Home జాతీయ national telgu భారత్-పాకిస్తాన్ మధ్య కాల్పుల విరమణ ఎలా సాధ్యమైంది? ఎన్నాళ్లుంటుంది..

భారత్-పాకిస్తాన్ మధ్య కాల్పుల విరమణ ఎలా సాధ్యమైంది? ఎన్నాళ్లుంటుంది..

7
0

SOURCE :- BBC NEWS

మోదీ, షరీఫ్

ఫొటో సోర్స్, ANI/Getty Images

భారత్ – పాకిస్తాన్ కాల్పుల విరమణతో రెండు దేశాల మధ్య ఏర్పడిన ఉద్రిక్తతకు విరామం ఏర్పడింది. కాల్పుల విరమణపై అంగీకారం కుదిరినట్లు భారత్-పాక్‌లు స్పష్టంగా చెప్పాయి.

అమెరికా అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్ శనివారం సాయంత్రం ట్రూత్ సోషల్, ఎక్స్‌లో చేసిన పోస్టుల తర్వాత, వరుస పరిణామాలు జరిగాయి.

భారత్, పాకిస్తాన్‌లు పూర్తిస్థాయి, తక్షణ కాల్పుల విరమణకు అంగీకరించాయని ట్రంప్ ప్రకటించారు.

ఈ మేరకు ఆయన సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ‘ఎక్స్’లో తెలిపారు.

“అమెరికా మధ్యవర్తిత్వంలో, రాత్రంతా సుదీర్ఝ చర్చల తర్వాత భారత్, పాకిస్తాన్ పూర్తిస్థాయి, తక్షణ కాల్పుల విరమణకు అంగీకరించాయని ప్రకటించడానికి సంతోషిస్తున్నా. కామన్‌సెన్స్, గ్రేట్ ఇంటెలిజెన్స్‌ను ఉపయోగించినందుకు రెండు దేశాలకు అభినందనలు. ఈ విషయంపై దృష్టి పెట్టినందుకు ధన్యవాదాలు!” అని తెలిపారు.

”ఉగ్రవాదానికి వ్యతిరేకంగా భారత్ అన్నిరకాలుగా స్థిరంగా దృఢమైన, రాజీలేని వైఖరిని అవలంబించింది. ఇదే వైఖరి కొనసాగుతుంది” అని భారత విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ అన్నారు.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

కాల్పుల విరమణకు తమ దేశం సిద్ధంగా ఉందని పాకిస్తాన్ విదేశాంగ మంత్రి ఇషాక్ దార్ చెప్పారు.

‘‘కనీసం మూడు డజన్ల దేశాలు దౌత్యపరమైన ప్రయత్నాలు చేశాయి. వీటిలో తుర్కియే, సౌదీ అరేబియా, అమెరికా విదేశాంగ కార్యదర్శి మార్కో రుబియోలాంటి వారున్నారు. బ్రిటన్ విదేశాంగ మంత్రి కూడా ఇందులో కీలక పాత్ర పోషించారు’’ అని ఇషాక్ దార్ అన్నారు.

అంతకు కొన్నిగంటల ముందు వరకు రెండు దేశాలు ఒకదానిపై ఒకటి దాడి చేసుకున్నాయి.

శుక్రవారం రాత్రి ఒకదానికొకటి లక్ష్యంగా చేసుకుని జరుపుకున్న దాడుల్లో, ప్రత్యర్ధి వైమానిక స్థావరాలను దెబ్బతీశామని భారత్, పాకిస్తాన్‌లు ప్రకటించాయి.

నియంత్రణ రేఖ (ఎల్ఓసీ) గుండా భారత్-పాకిస్తాన్ మధ్య భారీ షెల్లింగ్ జరిగింది. భారత్ తమ మూడు సైనిక విమానాశ్రయాలను ధ్వంసం చేసిందని శనివారం ఉదయం పాకిస్తాన్ చెప్పింది.

పాకిస్తాన్ వైమానిక స్థావరాలపై కచ్చితమైన దాడులు చేసినట్లు భారత్ ధ్రువీకరించింది.

కాల్పులు

ఫొటో సోర్స్, Getty Images

ఉదయం కాల్పులు, సాయంత్రం విరమణ

జమ్మూకశ్మీర్ సహా భారత్‌లోని పలు నగరాల్లో శనివారం ఉదయం పేలుళ్ల శబ్దాలు వినిపించాయి. భారత్‌పై చేపట్టిన ఆపరేషన్‌ను ‘బన్యన్ అల్ మార్సస్‌’గా పాకిస్తాన్ చెప్పింది.

