Home జాతీయ national telgu భారత్, పాకిస్తాన్ మధ్య అణుయుద్ధ ప్రమాదం ఉందా?

భారత్, పాకిస్తాన్ మధ్య అణుయుద్ధ ప్రమాదం ఉందా?

5
0

SOURCE :- BBC NEWS

భారత్ పాకిస్తాన్ అణ్వస్త్రాలు

ఫొటో సోర్స్, Corbis via Getty Images

భారత్, పాకిస్తాన్ మధ్య ఇటీవల నెలకొన్న ఉద్రిక్తతల వేళ వాటిని తగ్గించుకునే ప్రయత్నంలో ఇరువర్గాలు ఎవరు కూడా అణు బెదిరింపులకు దిగలేదు. రెడ్ బటన్ గురించి మాట్లాడలేదు.

అయితే, సైనికపరమైన ప్రతీకార చర్యలు, చాటుమాటు సంకేతాలు, అంతర్జాతీయ మధ్యవర్తిత్వంలాంటివన్నీ ఈ ప్రాంతపు ప్రమాదకరమైన సమస్యను మరోసారి అందరికి గుర్తుకుతెచ్చాయి.

ఈ సంక్షోభం అణుయుద్ధంవైపు విస్తరించలేదు. కానీ ఇక్కడి ఉద్రిక్తతలు ఆ భూతాన్ని ఎంత వేగంగా ఆహ్వానించగలవో గుర్తుచేశాయి.

ఇలాంటి పరిస్థితి ఎంత సులభంగా రాగలదో శాస్త్రవేత్తలు కూడా ఊహించారు.

2019లో కొంతమంది శాస్త్రవేత్తల బృందం రూపొందించిన ఒక స్టడీ పేపర్ ‘2025లో భారత పార్లమెంటుపై దాడి జరిగితే ఎలా ఉంటుంది’ అన్న భయంకరమైన ఊహాగానంతో మొదలవుతుంది. ఆ చర్య చివరకు భారత్ పాకిస్తాన్‌ల మధ్య అణుయుద్ధానికి కారణమవుతుంది.

ఆరేళ్ల తర్వాత.. వాస్తవ ప్రపంచంలో ఏర్పడిన ప్రతిష్టంభన అమెరికా మధ్యవర్తిత్వంతో కాల్పుల విరమణ కుదిరినప్పటికీ, ఈ ఘర్షణ పూర్తిస్థాయి యుద్ధంగా మారుతుందేమో అనే భయాన్ని రేకెత్తించింది. ఈ ప్రాంతంలో సుస్థిరత ఎంత సున్నితంగా ఉందో అనే జ్ఞాపకాలను తిరిగి తీసుకొచ్చింది.

సంక్షోభం తీవ్రం అయ్యే కొద్దీ, పాకిస్తాన్ రెండు సంకేతాలు పంపించింది. సైన్యంతో ఎదురుదాడి చేయడం, అవసరమైతే అణ్వస్త్రాలు ప్రయోగానికి సిద్ధమని చెప్పేందుకు నేషనల్ కమాండ్ అథారిటీ సమావేశం ఏర్పాటు చేయడం వంటివి.

అణ్వాయుధాలను ఉపయోగించడం, వాటిపై నియంత్రణను నేషనల్ కమాండ్ అథారిటీయే పర్యవేక్షిస్తుంది.

ఇది ఒక సంకేతమా, వ్యూహాత్మకమా లేక నిజంగానే అప్రమత్తం అయ్యారా..మనకు తెలిసే అవకాశం లేదు.

అమెరికా విదేశాంగమంత్రి మార్కో రూబియో ఈ చిక్కుముడిని విప్పేందుకు ఇందులోకి అడుగు పెట్టిన సమయంలోనే సరిగ్గా ఇది జరిగింది.

అమెరికా కేవలం కాల్పుల విరమణను సాధించడం మాత్రమే కాదు, అణుయుద్ధాన్ని కూడా తప్పించిందని అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్ చెప్పారు.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
భారత్ పాకిస్తాన్ అణ్వస్త్రాలు

ఫొటో సోర్స్, HAR

భారత్‌దే పై చేయి

సోమవారం జాతినుద్దేశించి చేసిన ప్రసంగంలో భారత ప్రధానమంత్రి నరేంద్రమోదీ “అణ్వస్త్రాలతో బ్లాక్‌మెయిల్ చేస్తే సహించేది లేదు. అణు బెదిరింపులకు భారత్ భయపడదు” అని చెప్పారు

“అణ్వస్త్రాలను బూచిగా చూపించి తీవ్రవాదులను పెంచి పోషిస్తున్న ప్రాంతం ఏదైనా కచ్చితమైన, నిర్ణయాత్మకమైన దాడుల్ని ఎదుర్కొంటుంది” అని ప్రధాని మోదీ హెచ్చరించారు.

