ రాసిన ‘లిస్ట్ ఆఫ్ ఇన్‌స్క్రిప్షన్స్ ఆన్ టూంబ్స్ ఆర్ మాన్యుమెంట్స్ ఇన్ మద్రాస్ – వాల్యూం 2” పుస్తకంలో ఆమె మరణించిన తేదీని ధ్రువీకరించేలా రాసి ఉంది. అలాగే, అరబెల్లా సమాధిపైనా ఈ సమాచారం ఉంటుంది.
”సంప్రదాయ చిక్కులను ఎదిరించి వివాహ బంధంతో పాటర్ భార్యగా అందరి ముందు నిలవాలనేది అరబెల్లా ప్రగాఢ కోరిక. సర్వజనాంగీకారంతో తన కుటుంబ జీవితం సాగాలని కలలు కనేది” అని ‘మచిలీపట్టణ చరిత్ర’ పుస్తకంలో రాశారు రచయిత డీవీ రాఘవరావు.
చివరికి, ఆ కల తీరకుండానే అరబెల్లా కన్నుమూశారు.

అరబెల్లా మృతదేహాన్ని గాజుపెట్టెలో భద్రపరిచి..
అరబెల్లా చనిపోయిన తర్వాత ఆమెను ఖననం చేసేందుకు అటు రోమన్ క్యాథలిక్ చర్చి గానీ, ఇటు ఆంగ్లికన్ చర్చి గానీ అనుమతించలేదు.
దీంతో జాన్ పాటర్ మచిలీపట్నం శివారులో ఆరున్నర ఎకరాల పొలం కొనుగోలు చేసి అందులోనే అరబెల్లా కోసం సమాధి కట్టారు. అరబెల్లా శవపేటిక భూమిలోపలి నుంచి పైకి వచ్చేలా ఈ సమాధికి ప్రత్యేక లాకింగ్ వ్యవస్థ ఏర్పాటు చేశారు.
‘తాజ్ మహల్ తరహాలో తన ప్రేమికురాలికి గుర్తుగా చర్చిని నిర్మించాడు. అప్పట్లోనే రూ.18 వేలు ఖర్చు పెట్టి చర్చి నిర్మాణం చేశాడు” అని ‘మచిలీపట్టణ చరిత్ర’ పుస్తకంలో రాసి ఉంది.
పెళ్లి కోసం అరబెల్లా తెప్పించుకున్న గౌను, రింగ్, కిరీటాలను ఆమె మృతదేహానికి అలంకరించి శవపేటికలో ఉంచినట్లు చరిత్ర పరిశోధకుడు మహమ్మద్ సిలార్ బీబీసీతో చెప్పారు.
”అరబెల్లా శరీరాన్ని గాజుపెట్టెలో భద్రపరిచి, అది పాడవ్వకుండా ఈజిప్టు మమ్మీల తరహాలో జాన్‌పాటర్ సుగంధ ద్రవ్యాలు, ఇతర పదార్థాలు వినియోగించి ఖననం చేశాడు” అని చెప్పారాయన.
జాన్ పాటర్ ఇలా చేయడానికి బలమైన కారణం ఉందంటారు సిలార్.
తను కావాల్సినప్పుడల్లా సమాధి వద్దకు వచ్చి ఆమె శవపేటిక బయటకు తీసి ఆమె మృతదేహం ముందు కూర్చుని మాట్లాడటం, తన బాధలు పంచుకునేవాడని వివరించారు.
”శవపేటిక బయటకు తీసేందుకు ఆ కాలంలో ప్రత్యేక లాకింగ్ వ్యవస్థ వినియోగించారు. సమాధిని ఆనుకుని ఉన్న గోడకు ఒక మీట పెట్టారు. ఆ లాక్ తీసి స్పిండిల్ తిప్పితే శవపేటిక (గాజు పెట్టె) బయటకు వచ్చేది. అప్పుడు జాన్‌పాటర్ అరబెల్లా మృతదేహం ముందు కూర్చుని మాట్లాడేవాడు” అని మహమ్మద్ సిలార్ బీబీసీతో చెప్పారు.
ఈ విషయంపై మచిలీపట్నం చరిత్ర పుస్తకంలోనూ ఇలా ఉంది.
”ఒక సుందరమైన గాజుపెట్టెలో అరబెల్లా శరీరాన్ని భద్రపరిచి, భూమిలో ఒక అరను ఏర్పాటు చేసి అందులో ఉంచారు. తాను (జాన్ పాటర్) చూడాలనుకున్నప్పుడు గోడకు గల కొయ్య చిలుకను తిప్పితే ఆ పెట్టె పైకి వచ్చేలా సాంకేతిక పరిజ్జానం ఏర్పాటు చేశారు” అని రాశారు.