”భారత్, పాకిస్తాన్‌లు యుద్ధానికి చాలా దగ్గరగా వచ్చాయి” అని అంతర్జాతీయ వ్యవహారాల నిపుణులు, దక్షిణాసియా నిపుణులు మైఖేల్ కుగెల్మాన్ చెప్పారు.

శనివారం సాయంత్రానికి రెండు దేశాలు తమ అన్ని సైనిక చర్యలను ఆపివేస్తున్నట్లు ప్రకటించాయి.

ఇంత వేగంగా మారిన పరిణామాలతో ప్రజలు ఆశ్చర్యపోయారు. అయితే, రెండు దేశాల మధ్యలో కాల్పుల విరమణపై అంతకు ముందు నుంచే సంకేతాలు కనిపించాయని అనలిస్ట్‌లు చెప్పారు.

‘‘ఆర్మీ చీఫ్‌లతో ప్రధాని నరేంద్ర మోదీ సమావేశమైన తర్వాత, భవిష్యత్‌లో ఏ ఉగ్రదాడినైనా యుద్ధంగానే భారత్ పరిగణిస్తుందని ప్రకటన చేయడంతో, ఈ విషయంలో భారత్ ఇంకేమీ కోరుకోవడం లేదని స్పష్టమైంది” అని రక్షణ రంగ నిపుణులు ప్రవీణ్ సాహ్ని చెప్పారు.

”పరమాణు శక్తులుగా అవతరించిన ఏడాది తర్వాత జరిగిన 1999 నాటి కార్గిల్ యుద్ధం తర్వాత తొలిసారి మళ్లీ ఇలాంటి పరిస్థితి నెలకొంది. అణు నిరోధానికి ఇది పెద్ద పరీక్ష లాంటిది. అంతర్జాతీయ మధ్యవర్తులు ఇప్పుడు యాక్టివ్ అవుతారు” అని మైఖేల్ కుగెల్‌మాన్ అన్నారు.

”క్షిపణితో దాడులు చేసుకునే దశకు రెండు దేశాలు వెళ్లాయి. ఈ ఘర్షణలు కనుక మరింత పెరిగి ఉంటే, పూర్తిగా యుద్ధ వాతావరణం ఉండేది. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. యుద్ధం చేయడం శ్రేయస్కరంకాదని రెండు దేశాలు అర్థం చేసుకున్నాయి” అని మనోహర్ పారికర్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ డిఫెన్స్ స్టడీస్‌లో రీసర్చ్ ఫెలో, రక్షణ నిపుణులు స్మృతి ఎస్ పట్నాయక్ చెప్పారు.

పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ జనరల్ ఆసిమ్ మునీర్‌తో ఫోన్‌లో మాట్లాడిన యూఎస్ సెక్రటరీ ఆఫ్ స్టేట్ మార్కో రూబియో

ఫొటో సోర్స్, ANI

శనివారం పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ జనరల్ ఆసిమ్ మునీర్‌తో ఫోన్‌లో మాట్లాడిన తర్వాత యూఎస్ సెక్రటరీ ఆఫ్ స్టేట్ మార్కో రూబియో భారత విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్‌తో మాట్లాడారు.

సాయంత్రం ఐదున్నర గంటల మధ్యలో రెండు దేశాలు కాల్పుల విరమణ చేసుకున్నట్లు అధికారికంగా ప్రకటించాయి. అయితే, ఈ కాల్పుల విరమణ స్థిరంగా కొనసాగుతుందా? అనేది ప్రశ్నార్థకం.

‘‘రెండు దేశాలు ఈ ఘర్షణలను కొనసాగించాలని కోరుకోవడం లేదు. ఈ కాల్పుల విరమణకు మధ్యవర్తిత్వం వహించిన అమెరికా, అన్ని విధాలా పాకిస్తాన్‌కు సాయపడుతుంది. భారత ప్రయోజనాలు కూడా అమెరికాతో ముడిపడి ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో కాల్పుల విరమణ చెక్కుచెదరకుండా కొనసాగాలి” అని రక్షణ నిపుణులు, భారత ఆర్మీ మాజీ బ్రిగేడియర్ జీవన్ రాజ్‌‌పురోహిత్ అన్నారు.

కాల్పుల్లో దెబ్బతిన్న ఇల్లు

ఫొటో సోర్స్, Getty Images

సీజ్ ఫైర్ కొనసాగుతుందా?

భారత్, పాక్‌ల డీజీఎంఓలు మధ్యాహ్నం 3:30 గంటలకు చర్చలు జరిపారు. ఆ తర్వాత రెండు గంటల్లోనే కాల్పుల విరమణ అమల్లోకి వచ్చింది.