2024 జనవరి నాటికి ప్రపంచవ్యాప్తంగా 12,121 అణ్వాయుధాలు ఉన్నాయని సిప్రి చెబుతోంది. ఇందులో 9,585 మిలటరీ గోదాముల్లో ఉన్నాయి. మరో 3904 అణ్వాయుధాలు మోహరించి ఉన్నాయి. ఇలా మోహరించిన వాటిలో అంతకు ముందు ఏడాదితో పోలిస్తే మరో 60 అదనంగా వచ్చి చేరాయి. అమెరికా, రష్యా వద్ద 8వేలకు పైగా అణ్వాయుధాలు ఉన్నాయి.

భారత్ పాకిస్తాన్ తమ తమ అణ్వాయుధాలను ఉపరితలం నుంచి ప్రయోగించే క్షిపణులతో కలిపి మోహరించాయి. రెండు దేశాలు భూమితో పాటు సముద్రం,ఆకాశం నుంచి వార్‌హెడ్‌లను ప్రయోగించే సాంకేతికతను అభివృద్ధి చేస్తున్నాయని అమెరికాలోని అల్బనీ యూనివర్సిటీలో భద్రత వ్యవహారాల నిపుణులు క్రిస్టఫర్ క్లేరీ చెప్పారు.

“భారత్ వద్ద పాకిస్తాన్ కంటే పెద్ద వైమానిక వ్యవస్థ ఉంది (అణ్వాయుధాలను జార విడిచే సామర్థ్యం ఉన్న విమానం). మనకు పాకిస్తాన్ నేవీ సత్తా ఏంటనేది తక్కువ తెలుసు. పాకిస్తాన్ సముద్ర ఆధారిత అణు సామర్థ్యం కంటే భారత నౌకా దళం మరింత అభివృద్ధి చెందిందే కాకుండా సామర్థ్యం కూడా ఎక్కువ” అని ఆయన బీబీసీకి చెప్పారు.

అణుశక్తితో నడిచే జలాంతర్గామిని తయారు చేసేందుకు భారత్ వెచ్చిస్తున్న సమయం, డబ్బును పాకిస్తాన్ వెచ్చించలేకపోవడం ఇందుకు ఒక కారణం కావచ్చని క్లారీ అన్నారు. ఇది ఇండియన్ నేవీకి స్పష్టమైన నౌకా అణు సామర్ధ్యాన్ని అందిస్తుంది.

1998లో అణ్వస్త్ర పరీక్షలు నిర్వహించిన తర్వాత పాకిస్తాన్ ఎప్పుడూ అణ్వస్త్ర విధానాన్ని ప్రకటించలేదు.

ఇందుకు భిన్నంగా, 1998 అణు పరీక్షల తర్వాత భారత్ ‘ముందుగా అణ్వాయుధాలను ప్రయోగించరాదనే విధానాన్ని’ ప్రకటించింది. ఇది ఒక విధంగా మెతక వైఖరికి నిదర్శనంగా నిలిచింది.

అయితే, రసాయన, జీవ సంబంధిత దాడుల విషయంలో ఎలా స్పందించాలనే దాని గురించి 2003లో భారత్ తన విధానాన్ని ప్రకటించించి. కొన్ని పరిస్థితులను బట్టి ముందుగానే అణ్వస్త్రాలను ఉపయోగించేందుకు ఈ విధానం అనుమతిస్తుంది.

2016లో మరింత సందిగ్ధత ఏర్పడింది. భారత్ ఈ విధానానికి కట్టుబడి ఉండాల్సిన అవసరం లేదని నాటి రక్షణ మంత్రి మనోహర్ పారికర్ సూచించారు. ఆయన వ్యాఖ్యలు చాలా కాలంగా భారత్‌కున్న విశ్వసనీయతను ప్రశ్నార్థకంగా మార్చాయి. ( ఇది తన వ్యక్తిగత అభిప్రాయమని పారికర్ తర్వాత చెప్పారు.)