మద్రాసుకు బదిలీ.. అక్కడే పాటర్ మరణం
కొన్నాళ్ల తర్వాత జాన్ పాటర్‌కు మద్రాసుకు బదిలీ అయ్యింది.
”మద్రాసు వెళ్లిపోయేప్పుడు అరబెల్లా చర్చి నిర్వహణ బాధ్యతలు ఆంగ్లికన్ చర్చి (కమ్యూనిటీ)కి కాకుండా ఈస్ట్ ఇండియా కంపెనీకిఅప్పగించాడు” అని జాన్ ఎర్నెస్ట్ చెప్పారు.
1816లో అరబెల్లా చర్చిని ఈస్టిండియా కంపెనీకి అప్పగించగా, 1842లో ఆంగ్లికన్ కమ్యూనిటీ నిర్వహణలోకి రావడంతో దాని పేరు సెయింట్ మేరీస్ చర్చిగా మార్చారని చరిత్రకారులు చెబుతున్నారు.
”మద్రాసుకు బదిలీ అయ్యి వెళ్లాక 1817లో జాన్ పాటర్ అక్కడే చనిపోయారు” అని మహమ్మద్ సిలార్ చెప్పారు.
జేజే కాటన్ రాసిన ‘లిస్ట్ ఆఫ్ ఇన్‌స్క్రిప్షన్స్ ఆన్ టూంబ్స్ ఆర్ మాన్యుమెంట్స్ ఇన్ మద్రాస్, పొసెసింగ్ హిస్టారికల్ ఆర్ ఆర్కియలాజికల్ ఇంటరెస్ట్ వాల్యూం – 1’ పుస్తకంలో ఈ ప్రస్తావన ఉంది.
అలాగే, ఇప్పటికీ చెన్నైలోని ఒక వీధికి ‘జాన్ పాటర్’ పేరు కనిపిస్తుంటుంది.

అరబెల్లా సమాధి శాశ్వతంగా మూసివేత
పుల్లింగ్ వ్యవస్థ ద్వారా అరబెల్లా శవపేటిక బయటకు వచ్చేది. కానీ, తర్వాత కాలంలో శవాన్ని ఉంచిన గాజుపెట్టె బయటకు రాకుండా పూర్తిగా మూసివేసినట్లుగా మహమ్మద్ సిలార్ చెప్పారు.
“బ్రిటిషర్ల సమయంలోనే ఓసారి క్రిస్మస్ పండుగ సందర్భంగా చర్చికి రంగులు వేస్తుండగా ఒక కార్మికుడు అనుకోకుండా సమాధి మీట తిప్పాడు. ఒక్కసారిగా అరబెల్లా శవపేటిక బయటకు రావడంతో అతను భయంతో గుండె ఆగి చనిపోయాడు” అని వివరించారు.
దీంతో అప్పటి కలెక్టర్ గోల్డెన్ హ్యామ్ ఆ సమాధిపై అరబెల్లా వివరాలు రాయించి పాలరాతితో శాశ్వతంగా మూసివేయించారని చెప్పారు.
ఆ తర్వాత ఇప్పటివరకు అరబెల్లా సమాధిని ఎప్పుడూ తెరవలేదని నోబుల్ కళాశాల మాజీ ప్రిన్సిపల్ జాన్ ఎర్నెస్ట్ చెప్పారు.
ఇప్పటికీ మచిలీపట్నంలో సెయింట్ మేరీస్ చర్చిలో పాలరాతితో మూసివేసిన అరబెల్లా సమాధి కనిపిస్తుంది.
పెళ్లి వరకూ వెళ్లని జాన్ పాటర్, అరబెల్లా ప్రేమకథ అలా ముగిసిపోయింది..!!
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)