అయితే, రెండు దేశాల మధ్య కుదిరిన ఒప్పందంలో నిబంధనలేంటో బయటకు తెలియలేదు.

ఈ కాల్పుల విరమణ కొనసాగింపు అన్నది ఇది ఇరువర్గాలు అంగీకరించిన నిబంధనలపై ఆధారపడి ఉంటుందని స్మృతి పట్నాయక్ చెప్పారు.

‘‘పాకిస్తాన్ దీని నుంచి వెనక్కి తగ్గితే, భారతదేశం కూడా అలా చేయడంలో ఎటువంటి సమస్యా ఉండదు. ఈ కాల్పుల విరమణ నిబంధనల గురించి ఇంకా పెద్దగా సమాచారం లేదు. కానీ ఇది రెండు దేశాలు ఎలా ముందుకు సాగాలో ఆలోచించడానికి అవకాశం ఇస్తుంది” అని పట్నాయక్ అన్నారు.

“మే 12న తదుపరి చర్చలతో మరింత స్పష్టత వస్తుంది. ఉగ్రవాదంపై భారతదేశం తన వైఖరిలో రాజీపడదు. రెండు దేశాలు దూకుడుగా వ్యవహరిస్తున్నాయి. అంతర్జాతీయ సమాజంలో ఆందోళన ఉంది. ఇలాగే దూకుడుగా ముందుకు సాగడం ఇద్దరికీ ఇష్టమైన విషయంకాదని రెండు దేశాలకూ తెలుసు. పాకిస్తాన్ ఉద్రిక్తతను తగ్గిస్తే, తాను కూడా తగ్గడానికి సిద్ధమని భారత్ ఇప్పటికే స్పష్టంచేసింది’’ అని పట్నాయక్ అన్నారు.

కల్నల్ సోఫియా ఖురేషి

ఫొటో సోర్స్, Getty Images

‘ఉద్రిక్తతలను పెంచాలని భారత్ కోరుకోదు’

ఉద్రిక్తతలను మరింత పెంచాలని భారతదేశం కోరుకోవడం లేదని, కానీ పాకిస్తాన్ ముందుకు చొచ్చుకు వస్తోందని శనివారం ఉదయం జరిగిన విలేఖరుల సమావేశంలో కల్నల్ సోఫియా ఖురేషి అన్నారు.

పాకిస్తాన్ సైన్యం దళాల మోహరింపు పెరుగుతున్నట్లు కనిపిస్తోందనీ, ఇది పరిస్థితిని మరింత ఉద్రిక్తంగా మార్చాలనే ఉద్దేశంతో చేపట్టిన చర్య అని ఖురేషి అన్నారు.

“భారత సాయుధ దళాలు పూర్తి సంసిద్ధతతో, అప్రమత్తతతో ఉన్నాయి. ఉద్రిక్తతలు పెరగకూడదని భారత సాయుధ దళాలు కోరుకుంటున్నాయి. అయితే, పాకిస్తాన్ దళాలు అందుకు అనుగుణంగా వ్యవహరించాల్సి ఉంటుంది” అని ఖురేషి స్పష్టం చేశారు.

పరిస్థితిని మరింత ఉద్రిక్తంగా మార్చాలన్న ఉద్దేశం భారత్‌కు లేదన్న ఉద్దేశాన్ని ఇది సూచిస్తోందని విశ్లేషకులు చెబుతున్నారు.

”పరిస్థితిని మరింత తీవ్రతరం చేయకూడదన్నది తమ ఉద్దేశ్యమని భారత విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ ఇప్పటికే చెప్పారు” అని మిలిటరి అనలిస్ట్, ఇండియన్ ఆర్మీలో పని చేసి రిటైరైన బ్రిగేడియర్ జీవన్ రాజ్ పురోహిత్ వెల్లడించారు.

“భారతదేశం వైఖరి చాలా స్పష్టంగా ఉంది – మేం ప్రతీకారం తీర్చుకుంటామని చెప్పింది, చేసింది. పాకిస్తాన్ సైన్యం కూడా ప్రతీకారం తీర్చుకోవాలని నిర్ణయించుకోవడంతో పరిస్థితి మరింత దిగజారడం మొదలైంది. మే 7న పాకిస్తాన్ స్పందించకపోతే, పరిస్థితి ఈ స్థాయికి చేరుకునేది కాదు” అన్నారు పురోహిత్.

పాకిస్తాన్ ఆర్మీ

ఫొటో సోర్స్, Getty Images

‘కాల్పుల విరమణను గౌరవించాలి’

ఇంత పెద్ద సమస్య నుంచి ఎలా బయటపడాలన్నదే రెండు దేశాల మధ్య ఉన్న సమస్య అని విశ్లేషకులు అభిప్రాయపడ్డారు.