భారత్ పాకిస్తాన్ అణ్వస్త్రాలు

ఫొటో సోర్స్, AFP via Getty Images

ఏ వైఖరీ లేకపోవడమే పాక్ వైఖరి

అణ్వాయుధాల విషయంలో పాకిస్తాన్‌కు ఒక విధానం లేకపోవడం అంటే ఏ వైఖరీ లేదని కాదు. అధికారిక ప్రకటనలు, ఇంటర్వ్యూలు, అణు పరీక్షలు లాంటివి పాక్ కార్యచరణ ఎలా ఉంటుందో చెప్పే సంకేతాలని కార్నెగీ ఎండోమెంట్‌ ఫర్ ఇంటర్నేషనల్ పీస్‌కు చెందిన సాడియా తస్లీమ్ చెప్పారు.

పాకిస్తాన్ అణు నియంత్రణ అస్పష్టంగా ఉంది. అయితే 2001లో ఎన్‌సీఏలోని నాటి వ్యూహాత్మక ప్రణాళికా విభాగం అధిపతి ఖలీద్ కిద్వాయ్ నాలుగు అంశాలను ప్రకటించారు. దేశంలో విస్తృత ప్రాంతాన్ని కోల్పోవడం, కీలక సైనిక స్థావరాల విధ్వంసం, రాజకీయ అస్థిరత.. ఇలాంటి పరిస్థితుల్లో అణ్వస్త్రాలు ఉపయోగించవచ్చని ఆయన సూచించారు.

2002లో నాటి పాకిస్తాన్ అధ్యక్షుడు పర్వేజ్ ముషారఫ్ “అణ్వాయుధాలన్నీ మొత్తంగా భారత్ వైపే గురి పెట్టి ఉంటాయి. ఒక దేశంగా పాకిస్తాన్ అస్తిత్వానికి ముప్పు ఏర్పడితే వాటిని ప్రయోగించాలి” అని చెప్పారు.

2019లో భారత్‌తో సంఘర్షణ ఏర్పడినప్పుడు పాకిస్తాన్ అణ్వస్త్ర ప్రయోగానికి సిద్ధమవుతోందంటూ ఒక భారత మంత్రి తనకు అర్ధరాత్రి ఫోన్ చేశారని, తాను రాత్రంతా మేల్కొని ఉండాల్సి వచ్చిందని అమెరికా మాజీ విదేశాంగ మంత్రి మైక్ పాంపియో ఆత్మకథలో గుర్తు చేసుకున్నారు. ఆ మంత్రి పేరును ఆయన చెప్పలేదు.

అదే సమయంలో ఒక సీనియర్ అధికారి భారత్‌ను గట్టిగా హెచ్చరించారని పాకిస్తాన్ మీడియా కథనాలు రాసింది ‘‘నేషనల్ కమాండ్ అథారిటీ అంటే ఏమిటో, దాని నిర్మాణం ఏమిటో మీకు తెలుసనుకుంటాను. మిమ్మల్ని అశ్చర్యపరుస్తామని నేను చెప్పాను. ఆ సర్‌ప్రైజ్ కోసం ఎదురు చూడండి. మీరు ఈ ప్రాంత శాంతి, భద్రత, తర్వాతి పరిణామాలు ఏంటో తెలుసుకోకుండా యుద్ధాన్ని ఎంచుకున్నారు” అని ఆ అధికారి చెప్పినట్లు పాక్ మీడియా రాసింది.

1999 కార్గిల్ యుద్ధ సమయంలో నాటి పాక్ విదేశాంగమంత్రి శంషాద్ అహ్మద్ “దేశాన్ని కాపాడుకునేందుకు పాకిస్తాన్ ఎలాంటి ఆయుధాన్నైనా ఉపయోగించడానికి వెనుకాడదు” అని హెచ్చరించారు.

ఆ సమయంలో పాకిస్తాన్ తమ అణ్వాయుధాలను మోహరించేందుకు ఏర్పాట్లు చేసినట్లు తమకు నిఘా సమాచారం ఉందని కొన్నేళ్ల తర్వాత అమెరికన్ అధికారి బ్రూస్ రీడెల్ వెల్లడించారు.

భారత్ పాకిస్తాన్ అణ్వస్త్రాలు

ఫొటో సోర్స్, AFP via Getty Images

అణ్వాయుధాల ముప్పు లేదా?

అయితే అలాంటి వాదనలపై రెండు వైపులా సందేహాలు ఉన్నాయి.

2019 వివాదంలో అమెరికా పాత్రను, అణ్వస్త్ర ప్రయోగాల గురించి మైక్ పాంపియో ఎక్కువ చేసి చెప్పారని పాకిస్తాన్‌లో ఇండియన్ మాజీ హైకమిషనర్ అజయ్ బిసారియా తన పుస్తకంలో రాశారు.

కార్గిల్ యుద్ధ సమయంలో “భారత వైమానిక దళం తన భూభాగంలోకి ప్రవేశించదని పాకిస్తాన్‌కు తెలుసు” అలాంటప్పుడు అణు ముప్పుకు అవకాశం లేదని పాకిస్తాన్ విశ్లేషకులు చెబుతున్నారు.

“ఏదైనా వివాదం చిక్కుముడిగా మారుతుందా లేదా అనేది కొన్ని సంకేతాల ద్వారా ప్రపంచం గుర్తిస్తుంది. భారత్ పాకిస్తాన్ అణ్వస్త్ర దేశాలు కావడంతో వాటి మధ్య వివాదంలో తీవ్రత ఎక్కువగా ఉంటుంది. అయితే ఏ దేశం కూడా అణ్వాయుధాలు ఉపయోగిస్తామని బెదిరించదు” అని లాహోర్‌కు చెందిన రక్షణ నిపుణుడు ఇజాజ్ హైదర్ బీబీసీతో చెప్పారు.

అయితే ప్రమాదవశాత్తూ అణ్వాయుధాలను ప్రయోగించే అవకాశం కూడా ఉంది.

“మానవ తప్పిదం వల్ల ఇది జరగవచ్చు, హ్యాకర్లు, టెర్రరిస్టులు, కంప్యూటర్ల వైఫల్యం, శాటిలైట్ల నుంచి తప్పుడు డేటా, రాజకీయ అస్థిరత” లాంటివి అణ్వస్త్ర ప్రయోగానికి కారణం కావచ్చని రట్గర్స్ యూనివర్సిటీలో ప్రొఫెసర్ అలన్ రొబోక్ బీబీసీతో చెప్పారు.

2022 మార్చ్‌లో భారత్ ప్రమాదవశాత్తూ అణ్వస్త్రాలను మోసుకెళ్లే సామర్థ్యం ఉన్న క్రూయిజ్ మిసైల్‌ను ప్రయోగించింది. ఇది పాకిస్తాన్ భూభాగంలో 124 కిలోమీటర్లు ప్రయాణించి పేలిపోయింది. ఈ పేలుడులో పౌర ఆవాసాలు దెబ్బ తిన్నాయని కథనాలు వచ్చాయి.

ఈ సంఘటనపై భారత్ రెండురోజుల వరకు మిలటరీ హాట్‌లైన్ ద్వారా సమాచారం ఇవ్వడం లేదా బహిరంగ ప్రకటన చేయలేదని పాకిస్తాన్ ఆరోపించింది.

రెండు దేశాల మధ్య తీవ్ర ఉద్రిక్తతలు ఉన్నప్పుడు ఇలాంటిది జరిగితే, అది చాలా తీవ్రమైన సంఘర్షణకు దారి తీస్తుందని నిపుణులు చెప్పారు. (మిసైల్‌ను మిస్‌ఫైర్ చేసిన ముగ్గురు ఎయిర్‌ఫోర్స్ అధికారులను కొన్ని నెలల తర్వాత భారత ప్రభుత్వం ఉద్యోగం నుంచి తొలగించింది)

అయినప్పటికీ, భారత్ పాకిస్తాన్ మధ్య అణు యుద్ధం వచ్చే ప్రమాదం”చాలా తక్కువని” క్లారీ అభిప్రాయం.

“సరిహద్దుల వెంబడి భారీ స్థాయిలో ఉపరితల దాడులు జరగనంత వరకు, అణ్వాయుధాలను ప్రయోగించే ముప్పు చాలా తక్కువ” అని ఆయన చెప్పారు.

“శత్రువు క్షేత్రస్థాయి యుద్ధంలో పైచేయి సాధించడం, తమ భూభాగంలోకి చొచ్చుకువస్తున్న సమయంలోనే యూజ్ ఇట్ ఆర్ లూజ్ ఇట్ అనే సమస్య తలెత్తుతుంది’’ అని క్లారీ అన్నారు.