”భారత్, పాకిస్తాన్‌లు రెండూ పోరాడటానికి ఇష్టపడటం లేదని సంకేతాలు పంపాయి. రెండు దేశాలు పూర్తి యుద్ధాన్ని కోరుకోలేదు. ఈ పరిస్థితి నుండి గౌరవప్రదంగా బయటపడాలని రెండూ కోరుకున్నాయి” అని ప్రవీణ్ సాహ్ని అన్నారు.

”పాక్ సైన్యానికి దేశ రాజకీయాల్లో చాలా పట్టుంది. పాకిస్తాన్ బడ్జెట్‌లో ఎక్కువ భాగం సైన్యం కోసం ఖర్చవుతుంది. అటువంటి పరిస్థితిలో, సైన్యం స్పందించాలన్న భావన పాకిస్తాన్‌ ప్రజలలో ఉంది. అందుకే, తాము స్పందించామని దేశ ప్రజలకు చూపించేలా సైన్యంపై ఒత్తిడి వచ్చి ఉంటుంది” అని స్మృతి పట్నాయక్ అభిప్రాయపడ్డారు.

ప్రస్తుత పరిస్థితిలో, రెండు దేశాలు గౌరవప్రదమైన రీతిలో కాల్పుల విరమణకు వచ్చినట్లు తమ ప్రజలకు చెప్పుకోగలిగాయని ప్రవీణ్ సాహ్ని అంటున్నారు.

“ఈ యుద్ధ పరిస్థితి నుండి గౌరవంగా బయటపడే విషయానికి వస్తే, భారత్, పాకిస్తాన్‌లు రెండూ తమ లక్ష్యాలను సాధించామని భావిస్తున్నాయి. భారతదేశం పాకిస్తాన్ లోపలికి వెళ్లి దాడులు చేసింది. తాము భారత యుద్ధ విమానాలను కూల్చేశామని పాకిస్తాన్ ప్రకటించుకుంది. అందువల్ల తాము ఈ ఉద్రిక్తతల నుంచి ఏమేం చేయగలిగామో రెండు దేశాలు తమ ప్రజలకు చెప్పుకోగలవు” అని ప్రవీణ్ సాహ్ని అన్నారు.

పాకిస్తాన్ ప్రధాన మంత్రి షాబాజ్ షరీఫ్

ఫొటో సోర్స్, Getty Images

‘ప్రతీకారం తీర్చుకున్నాం’

పాకిస్తాన్ ప్రధాన మంత్రి షాబాజ్ షరీఫ్ శనివారం ఉదయం ఒక ప్రకటన చేస్తూ, ‘భారతదేశానికి తగిన సమాధానం ఇచ్చాం’ అని అన్నారు.

“మా రిటాలియేషన్ ఆపరేషన్ బన్యన్ అల్ మార్సస్‌లో, పాకిస్తాన్‌పై దాడులు ప్రారంభమైన ప్రదేశం నుండే భారత సైనిక స్థావరాలను ప్రత్యేకంగా లక్ష్యంగా చేసుకున్నారు. ఈ రోజు మనం భారతదేశానికి తగిన సమాధానం ఇచ్చాము. అమాయక ప్రజల మరణానికి ప్రతీకారం తీర్చుకున్నాము” అని అన్నారు.

భవిష్యత్తు ఎలా ఉంటుంది?

పాకిస్తాన్ తన వైఖరిని మార్చుకుంటుందా అనేది కీలకమైన విషయమని బ్రిగేడియర్ జీవన్ రాజ్‌పురోహిత్ అభిప్రాయపడ్డారు.

”పాకిస్తాన్ తన వైఖరిని మార్చుకుంటే, రెండు దేశాల మధ్య అర్థవంతమైన సంభాషణ జరగవచ్చు. ఉగ్రవాదం, చర్చలు కలిసి సాగలేవన్న స్పష్టమైన వైఖరితో భారతదేశం ఉంది” అని రాజ్‌పురోహిత్ అన్నారు.

“ఇప్పుడు పాకిస్తాన్ ఉగ్రవాదం గురించి, పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్ గురించి మాట్లాడటానికి సిద్ధంగా ఉందా అనేది అసలైన ప్రశ్న. భారత్, పాకిస్తాన్ మధ్య భవిష్యత్ సంబంధాలకు ఈ ప్రశ్నకు సమాధానమే ఆధారం అవుతుంది” అని పురోహిత్ అన్నారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)