(శత్రువు దెబ్బకు పూర్తిగా తాము నాశనమైపోతామని ఒక అణ్వస్త్ర దేశం భావించినప్పుడు, అణ్వస్త్రాలను ఉపయోగించి దేశాన్ని కాపాడుకోవడమా, ఉపయోగించకుండా దేశాన్ని వదులుకోవడమా అని ప్రశ్నించుకునే సందర్భాన్ని ‘యూజ్ ఇట్ ఆర్ లూజ్ ఇట్’ అని అంటారు)

భారత్ పాకిస్తాన్ అణ్వస్త్రాలు

ఫొటో సోర్స్, AFP via Getty Images

అణ్వాయుధాలను పెంచుకుంటున్న భారత్, పాక్

“హిరోషిమా మీద అణుబాంబు పేలుడు తర్వాత భారత్ లేదా పాకిస్తాన్‌లు తమను తాము అణ్వస్త్ర నిషేధాన్ని ఉల్లంఘంచిన దేశాలుగా ముద్రవేసుకోవాలని కోరుకోవడం లేదు” అని స్టాన్‌ఫోర్డ్ యూనివర్సిటీకి చెందిన హూవర్ ఇన్‌స్టిట్యూషన్‌లో సీనియర్ ఫెలో సుమిత్ గంగూలీ చెప్పారు.

“ఇంకా చెప్పాలంటే, అణ్వస్త్రాలను ఉపయోగించిన దేశం తీవ్రమైన ప్రతీకార చర్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. భారీస్థాయిలో ప్రాణనష్టాన్ని చవి చూస్తుంది” అని గంగూలీ బీబీసీతో చెప్పారు.

అయినప్పటికీ భారత్ పాకిస్తాన్ తమ అణ్వాయుధాలను పెంచుకుంటున్నట్లు కనిపిస్తోంది.

నూతన డెలివరీ వ్యవస్థల అభివృద్ధి, నాలుగు ప్లుటోనియం రియాక్టర్ల విస్తరణ, యురేనియం శుద్ధి లాంటి వాటితో 2020 చివరి నాటికి పాకిస్తాన్ వద్ద అణ్వాయుధాల సంఖ్య 200కి చేరి ఉండవచ్చని ఫెడరేషన్ ఆఫ్ అమెరికన్ సైంటిస్ట్స్ న్యూక్లియర్ ఇన్ఫర్మేషన్ ప్రాజెక్ట్‌లో భాగంగా చేసిన పరిశోధన ‘ది న్యూక్లియర్ నోట్‌బుక్’ అంచనా వేస్తోంది.

2023 మొదటికల్లా, భారత్ వద్ద ఆయుధాల తయారీకి పనికొచ్చే 680 కేజీల ఫ్లుటోనియం ఉంది. ఇది130 నుంచి 210 అణువార్‌హెడ్ల తయారీకి సరిపోతుందని ఇంటర్నేషనల్ ప్యానెల్ ఆఫ్ ఫిసైల్ మెటీరియల్స్ తెలిపింది.

పదేపదే సంక్షోభాలు, యుద్ధం ముంగిటి వరకు చేరిన సందర్భాలు వచ్చినా, ఇప్పటి వరకు రెండుపక్షాలు వినాశనకరమైన అణుయుద్ధంలోకి అడుగు పెట్టకుండా నివారించగలిగాయి.

“ఒకరినొకరు నిరోధించేశక్తి ఇప్పటికీ అలాగే ఉంది. పాకిస్తానీలు చేసిందల్లా తమ మీద జరిగిన సంప్రదాయ దాడులకు, అదే తరహా సంప్రదాయ దాడులతో స్పందించడమే” అని ఇస్లామబాద్ విశ్లేషకుడు ఉమర్ ఫరూక్ రాశారు.

ఎంత తెలివైన నాయకత్వం ఉన్నప్పటికీ, నిగ్రహం పాటించేదైనప్పటికీ, అణ్వాయుధాలు ఉన్నంతవరకు అణుయుద్ధ భయం మాత్రం అంతర్లీనంగా కొనసాగుతూనే ఉంటుందనీ, దాన్ని పూర్తిగా తోసిపుచ్చలేని పరిస్థితి ఉంటుందని నిపుణులు అంటున్నారు.

“భారత్ పాకిస్తాన్ ప్రభుత్వాలు గతంలో ఇలాంటి పరిస్థితులను దాటుకుంటూ వచ్చాయి. కాబట్టి ప్రమాదం చిన్నది. అయితే అణ్వాయుధాలతో చిన్న ప్రమాదం కూడా చాలా పెద్దదే అవుతుంది” అని నాన్ ప్రాఫిట్ సెంటర్ ఫర్ ఆర్మ్స్ కంట్రోల్ అండ్ నాన్ ప్రొలిఫరేషన్‌లో సీనియర్ పాలసీ డైరెక్టర్ జాన్ ఇరాత్ బీబీసీతో అన్నారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)